Title Picture
జగ్గయ్య, సావిత్రి

సగటు కంటే తక్కువ నిడివిలో ఈ చిత్రాన్ని ముగించినందుకు దర్శకుని అభినందించక తప్పదు (నిడివి-13,900 మాత్రమే). అయితే ఈ చిత్రాన్ని ఇంకా పొట్టిగా నిర్మించడానికి అవకాశం ఉన్నదనిపిస్తుంది. చిత్రాల నిడివిని తగ్గించితే తెలుగు చిత్రాలకు కొత్తగా వచ్చే అవలక్షణమేమీ ఉండదని ఈ చిత్రం నిరూపిస్తుంది.

ముఖ్ రాంశర్మగారి కథ, సావిత్రి, రేలంగి, డైసీ ఇరానీల నటన ఈ చిత్రానికి ఆకర్షణలు. శంకర్ (బాలయ్య), అతని భార్య మాలతి (సావిత్రి), వారి బిడ్డ రాజా (డైసీ ఇరానీ) హాయిగా కాలం గడుపుతూ ఉంటారు. ప్రకాశ్ (జగ్గయ్య) వ్యాపార సంస్థకు శంకర్ మేనేజరు. ఇద్దరూ ప్రాణస్నేహితులు. ఆ సంస్థలోనే పనిచేస్తున్న గుమాస్తా (సీతారాం), లారీ డ్రైవరు కలసి సరుకుని దొంగతనంగా చేరవేస్తూ ఉండగా పట్టుకొని శంకర్ వాళ్ల ఉద్యోగాలను ఊడకొట్టాడు. పగతీర్చుకునేందుకు శంకర్ మీద నుంచి లారీనిపోనిచ్చి అతని ప్రాణాలని బలితీసుకుంటాడు డ్రైవర్. అనాథ అయిన మాలతికి ప్రకాశ్ సహాయం చేస్తుంటే లోకం కోడై కూస్తుంది. మాలతికి బతకడమే కష్టమైపోతుంది. అపవాదుల నుంచి కాపాడేందుకు ప్రకాశ్ ఆమెను వివాహం చేసుకుంటాడు. రాజా తండ్రికోసం కలవరిస్తూ ఉంటాడు. తండ్రి లేని లోటును ప్రకాశ్ తీర్చలేకపోతాడు. ప్రకాశ్ తన తండ్రి కాదంటాడు రాజా. మాలతికి మనోవ్యాధి ప్రారంభమవుతుంది. చివరకు రాజాకు అంతా అర్థమవుతుంది. ప్రకాశ్ ను 'నాన్నా' అని పిలుస్తాడు.

ఇంత టూకీగా చెప్తే పస అర్థం కాకపోయినా నిజానికి ఇది చాలా గొప్ప కథ. ఈ చిత్రానికి ఉన్న ఒకే ఒక్క బలం కథాబలం.

ఈ కథను లోగడ బి.ఆర్.చోప్రా 'ఏక్ హీ రాస్తా' అనే పేరిట నిర్మించారు. కథాబలంతో పాటు దర్శకబలం, సాంకేతిక బలం, తారాబలం కూడా తోడై ఆ చిత్రం కీర్తినీ, ధనాన్నీ సంపాదించుకుంది. నాయికగా మీనాకుమారి, నాయకులుగా అశోక్ కుమార్, సునీల్ దత్ లు ఆ చిత్రంలో నటించారు.

మీనాకుమారితో పోల్చుకోకుండా ఉంటే 'కుంకుమరేఖ'లో సావిత్రి చాలా చక్కగా నటించిందని చెప్పాలి. ఈ చిత్రంలో అగ్రతాంబూలం ఆమెకే. నౌకరుగా రేలంగి చాలా హాయిగా నటించాడు. డైసీ ఇరానీకి తెలుగు రానందువల్ల మరెవరో పిల్లతో మాట్లాడించారు. డెైసీ నటించినంత చలాకీగా లేవు ఆమె మాటలు. నటనకు, మాటలకు పొత్తు కలవలేదు. జగ్గయ్య, బాలయ్య ప్రభృతులంతా బాగానే నటించారు.

పూర్వార్థంలో చిత్రం కొంత మందకొడిగా, నీరసంగా నడిచినా ఉత్తరార్థంలో మంచి వేగం పుంజుకుంది. పతాక సన్నివేశాలలో కేవలం నటీనటులే చిత్రానికి జీవం పోశారు. మొత్తం ఈ చిత్రంలో ఏడు పాటలున్నాయి. వీటిలో ఏ ఒక్కటీ అత్యవసరమనిపించదు. మెచ్చుకోతగ్గ వరసలు అంతగా కనిపించవు. కథ కోసం, సావిత్రి నటన కోసం, ప్రతివారూ ఈ చిత్రాన్ని చూడవచ్చును.

దర్శకత్వం: తాపీ చాణక్య; కథ: పండిట్ ముఖ్ రాం శర్మ; మాటలు: డి.వి.నరసరాజు; పాటలు: కొసరాజు, ఆరుద్ర; సంగీతం: మాష్టర్ వేణు; ఛాయాగ్రహణం: యూసుఫ్ మూల్జీ; నృత్యం: వెంపటి; కళ: వి. సూరన్న; తారాగణం: సావిత్రి, జగ్గయ్య, బాలయ్య, రేలంగి, డైసీ ఇరానీ, సీతారాం వగైరా.

నండూరి పార్థసారథి
(1960 నవంబర్ 13వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post