Title Picture

(10)

1910లో మా మామగారికి తొరెయపురం సుబేదారుగా ఉద్యోగం అయింది. అప్పట్లో ఆయన నాకు బావగారు మాత్రమే - అంటే మా అక్క భర్త. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లలితను నేను వివాహం చేసుకోవడంతో మా బావగారే తరువాత మామగారు కూడా అయ్యారు. ఆయన కొంత విశేషమైన వ్యక్తి అని చెప్పవచ్చు. వివరంగా చెబితే ఆయన జీవితమే ఒక పెద్ద కథ అవుతుంది. కాని ఇది ఆయన కథ కాదు కాబట్టి ఆయన గురించి ఎక్కువగా చెప్పుకోవడం సాధ్యం కాదు. ఆయనకి సంగీతం పట్ల గొప్ప ఆసక్తి. వైలిన్ చక్కగా వాయించేవారు. కాని ఎవరైనా “మీరు బాగా వాయిస్తారండీ” అని మెచ్చుకుంటే ఆయన “అబ్బే... నాకేం వచ్చు” అనేవారు. “మీకింకా వైలిన్ వాయించడం బాగారాదు” అన్నారనుకోండి. “నా సంగతి మీకేం తెలుసు? వినిపిస్తాను చూడండి” అంటూ తను సాధన చేసిన కొన్ని కొత్త రకం గమకాలను వాయించి వినిపించేవారు. “పెద్ద విద్వాంసులు కూడా ఈ సంగతి వాయించలేరు తెలుసా” అనేవారు. అది నిజం కూడా. అవి ఆయన స్వయంగా కనిపెట్టిన సంగతులు. ఇంతకీ చెప్పవచ్చే దేమిటంటే అవునన్నది కాదనడం, కాదన్నది అవుననడం మా మామగారికి అలవాటు. ఎదుటి వాళ్ళతో వివాదం పెట్టుకోవాలని కాదు. ఆయన తీరే అంత. సాధారణంగా కాస్తోకూస్తో అధికారం, హోదా గలవాళ్ళందరికీ అలా అవునన్నది కాదనే అలవాటు ఉంటుంది. ఎటొచ్చీ మా మామగారికి అది అధికారాన్ని బట్టికాక సహజంగా వచ్చింది.

ఒకరోజు ఆయన తన కచేరీకి వెడుతుండగా ఒక ఇంట్లో నుంచి వైలిన్ వినిపించింది. వాయించే పద్ధతి బాగుందని ఆయనకి అనిపించింది. అక్కడ కనిపించిన ఒకరిని కనుక్కోగా ఆ వాయించేది వెంకటరమణ అని తెలిసింది. ఆ రోజు సాయంత్రం ఆయన వెంకటరమణను ఇంటికి పిలిపించారు. ఆయన కోరికపై వెంకటరమణ సుమారు గంటసేపు వాయించాడు. “చాలా బాగా వాయించావు. నీ గురువు ఎవరో గాని బాగా తర్ఫీదు ఇచ్చారు” అని ఆయన మెచ్చుకున్నారు.

“అవునండీ... మీరు సుబ్బణ్ణగారి సంగీతం విని తీరాలి” అని చెప్పాడు వెంకటరమణ.

“ఎవరా సుబ్బణ్ణ గారు?”

“మా గురువుగారండి”

“ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నారా?”

“అవునండి”

“ఎప్పుడైనా ఒకసారి రమ్మని చెప్పు. విందాం”.

సుబ్బణ్ణగారు అలా ఒకరు పిలిస్తే వచ్చే రకం కాదని రమణ, అతని స్నేహితులు మా మామగారికి చెప్పారు.

సుబ్బణ్ణ అలా వచ్చేరకం కాకపోతే మా మామగారు మళ్ళీ ఇంకోసారి అడిగే రకం కాదు. అది గర్వం అని మీరనుకోవచ్చు. కాని నేను అలా అనుకోను. అది ఒకరకం ఆత్మగౌరవమని అనుకుంటాను. సాధారణంగా అది గొప్ప వాళ్ళందరికీ ఉంటుంది. సుబ్బణ్ణగారు ఒప్పుకుంటే తన కుమార్తె లలితకు ఆయన చేత సంగీతం నేర్పించాలని మా మామగారు అనుకున్నారు. కాని సుబ్బణ్ణగారి సంగతి విని, అది సాధ్యం కాదని వదిలేశారు.

ఇంకో రోజు మా మామగారు కచేరీకి వెడుతుండగా దారిలో ఒక ఇంటి ముందు కొంత మంది పిల్లలకి వైలిన్ నేర్చుతూ సుబ్బణ్ణగారు కనిపించారు. ఫలానా సంగతి వైలిన్ పై పలికించడం ఎలాగో చెబుతూ సుబ్బణ్ణగారు స్వయంగా వాయిస్తున్నారు. ఒక చిన్న సంగతి వాయించి చూపించాలనుకున్న సుబ్బణ్ణగారు ఆ రాగం ఆకర్షణకు వశుడై ఆలాపన వాయించడం మొదలుపెట్టాడు. ఆయన రాగాలాపనలో నిమగ్నుడై ఉండగా మా మామగారు ఆదారిని వెళ్ళడం జరిగింది. తన చెవినిపడిన ఆకాస్త సంగీతానికే మా మమగారు ముగ్ధుడైపోయారు. కచేరీలో పనిచేసుకుంటున్నంత సేపు ఆయన సుబ్బణ్ణగారి సంగీతాన్ని నెమరువేసుకుంటూనే ఉన్నారు. రోజూ కంటే త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చి, ఎలాగైనా సుబ్బణ్ణగారిని ఒప్పించి తీసుకురమ్మని ఒక గుమాస్తాను పంపించారు.

ఆ గుమాస్తా సుబ్బణ్ణగారి దగ్గరకు వెళ్ళి “అయ్యా... ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి” అన్నాడు.

“ఏం మాట్లాడాలి?”

