సితార్ వాదకుడుగా, సంగీత ప్రచారకుడుగా, బోధకుడుగా, నిత్య నూతన ప్రయోగశీలిగా మాత్రమేకాక, స్వయంగా కొన్ని అద్భుత రాగాలను సృష్టించి, భారతీయ సంగీత భాండారానికి సమర్పించిన గొప్ప పండితుడుగా కూడా రవిశంకర్ పేరు శాశ్వతంగా నిలిచిపోగలదు. 'రసియా', 'అహీర్ లలిత్', 'తిలక్ శ్యామ్', 'నటభైరవ్', 'బైరాగి', 'కామేశ్వరి', 'పరమేశ్వరి', 'గంగేశ్వరి', 'రంగేశ్వరి' రాగాలు ఆయన స్వయంగా సృష్టించినవి. ఈ రాగాలన్నీ ఆయన జీవిత కాలంలోనే విశేషంగా ప్రచారంలోకి రావడం ఆయన అదృష్టం. ఎందుకంటే గొప్ప విద్వాంసులు సాధారణంగా సమకాలికుల రాగాలను ఆదరించరు. కాని, రవిశంకర్ తన పైతరం విద్వాంసుల గౌరవాన్నికూడా చూరగొన గలిగారు. 'నట భైరవ్', 'బైరాగి' రాగాలను పైతరం విద్వాంసులు కూడా గానం చేస్తున్నందు వల్ల అవి రవిశంకర్ సొంత రాగాలని చాలా మందికి తెలియదు. అవి ప్రాచీనమైన రాగాలనే చాలా మంది అనుకుంటున్నారు.

'రసియా, అహీర్ లలిత్, బైరాగి, నట భైరవ్, తిలక్ శ్యామ్' - రాగాలను ఆయన పాతిక ముప్పయి సంవత్సరాల క్రిందటే-అంటే పాతిక ముప్ఫయ్యేళ్ళ వయస్సులోనే-సృష్టించారు. 'పరమేశ్వరి, కామేశ్వరి, గంగేశ్వరి, రంగేశ్వరి' రాగాలను 1968లో సృష్టించారు. ఈ రాగాలన్నింటిలోకి అత్యద్భుతమైనది అతి ప్రసిద్ధమైనది 'బైరాగి'. ఈ ఒక్క రాగాన్ని తప్ప మిగిలిన రాగాలన్నింటినీ ఆయన రికార్డులలో వాయించారు.

'బైరాగి' రాగం 'భైరవ్' థాట్ (మేళకర్త) కు చెందిన ప్రాతఃకాల రాగం. వైరాగ్య భావాన్నీ, ఆత్మ విచారాన్ని వ్యక్తంచేసే అతి గంభీరమైన రాగం ఇది. ఆలాప్ లో, విలంబిత లయలో ఈ రాగం ఎక్కువగా శోభిస్తుంది. చిత్రవిచిత్రమైన నగిషీలకు ఇందులో ఆస్కారం లేదు. ఆరోహణ-అవరోహణ : సరిమపనిస-సనిపమరిస. 'రి', 'ని' కోమలస్వరాలు. 'రి' అతికోమల స్వరంగా ప్రయోగించ బడుతుంది. వాది 'ని', సంవాది 'మ'. ఉస్తాద్ అలీఅక్బర్ ఖాన్ (సరోద్) ఈ రాగాన్ని EASD 1319 నంబరు రికార్డులో అద్భుతంగా వాయించారు.

'నటభైరవ్' కూడా 'భైరవ్' థాట్ కు చెందిన ప్రాతఃకాల రాగం. ఇది 'భైరవ్', 'బైరాగి' రాగాలంత బరువైన రాగం కాదుకాని, మొత్తం మీద గంభీరమైనదే. 'భైరవ్' సూర్యోదయానికి పూర్వం గానం చేయదగినది. 'నటభైరవ్' సూర్యోదయ కాలంలో గానం చేయదగినది. EASD 1356 నంబరు రికార్టులో రవిశంకర్ ఈ రాగాన్ని గొప్పగా వాయించారు. ఆలాప్, జోడ్, మధ్యలయ గత్, చివరికి ఝాలా వాయించారు. ఈ రికార్డులో రెండో వైపు 'మిశ్రపీలూ' రాగాన్ని రాగమాలిక పద్ధతిలో వాయించారు. 'నటభైరవ్' రాగాన్ని రవిశంకర్ చాలా కాలం క్రిందట ఒక 78 RPM రికార్డులో కూడా వాయించారు. ఆ మూడు నిముషాల గత్ ను ఇటీవల ఒక ఇ.పి. రికార్డు ( EMOE 505) లోనికి, ఒక ఎల్.పి. రికార్డు (D ELRZ 2) లోనికి ఎక్కించారు. ఈ రాగాన్ని ప్రసిద్ధ విద్వాంసులు చాలా మంది రికార్డులలో వాయించారు. వీటిలో ముఖ్యమైనది అలీఅక్బర్ ఖాన్ రికార్డు (EALP 1324).

