Title Picture
వందేమాతరం

మనం ఎటుపోతున్నామో, ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలంటే మధ్య మధ్య ఒక్కసారి ఆగి, వెనక్కి తిరిగి చూసుకోవడం మంచిది. అలా చూసుకుంటే మనం తిన్నగా నడుస్తున్నామా, డొంక తిరుగుళ్ళు తిరుగుతున్నామా, అసలు ముందుకు పోతున్నామా, వెనక్కి పోతున్నామా, గానుగెద్దులాగా గుండ్రంగా తిరుగుతున్నామా అనేది తెలుస్తుంది. మనకొక గమ్యం అంటూ ఉందనుకుంటే, ఆ గమ్యం దిశగా నడుస్తున్నామా, లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఎటో అటు నడుస్తూ పోవడమే మన పరమాశయం కాదు కదా!

బలుపా? వాపా?

కడచిన ఇరవై సంవత్సరాల్లో తెలుగు చలన చిత్రపరిశ్రమ ట్రిక్ షాట్ లో ఘటోత్కచుడిలాగా పెరిగిపోయింది. మన ఆర్థిక వ్యవస్థలాగా లెవెక్కిపోయింది. కాస్త జాగ్రత్తగా పరీక్షిస్తే గాని ఇది బలుపో, వాపో తెలియదు. పరిమాణంలో గ్రాఫ్ అంత కంతకు ఎగబ్రాకుతోంది. ప్రమాణంలో అంత కంతకు దిగజారుతోంది. ఇప్పుడు పైన పటారం, లోన లొటారంగా ఉంది వ్యవహారం. ఈ పరిస్థితిని 'చలన చిత్రోల్బణం' అనవచ్చు.

Picture
ఆలం ఆరా

'తెలుగు చలన చిత్ర పరిశ్రమ' అంటూ ఒకటి ఏర్పడినది 1931 లోనే. అంతకు ముందు సినిమాకు నోరు లేదు. మూగ చిత్రాలకు భాష ప్రసక్తిలేదు. ఎక్కడ నిర్మించబడినప్పటికీ వాటికి దేశమంతటా మార్కెట్ ఉండేది. 1931లో సినిమా మాట్లాడడం నేర్చుకున్నది. మొదటి టాకీ 'ఆలం ఆరా' హిందీలో వెలువడింది. ఆ ఏడాది హిందీలో మొత్తం 23 టాకీలు విడుదలైనాయి. తెలుగులో ఒక టాకీ విడుదలయింది. టాకీల నిర్మాణంతో మార్కెట్ భాషల వారీగా విభక్తమైపోయింది. మార్కెట్ బట్టి - అంటే బాక్సాఫీస్ వసూళ్ళకు గల అవకాశాన్ని బట్టి - ఆయా భాషా చిత్రాల స్తోమతులు నిర్ణయమైనాయి. ఆ స్తోమతులను బట్టి నిర్మాణ వ్యయాలకు కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి. హిందీ చిత్రాలకున్నంత మార్కెట్ ఇతర భాషా చిత్రాలకు లేదు. అందుచేత హిందీలో వెలువడినన్ని చిత్రాలు ఇతర భాషలలో వెలువడే ఆస్కారం లేదు. హిందీ చిత్రాలను నిర్మించినంత భారీ ఎత్తున ఇతర భాషా చిత్రాలను నిర్మించడం సాధ్యం కాదు.

అయినా చిత్రాల సంఖ్య విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ మిగతా భాషలన్నింటి కంటే శీఘ్రమైన అభివృద్ధి సాధించింది. మొదట-హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ చిత్రాల తర్వాత ఐదవ స్థానంలో ఉన్న తెలుగు సినిమా 1940 నాటికి మరాఠీ సినిమాను దాటేసి నాలుగో స్థానంలోకి వచ్చింది. 1959 నాటికి బెంగాలీ సినిమాను దాటేసి మూడో స్థానంలోకి వచ్చింది. 1968లో తమిళ సినిమాను వెనక్కి నెట్టేసి రెండో స్థానంలోకి వచ్చింది. అప్పటి నుంచి తెలుగు, తమిళ చిత్రాలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పుడు తెలుగులోనూ, తమిళంలోనూ కూడా సగటున ఏడాదికి 70 చిత్రాలు విడుదలవుతున్నాయి. 1971లో తెలుగులో 84 చిత్రాలు విడుదలయినాయి.