“మా సుబేదారుగారు ఒక్కసారి మిమ్మల్ని తమ ఇంటికి తీసుకు రమ్మన్నారు. ఆయన చాలా మంచివారు. మీ సంగీతం వినాలనుకుంటున్నారు”.

సుబ్బణ్ణగారు ఏమీ మాట్లాడలేదు. ఇటువంటి వ్యవహారాలు ఆయనకు నచ్చవు. ఆయన అన్నీ వదిలేశాడు. కాని ఎలాగో మళ్ళీ పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. కాని, గొప్ప వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం, వాళ్ళ ప్రవర్తన సరిగా లేదని చిరాకు పడడం.. ఇవన్నీ ఆయనకు ఇష్టం లేదు. ఆ గుమాస్తా మళ్ళీ బలవంతం చేయగా ఆయన “అంతగొప్ప వాళ్ళ ఇళ్ళకు రావాలంటే నాకు సంకోచం. నన్ను క్షమించవలసిందని మీ సుబేదారు గారికి చెప్పండి” అన్నాడు. గుమాస్తా వచ్చి మా మామగారికి ఆ సంగతి చెప్పాడు.

మా మామగారికి కొద్దిగా కోపం వచ్చింది. “నేను అదేపనిగా ఆహ్వానం పంపితే రానని తిరస్కరించేటంత గొప్ప విద్వాంసుడా ఆయన” అనుకున్నాడు. జీవితం ఇలాగే ఉంటుంది. నాటకంలో రాజు వేషం వేసే రంగారావు తాను నిజంగా రాజే అయినట్లు నటిస్తాడు. రాజఠీవి అంతా ప్రదర్శిస్తాడు. అలాగే మనం జీవితంలో హోదా, ప్రతిష్ఠ, పలుకుబడి అనేదుస్తులు ధరించి, నిజంగా గొప్ప వాళ్ళమని అనుకుంటూ ఉంటాము. ఇంకో వ్యక్తి పేద వాడి వేషంలో ఉంటాడు. అతడిని తక్కువగా చూస్తాము. పేదవాడి వేషంలో ఉన్న వ్యక్తి తను నిజంగా తక్కువ వాడేననుకుని 'గొప్ప వాడి'కి తలవంచుతాడు. అలా తలవంచ లేదనుకోండి. తనకు చాలా అవమానం జరిగినట్లు, తన ప్రతిష్ఠకు భంగం కలిగినట్లు 'గొప్పవాడు' భావిస్తాడు. నాటకంలో సేవకుని వేషం వేసే సింగయ్య రాజువేషం వేసే కోటయ్యకు రంగస్థలం మీద వంగి సలాము చేయవలసిన మాట నిజమే. కాని, వీధిలో సలాము చేయనవసరం లేదు కదా. నాటకం అయిపోయిన తరువాత అతను సేవకుడూ కాదు, ఇతను రాజూ కాదు. కాని జీవితంలో ఒక్కొక్కప్పుడు కొన్ని విచిత్రమైన సందర్భాలు వస్తూ ఉంటాయి. సింగయ్య రంగస్థలం మీది నుంచి దిగిపోతాడు. కోటయ్య మాత్రం ఇంకా రాజు వేషంలో రంగస్థలం మీదే ఉంటాడు. అలాంటప్పుడు వస్తుంది పేచీ. సుబేదారుగారు ఇంకా ప్రపంచంలోనే ఉన్నాడు. ప్రపంచం దృష్టిలోనే ఆయన అన్నింటిని విలువలను బేరీజు వేస్తాడు. కాని, సుబ్బణ్ణగారు మామూలు ప్రపంచ మర్యాదలన్నింటికీ అతీతంగా ఉన్నారు. ఆయన విలువ వేరు. అందుచేత సుబ్బణ్ణగారు తన పట్ల మర్యాద చూపించలేదని మామామగారికి కోపం రావడం సహజం. మామూలుగా మనలాంటి వారెవరికైనా అటువంటి పరిస్థితిలో కోపం వచ్చేమాట నిజం. గుమాస్తా వచ్చి చెప్పగానే మా మామగారు “రాకపోతే పోనీ” అని ఊరుకున్నారు.

తరువాత కొన్ని రోజులకి ఆ గుమాస్తా మా మామగారి దగ్గరకు వచ్చి “ఇవాళ సాయంకాలం గుళ్ళో ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతోంది. ఇటువంటి సందర్భాలలో సుబ్బణ్ణగారు అక్కడ ఫిడేలు వాయిస్తుంటారు. ఇవాళ కూడా వాయిస్తారట. తమరు గుడికి వెడితే ఆయన సంగీతం వినవచ్చు” అని చెప్పాడు. మొదట మా మామగారు “ఆయన నా ఇంటికి రాకపోతే నేను ఆయన సంగీతం కోసం గుడికెందుకు వెళ్ళాలి?” అనుకున్నాడు. కాని మళ్ళీ అంతలోనే “ఆయన కోసం నేను గుడికి వెళ్ళడం ఎందుకు మానేయాలి? గుళ్ళో పూజలు జరుగుతుంటే నేను వెళ్ళాల్సిందే. పూజ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా సంగీతం వినాల్సి వస్తే వింటాను. ఎవరో నా ఇంటికి రాలేదని నేను గుడికి వెళ్ళకపోవడం దురహంకారం అవుతుంది” అనుకున్నాడు.

సాయంత్రం మా మామగారు గుడికి వెళ్ళారు. పూజ కోసం వచ్చిన జనంలో సుబ్బణ్ణగారు కూడా ఉన్నారు. పూజా కార్యక్రమంలో 'సంగీతమవధారయ' అనగానే సుబ్బణ్ణగారు తన ఫిడేలుతో ముందుకు వచ్చారు. ఆయన వాయిస్తుంటే ఆయనతో పాటు వెంకటరమణ కూడా వాయించాడు.

