Title Picture

"మెజారిటీ ప్రజలను రంజింప చెయ్యటమే మా లక్ష్యం. డెమోక్రసీ లక్ష్యం కూడా ఇదేగా" అని ఈమధ్య ఒక ప్రముఖ చలనచిత్ర నిర్మాత అన్నారు. ప్రజా బాహుళ్యాన్ని రంజింపచెయ్యటమే చిత్రాల లక్ష్యవైుతే శ్రీప్రొడక్షన్సు వారి 'శాంతినివాసం' ప్రథమ శ్రేణి చిత్రాల కోవకు చెందుతుంది.

వినోదం కోసం, దేవిక నటన కోసం ప్రతి ఒక్కరూ చూడతగిన చిత్రం. ఆర్థికంగా విజయవంతం కాగల చిత్రం. ఆంధ్రప్రదేశ్ అంతటా 14వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలయింది. రాజశ్రీ డిస్ట్రిబ్యూటర్లకు నూతన సంవత్సర శుభసూచకం 'శాంతినివాసం'.

ఒక్క దేవిక నటనను మినహా చిత్రంలో మిగతా ఏ అంశాన్ని గురించీ ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎంతో నిరాడంబరంగా నిండుగా, ఆప్యాయంగా, వదినగా ఆమె గొప్పగా నటించింది. వదిన అనే మూడు అక్షరాలలోని పవిత్రతకూ, నిండుతనానికీ, ఆప్యాయతకు ఆమె నటన ఒక గొప్ప వ్యాఖ్యానం. పకపకా నవ్వేస్తూ అల్లరి చేసే పండితులు కూడా ఆమె తెరమీదికి రాగానే, మౌనంగా, వినమ్రంగా ఉండిపోయారు. అసంకల్పితంగా అందరికీ ఆమె మీద ఒక విధమైన గౌరవం, భక్తి కలుగుతుంది - కనీసం ఆ కాసేపైనా; వదిన పాత్రను ఇంత సహజంగా తెలుగులో ఇంతవరకూ ఎవరూ నటించలేదనటం సాహసం కాదు.

"సినిమాలలో వాస్తవికతకు తావులేదు. కృత్రిమంగా ఉన్నాసరే, అతిగా కన్నీళ్ళు కారిస్తే గానీ, ప్రేక్షకుల సానుభూతి లభించదు మాకు" అని ప్రఖ్యాత నటి ఒకరు ఈమధ్య అన్నారు. కాని ఆ మాట అబద్ధమని దేవిక రుజువు చేస్తుంది. రచన, దర్శకత్వం, ఆమె నటనా ప్రమాణాన్ని అందుకో గలిగి ఉంటే ఇంకా ఎంత గొప్పగా నటించేదో! పతియే ప్రత్యక్ష దైవము వగైరా నీతులు ఆమె చేత పలికించకుండా ఉంటే-కనీసం అన్నిసార్లు-ఆమె ఇంకా ఎంతో స్థిరంగా ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయేది. ప్రేమ గీతమేకాక, ఒక పద్యం కూడా ఆమె చేత చదివించటం అన్యాయం అనిపించింది. ఆమె సహజత్వం, నిరాడంబరత ముందు-మిగతా ప్రముఖ నటులు తేలిపోయారు. వదినగా ఆమె నటించిదనడం కంటే జీవించిందనటం న్యాయం.

Picture
నాగేశ్వరరావు, రాజసులోచన

మిగిలిన నటీనటుల నటనలు విశేషంగా ఏమీలేవు. అందుకు పూర్తిగా వారూ బాధ్యులు కారు. పాత్రోచితంగా శాయశక్తులా నటించారు.

ఆడపెత్తనం వల్ల వచ్చే అరిష్టాన్నీ, అత్తాఒకింటి కోడలే అనే సత్యాన్నీ, బోధించే ఒక సంసార కథ ఇది. ఇల్లరికం, కోడరికం, తోడికోడళ్ళ అన్యోన్యత, మొదలయిన వాటికి ఈ కథలో జాగా ఉంది. దృశ్యాలూ, సంభాషణలూ, పాటలూ, వాటి వరసలు, అన్నీ మనకు సుపరిచితములే.

దర్శకత్వం ప్రజాస్వామిక లక్ష్యానికి అనుగుణంగా ఉంది. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టకుండా చిత్రం అంతా అనుకున్న విధంగా పాల్లుపోకుండా సాగిపోతుంది సాఫీగా. ఒక చోట దేవిక మెట్లపైన నుంచుంటే, ఆమె క్రింద పడిపోతుందనీ గాయం తగులుతుందనీ, మతిస్థిరం కూడా తప్పే ప్రమాదం ఉందనీ మనకు ముందే తెలుస్తుంది. నటించింది దేవిక కాబట్టి ముందే మనకు సానుభూతి కలుగుతుంది. నాయికా నాయకులకు ప్రేమాంకురం జరగటం, క్రమక్రమంగా అభివృద్ధి కావటం వగైరా మామూలు విషయాలకోసం, అనవసరంగా కాలవ్యయం, ముడిఫిలుం వ్యయం చెయ్యకుండా, దర్శకుడు వారికి ప్రథమ వీక్షణంలోనే ప్రేమ అంకురించి అభివృద్ధి అయ్యే ఏర్పాటు చెయ్యటం ప్రేక్షకులకు చాలా విశ్రాంతి నిచ్చింది. దృశ్యాల చిత్రీకరణలో చాలా సౌలభ్యం చెయ్యితిరిగినతనం కనుపిస్తుంది.

ప్రధాన పాత్రధారులు: నాగేశ్వరరావు, రాజసులోచన, దేవిక, కృష్ణకుమారి, రేలంగి, కాంతారావు, నాగయ్య, సూర్యకాంతం, హేమలత, రమణారెడ్డి, బాలసరస్వతి, కె.వి.యస్.శర్మ; దర్శకుడు: సి.యస్.రావు; రచన: జూనియర్ సముద్రాల; సంగీతం: ఘంటసాల; ఛాయాగ్రహణం: కమల్ ఘోష్.

నండూరి పార్థసారథి
(1960 జనవరి 10వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post