మార్కెట్ వైశాల్యాన్ని, చిత్రాల సంఖ్యను బేరీజు వేసుకుని చూస్తే హిందీ చిత్రాల కంటే మనదే పైచెయ్యి అని చెప్పాలి. తెలుగు చిత్రాల మార్కెట్ హిందీ చిత్రాల మార్కెట్ లో సుమారు ఆరోవంతు ఉంటుంది. కాని ఏటా విడుదలవుతున్న తెలుగు చిత్రాల సంఖ్య హిందీ చిత్రాల సంఖ్యలో సగానికి పైగా ఉంటుంది. రాష్ట్రాల వారీగా చూస్తే-ఒక్క తమిళనాడు మినహా-మిగిలిన అన్ని రాష్ట్రాలలో కంటే మన రాష్ట్రంలో థియేటర్ల సంఖ్య ఎక్కువ. అయినా నాలుగున్నర కోట్ల జనాభాగల ఆంధ్రప్రదేశ్ లో టూరింగ్ టాకీసులతో కలిపి సుమారు వెయ్యి థియేటర్లు మాత్రమే ఉన్నాయి. మన జనాభాతో, చిత్రాల సంఖ్యతో పోల్చితే థియేటర్ల సంఖ్య చాలా తక్కువ. ఈమధ్య మన చిత్రాలు బాగా దెబ్బతినడానికి ఒక కారణం ఇది. థియేటర్ల సంఖ్య పెరగకుండా చిత్రాల సంఖ్య పెరుగుతున్నది. మన వాళ్ళకి చిత్ర నిర్మాణం పట్ల ఉన్న మోజు థియేటర్ల నిర్మాణం పట్ల లేదు. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చలన చిత్ర నిర్మాణాన్ని అభివృద్ధి చేయాలని తాపత్రయపడుతున్నదే కాని, థియేటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడం లేదు. నిజానికి చిత్ర నిర్మాణంలో ఉన్న 'రిస్క్' థియేటర్ నిర్మాణంలో లేదు. అయితే థియేటర్ మీద ఆదాయం కొంచెం నెమ్మదిగా వస్తుంది. చిత్రం మీద ఆదాయం ఓపెనింగ్స్ బాగా ఉంటే - కొద్ది నెలల్లో వచ్చేస్తుంది. ఈ ఆశ వల్ల చిత్ర నిర్మాణం ఒక జూదంగా తయారయింది.

భారీ జూదం

ద్రవ్యోల్బణం వల్ల, స్టార్ సిస్టమ్ వల్ల, కలర్ మోజు వల్ల తెలుగు చిత్రాల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా పెరుగుతున్నది. అయినా నిరుత్సాహపడకుండా మనవాళ్లు ఇతోధికంగా చిత్రాలను నిర్మిస్తున్నారు. మార్కెట్ మాత్రం అంత జోరుగా పెరగడం లేదు. ఎక్కువ ఖర్చు పెట్టినందుకు ఎక్కువ డబ్బు రాబట్టుకోవడానికి వీల్లేకుండా ఉంది. అందుచేత ఒక చిత్రం విజయవంతం కావాలంటే తప్పని సరిగా నాలుగైదు చిత్రాలు దెబ్బతినవలసి వస్తున్నది. క్రిందటి సంవత్సరం తెలుగులో 70 చిత్రాలు వచ్చాయి. వాటిలో 10 డబ్బింగ్ చిత్రాలు. మిగిలిన 60 స్ట్రెయిట్ టేక్ చిత్రాలలో మూడో వంతు-అనగా 20 చిత్రాలు-కలర్ వి. వాటిలో 15 చిత్రాలు విజయవంతమైనాయి. బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో 5 శాతం మాత్రం విజయవంతమైనాయి. మొత్తం మీద పరిశ్రమకు 175 లక్షల రూపాయలు నష్టం వచ్చినట్లు అంచనా వేశారు.