సుబ్బణ్ణగారి ఫిడేలు వాదనంలోని గొప్పతనాన్ని వర్ణించే శక్తి నాకులేదని ఇంతకు ముందే చెప్పాను. ఆయన ప్రావీణ్యం రోజురోజుకూ పెరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ రోజు ఆయన వాయించిన భైరవి రాగం విన్న భక్తులు దేవుణ్ణి కళ్ళారా చూసినట్లుగా ఆనంద పరవశులైనారు. పూజా కార్యక్రమం ముగిసిన తరువాత అందరూ వెళ్ళిపోతున్న సమయంలో మా మామగారు మెల్లగా, గంభీరంగా సుబ్బణ్ణగారి దగ్గరకు వెళ్ళి “తమరు ఇంత గొప్ప విద్వాంసులని తెలియక మా ఇంటికి రమ్మని కబురు చేశాను. చాలా తప్పు చేశాను. మీరు సంగీతాన్ని యోగంగా సాధన చేసిన వారు” అని అన్నారు.

“మీరు మరీ అంతగా పొగిడితే నాకు తల తిరిగిపోతుంది. నేను చాలా అల్పవ్యక్తిని. తమ వంటి పెద్దల వద్దకు రావాలంటే నాకు భయం. అందుకే మీరు కబురు చేసినప్పుడు రాలేకపోయాను” అని సమాధానమిచ్చాడు సుబ్బణ్ణగారు.

“తమరు మా ఇంటికి దయచేస్తే మేమెంతో సంతోషిస్తాము. మా కుమార్తెకు మీరు సంగీతం నేర్పితే మహద్భాగ్యంగా భావిస్తాము. ఒక వేళ అది మీకు వీలు గాక పోయినా దయచేసి మమ్మల్ని పరాయి వారుగా భావించవద్దని మాత్రం కోరుతున్నాను” అన్నారు మా మామగారు.

మా మామగారు మామూలుగా ఎవరితో అంత గౌరవ పూర్వకంగా మాట్లాడరు. కాని ఆయన సంస్కారవంతుడు, ప్రతిభావంతుడు కూడా. అందుచేత సుబ్బణ్ణగారి వంటి గొప్ప వ్యక్తిని, గొప్ప విద్వాంసుడిని చూసినప్పుడు ఆయన ఎటువంటి భేషజం లేకుండా తన గౌరవాన్ని ప్రకటించారు. అదీకాక సుబ్బణ్ణగారి సంగీతం ఇంకా ఆయన చెవుల్లో రింగుమంటూనే ఉన్నది. సంగీతం పాషాణ హృదయాలను సైతం కరిగించగలదు. కాగా అది సంస్కారవంతులను, విద్యావంతులను లోబరచుకోవడంలో ఆశ్చర్యమేముంది? స్వతహాగా వారిలో నున్న వినయాన్ని సంగీతం వెలికి తీసుకొస్తుందని నాకు అనిపిస్తుంది.

మా మామగారు అంత ధారాళంగా, నిస్సంకోచంగా గౌరవం ప్రదర్శించడంతో సుబ్బణ్ణగారూ మెత్తబడ్డారు. ఆ మరునాడు ఆయన తనంతటతనే మా ఇంటికి వచ్చి లలితకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఎప్పుడో ఒకసారి మాటలు సందర్భంలో ఆయన అన్నారు. “సుబేదారు అనగానే ఆయన ఎలాంటివాడై ఉంటాడో నేను ఊహించలేకపోయాను. అందుకే ఆయన కబురు చేసినప్పుడు నేను రానన్నాను. కాని గుళ్ళో కలుసుకొన్నప్పుడు ఆయన ఎటువంటివాడో తెలుసుకున్నాను. ఆయన బంగారం లాంటి మనిషి. అచ్చమైన మేలిమిబంగారం. ఆయన గర్విష్టి అని కొందరు అనుకుంటారేమోగాని, సుబేదారైనవాడు ఆ మాత్రం గర్వంగా లేకపోతే ఎలా ఉద్యోగం చేయగలడండీ”.

సుబ్బణ్ణగారు సంగీత పాఠాలు చెప్పడానికి మా మామగారింటికి తరుచుగా వచ్చి పోతుండడంతో మా అందరికీ ఆయనతో బాగా చనువు ఏర్పడింది. ఆయనంటే మా అక్కకు ఎంతో జాలి. ఆమెది చాలా జాలిగుండె. ఇతరుల కష్టాన్ని చూడలేదు. ఆమెకు భర్త పట్ల విపరీతమైన ప్రేమ, భక్తి. పిల్లలంటే చెప్పలేనంత వాత్సల్యం. ఇంటికి వచ్చేవారిని ఆమె ఎంతో ఆదరంగా చూస్తుంది. భర్తపట్ల, పిల్లలపట్ల ఆమె శ్రద్ధ, నౌకర్లపట్ల ఆమె ఆదరం, గృహకృత్యాలు నిర్వర్తించడంలో ఆమె నేర్పు-ఇవన్నీ చూసి సుబ్బణ్ణగారికి ఆమె పట్ల ఎంతో గౌరవం కలిగింది. ఒకసారి ఆయన మాటల సందర్భంలో “మీ అక్క ఎంతో ఉత్తమ ఇల్లాలు. అటువంటి ఉత్తమురాలిని ఇది వరకు ఒక్కరిని మాత్రమే చూశాను. ఇప్పుడు మళ్ళీ ఈమెను చూస్తున్నాను” అన్నారు.

“ఇది వరకు మీరు చూసిన ఆవిడ ఎవరండీ” అని అడిగాను నేను.

“ఆమె నా ఇల్లాలు. అదంతా పాతకథ” అన్నారు ఆయన. ఆ మాట అంటున్నప్పుడు ఆయన మొహం అవతలికి తిప్పుకుని ఎటో శూన్యంగా చూస్తున్నారు.