'రసియా', 'అహీర్ లలిత్' రాగాలను రవిశంకర్ EASD 1325 రికార్డులో వాయించారు. 'అహీర్ లలిత్' రాగం- 'అహీర్ భైరవ్', 'లలిత్' రాగాల మిశ్రమం. 'అహీర్ భైరవ్' రాగం 'భైరవ్' థాట్ కు చెందినది. కనుక 'అహీర్ లలిత్' కూడా 'భైరవ్' థాట్ క్రిందకే వస్తుంది. 'భైరవ్' థాట్ రాగాల పట్ల రవిశంకర్ కు ప్రత్యేకాభిమానం ఉన్నట్లున్నది. ఆ థాట్ కు చెందిన ప్రధాన రాగాలన్నింటినీ ఆయన రికార్డులలో వాయించారు. 'రసియా' రాగం కళ్యాణ్ థాట్ కు చెందిన రాగం. 'రసియా', 'అహీర్ లలిత్' రాగాలను ఆయన ఇదివరకు 78 RPM రికార్డులలో వాయించారు. అవి ఇటీవల ఇ.పి. రికార్డుల (EMOE 506, EMOE 507)లోకి, ఒక ఎల్.పి. రికార్డు (D ELRZ 2)లోకి ఎక్కించబడినాయి.

'తిలక్ శ్యామ్' రాగాన్ని EASD 1307 రికార్డులో వాయించారు. ఇది 'తిలక్ కామోద్', 'శ్యామ్ కళ్యాణ్'ల మిశ్రమం. ఈ రాగాన్ని కూడా ఆయన ఇది వరకు 78 RPM రికార్డులో వాయించారు. దీనిని ఇ.పి. (EMOE 505) రికార్డులోనూ, ఎల్.పి. (D ELR 2) రికార్డులోనూ వినవచ్చును. 'రసియా', 'అహీర్ లలిత్', 'తిలక్ శ్యామ్' రాగాలు వాయించిన రెండు ఎల్.పి. రికార్డులూ ఆట్టే సంతృప్తికరంగా లేవు.

'కామేశ్వరి', 'పరమేశ్వరి', 'గంగేశ్వరి', 'రంగేశ్వరి' రాగాలలో 'పరమేశ్వరి' అద్భుతంగా ఉంది. ఈ రాగంలో 'అహీర్ భైరవ్', 'శుద్ధ భైరవి', 'బిలాస్ ఖానీతోడి', 'భాగేశ్వరి' రాగాల ఛాయలు కనిపిస్తాయి. వీటిలో 'భాగేశ్వరి' తప్ప మిగిలినవి ప్రాతఃకాల రాగాలు. నాలుగూ వేర్వేరు థాట్ లకు చెందిన వేర్వేరు తత్వాలుగల రాగాలు. 'అహీర్ భైరవ్' ప్రాతఃకాల ప్రకృతిని వర్ణించే రాగం. 'శుద్ధభైరవి' 'బిలాస్ ఖానీతోడి' కరుణరస ప్రధాన రాగాలు. 'భాగేశ్వరి' విప్రలంభ శృంగార రాగం. రవిశంకర్ సితార్ వాదనంలో ఈ నాలుగు రాగాల 'కలనేత' అతి మనోహరంగా ఉంది. ఈ రాగాన్ని EASD 1360 రికార్డులో పూర్తిగా రెండు వైపులా వాయించారు. ఒక వైపు 'ఆలాప్', 'విలంబిత్ జోడ్' వాయించారు. రెండో వైపు మధ్యలయలో, ధ్రుత్ లయలో జోడ్, తర్వాత ధమార్ తాళంలో గత్ వాయించారు. ఇతర రికార్డులన్నింటిలోకంటే చాలా గంభీరంగా, ధ్రుపద్ శైలిలో ఈ రాగాన్ని వాయించారు రవిశంకర్.

నండూరి పార్థసారథి
(1974 జూన్ 21వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post