కలర్ చిత్రాలను మరిగిన ప్రేక్షకులు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను చూడడానికి ఇష్టపడడం లేదు. కలర్ లో తీసిన చిత్రాలకే బాగా డబ్బులొస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ లో ఎంత చక్కగా తీసినా డబ్బులు రావేమోనని భయపడే పరిస్థితి ఏర్పడింది. అలా అని కలర్ లో తీస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. (క్రిందటి ఏడాది ఐదు కలర్ చిత్రాలు బాగా దెబ్బతిన్నాయి కదా మరి!) అంటే - తెలుగు చిత్రం నిర్మించడంలో 'రిస్క్' ఇది వరకు ఐదారు లక్షలు ఉండేది ఇప్పుడు సుమారు 15 లక్షలకు పెరిగింది. అయినా, ఈ జూదం పట్ల నిర్మాతలకు మోజు తగ్గడం లేదు.

వెన్నులు విరిగే పన్నులు

ఒక వంక నిర్మాణ వ్యయం ఇలా విపరీతంగా పెరుగుతుంటే మరొకవంక పన్నుల భారం తడిసి మోపెడై నిర్మాతల వెన్నులు విరుగుతున్నాయి. బాక్సాఫీస్ వసూళ్ళలో సగానికి పైగా పన్నులు తన్నుకు పోతున్నాయి. వినోదం పన్ను, షోటాక్సు వగైరాలు, థియేటర్ అద్దె, డిస్ట్రిబ్యూటర్ షేర్-ఇవన్నీ పోనూ నిర్మాతకు రూపాయిలో పదిపైసలు మాత్రమే చేతికి వస్తున్నాయి. అంటే-నిర్మాతకు తన పెట్టుబడి తిరిగి రావాలంటే నిర్మాణ వ్యయానికి పదిరెట్లు ధనం బాక్సాఫీసు వద్ద వసూలు కావాలి. అంతకు మించి వసూలు చేస్తేనే లాభాలు వస్తాయి. కాని, అంత డబ్బు వసూలు చేయడానికి ఇప్పుడున్న థియేటర్లు ఎంత మాత్రం చాలవు. కొన్ని సంవత్సరాల పాటు తెలుగులో చిత్రాల నిర్మాణం తగ్గించి, థియేటర్ల నిర్మాణం పెంచితే తెలుగు చిత్ర పరిశ్రమకు కొంత స్వస్థత చేకూరుతుంది. థియేటర్లు చాలినన్ని ఉంటే ఒక మోస్తరు చిత్రాలు కూడా బాగా డబ్బు చేసుకోగలుగుతాయి. థియేటర్ల నిర్మాణం పట్ల ప్రైవేటు వ్యక్తులు ఆసక్తి చూపకపోతే ప్రభుత్వం స్వయంగా నిర్మించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్ల ఆవశ్యకత ఎంతైనా ఉంది. థియేటర్లు ఎక్కువైన కొద్దీ ప్రభుత్వానికి వినోదం పన్ను రూపంలో ఆదాయం కూడా ఎక్కువ అవుతుంది.