ఉత్తమ ఇల్లాలు గల ఇంటికి వచ్చినందుకు ఆయనకెంతో సంతోషం. అదీగాక లలిత ఆయన చెప్పే పాఠాలను చాలా త్వరగా నేర్చుకునేది. ఆయన చెప్పే మెలకువలను త్వరగా గ్రహించేది. ఇది కూడా ఆయనకు ఎంతో సంతృప్తి కలిగించిన విషయం. ఆ విధంగా సుబ్బణ్ణగారు మళ్ళీ జీవిత వలయంలో చిక్కుకున్నారు. కాని ఆయన తన మట్టుకు తను తామరాకుపై నీటి బొట్టులానే ఉండడానికి ప్రయత్నించేవారు. అయినా తనకు తెలియకుండానే జీవితవలయంలో చిక్కుకుంటూ ఉండేవారు.

ఎంత చనువుగా ఉన్నా ఆయన మా ఇంట్లో భోజనం చేసే వారు కారు. భోజనం చేయమని అడిగితే చాలు మాయమైపోయేవారు. ఆయన లలితకు పాఠాలు చెప్పడం మొదలు పెట్టిన తరువాత రెండు నెలలకు మా మామగారు ఆయనకు పది రూపాయలు ఇవ్వబోయారు. కాని సుబ్బణ్ణగారు తీసుకోలేదు.

“జీతం ఇవ్వకుండా మా అమ్మాయికి మీ చేత ఉచితంగా ఎలా సంగీతం నేర్పించగలను అది న్యాయం కాదు?” అన్నారు మా మామగారు.

“నాకు డబ్బు అవసరమైతే మీరు ఇవ్వవలసిందే. కాని నాకు అవసరం లేనప్పుడు ఎందుకివ్వాలి? నాకు డబ్బుతో అవసరం లేదే” అని జావాబిచ్చారు సుబ్బణ్ణగారు.

“కాని ఊళ్ళోవాళ్ళు ఏమనుకుంటారు? జీతం ఇవ్వనవసరం లేకుండా ఉచితంగా సంగీతం నేర్పేందుకు ఒక దిక్కులేని ముసలాయన్ని నేను వెతికి పట్టుకున్నానని అనుకుంటారు” అన్నారు మా మామగారు.

సుబ్బణ్ణగారు డబ్బు తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. తరువాత చాలా రోజుల వరకు ఆయన మా ఇంటికి రాలేదు. ఎందుకురావడం లేదని మా మామగారు అడిగారు. అంతకు ముందే లలిత వెళ్ళి సుబ్బణ్ణగారిని అడిగింది. “మీ నాన్నగారు నన్ను రావద్దన్నారు” అని సమాధానమిచ్చారు ాయన. లలిత ఈ మాట తన తండ్రికి చెప్పింది. ఆయన “అవును, పాఠాలు చెబితే డబ్బు తీసుకోవలసిందే. డబ్బు తీసుకోవడం ఇష్టం లేకపోతే పాఠాలు చెప్పనక్కర్లేదు” అన్నారు. మూడు నాలుగు రోజుల తరువాత సుబ్బణ్ణగారు మళ్ళీ పాఠాలు చెప్పడానికి వచ్చారు. మా మామగారు ఆయనకు డబ్బు ఇచ్చారు. ఆయన తీసుకున్నారు.

“అదీ పద్ధతి. అలా ఉండాలి. నేను ఇచ్చింది మీరు తీసుకుంటే మీకు సంతోషం, నాకూ సంతోషం” అన్నారు మా మామగారు.

“నాకు సంతోషం లేదు. కాని ఏం చేయను? ఎంతైనా మీరు మేజిస్ట్రేటు కదా. మేజిస్ట్రేటు అంటే నాకు భయం” అన్నాడు సుబ్బణ్ణగారు. మా మామగారు నవ్వారు. మా అక్క అటువెడుతుంటే సుబ్బణ్ణగారు “నువ్వు చెప్పమ్మా... ఆయన మేజిస్ట్రేటు కదా. ఆయనంటే నాలాంటి వాళ్ళకి భయం ఉండదా?” అన్నారు.

“కేవలం మేజిస్ట్రేటు కదా అని ఎవరైనా భయపడతారుటండీ. న్యాయం చేస్తేనే ఆయన మేజిస్ట్రేటు. న్యాయం చెయ్యకపోతే అప్పీలు ఉండనే ఉంటుంది” అన్నది మా అక్క.

సుబ్బణ్ణగారు తనలో తనే నవ్వుకున్నారు. ఒక నిమిషం ఆగి ఆయన మా మామగారితో “అంతేకదండీ అప్పీలు చేసుకోవచ్చు” అన్నారు.

“ఇతర విషయాలలో అప్పీలు చేసుకోవచ్చు. కాని ఈ విషయంలో అప్పీలుకు ఆస్కారం లేదు” అన్నారు మా మామగారు.

“ఏమో ఎవరు చూడవచ్చారు” అంటూ సుబ్బణ్ణగారు మళ్ళీ తనలో తనే నవ్వుకున్నారు.

అసలు జరిగింది ఇది. ఆ కిందటి రోజు మా అక్క సుబ్బణ్ణగారికి కబురు చేసి పిలిపించింది. “మా ఆయన మహా పట్టుదల మనిషి. మీదీ అదే లక్షణం. మీ ఇద్దరి పంతాల వల్ల మా అమ్మాయికి సంగీత పాఠాలు లేకుండా పోయాయి. ఆయన చిన్నవాడు. ఆయనకి పంతం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కాని మీరు పెద్ద వారు కదా. మీరు కూడా ఆయనతో వంతు పెట్టుకుని పంతానికిపోతే ఎలా? ఆయన పంతం నెగ్గనిస్తే పోయిందే ముంది? మీరు మళ్ళీ వచ్చి అమ్మాయికి పాఠాలు చెప్పండి” అని నచ్చజెప్పింది.

