Title Picture
నాగేశ్వరరావు, కృష్ణకుమారి
కవిత చిత్రవారి 'వాగ్దానం' చిత్రానికి శరత్ రచించిన 'వాగ్దత్త' కేవలం ఆధారం మాత్రమే. ఇది తెలుగు సినిమా కాబట్టి ఇందులో శరత్ కథ యథాతథంగా ఉండకూడదు. ఉండాలనీ, ఉంటుందనీ ఆశించడం పొరపాటు. ఈ దృష్ట్యా చూస్తే ఈ చిత్రం ఆశాభంగం కలిగించక పోవచ్చును.

పాఠకుల హృదయాలను ఆర్ధ్రంచేయగల అద్భుతశక్తి శరత్ లేఖనిలో ఉన్నది. ఆయన రచనలన్నీ ఎంతో ఉదాత్తమైనవి, గంభీరమైనవి. 'వాగ్దత్త'లో ఆయన సృష్టించిన పాత్రలన్నీ చిరస్మరణీయంగా ఉన్నాయి. అటువంటి గొప్ప నవలను తెలుగు సినిమా సగటు ప్రమాణానికి కుదించడంలోనూ, ఆ నవలలోని ముఖ్యపాత్రలకు తెలుగు సినిమా పాత్రల స్వరూప స్వభావాలను ఆపాదించడంలోనూ ఆచార్య ఆత్రేయ కృతకృత్యులయ్యారని నిస్సందేహంగా చెప్పవచ్చును. ఈ చిత్రంలోని చాలా పాత్రలు, సన్నివేశాలు ఆత్రేయ సృష్టించినవే. పాటలు, నృత్యాలు, హాస్యాలు మొదలయిన దేశవాళీ హంగులు కూడా ఆయనే ఏర్పాటుచేశారు. వీటితో శరత్ కు నిమిత్తం లేదు. అందుచేత ఈ చిత్రం ఏమైనా కీర్తిని సంపాదిస్తే అది నేరుగా ఆత్రేయగారికే దక్కుతుంది.

ఆత్రేయ ఇదివరకు రచన నిర్వహించిన చిత్రాలన్నీ దాదాపు 17 వేల అడుగుల నిడివిగలవి. ఈ చిత్రం 15 1/2 వేల అడుగులు మాత్రమే ఉండడం విశేషం. అయితేనేం 18 వేల అడుగుల చిత్రం చూసిన ఫలం దక్కుతుంది ప్రేక్షకులకు.

విశ్వనాథం (నాగయ్య), రంగనాథం (గుమ్మడి), జగన్నాథం (కె. వెంకటేశ్వరరావు) బాల్యమిత్రులు. విశ్వనాథం జమీందారు. ఆయన కూతురు విజయ (కృష్ణకుమారి). రంగనాథం ఆ జమీందారీకి దివాను. ఆయన కొడుకు చంద్రం (చలం). జగన్నాథం కులం లేని పిల్లను వివాహమాడి అందరిచేత వెలివేయించుకున్నవాడు, నిర్ధనుడు. భార్య చనిపోయింది. ఆయన కొడుకు సూర్యం (నాగేశ్వరరావు). తన కూతురు విజయను సూర్యానికిచ్చి వివాహం చేస్తానని ఆమె పుట్టక ముందే విశ్వనాథం జగన్నాథానికి మాట ఇచ్చాడు. పెరిగి పెద్దవాళ్లైనా విజయ, సూర్యం ఒకరి నొకరు చూసుకోలేదు. విశ్వనాథం తన డబ్బుతో సూర్యాన్ని డాక్టరు చదివించాడు. ఆయన వద్దంటున్నా వినక జగన్నాథం ఈ అప్పుకుగాను తన ఆస్తిని ఆయనకు తాకట్టు రాశాడు.

జగన్నాథం చనిపోయాడు. ఆ వార్త విని, మనోవ్యాధితో విశ్వనాథం మరణించాడు. చనిపోయేముందు తన కూతుర్ని రంగనాథానికి అప్పచెప్పాడు. సూర్యం వద్ద నుంచి అప్పు సొమ్మును తీసుకోవద్దని కూతురుకు చెప్పాడు.

