Title Picture
జగ్గయ్య, దేవిక

విలన్ (రాజనాల) చేసిన హత్యానేరం హీరో (జగ్గయ్య) పై పడడం, హీరో హీరోయిన్ (దేవిక) ఇంట్లో అజ్ఞాతవాసం చేయడం, ఇన్ స్పెక్టరైన బావగారు (రామకృష్ణ) అతనిని తరుముకుంటూ రావడం, చెల్లెలు (కృష్ణకుమారి) రక్షించడం, చివరకు హంతకుడు పట్టుబడటం 'కన్నకొడుకు' చిత్రంలోని కథాంశం. ఈ కథ, అందులోని సన్నివేశాలు, సంభాషణలు, పాటలు, రాగాలు, మనుషులు, మేడలు, తోటలు అన్నీ తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితములైనవే. రాజనాల ఎప్పుడు వికటాట్టహాసం చేయబోతున్నాడో, జగ్గయ్య ఎప్పుడు ఎలాంటి పాట పాడబోతున్నాడో, స్వప్నం సీను ఎప్పుడు వస్తుందో, దేవిక ఎప్పుడు డాన్సు చెయ్యబోతుందో ప్రేక్షకులకు ముందే తెలిసిపోతుంది. కంఠతా వచ్చిన పద్యాన్ని మళ్ళీ ఒకసారి చదివినట్టు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఉత్సాహంగానే చూస్తారు. చివరి స్టంటు సీనుల్లో ఈలకూడా కొడతారు.

ఇందులో నటీనటులంతా కథ నాణ్యతను గుర్తించి, హైరాన పడకుండా, అవసరమైనంత వరకు నటించారు.

సుమారు 14 1/2 వేల అడుగుల పొడుగువున్న ఈ చిత్రంలో మొత్తం 10 పాటలు ఉన్నాయి. వీటిని ఘంటసాల, రాజా, శ్రీనివాస్, మాధవపెద్ది, సుశీల, జానకి, రాణి, స్వర్ణలత పాడారు. పాటలన్నీ కూడా మార్కెట్టులో బాగా ప్రచారం కాగల విధంగా ఉన్నాయి. జగ్గయ్య రచించిన పద్యాలలో పదాలు సాంపుగా ఉన్నాయి. 'ఛాయాగ్రహణం నేత్రపర్వముగా, శబ్దగ్రహణము నిర్దుష్టముగా నున్నవి'.

నిర్మాత: కె.ప్రభాకరం, ఎం.ఎస్.బాబు; దర్శకత్వం: కృష్ణారావు; రచన: సదాశివబ్రహ్మం, రామ్ చంద్; పాటలు: రామ్ చంద్, ఆరుద్ర, వీటూరి; పద్యరచన: కె.జగ్గయ్య; సంగీతం: కోదండపాణి; ఛాయాగ్రహణం: జె.సత్యనారాయణ; తారాగణం: జగ్గయ్య, దేవిక, కృష్ణకుమారి, రామకృష్ణ, రాజనాల, రమణారెడ్డి, కె.వి.ఎస్.శర్మ, పేకేటి, ఛాయాదేవి, బాలకృష్ణ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 జూలై 16వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post