“అయ్యో అదేమిటమ్మా... ఇంతగా చెప్పాలా? తప్పకుండా వచ్చి పాఠాలు చెబుతాను. కాని... చూడమ్మా... డబ్బు తీసుకుని ఏం చెయ్యను?” అన్నాడు ఆయన. డబ్బు తీసుకోవలసిందని మా అక్క ఎంతో చెప్పి చూసింది. అయినా ఆయన ఒప్పుకోలేదు.

“మా అమ్మాయికి సంగీతం చెప్పడం మీకు ఇష్టం లేనట్టుంది” అన్నది మా అక్క.

“అమ్మమ్మ... అంతమాట అనకమ్మా... మూడు రోజులు రాకపోతే నాకే ఎలాగో అనిపించింది. కాని ఏం చేయను? నాకు డబ్బుతో అవసరం లేదు. ఒకవేళ తీసుకున్నా అది నాకు కీడే చేస్తుంది” అన్నారు ఆయన.

“అయితే ఒకపని చేయండి. తీసుకుని ఎవరికైనా ఇచ్చేయండి”.

“అయితే సరేనమ్మా... ఆయన ఇచ్చే డబ్బు తీసుకుని నీకు ఇస్తాను. నీకుతోచిన విధంగా ఆ డబ్బును వినియోగించు. నేను మామూలుగా వచ్చి సంగీతం చెబుతాను”.

అందుకు మా అక్క ఒప్పుకున్నది. ఆయన మళ్ళీ వచ్చి పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. సుబ్బణ్ణగారికి, మా అక్కకి మధ్య కుదిరిన ఒప్పందం సంగతి మా మామగారికి తెలియదు. తరువాత కొన్ని రోజులకు సుబ్బణ్ణగారు నాకు ఈ సంగతి చెబుతూ “అదీ అప్పీలు. సుబేదారు గారి నిర్ణయంపై ఆయన భార్యకు అప్పీలు” అన్నారు. నేను నవ్వాను.

“అక్కడ కూడా అంతే బాబూ... ఆయన కఠినంగానే ఉంటాడు. తప్పదు. అప్పీలు చేసుకోవలసిందే” అన్నారు ఆయన.

“ఎవరు?” అని అడిగాను ఆయన చెప్పేది అర్థం కాక.

“ఆయనే. ఈ జీవితం ముగిశాక అక్కడికి వెళ్ళి దేవుడి ముందు నుంచుంటాను కదా. అప్పుడు ఆయనా ఇలాగే మొండిగా మాట్లాడతాడు. ఇంక నేను అమ్మవారికి అప్పీలు చేసుకోక తప్పదు. తప్పకుండా అప్పీలు చేస్తాను చూడు” అన్నారు ఆయన.

నేను సుబ్బణ్ణగారి ముఖం కేసి చూశాను. ఆయన ఆ మాటలు నవ్వులాటగా అనడం లేదు. నిజంగా, పూర్తి నమ్మకంతో అంటున్నారు. పరలోకానికి సంబంధించిన విషయాలను ఆయన అతి సామాన్యమైన ఈలోకపు విషయాలలాగా భావించి మాట్లాడడం నేను చాలా సార్లు గమనించాను.

(11)

అలా నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఆ నాలుగు సంవత్సరాల కాలంలో జరిగిన విషయాలను గురించి పెద్దగా చెప్పుకోవలసింది లేదు. నాకు సుబ్బణ్ణగారితో పరిచయమయింది ఆ కాలంలోనే. లలితను నాకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నారని తెలియడంతో ఆయనకు నా పట్ల ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఆయన, నేను ఇద్దరం కలిసి కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. వైలిన్ అంటే నాకూ చాలా ఇష్టం. ఆయన నాకూ నేర్పారు. క్రమంగా నాకు ఆయన వ్యక్తిత్వం అర్థమవుతూ వచ్చింది. ఆయన పట్ల నా గౌరవం పెరుగుతూ వచ్చింది. “ఈయన ధన్యుడు. ఈయన యోగులలో అగ్రగణ్యుడు. ఈయనకు దైవసాక్షాత్కారం అయింది” అని నాకు అనిపించింది.

ఆయన ఎప్పుడూ ఇంటిలోపల పడుకునే వారు కారని చెప్పాను కదా. ఒకసారి మా మామగారు “సుబ్బణ్ణగారూ... అలా ఇల్లిల్లూ తిరుగుతారు దేనికండీ. శుభ్రంగా మా ఇంట్లో మాలో ఒకరుగా ఉండిపోవచ్చు కదా. ఈ ఇంట్లో జాగాకేమీ లోటులేదు కదా. మేమందరం మీకు బాగా అలవాటైన వాళ్ళమే. హాయిగా మా ఇంట్లో ఉండిపొండి” అని అన్నారు. ఆ తరువాత నాలుగు రోజులు సుబ్బణ్ణగారు మా ఇంటి గడప తొక్కలేదు. చివరికి మా మామగారు “ఆయనకి మన ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే తిరగనీ” అన్నారు. మరునాటి నుంచి సుబ్బణ్ణగారు మళ్ళీ రావడం మొదలు పెట్టారు. ఇన్నాళ్లూ ఎందుకు రాలేదని అడిగితే ఆయన “అయ్యవారికి పంతం ఎక్కువ. మళ్ళీ మా ఇద్దరికీ మధ్య ఏదైనా వాగ్వాదం జరిగితే, అమ్మగారు మళ్ళీ ఆయన పక్షానే మాట్లాడితే నాగతేంకాను” అన్నారు.