విజయకూ, తన కొడుక్కీ వివాహం చేస్తే జమీందారీ తనకు దక్కుతుందని రంగనాథం ఆశ. సూర్యం పల్లెటూళ్లో తన ఇంట్లోనే ఆస్పత్రి పెట్టి ప్రజాసేవ చేస్తున్నాడు. ఆ చుట్టు పక్కల ప్రజలందరికీ అతను దేవుడయ్యాడు. విజయకు తెలియకుండా రంగనాథం సూర్యం ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు. తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయినందుకు కుమిలిపోయింది విజయ. తన పాపానికి పరిహారంగా తన సర్వస్వం సూర్యానికి అర్పించాలనుకుంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వారిని వేరుచేయడానికి రంగనాథం అబద్ధాలు చెప్పి స్పర్థలు కల్పించాడు. తన కొడుకుతో విజయకు బలవంతంగా పెళ్ళి ఏర్పాటు చేశాడు. చివరికి ఆయన కుట్రలు బైటపడ్డాయి. విజయ ధైర్యం తెచ్చుకుంది. ఆ వూళ్లో హరికధలు చెప్పే రామదాసు (రేలంగి) ఆమెకు సహాయం చేశాడు. అనుకున్న ముహూర్తానికి చంద్రంతో కాక సూర్యంతో ఆమె వివాహం జరిగింది.

Picture
నాగేశ్వరరావు, గిరిజ, పద్మనాభం

కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం'లో దుష్యంతునికి అనేక గొప్ప లక్షణాలను ఆపాదించినట్టు, ఆత్రేయగారు కూడా మూలకథలో నాయకునికి లేని అనేక అర్హతలను తన నాయకునికి ఏర్పాటు చేశారు. మూలకథలో నాయకుడు పొడుగ్గా, బక్కపల్చగా ఉంటాడు. నీరుకావి ధోవతి, ఉత్తరీయం వేసుకుని పల్లెటూరి వాడిలా ఉంటాడు. ఆట్టే అందంగానూ ఉండడు, మితభాషి. డ్యూయెట్లు చాతకావు. డాక్టరు కోర్సు చదివాడని ఎవరూ అనుకోరు. చూపులు తీక్షణంగా ఉంటాయి. ఈ చిత్రంలో నాయకునికి ఆ లక్షణాలు లేవు. ఇతను అందంగా, చలాకీగా, గడుసుగా, దర్జాగా మంచి పోజులో ఉంటాడు. జమీందారిణి (విజయ)తో ఇట్టే చనువు చేసుకుని, గుర్రబ్బండి మీద షికారు తీసుకువెళ్తాడు. విజయ పాత్ర కూడా తదనుగుణంగానే సవరించబడింది.

వెనకటికి శ్రీరాముడు శివధనుస్సును విరిచి సీతామహాదేవి మనస్సును హరించినట్లే, ఇందులో-విజయ జీవితమనే గుర్రబ్బండి బానిసత్వమనే గోతిలో పడినప్పుడు సూర్యం ఆ బండిని గోతి నుంచి ఉద్దరించి ఆమె మనస్సును హరించాడు. సీతాకళ్యాణం హరికథను బ్యాక్ గ్రౌండులో పెట్టి ఆత్రేయగారు బాగా ఉపమించారు.

హరికథ కాక ఈ చిత్రంలో ఏడుపాటలున్నాయి. వీటిలో రెండు మూడు వినడానికి హాయిగా ఉన్నాయి. నటీనటులంతా తమతమ శక్తుల ననుసరించి కాకుండా దర్శకునికి అవసరమైన మేరకు నటించారు.

నిర్మాతలు: కె.సత్యనారాయణ, డి.శ్రీరామమూర్తి; రచన, దర్శకత్వం: ఆచార్య ఆత్రేయ; పాటలు: శ్రీ శ్రీ, ఆత్రేయ, దాశరధి, నార్ల చిరంజీవి; సంగీతం: పెండ్యాల; ఛాయాగ్రహణం: పి.యల్.రాయ్; తారాగణం: నాగేశ్వరరావు, కృష్ణకుమారి, గుమ్మడి, రేలంగి, గిరిజ, చలం, సూర్యకాంతం, పద్మనాభం, నాగయ్య, కె.వెంకటేశ్వరరావు వగైరా; నిడివి: 15,500 అడుగులు.

నండూరి పార్థసారథి
(1961 అక్టోబరు 08వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post