Title Picture

సత్యేన్ బోస్ ('చల్తీకానామ్ గాడీ' ఫేమ్) తాజా చిత్రం 'గర్ల్ ఫ్రండ్' సకుటుంబంగా చూసి ఆనందించదగిన హాస్య చిత్రం. భారీ ఎత్తున హంగులు, హడావుడులు లేకుండా నిరాడంబరంగా, చౌకలో పన్నెండున్నర అడుగుల నిడివిలో తీసిన చిత్రం ఇది.

సరళమైన శైలి, సున్నితమైన హాస్యం మేళవించుకుని సన్నని నాజూకు పడుచుపిల్లలా నడిచింది రచన. శ్రుతిమించకుండా సుతారంగా వయ్యారంగా సాగింది సంగీతం. మితిమించకుండా, గతి తప్పకుండా అల్లరిచేశాడు కిశోర్ కుమార్. గంభీరంగా, గడుసుగా, చిలిపిగా, అందంగా ఉంది వహీదా - ఆమె నటన.

బొంబాయి వాళీ మెజారిటీ చిత్రాలలో లాగా భారీ ఎత్తున సస్పెన్సు, స్టంటు, చెత్తా, చెదారం మొదలయినవి ఇందులో లేవు. ముఖ్యంగా ఇంత చక్కని సంభాషణలు ఈ మధ్య ఏ హిందీ చిత్రంలోనూ వినలేదు.

అతను, ఆమె ఇరుగుపొరుగువారు. వారిద్దరూ ప్రేమించుకోవడం కన్నా సహజం ఇంకేం ఉంటుంది? అయితే ఇరుగింటాయన, పొరుగింటాయన ప్రేమించుకోలేదు. వాళ్ళిద్దరికీ మధ్య కోర్టు వ్యవహారాలనే గోడ అడ్డం. కాని అతను మాత్రం ఆ గోడను లెఖ్కచెయ్యకుండా దాటి, ఆమెతో సరాగాలు ఆడుతూ ఉంటాడు. ఇంతలో విలన్ ప్రవేశిస్తాడు. అతని దిష్టితగిలి ఆ గోడ లావుగా, ఎత్తుగా పెరుగుతుంది. అతను ఆ గోడను దూకలేకపోతాడు. తర్వాత కొంతసేపు విరహం. చివరికి ప్రేమ, ధర్మం మొదలయినవి జయిస్తాయి. గోడ పటాపంచలవుతుంది. ఇరుగింటాయన, పొరుగింటాయన స్నేహితులవుతారు. ఆమె, అతను భార్యా భర్తలవుతారు. ఇది కథకాదు -సారాంశం.

ద్వితీయార్థంలో కొంత మామూలుతనానికి దిగజారినట్లు అనిపించినా మొత్తానికి చిత్రం ఎంతో హాయిగా - మండువేసవిలో కూల్ డ్రింక్ లా ఉంటుంది.

కులాసా, వినోదం కోరే యువతీయువకులు చెట్టపట్టాలు వేసుకుని వెళ్ళి చూడవలసిన చిత్రం 'గర్ల్ ఫ్రండ్'.

దర్శకుడు : సత్యేన్ బోస్; రచన : సజ్జన్ ; పాటలు : సాహిర్; సంగీతం : హేమంత్ కుమార్; ఛాయాగ్రహణం : మదన్ సిన్హా; తారాగణం : కిశోర్ కుమార్, వహీదా రహమాన్, నాజిర్ హుస్సేన్, బిపిన్ గుప్త, ధూమల్, లీలామిశ్రా, జగ్ దేవ్, మాస్టర్ అన్వర్, డైసీ ఇరానీ వగైరా....

నండూరి పార్థసారథి
(1961 ఫిబ్రవరి 19వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post