మరోసారి లలిత పుట్టిన రోజు పండుగనాడు మేము ఆయనకు బట్టలు పెట్టి సత్కరించాలని అనుకుంటుండగా ఆ సంగతి గ్రహించి ఆయన వారం రోజులు కనిపించకుండా మాయమైపోయారు. మా మామగారికి చెప్పలేనంత కోపం వచ్చింది. అయినా సుబ్బణ్ణగారు లక్ష్యపెట్టలేదు. నా పెళ్ళి రోజునా సరిగా అలాగే జరిగింది. మా మామగారు ఆయనను సత్కరించాలనుకున్నారు. ఆయన మాయమైపోయారు. తనకు ఏమీ అక్కరలేదనుకునే అటువంటి వ్యక్తిని నేనెక్కడా చూడలేదు. మేమంటే ఆయనకు విపరీతమైన అభిమానం ఉండేది. కాని మా అభిమానం తనకొక బంధం కావడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కడవరకు ఆయన అలా మమతాబంధాలకు అతీతంగా ఉండడానికే ప్రయత్నించారు.

కొన్నాళ్ళకు మా మామగారికి బెంగుళూరు బదిలీ అయింది. ఆ సంగతి తెలియగానే సుబ్బణ్ణగారి ముఖం వాడిపోయింది. నేను అప్పుడు తొరెయపురంలోనే ఉన్నాను. “మేము వెళ్ళిపోతున్నందుకు విచారంగా ఉందా సుబ్బణ్ణగారూ” అని అడిగాను.

“అవును బాబూ... ఇటువంటిదేదో జరుగుతుందని భయపడుతూనే ఉన్నాను. అందుకే మొత్తుకున్నాను అయ్యా నన్ను బలవంతపెట్టకండి. క్షమించి వదిలిపెట్టండి. ఈ లంపటాల్లో నన్ను ఇరికించకండి అని”.

“లంపటం ఏముంది?”

“కాకపోతే ఏమిటి బాబూ... నేను మీతో ఈ సంబంధం పెట్టుకోకపోతే ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారని విచారపడవలసిన అవసరం ఉండేది కాదు కదా. ఇప్పుడు చూడు. నా ప్రాణం తల్లడిల్లిపోతోంది. ఈ రాత్రంతా ఈ బాధనుంచి బైటపడేందుకు ప్రయత్నం చేయాలి”.

ఆ రాత్రి అంతా ఆయన గుళ్ళో దేవుడి ముందు కూర్చుని ఉపశమనం కోసం ప్రార్థన చేశాడు. ఆ నాటి సాయంత్రం నేను ఆయన దగ్గరే ఉన్నాను. ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అప్పుడే ఆయన తన కథ అంతా చెప్పారు. మొదటి నుంచి చివరి దాకా ఒక వరసలో చెప్పకుండా అక్కడో ముక్క, అక్కడో ముక్క చొప్పున నెమ్మది నెమ్మదిగా ఆగి ఆగి మొత్తం మీద అంతా చెప్పారు. నేను మధ్య మధ్య 'అయ్యో' అని జాలి ప్రకటిస్తూ, నాకు తెలిసిన కాసిన వేదాంతపు ముక్కలు సందర్భోచితంగా మాట్లాడుతూ విన్నాను. “నది నిండుగా, గట్లను ఒరుసుకుంటూ ప్రవహిస్తున్నప్పుడే నీళ్ళు మురికిగా ఉంటాయి. నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు నిర్మలంగా ఉంటాయి” అన్నాడు ఆయన.

“కాని, అసలు సంపాదించకపోవడంలో గొప్పతనం లేదండీ. సంపాదించి వదిలేయడంలోనే గొప్పతనం ఉంది. అటువంటి పరిత్యాగంలోనే ఆనందం ఉంది. మీరు జీవితాన్ని నిండుగా జీవించి ఉండకపోతే మీకు ఇంత సంస్కారం అబ్బి ఉండేదా?” అన్నాను నేను.

“సంస్కారం కోసం నేను ఇక్కడదాకా రావాలా?” అన్నాడు ఆయన.

నేను సమాధానం చెప్పలేకపోయాను. తరువాత ఇద్దరం చాలాసేపు ఆ మాట ఈ మాటా మాట్లాడుకున్నాం.

ఆ రాత్రి తరువాత మళ్ళీ మేము తొరెయపురం నుంచి బయలుదేరేవరకు సుబ్బణ్ణగారు మాకు కనిపించలేదు. మా అక్క చాలా ఆందోళన పడింది. సుబ్బణ్ణగారు బొంబాయిలో షావుకారు తనకు ఇచ్చిన వంద రూపాయలు మా మామగారికిచ్చారు బ్యాంకులో వేయమని. తన అంత్యక్రియలకి ఆ డబ్బు ఉపయోగపడుతుందని ఆయన అనుకున్నారు. లలితకు సంగీతం చెప్పినందుకు నెలనెలా మా మామగారు ఇచ్చిన డబ్బు ఆయన మా అక్కకు ఇచ్చేవారు. ఆ డబ్బు దాన ధర్మాలకు ఉపయోగించవలసిందని ఆయన కోరాడు కాని మా అక్క ఆ డబ్బు ఎప్పటికైనా ఆయనకే అవసరమవుతుందని దాచిపెట్టింది. “ఈ ఊరి నుంచి వెళ్ళిపోయేముందు ఆ డబ్బు ఆయనకు ఇవ్వవచ్చు. అప్పటికి ఆయన మనస్సు మార్చుకుని డబ్బు పుచ్చుకోవచ్చు” అనుకుంది ఆమె. కాని ఇప్పుడు ఆ మనిషే కనిపించకుండా పోయాడు. ఆ డబ్బు ఆయనకు ఎలా చేర్చాలో తెలియక ఆమె చాలా ఆందోళనపడింది. ఈ సంగతి ఆమె నాతో చెబితే నేను నెమ్మదిగా మామగారికి చెప్పాను. మొదట ఆయనకి చాలా కోపం వచ్చింది. తరువాత నెమ్మదిగా చల్లబడ్డారు. “నిజమే. నేను మొండి మనిషిని. ఆయన నాకన్నా జగమొండి. నువ్వు మాత్రం ఏం చేస్తావు” అన్నారు ఆయన. తరువాత మా అక్క నుంచి ఆ డబ్బు తీసుకొని బ్యాంకులో సుబ్బణ్ణగారి ఖాతాలో జమ చేయించారు. ఊరి నుంచి బయలుదేరేటప్పుడు వెంకటరమణని పిలిపించి ఆ డబ్బంతా బ్యాంకులో వేసిన సంగతి సుబ్బణ్ణగారికి తెలియబరచవలసిందని చెప్పారు. ఊరి పెద్దలను పిలిపించి సుబ్బణ్ణ గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. తరువాత మేము తొరెయపురం నుంచి బయలుదేరాము.

