Title Picture

'పాతాళగర్భ భయంకర పిశాచి', 'ప్రళయ విధ్వంసక సర్పరాణి', 'సాబూ మరియు అద్భుత పుటుంగరము' అనే మారుపేర్లతో దేశంలోకి దిగుమతి అవుతున్న అనేక బీభత్సరస ప్రధాన చిత్రాల కోవలోకి వస్తుంది సోవియెట్ చిత్రం 'స్వోర్డ్ అండ్ ది డ్రాగన్' (అద్భుత కరవాలము మరియు భయంకర అగ్నిపిశాచము). ఈ చిత్రం ఇటీవలనే ఇండియాకు దిగుమతి అయింది.

సాంకేతికంగా ఈ చిత్రం 'సాటిలేనిమేటి చిత్రం' కాకపోయినా అద్భుతంగా ఉందనిమాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చును. 'ఏవిషయంలో నైనాసరే అమెరికాకంటే రష్యాదే పై చెయ్యి. ఆఖరికి సినిమారంగంలో కూడా' అన్న ఘోష ఈ చిత్రానికి నేపథ్యంలో లీలగా వినిపిస్తూ ఉంటుంది. నిర్మొహమాటంగా, నిష్కర్షగా చెప్పుకోవాలంటే ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాలతో సరితూగగల స్థాయిలో ఉన్నది.

సాధారణంగా ఈ మాదిరి చిత్రాలన్నింటివలెనే ఈ చిత్రం కూడా అద్భుత, భీభత్స, భయానక, వీరరస ప్రధానంగా రూపొందింది. సోవియెట్ బామ్మలూ, తాతయ్యలూ వాళ్ళ మనుమలకూ మనుమరాళ్ళకూ చెప్పుకొనే వీరోచిత జానపదగాధ ఇది. ఈ మాదిరి కథలను తరతరాలుగా మనపిల్లలూ కొల్లలుగా వింటూనే ఉన్నారు. కాని వెండితెరమీద యింత అద్భుతంగా మన పిల్లలెవరూ భారతీయకథలను చూసి ఉండరు. వినోదంకోసం పిన్నలూ, పెద్దలూ అందరూ తప్పక చూడవలసిన చిత్రం ఇది.

ఈ చిత్రంలో లక్షమందికి పైగా నటించారట. ఇందులో కథానాయకుడు (బోరిస్ ఆండ్రియేవ్) ఇద్దరు క్లార్క్ గేబుళ్ళు, ముగ్గురు గ్రిగరీ పెక్కులూ కలిసినంత సైజులో ఉంటాడు. ఒక రాక్షసుడు ఈలవేసి తుఫాను సృష్టిస్తాడు. ఆ తుఫానుకు బల్లలూ, కుర్చీలూ, సింహాసనాలూ, మనుషులూ కూడా ఎగిరిపోతారు. చాలా వేడుకగా ఉంటుంది. మూడు తలల అగ్నిపిశాచం నోటి నుంచి మంటలు కక్కుతూ అతిభయంకరంగా ఉంటుంది. అద్భుత కరవాలం తడవకు 10 మందిని చంపుతుంది. లక్షలాది సైనికులు ఒకరిమీద మరొకరు మిడతలదండులా కుప్పగా పడీ ఒక కొండలా తయారవుతారు. ముఠానాయకుడు ఆసైనికుల గుట్టమీదనుంచి గుర్రంపై స్వారీ చేసి పైకెక్కుతాడు-మనుషుల్ని వంగోపెట్టి, వాళ్ళ మీద ఒక పెద్ద బల్ల వేసి దాని మీద ముఠానాయకుడు కూర్చుంటాడు. అదే అతని సింహాసనం. ఇవన్నీ ఈ చిత్రంలోని వింతలూ, విశేషాలు.

ఈ చిత్రం సోవోకలర్, సోవోస్కోప్ లో నిర్మించబడింది. ఛాయాగ్రహణం నేత్రపర్వంగా, సంగీతం కర్ణ పేయంగా ఉన్నాయి. హాలీవుడ్ చిత్రాలకంటే చాలా తక్కువ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారట. ఇదేకాదు, అసలు అమెరికాలో కంటే రష్యాలో చిత్రాల సరాసరి నిర్మాణ వ్యయం చాలా తక్కువట. సాంకేతిక పరిజ్ఞానానికంటే ముందు ఈ విషయానికి రష్యావారిని అభినందించవలసి ఉంటుంది.

చూసిన తర్వాత ఆట్టే కాలం జ్ఞాపకం ఉండకపోయినా, చూస్తున్నంతసేపు చాలా వినోదాన్నిస్తుంది ఈ చిత్రం. ఆ లక్ష్యంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారు.

నండూరి పార్థసారథి
(1960 నవంబరు 20వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post