నానాటికీ తీసికట్టు

ఇక కళా ప్రమాణాలను బేరీజు వేయాలంటే 44 సంవత్సరాల తెలుగు చలన చిత్ర చరిత్రను స్థూలంగా మూడు అధ్యాయాలుగా విభజించవచ్చును. 1931 నుంచి 1938 వరకు మొదటి 8 సంవత్సరాలను ప్రాథమిక యుగమనీ, 1939 నుంచి 1955 వరకు 17 సంవత్సరాల కాలాన్ని స్వర్ణయుగమనీ, 1956 నుంచి ఇప్పటి వరకు 19 సంవత్సరాలను అధ్వాన్న యుగమనీ చెప్పవచ్చును.

మొదటి ఎనిమిదేండ్లలో వచ్చినవి ఎక్కువగా పౌరాణిక చిత్రాలే. తెలుగులోనే కాదు-దేశమంతటా కూడా అప్పట్లో పౌరాణికాలే ఎక్కువగా నిర్మించబడుతూ ఉండేవి. అవి కేవలం ఫొటో గ్రాఫ్ చేయబడిన కంపెనీ నాటకాల ధోరణిలో ఉండేవి. ఒక్కొక్క చిత్రంలో పాటలు, పద్యాలు అరవై, డెబ్బయిదాకా ఉండేవి. అప్పట్లో మన వాళ్ళు సినిమాను మంచి లాభసాటి వ్యాపారంగా మాత్రమే గుర్తించారు. తమ వ్యాపారాన్ని చక్కబరచుకోవడానికే వారు తాపత్రయ పడ్డారు. సినిమాను ఒక కళా సాధనంగా వారు గుర్తించనూ లేదు, అప్పటికి కళా హృదయం గల దర్శకులూ లేరు.

Picture
బి.ఎన్.రెడ్డి

1939లో బి.ఎన్.రెడ్డి వాహినీ సంస్థను నెలకొల్పి, 'వందేమాతరం' నిర్మించడంతో తెలుగులో ఉత్తమ చిత్రాల నిర్మాణం ప్రారంభమయింది. కేవలం నిరక్షరాస్య ప్రజాబాహుళ్యం చూసి ఆనందించదగిన వీధి నాటకాల వంటి చిత్రాలను కాక, సంఘ సంస్కరణను ప్రతిపాదించే విప్లవాత్మక ఇతి వృత్తాలతో, మేధావి వర్గాన్ని ఆలోచింపజేయగల చిత్రాలను వాస్తవికంగా, కళాత్మకంగా ఆయన నిర్మించాడు. ఈ విషయంలో ఆయన అప్పట్లో దేశంలో కెల్ల అత్యుత్తమ చలన చిత్ర నిర్మాణ సంస్థ అయిన న్యూథియేటర్స్ (కలకత్తా)ను ఆదర్శంగా పెట్టుకున్నారు. ఆ నాటి ప్రముఖ దర్శకుడు దేవకీ బోస్ ను తన గురువుగా భావించుకున్నారు.

Picture
బంగారు పాప

తెలుగు చిత్రసీమలో బి.ఎన్.రెడ్డి మొదటి ఇంటిలెక్చువల్. ఆయన కంటే కొంచెం ముందుగానే నటుడుగా రంగంలోకి ప్రవేశించిన స్వర్గీయ నాగయ్య వాహినీ సంస్థ మూలస్తంభాలలో ఒకరైనారు. తర్వాత ఆయన స్వయంగా ఒక సంస్థను నెలకొల్పి చిత్రాలను నిర్మించారు. దర్శకత్వ ప్రతిభలో ఆయన బి.ఎన్.రెడ్డికి ఏ మాత్రం తీసిపోయిన వారు కారు. నాగయ్య నటుడుగా, సంగీత దర్శకుడుగా, గాయకుడుగా కూడా అత్యున్నత స్థాయి నందుకున్నారు. దేశంలో తెలుగు చిత్రరంగానికి గౌరవ ప్రతిష్ఠలు చేకూర్చి పెట్టిన వారు వారిద్దరే. వారి తర్వాత ఇంటలెక్చువల్స్ ఆనదగిన దర్శకులు ఇంకో ముగ్గురు నలుగురు రంగంలోకి ప్రవేశించినా వారు బి.ఎన్.రెడ్డి, నాగయ్యల స్థాయి నందుకోలేక పోయారు. బి.ఎన్.రెడ్డి 1939 నుంచి 1955 రకు ('వందేమాతరం' నుంచి 'బంగారు పాప' వరకు) తీసిన చిత్రాలన్నీ ఉత్తమ శ్రేణికి చెందినవి. ఆ తర్వాత ఆయన తీసిన ఐదు చిత్రాలూ చెప్పుకోదగినవి కావు.