మూడు మైళ్ళు వెళ్ళేసరికి ఊరి వైపు నుంచి ఎవరో మా బండి వైపు పరుగెత్తుకు రావడం కనిపించింది. ఆ వ్యక్తి ప్రాణ భయంతో పరుగెత్తుతున్నట్టు వగర్చుకుంటూ వస్తున్నాడు. మేము బండి ఆపుచేశాం. తీరా చూస్తే ఆ వ్యక్తి సుబ్బణ్ణగారు. “అయ్యా... ఈ మమకారాలకు లొంగకూడదనుకుని దూరంగా ఉన్నాను. కాని ఇంక నా వల్ల కాలేదు. మీరు వెళ్ళిపోయేలోగా ఒక్కసారి చిట్టి తల్లి లలితమ్మని చూడాలనిపించి పరుగెత్తుకొచ్చాను” అన్నారు ఆయన. మా మామగారు “భలేవారే. ఇందుకా ఇన్నాళ్ళూ కనిపించకుండా పోయింది? వెళ్ళిపోవడం దేనికి? మళ్ళీ ఇలా పరుగెత్తుకు రావడందేనికి? మీరూ అందరిలా ఉండకూడదూ?” అన్నారు. కాని, సుబ్బణ్ణగారు అందరిలా ఉండలేరన్న సంగతి అందరికంటే మా మామగారికే బాగా తెలుసు. అయినా సందర్భాన్ని బట్టి ఊరికే అలా అన్నారు. సుబ్బణ్ణగారు లలితను దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు. మా మామగారికి, అక్కకు నమస్కరించారు. నన్ను ఆశీర్వదించారు. తరువాత ఒక్క మాట మాట్లాడకుండా వెనక్కి తిరిగి, ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగా పరుగెత్తుకు వెళ్ళిపోయారు.

నాలుగు సంవత్సరాల తరువాత సుబ్బణ్ణగారు బెంగుళూరు వచ్చారు. మా బిడ్డను చూసి చాలా సంతోషించారు. మేము తొరెయపురం నుంచి వచ్చేసిన రోజు గురించి చెబుతూ ఆయన “ఒక్కక్షణం ఆగితే మల్ళీ మిమ్మల్ని విడిచి వెళ్ళగలుగుతానో లేదో అని భయపడి వెనక్కి తిరిగి పరుగెత్తాను. నా ప్రాణం మీదగ్గరే ఉండిపోయి దేహం మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళినట్లు అనిపించింది” అన్నారు. ఆయన మాతో ఒక్కరోజు మాత్రమే ఉన్నారు. మరునాడు వెళ్ళిపోయారు. ఆ ఒక్కరోజూ మేమంతా ఆయనను ఎంతో ఆదరంగా చూశాము. మమ్మల్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆయన ఇదివరకు తొరెయపురంలో మాదిరిగా బాధపడలేదు. ఈ నాలుగేళ్ళలో ఆయన మనస్సు మరింత పరిపక్వమయింది. మమ్మల్ని చూడాలనిపించింది. రావడానికి సంకోచించలేదు. వచ్చి చూశారు. అయిపోయింది. ఇంక వెనక్కి తిరిగి వెళ్ళేందుకు ఆయన కేమీ బాధలేదు. మేమందరం ఆయనని ఇంకా కొద్ది రోజులు ఉండమని బ్రతిమాలాము. కనీసం ఒక్కరోజైనా ఉండమన్నాము. ఆయన ఒప్పుకోలేదు.

బెంగుళూరు నుంచి వెళ్ళిన రోజు ఉదయం నాతో మాట్లాడుతూ “ఆయన కూడా నన్ను మరచిపోయినట్లుంది” అన్నారు సుబ్బణ్ణగారు. “ఎవరు?” అని అడిగాను. సుబ్బణ్ణగారు మాట్లాడే పద్ధతి విచిత్రంగా ఉంటుంది. ఆయన మనస్సులో పది విషయాలు ఆలోచిస్తారు. ఆ ఆలోచనలకు సంబంధించి ఒకటి రెండు మాటలు బైటికి అంటారు. దేన్ని గురించి ఆ మాటలు అంటున్నారో మనకి అర్థం కాదు.

“అదేనయ్యా... యమధర్మరాజు గారు. ఆయన నన్ను మరిచిపోయినట్టున్నాడు” అన్నారు సుబ్బణ్ణగారు. నేనేమీ మాట్లాడలేదు. సుబ్బణ్ణగారి మాటలు విన్న మా మామగారు “భయపడకండి సుబ్బణ్ణగారూ... యమధర్మరాజుగారెప్పుడూ మరచిపోరు” అన్నారు.

