Title Picture

అశోక్ పిక్చర్స్ వారి తాజా చిత్రం కల్పన లోగడ అశోక్ కుమార్ నిర్మించిన 'రాగిణి'తో సరితూగేవిధఁగా ఉంది. ఆ చిత్రాన్ని చూసినవారు ఈ చిత్రం ఎంత బాగుంటుందో ఉజ్ఞాయింపుగా ఊహించుకోవచ్చును. అయితే, ఆ చిత్రం కంటే ఈ చిత్రానికి ప్రచారం ఎక్కువ జరిగింది కనుక జనం కొండంత ఆశలు పెంచుకున్నారు. వారికి ఈ చిత్రం ఆశాభంగం కలిగిస్తుందనడం సాహసమే అవుతుంది. మన మెజారిటీ ప్రేక్షకులకు ఈ చిత్రం పాత చొక్కా తొడుక్కున్నంత సుఖంగా ఉంటుంది.

అన్నం ఉడికిందీ, లేనిదీ ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసినట్లు, అసలు టూకీగా కథవింటే చిత్రం ఎలా ఉంటుందో సగం తెలిసిపోతుంది.

భార్యావియోగతప్తుడైన అమర్ (అశోక్ కుమార్) అనే బొమ్మలు గీసే అతను (లేక పరిభాషలో 'కళాతపస్వి') మనోగ్లానికి మందుదొరక్క సుందర కాశ్మీరు వాతావరణంలో సేదతీర్చుకునేందుకు వస్తాడు. ఆ ప్రదేశానికి కల్పన (పద్మిని) అనే ఒక కళా తపస్విని శాంతిని అన్వేషిస్తూ వస్తుంది. అమర్, కల్పన, పరస్పరం ప్రథమ వీక్షణంలోనే ప్రేమించుకొనడం పూర్తి అయన తరువాత విధి వారిని వేరు చేస్తుంది.

Picture
పద్మిని

తర్వాత అమర్ కు రైలులో ఆశా (రాగిణి) అనే అమ్మాయి పరిచయమవుతుంది. అసలు అమర్ బాబు బొంబాయిలో భారతీయ కళాకేంద్రానికి ప్రిన్సిపాల్. ఆశాకూడా కళా తపస్వినే. అందుకని అతను ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తాడు. దరిమిలా ఆమె అతన్ని ప్రేమిస్తుంది. అతను కూడా తనను ప్రేమిస్తున్నట్లు అపోహపడుతుంది. మధ్యలో అతను కల్పనను ప్రేమిస్తున్నట్లు తెలుసుకుని చివరలో ప్రేమను త్యాగం చేస్తుంది. అయితే ఈలోగా అమర్ కు కల్పనకు మధ్య అనేక అపార్థాలు వస్తాయి. విలన్ రూపంలో విధి అనేక పరీక్షలు పెడుతుంది. చివరికి వారిద్దరూ పాసవుతారు.

ఈ చిత్రంలో సంగీత, సాహిత్య, శిల్ప, నృత్యాలను విపరీతంగా గుప్పించి వేయడానికి ప్రయత్నం జరిగివుంటుందని కథను బట్టే ఊహించవచ్చును. ప్రయత్నలోపం ఏమీ లేదు.

దర్శకుని పేరిటకంటే సంగీత దర్శకుడు ఒ.పి. నయ్యర్ పేరిటనే ఈ చిత్రానికి ఎక్కువ ప్రచారం జరిగింది కనుక, సంగీతాన్ని గురించి ముందు ప్రస్తావించటం భావ్యం. సాటి సంగీత దర్శకులంతా జడుసుకునేటట్లు ఈ చిత్రానికి నయ్యర్ సంగీతం సమకూరుస్తాడని ఆయన అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే, బొంబాయి సంగీత దర్శకులకు నయ్యర్ వల్ల అట్టి ప్రమాదం ఎన్నడూ వాటిల్లదని ఈ చిత్రం రుజువు చేసింది. కష్టపడి, చెమటోడ్చి, తన ప్రతిభనంతా గుప్పించి రాగాలు కూర్చినట్లు తోస్తుంది. మొత్తం దాదాపు పదిపాటలున్నాయి. తిలకామోద్ రాగంలో కూర్చిన చిట్టచివరిపాట ఒక్కటే చాలా బాగుంది. మిగిలిన పాటలన్నింటిలోనూ, నయ్యర్ ధోరణి కొంచెం హెచ్చుమోతాదులో కనిపిస్తుంది. పాటలు జనసామాన్యానికి నోటపట్టవు. అంటే అంత శాస్త్రీయంగా ఉన్నాయని అర్థంకాదు.

రాఖన్ దర్శకత్వం కొట్టినపిండిలా ఉంది. ఫోటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ కాదు. సంగీతం నయ్యార్ సమకూర్చాడు కాబట్టి శబ్దం కొంచెం తగ్గితే యింకా బాగుండేది.

అశోక్ కుమార్ శృంగారాభినయం నచ్చినవారికి యీ చిత్రం బాగుంటుంది. నటనకోసం కాకపోయినా, పద్మినికోసం యీ చిత్రాన్ని చూడవచ్చును. రాగిణి నటన మామూలే.

నండూరి పార్థసారథి
(1960 అక్టోబర్ 9వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post