మూడు దశాబ్దాలుగా మూగవోయినా మరపురాని మధుర గాయకుడు

సైగల్ కీర్తి శేషుడై ఈ రోజుకు సరిగా ముప్ఫయ్యేళ్ళయింది. ఆ రోజులో అతని సినిమాలు చూసి, అతని పాటలు విని, అతన్ని ఆరాధించిన నేటి నడి వయస్సు వారి మనస్సుల్లో అతని స్మృతి ఇంకా వన్నె తరగలేదు. ఇప్పటికీ అతడు రోజూ రేడియోలో 'హలో' అని స్నేహంగా పలకరిస్తూనే ఉన్నాడు. అతని పాట వింటున్నంత సేపు, ఆ తర్వాత కాసేపు ఆ తరంవారు మైమరపుతో మధుర స్మృతి పథంలో విహరిస్తూ ఉంటారు.

సైగల్ మరణంతో ఆనాడు భారతచలన చిత్రరంగం ఒక విలక్షణమైన, అద్భుతమైన గాయక నటుని కోల్పోయింది. ఆ లోటును ఇప్పటి వరకు భర్తీ చేసుకోలేకపోయింది. సైగల్ ఒక 'ఫినామినన్', బొత్తిగా స్టార్ ఇమేజ్ లైని సూపర్ స్టార్. పాత్ర నుంచి వేరుగా 'నటించడం' కాక, అప్రయత్నంగా, అతి సహజంగా పాత్రలో 'జీవించడం' అతనికి అలవాటు. అంత సహజంగా, సునాయాసంగా నటించిన కథానాయకులు చాలా అరుదు. అతని నటన లాగానే పాట కూడా అతి స్వాభావికంగా ఉండేది. సంతోషం పట్టలేకనో, మనోవ్యధ భరించలేకనో అతను తన కోసం తాను పాడుకుంటున్నట్టుగా అనిపించేది.

నటుడుగా, గాయకుడుగానే కాక, వ్యక్తిగా కూడా అతడు అసాధారణ సంస్కారవంతుడని అతనితో కలిసి పనిచేసినవారు చెబుతారు. అతడు ఇతరులను గురించి ఒక్కమాట చెడ్డగా చెప్పడం తాము వినలేదని, అతడు అజాతశత్రువని వారు చెబుతారు. అతని నటనలో, పాటలో, మాటలో, ప్రతి కదలికలో ఆ సంస్కారం కనిపిస్తుంది. అతడు అందగాడు కాడు. అయినా, అతనిలో గొప్ప ఆకర్షణ ఉంది. సాధారణంగా కనిపిస్తూనే అసాధారణంగా కనిపించేవాడు. అతని అమాయకత్వంలో, నిరాడంబరతలోనే ఒక ఆకర్షణ ఉంది. విశ్లేషణకు అందని విశేష ప్రతిభ ఏదో అతనిలో ఉంది.

యువతరంలో ఆకర్షణ

సైగల్ ఆకర్షణ అతని సమకాలిక ప్రేక్షకులకు మాత్రమే పరిమితం కాలేదు. మరణించిన ముప్ఫయ్యేళ్ళకి ఇప్పటికీ అతడు యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. అతని రికార్డులకు ఇప్పటికీ గిరాకీ తగ్గలేదు. కొత్త సినిమా రికార్డులలాగా ఒక్క ఊపులో వేలకు వేలకాపీలు అమ్ముడుపోయి, మూడు నెలలకే మూలపడడం కాకుండా-కరీంఖాన్, బడేగులాం వంటి శాస్త్రీయ సంగీత విద్వాంసుల రికార్డులలాగా-ఏడాది పొడుగునా స్టెడీగా అతని రికార్డులు అమ్ముడు పోతున్నాయి. స్టాకు చెల్లిపోతే మళ్ళీ కొత్త కాపీలు మార్కెట్లోకి వస్తున్నాయి. అతడు నటించిన సినిమాలు ఇటీవల కొన్ని పెద్ద నగరాలలో విడుదలై నాలుగైదు వారాలు మంచి కలెక్షన్లతో నడిచాయి. నడివయస్సు వారి కంటె యువతరం వారు ఎక్కువమంది చూసి ఆనందించారు. డైరెక్టర్ ఎవరైనా, ఇతర నటీనటులెవరైనా కేవలం సైగల్ కోసం ఆ చిత్రాలను చూస్తున్నారు. బొంబాయి సినీ సంగీతదర్శకులు, గాయకులు, ఇతర అభిమానులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం సైగల్ వర్ధంతి జరుపుతూ అతని పట్ల తమ గౌరవాభిమానాలను ప్రకటిస్తున్నారు.