సుబ్బణ్ణగారు “ఇంకచాలు” అనిపించేంతగా జీవించారు. జీవితమంటే విసుగులేదు గాని 'చాలు' అనే భావం ఆయనకు కలిగింది. ఆ తరువాత త్వరగానే ఆయనకు విముక్తిలభించింది. బెంగుళూరు నుంచి వెళ్ళిన రెండు వారాలకు వెంకటరమణ నుంచి మాకు ఉత్తరం వచ్చింది. మూడు రోజుల క్రితం సుబ్బణ్ణగారు స్వర్గస్థులైనట్లు రమణ రాశాడు. తొరెయపురం దేవాలయం ఎదుట సుమారు యాభైగజాల దూరంలో ఒక పెద్ద చెట్టు కింద చేతులు జోడించి దేవునికి నమస్కరిస్తున్నట్లుగా కూర్చున్న సుబ్బణ్ణగారు అలాగే మరణించారట. ఊరి బ్రాహ్మణులు ఉత్తర క్రియలు జరిపించారట. “బ్యాంకులో ఆయన ఖాతాలో ఉన్న డబ్బులో ఇంకా రెండు వందల రూపాయలు మిగిలి ఉన్నాయి. ఆ డబ్బుపై వచ్చే వడ్డీతో ఏడాదికొక రోజు దేవాలయంలో సంతర్పణ జరిపించడానికి ఏర్పాట్లు చేశాను. అది మా గురువు గారి కోరిక” అని రాశాడు వెంకటరమణ. సుబ్బణ్ణగారి మరణ వార్త తెలిసిన రోజు రక్త సంబంధం గల బంధువు మరణించినట్లుగా మేమందరం బాధపడ్డాము.

సుబ్బణ్ణగారు ఆ విధంగా తన జీవన నాటకాన్ని ముగించి ముక్తి పొందారు.

ముక్తి అనేది ఒకటంటూ ఉంటే సుబ్బణ్ణగారు దాన్ని పొందారనడంలో నాకేమీ సందేహం లేదు.

(12)

“సంగీతంలో ఒక స్థాయికి ఏడు స్వరాలు మాత్రమే ఉంటాయి ఎందుకండీ” అని ఒకసారి సుబ్బణ్ణగారిని అడిగాను.

“మనం ఏడు అనుకుంటే ఏడు. కాని నిజానికి అవి అనంత కోటి స్వరాలు లేదా ఒకటే స్వరం” అని సమాధానమిచ్చారు ఆయన. ఆ మాటలను బట్టి ఆయన ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవడం కష్టం. కాని ఆయన ఫిడేలు వాయిస్తున్నప్పుడు వింటే కొంత అర్థమవుతుంది.

ఇంకొకసారి నేను “అద్వైతం మంచిదా, ద్వైతం మంచిదా” అని అడిగాను. సుబ్బణ్ణ గారు “నా జీవితం చూస్తే అద్వైతం మంచిదనిపిస్తుంది. ఆవిడ జీవితం చూస్తే ద్వైతం మంచిదనిపిస్తుంది” అన్నారు.

నేనేమీ మాట్లాడలేదు. 'ఆవిడ' అంటే ఎవరో ఆయనే చెబుతారని నాకు తెలుసు. ఆయన పద్ధతే అది. నేననుకున్నట్లే ఆయన వివరంగా చెప్పారు. “ఆమె నన్ను విడిచి వెళ్ళేటప్పుడు చెప్పింది. 'ఇంతకాలం మీ నీడలో ఉండి రోజూ గౌరీపూజ చేశాను. ఈ రోజు గౌరీదేవి నన్ను దగ్గరకు చేర్చుకుంటున్నది. మిమ్మల్ని ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళి పోతున్నాను. అదొక్కటే నాకు బాధగా ఉంది. నా కడుపున బుట్టిన మీ బిడ్డలు కూడా మీకు మిగల్లేదు. ఈ లోకంలో కర్మశేషం పూర్తికాగానే మీరూ అక్కడికే వస్తారుగా. అప్పుడు ఇద్దరం కలిసి దేవిని సేవించుదాం' అంది. ఆమె విశ్వాసం, ఆమె జీవితం చూస్తే ద్వైతం మంచిదనిపిస్తుంది. నా బతుకు చూస్తే ఈ ఆట ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిదనిపిస్తుంది. ఈ ఆట ముగిసిన తరువాత అద్వైతమే మంచిదనీ, ఇంక నేను అనేదేమీ లేకుండా దేవునిలో లీనమైపోవాలనీ అనిపిస్తుంది”.

మరోసారి నేను “సుబ్బణ్ణగారూ శివుడు గొప్పా, విష్ణువు గొప్పా?” అని అడిగాను. ఆయనేమీ సమాధానమివ్వలేదు. నేను అడిగిన ప్రశ్న ఆయనకి వినిపించలేదేమో, వేరే ధ్యాసలో ఉన్నారేమోననుకున్నాను. ఓ పావుగంట తరువాత ఆయన ఫిడేలు తీసుకొని శంకరాభరణం వాయించడం మొదలు పెట్టారు. తన్మయత్వంతో గంటసేపు అద్భుతంగా వాయించారు. ఆ కిందటి రోజు భైరవి రాగాన్ని ఆయన అలాగే పరవశంతో అద్భుతంగా వాయించారు. శంకరాభరణం వింటున్న ఆనందంలో నేను అప్పటి వరకు మాట్లాడిన విషయాలను మరచిపోయాను. “ఆహా...ఏం వాయించారు సుబ్బణ్ణగారూ ఏం ఆలాపన! ఏం సొగసు! ఏం మాధుర్యం! ఆహా!” అని ప్రశంసించాను.

ఆయన “నిన్ను భైరవి వాయించాను కదా. అది ఎలా ఉంది?” అని అడిగారు.

“అదీ గొప్పగా ఉంది” అన్నాను నేను.

ఆయన “భైరవి గొప్పగా ఉందా, శంకరాభరణం గొప్పగా ఉందా” అని అడిగారు. నేను అడిగిన ప్రశ్నకు ఆయన ఆ విధంగా సమాధానమిచ్చారు.

సుబ్బణ్ణగారు సంగీతం ద్వారా సకల తత్త్వాన్ని గ్రహించారు. ఆయన సాధన అటువంటింది. ఆయన అవగాహన అటువంటింది. అటువంటి సాధన ద్వారా, అవగాహన ద్వారా మనిషి సాధించగల స్థితిని 'ముక్తి' అనక మరేమంటాము? అది కాకపోతే 'ముక్తి' అనేది ఇంకెలా ఉంటుంది?

  • సమాప్తం

నండూరి పార్థసారథి
(1987లో అనువదించబడినది)

Next Post