Picture
సుమంగళి

మొదటి ఎనిమిదేండ్లలో తెలుగులో సుమారు 50 చిత్రాలు మాత్రమే వచ్చాయి. తర్వాత 17 ఏండ్ల స్వర్ణయుగంలో 244 చిత్రాలు, ఆ తర్వాత గడచిన 19 ఏండ్ల అధ్వాన్న యుగంలో 1030 చిత్రాలు వచ్చాయి. కాని, ఉత్తమ చిత్రాలని చెప్పుకోదగినవన్నీ 1939, 1955 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినవే. 'వందేమాతరం', 'సుమంగళి', 'దేవత' వంటి సాంఘిక ప్రయోజనాత్మక చిత్రాలు, 'పోతన', 'వేమన', 'త్యాగయ్య' వంటి భక్తిరస ప్రధాన చిత్రాలు, 'లైలా మజ్నూ', 'దేవదాసు' వంటి విషాదాంత ప్రేమ కథా చిత్రాలు, 'మల్లీశ్వరి', 'బంగారు పాప' వంటి కళాత్మక చిత్రాలు ఆ 17 ఏండ్లలో వచ్చినవే. ఇంకా 'షావుకారు', 'పాతాళభైరవి', 'పెద్దమనుషులు', 'కన్యాశుల్కం', 'అర్ధాంగి', 'తోడుదొంగలు', 'పక్కయింటి అమ్మాయి' వంటి ఎన్నో చక్కని చిత్రాలు ఆ కాలంలోనే వచ్చాయి. అవన్నీ 'గొప్ప' చిత్రాలు కాకపోవచ్చు గానీ, చక్కని చిత్రాలు మాత్రం అవును.

1956 నుంచి అధ్వాన్న యుగం ప్రారంభమయింది. చిత్రాల ప్రమాణం దిగజారిపోయింది. తెలుగు చిత్ర సీమ పై బాక్సాఫీస్ కబంధుని కౌగిలి బిగింపు ఎక్కువయింది. దర్శకులు, నిర్మాతలు బాక్సాఫీస్ సూత్రాలను తమ కాళ్ళకు, చేతులకు సంకెళ్ళుగా తగిలించుకున్నారు. సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాలకు వేర్వేరు ఫార్ములాలు తయారు చేసుకున్నారు. ఉత్తమాభిరుచికి, వాస్తవికతకు విడాకులిచ్చి, ఆ ఫార్ములాల ప్రకారం చౌకబారు చిత్రాలు ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. దురదృష్ట వశాత్తూ ఆ చిత్రాలు విజయవంతం కావడంతో మంచి దర్శకులు కూడా ఇష్టం లేకపోయినా ఆ ఫార్ములాలకు దాసులైపోయారు. వరసగా నాలుగైదు శతదినోత్సవ చిత్రాలను నిర్మించినవారికి 'బాక్సాఫీస్ బ్రహ్మ' లని బిరుదులు అంటగట్టారు. చివరికి ఈ 'బాక్సాఫీస్ బ్రహ్మ' ల చిత్రాలు వరసగా నాలుగైదు దారుణంగా ప్లాప్ అయ్యాయి. వారు రంగం నుంచి నిష్క్రమించారు.

ప్రాథమిక యుగంలోని పౌరాణికాలన్నీ మళ్ళీ ఈ అధ్వాన్నయుగంలో భారీ సెట్టింగులతో నిర్మించబడుతున్నాయి.

