షాజహన్ చక్రవర్తి ముంతాజ్ పట్ల తన ప్రేమకు శాశ్వత చిహ్నంగా తాజ్ మహల్ ను నిర్మించాడు. అతి సుందరమైన ఆ పాలరాతి సౌధం భూలోకపు అద్భుతాలలో ఒకటి అయింది. షాజహాన్, ముంతాజ్ ల ప్రేమ కూడా అంత అద్భుతంగా, అంత నిత్య నూతనంగా శతాబ్దాలుగా కళా హృదయాన్ని పరవశింపజేస్తున్నది. 'కాలం చెక్కిలిపై ఘనీభవించిన కన్నీటి చుక్క' అని దానిని ఒక కవి అభివర్ణించాడు. తాజ్ మహల్ ను ప్రత్యక్షంగా చూసిన ఏ కవీ దానిపై కవిత్వం చెప్పకుండా ఉండలేడు. తాజ్ మహల్ ను చూస్తే పామరునికి కూడా కవిత్వం పుట్టుకొస్తుంది. ఎందరో చిత్రకారులు తాజ్ సౌందర్యాన్ని వివిధ కోణాల నుంచి పరికించి చిత్రాలు రచించారు.

సితార్ నవాజ్ విలాయత్ ఖాన్ కూడా తాజ్ సౌందర్యానికి, షాజహాన్, ముంతాజ్ ల ప్రేమ సౌందర్యానికి ముగ్ధుడై సితార్ పై 'చాందినీ కేదార్' రాగంలో ఒక మనోజ్ఞ ప్రణయ కావ్యాన్ని రచించారు. ఈ కావ్యం 'ఎ నైట్ ఎట్ ది తాజ్' అనే శీర్షికతో ఒక లాంగ్ ప్లే రికార్డు (EALP1323)గా ఆరేండ్ల క్రిందట విడుదల అయింది. ఈ రికార్డులో విలాయత్ ఖాన్, ఆయన తమ్ముడు ఇమ్రాత్ ఖాన్ సితార్-సుర్ బహార్ జుగల్ బందీ వాయించారు. రికార్డులో రెండు వైపులా పూర్తిగా 'చాందినీ కేదార్' రాగం వాయించారు. మొదటి వైపు ఆలాప్. జోడ్, ఝాలా, రెండో వైపు గత్ వాయించారు. ప్రక్క వాద్యంగా ఉస్తాద్ నిజాముద్దీన్ ఖాన్ తబ్లా వాయించారు. పూర్తి శాస్త్రీయ వాద్య సంగీతంతో, ఒక సుప్రసిద్ధ, కథా వస్తువును భావకవితా శైలిలో వర్ణన చేసిన రికార్డులలో ఇదే మొదటిది.

ఒక మనోజ్ఞ దృశ్యాన్ని భావనచేస్తూ, ఆ దృశ్యాన్ని సంగీతం ద్వారా శ్రోతల మనఃఫలకాలపై ఆవిష్కరించడం హిందూస్థానీ సంగీత సంప్రదాయంలోనే ఉంది. రాగరాగిణి సంప్రదాయంలో ప్రతి రాగం, ప్రతి రాగిణి స్పష్టంగా వర్ణింపబడినాయి. రాగాలన్నీ శృంగార నాయకులు, రాగిణులన్నీ శృంగార నాయికలు, ఆ నాయికా నాయకుల స్వరూపాలను, స్వభావాలను, వారు ధరించే ఆభరణాలను, వారి మానసిక స్థితులను సంస్కృత శ్లోకాలలో వర్ణించారు. ఆయా రాగ రాగిణులను గానం చేసేటప్పుడు గాయకులు ఆ శ్లోకాలలో వర్ణించిన దృశ్యాలను భావన చేస్తూ ఉంటారు. రాగరాగిణీ సంప్రదాయం మరుగున పడిపోయినప్పటికీ, విలాయత్ ఖాన్ వంటి వారు ఏ రాగాన్ని వాయించినా సాధారణంగా ఏదో ఒక దృశ్యాన్ని భావన చేస్తూ ఉంటారు. అందుకే ఆయన సంగీతం కవితా శైలిలో సాగుతుంది.