'కత్తి, కర్ర, కుక్క, గుర్రం ఫార్ములాతో కొన్నాళ్ళు విఠలాచార్య మార్కు చౌకబారు జానపద స్టంటు చిత్రాలు మార్కెట్ ను దున్నేశాయి. ఆయనను అనుకరిస్తూ మరి కొందరు రంగంలోకి దూకారు. అటువంటి చిత్రాలను ఇతర భాషల్లోకి డబ్ చేసి కూడా బాగా డబ్బులు చేసుకున్నారు. ఈలోగా ఇతర భాషల నుంచి తెలుగులోకి డబ్ చేయడం ఎక్కువయింది. వాటి తర్వాత సకుటుంబంగా చూసి ఆనందించదగిన కుటుంబ కథా చిత్రాలను వడ్డించడం ప్రారంభించింది తెలుగు చిత్ర సీమ. ఈ రకం చిత్రాలలో అంతకంతకు మెలో డ్రామా మసాలా తిరగమోత ఎక్కువుతోంది. మెలో డ్రామా దట్టించడంలో, ఓవర్ యాక్షన్ లో మనతో పోటీ పడగల వారు తమిళులు తప్ప మరెవ్వరూ లేరు.

1963 నుంచి తెలుగు వార పత్రికా లోకంలో రచయిత్రులు విజృంభించారు. పాఠకులు ఎగబడి చదవడంతో రచయిత్రుల పాపులారిటీ విపరీతంగా పెరిగింది. సినిమాలను కాపీ కొట్టి తమ సరుకును సినిమాలకే అంట గట్టుతున్నారు రచయిత్రులు. ఈ 'చౌకబోరు' సాహిత్యాన్ని ఉత్పత్తి చేయడంలో మగవారు స్త్రీలకు ఎంత మాత్రం తీసిపోరు. అయితే వారు తమ సాహితీ వ్యాపార ప్రతిభను సంభాషణలు రచించడంలో ప్రదర్శిస్తున్నారు. శ్రమ విభజన 'సూత్రం' ప్రకారం స్త్రీలు ముడి పదార్థం సరఫరా చేస్తున్నారు. పురుషులు ఆ పదార్థాన్ని ఫినిష్డ్ ప్రాడక్టుగా మార్చుతున్నారు. ఈమధ్య ఐదారు సంవత్సరాలుగా తెలుగులో ఇటువంటి చిత్రాల జోరు ఎక్కువగా ఉంది. ఇవి ఇతర భాషల్లోకి తర్జుమా అవుతున్నాయి.

ఈ 19 ఏండ్ల అధ్వాన్నయుగంలో మంచి చిత్రాలని చెప్పుకోదగ్గవి-బాటసారి, 'సాక్షి' వంటివి-గట్టిగా లెక్క బెడితే ఒక ఐదారు ఉంటాయి. 1030 చిత్రాల 'జంక్' పాత ఇనప సామాను నుంచి వీటిని పెళ్ళగించి బైటికి తీయాల్సి ఉంటుంది.

తరుణోపాయం

తెలుగు సినిమా ఈపరిస్థితి నుంచి ఇంక బైటపడదా? తరుణోపాయంలేదా? ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధతో చిత్త శుద్ధితో పూనుకుంటే ఒక్క ఐదారు సంవత్సరాల్లో తెలుగు సినిమాకు ఈ మాయరోగం వదులుతుంది. ప్రైవేటు నిర్మాతల వల్ల ఏమీ మేలు జరగదు. వారు తెలుగు సినిమాను ఇంకా లోతైన ఊబిలోకి దింపుతారు.

తెలుగు చిత్ర రంగాన్ని తెలుగు దేశంలోనే అభివృద్ధి పరచాలంటే ప్రభుత్వం తప్పని సరిగా తీసుకోవలసిన చర్యలు ఇవి :

  1. తారలతో నిమిత్తం లేకుండా పూర్తిగా కొత్త నటీ నటులతో వాస్తవికంగా కళాత్మకంగా, తక్కువ ఖర్చుతో చిత్రాలు తీయాలనుకుంటూ, ధనాభావం వల్ల ఆ పని చేయలేకపోతున్న దర్శకులకు ఆర్థిక సహాయం అందజేయాలి. అటువంటి వారి స్క్రిప్టులను పరిశీలించడానికి, వారి ప్రతిభను పరీక్షించడానికి ఒక సంఘాన్ని నియమించాలి. చిత్తశుద్ధి, ప్రతిభ గల సాంకేతిక నిపుణులను, విమర్శకులను ఆ సంఘంలో సభ్యులుగా నిమించాలి.

  2. ప్రతిభావంతులైన దర్శకులు నిర్మించే ఉత్తమ చిత్రాలకు వినోదం పన్ను మినహాయించాలి.

  3. హైదరాబాద్ లో వెంటనే ఫిలిం ఇన్ స్టిట్యూట్ ను అన్ని హంగులతో నెలకొల్పాలి. దాని వల్ల స్థానికంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి గట్టి ప్రాతిపదిక ఏర్పడుతుంది. మద్రాసులోని తారల మీద, సాంకేతిక నిపుణుల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. ఈ ఇన్ స్టిట్యూట్ ను బ్రహ్మానంద చిత్రపురిలోనే నెలకొల్పి, అక్కడ విద్యార్థులకు వసతి గృహాలు నిర్మించాలి. శిక్షణ కోసం ప్రత్యేకంగా అక్కడ ఒక స్టూడియోను ప్రభుత్వమే నిర్మించాలి.

  4. ఇప్పుడు చాలా మంది స్టూడియోతో నిమిత్తం లేకుండా ఏదైనా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అందులోనే షూటింగ్ చేస్తున్నారు. ఔట్ డోర్ చిత్రీకరణ కూడా ఎక్కువగా జరుగుతున్నది. ఇటువంటి చిత్రాల నిర్మాణం ముందు ముందు ఇంకా ఎక్కువవుతుంది. అందుచేత అటువంటి నిర్మాతలకు అద్దెకు ఇవ్వడం కోసం ఒక మొబైల్ షూటింగ్ యూనిట్ ను కొనాలి.

  5. హైదరాబాద్ పరిసరాలను ప్రకృతి దృశ్యాలతో అందంగా అభివృద్ధి చేయాలి.

  6. ప్రేక్షకుల అభిరుచిని పెంపొందింపజేయడం కోసం రాష్ట్ర మంతటా ఫిలిం సొసైటీలకు అవసరమైన ఆర్థిక సహాయం అందజేయాలి. యూనివర్సిటీలలో ఫిలిం అప్రీసియేషన్ కోర్సులను ప్రారంభించాలి.

  7. 'తెలుగు సినిమా'ను అధ్యయనం చేయగోరేవారికి అందుబాటుగా ప్రభుత్వం ఒక ఫిలిం ఆర్కైవ్ ను నెలకొల్పాలి. 1931 నుంచి వెలువడిన తెలుగు చిత్రాలను దొరికినంత మట్టుకు సేకరించి భద్రం చేయాలి. పాత సినిమా పాటల పుస్తకాలను జాగ్రత్త పెట్టాలి. సమగ్రమైన తెలుగు సినిమా చరిత్రను రచింపచేయాలి.

  8. అన్నిటికంటే ముఖ్యంగా చేయవలసిన పని - థియేటర్ల నిర్మాణం. గ్రామీణ ప్రాంతాల్లో చౌకగా, విరివిగా థియేటర్లు నిర్మించాలి.

నండూరి పార్థసారథి
(1975 ఏప్రిల్ 20వ తేదీన ప్రజాతంత్రలో ప్రచురితమైనది.)

Previous Post Next Post