ఈ రికార్డులో సితార్ ముంతాజ్ పాత్రను, సుర్ బహార్ షాజహాన్ పాత్రను నిర్వహిస్తాయి. సుర్ బహార్ కూడా సితార్ వంటి వాద్యమే. సితార్ కంటే పరిమాణంలో కొంచెం పెద్దది. సితార్ కంటే ఒక స్థాయి తక్కువగా సుర్ బహార్ ను శ్రుతి చేస్తారు, అందుకని అది ఎక్కువగా మంద్రంలో పలుకుతుంది. సితార్ నాజూకుగా, చురుకుగా, వేగంగా పలుకుతుంది. సుర్ బహార్ గంభీరంగా, రాజఠీవితో నడుస్తుంది. విలాయత్ ఖాన్ భావన చేసిన కథను రికార్డు కవరు వెనక ముద్రించారు.

ఆ కథ ఇది

ఆలాప్:

స్వర్గంలో ఉన్న ముంతాజ్, షాజహాన్ లు తమ ప్రేమాలయమైన తాజ్ మహల్ ను చూడాలని వేదన చెందుతూ ఉంటారు; ఒక పున్నమి వెన్నెల రాత్రి కొద్ది గంటలసేపు తాజ్ మహల్ ను సందర్శించే అవకాశం దేవతలు వారికి ఇచ్చారు. దేవదూతలు వారిని భూలోకానికి తీసుకు వచ్చి తాజ్ మహల్ ను పరివేష్టించి ఉన్న సుందరోద్యాన వనంలో దింపి వెళ్ళిపోయారు. తెల్లని పాలవెన్నెల పాలరాతి సౌధాన్ని అభిషేకిస్తుంటే, ఆ సౌధం స్వచ్ఛమైన తమ ప్రేమలా ప్రకాశిస్తుంటే, వారు ఆ సౌందర్యాన్ని చూసి ముగ్ధులైనారు. ఇద్దరూ చేయి చేయి పట్టుకుని, ప్రపుల్ల సుమపరిమళభరితమైన ఉద్యాన వనంలో నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. మధ్య మధ్య ఆగి రకరకాల గులాబుల సోయగాలను పరికిస్తూ ఉంటారు. వనంలో తాము పూర్వం విహరించిన ప్రదేశాలన్నింటిని తనివితీర తిలకిస్తూ ఉంటారు. మధురానుభూతితో మైమరపుతో మబ్బులపై తేలిపోతున్నట్లుగా నడుస్తోంది ముంతాజ్; షాజహాన్ రాజఠీవితో తన రాణి చేయిపట్టుకుని నడిపిస్తున్నాడు. అతని ఠీవి చూసి ముచ్చటపడుతున్నది ఆమె. తాము భూమిపై జీవించి ఉన్నప్పటి సంఘటనను ఒక దానిని జ్ఞాపకం చేసి ఏదో అడుగుతోంది ఆమె. అతను ఆమెకు వివరించి చెబుతున్నాడు. తర్వాత షాజహాన్ ఒక చంద్ర శిలా వేదికపై కూర్చున్నాడు. ముంతాజ్ తాజ్ మహల్ వద్దకు పరుగెత్తుకు వెళ్ళింది. ఒక మినార్ మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది. అక్కడి నుంచి చూస్తే తాజ్ మహల్ పరిసర సుందర ప్రకృతి దృశ్యమంతా వెన్నెల్లో మెరిసిపోతూ కనిపిస్తోంది. ఆమె మళ్ళీ క్రిందికి దిగి వచ్చి ప్రియుని చేరుకున్నది. భరించరాని ఆనందంతో ఇద్దరూ కౌగిలించుకున్నారు, పరవశంతో కన్నులు మూసుకున్నారు.

విలాయత్ ఖాన్, ఇమ్రాత్ ఖాన్

జోడ్:

'చాందినీ కేదార్' రాగం ఆలాప్ నుంచి 'జోడ్ లోకి వచ్చేసరికి కథలో రెండో అంకం -ఫ్లాష్ బాక్ ప్రారంభమవుతుంది. ముంతాజ్, షాజహాన్ ల మనస్సులు గతంలోకి వెళ్ళాయి. అప్పటికి వారికింకా పెళ్ళికాలేదు. ఒకరినొకరు కలుసుకోవాలనీ, కలుసుకుని కాలగమనాన్ని స్తంభింపజేయాలనీ తహతహ లాడేవారు. రహస్యంగా కలుసుకునేవారు. ఒకరిపై ఒకరు కొంటెగా చమత్కార బాణాలు విసురుకునేవారు. ఒకసారి కలుసుకున్నప్పుడు షాజహాన్ మోహావేశంలో తన కోరికను వ్యక్తం చేశాడు. ఆమె భయసంకోచాలు ప్రకటించింది. 'నిన్ను తప్ప మరెవ్వరినీ ప్రేమించలేను. నిన్ను తప్ప ఇంకెవ్వరిని వివాహం చేసుకోను. నేను నీ వాడిని, నువ్వు నా దానివి. నాలో ఐక్యమైపో' అన్నాడు అతను. ఆమె అతని కౌగిట్లో ఒదిగిపోయింది. అతని అణువణువునా కరిగిపోయింది. ఈ శృంగార రసవద్ఘట్టం పతాక స్థాయి సితార్, సుర్ బహార్ ల ఝాలాతో ముగుస్తుంది.

గత్:

రికార్డు రెండో వైపు 'గత్' వాయించారు. ముంతాజ్, షాజహాన్ లు భార్యా భర్తలైనారు. ప్రేమామృత పానంతో మత్తెక్కిపోయాడు షాజహాన్. ముంతాజ్ తప్ప మరేదీ కనిపించడం లేదు అతనికి. అతని జీవితంలోని ప్రతిక్షణంలో ప్రతి అణువులో ముంతాజ్ నిండిపోయింది; ముంతాజ్ సౌందర్యాన్ని ఆరాధించడంలో, ఆస్వాదించడంలో అతను సమస్త ప్రపంచాన్ని విస్మరించాడు. సామాజిక నియమాలను, రాజరిక విధులను త్రోసిపుచ్చాడు. రాజదర్భారు అధికారులు ముంతాజ్ షాజహాన్ ల ప్రేమకు మనస్సులో జోహారులర్పిస్తున్నప్పటికీ, చక్రవర్తి రాణికి దాసుడైపోయాడని విమర్శలు లేవదీశారు. ప్రజలు కూడా నిరసించారు. కాని, షాజహాన్ ఈ విమర్శను, నిరసనలను లక్ష్యపెట్టలేదు. రాణిపట్ల తన ప్రేమకు చిహ్నంగా ఒక అద్భుతమైన, అపూర్వమైన సౌధాన్ని నిర్మించాలని సంకల్పించాడు. ఆ దశలో ముంతాజ్ భర్తను గురించి ఆందోళన పడసాగింది. అతని ప్రేమకు తాను ఎంతో సంతోషిస్తున్నా, తన కోసం చక్రవర్తి ఒక మహాసౌధాన్ని నిర్మించడం సముచితమేనా అని ఆమె మధనపడేది. కాని, షాజహాన్ దేనినీ లక్ష్యపెట్టలేదు. ఎవరెన్ని అనుకున్నా అతను మదిరాపానంతో ప్రేయసి ఒడిలో కాలం గడిపేశాడు. అతను ఆనందంతో మత్తెక్కిఉండగా క్రూరవిధి శపించింది. ముంతాజ్ అతనికి శాశ్వతంగా దూరమైపోయింది. ఆమె లేని జీవితం అతనికి కారు చీకటైపోయింది. కోరికలు, ఆశలు, అన్నీ అణగారిపోయాయి. జీవితంపై ఇచ్ఛ నశించింది. ముంతాజ్ తో గడిపిన అనుభవాల మాధుర్యాన్ని నెమరు వేసుకుంటూ ఆ నిషాతోనే తాజ్ మహల్ ను చూస్తూ జీవిత శేషం గడిపివేశాడు.

గతం కలలాగా కరిగిపోయింది. దేవదూతలు మళ్ళీ భువికి దిగివచ్చారు. వారు ఇచ్చిన గడువు తీరిపోయింది. ముంతాజ్, షాజహాన్ లు తాజ్ మహల్ ను విడిచిపెట్టలేక, మళ్ళీ మళ్ళీ వెనుదిరిగి చూస్తూ, ఎంతో దిగులుగా మబ్బులపై స్వర్గలోకానికి తిరిగి వెళ్ళారు.

నండూరి పార్థసారథి
(1974 ఆగస్టు 23వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post