కుందన్ లాల్ సైగల్ 1904లో పంజాబులోని జలంధరులో జన్మించాడు. ఎవరి దగ్గర నేర్చుకోకుండా సహజంగానే అతనికి సంగీతం అబ్బింది. కొంతకాలం ఢిల్లీలో రైల్వే టైమ్ కీపరుగా పనిచేశాడు. తరువాత రెమింగ్టన్ టైప్ రైటర్ల కంపెనీలో సేల్స్ ఎజెంట్ గా పనిచేశాడు. ఆ ఉద్యోగం పనిమీద ఉత్తర హిందూస్థానంలోని ముఖ్య నగరాలన్నీ తిరుగుతూ ఉండేవాడు. ఆ నగరాలలో సంగీతాభిమానులైన మిత్రులు చిన్న చిన్న కచేరీలు ఏర్పాటు చేసి, అతని చేత గజల్ లు, భజన్ లు, గీత్ లు పాడిస్తూ ఉండేవారు. ఒక సారి కలకత్తాలో ఆ విధంగా పాడుతూ ఉండగా న్యూ థియేటర్స్ అధినేత బి.ఎన్. సర్కార్ విని ముగ్ధుడై వెంటనే నెలకు 200 రూపాయల జీతం మీద తన చిత్రాలలో నటించడానికి తీసుకున్నారు. ఆ విధంగా 1931 సంవత్సరాంతంలో సైగల్ చలన చిత్ర రంగంలో గాయక నటుడుగా ప్రవేశించాడు.

న్యూ థియేటర్స్ చిత్రాలు

సైగల్ నటించిన మొదటి చిత్రం 'మొహబ్బత్ కీ ఆఁసూ' 1932లో విడుదలయింది. అదే సంవత్సరం అతని చిత్రాలు మరి మూడు-'దులారీ బీబీ', 'జిందాలాష్' 'సుబహ్ కా సితారా' విడుదలైనాయి. 1933లో విడుదలైన 'పూరన్ భగత్' చిత్రంతో సైగల్ నటుడుగా, గాయకుడుగా బాగా పేరులోకి వచ్చాడు. ఆ తర్వాత 'చండీదాన్', 'రూప్ లేఖా', 'దేవదాస్', 'ప్రెసిడెంట్', 'ధర్తీమాత', 'స్ట్రీట్ సింగర్', 'దుష్మన్', 'జిందగీ', 'లగన్', 'మైసిస్టర్' వంటి పెక్కు 'హిట్' చిత్రాలలో నటించాడు. 'చండీదాస్'లో ఉమాదేవితో కలిసి సైగల్ పాడిన 'ప్రేమ్ నగర్ మే' అనే పాట భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి యుగళగీతం. భారతీయ చలన చిత్రాలలో మొదటి నేపథ్యగాయకుడు కూడా అతనే 1935లో 'ధూప్ చావో' చిత్రంతో అతను నేపథ్య గానానికి ప్రారంభోత్సవం చేశాడు.

1935లో 'దేవదాస్' విడుదలైనప్పటి నుంచి మరణించే నాటివరకు సైగల్ దేశం మొత్తం మీద అగ్ర నటుడుగా వెలిగాడు. 1932 నుంచి 1942 వరకు అతను నటించినవన్నీ న్యూ థియేటర్స్ చిత్రాలే. ఆ పదేళ్ళలో సుమారు పాతిక, ముప్ఫయి చిత్రాలలో నటించాడు. వాటిలో కొన్ని బెంగాలీ చిత్రాలు కూడా ఉన్నాయి. అతని హిందీ పాటలతో సమానంగా బెంగాలీ సినిమా పాటలు, రవీంద్రగీతాలు కూడా హిట్ అయినాయి. 1942లో అతడు కలకత్తా నుంచి బొంబాయికి మకాం మార్చాడు. బొంబాయి వచ్చిన తర్వాత అతను 'పర్వానా'. 'ఉమర్ ఖయ్యాం', 'సూరదాస్', 'తాన్ సేన్' 'షాజహాన్', 'భవరా', 'తద్ బీర్', 'హర్ జాయ్' వంటి సుమారు 15 చిత్రాలలో నటించాడు.

సైగల్ నిష్క్రమణతో న్యూథియేటర్స్ సంస్థ వైభవం క్రమంగా తగ్గిపోయింది. ఆ సంస్థకు మూల స్తంభాల వంటి దర్శకులు దేవకీ బోస్, పి.సి. బారువా కూడా ఆ రోజులలోనే నిష్క్రమించారు. ఆ తర్వాత న్యూథియేటర్స్ స్టూడియోలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి, పెక్కు చిత్రాల నెగెటివ్ లు ఆహుతి అయిపోయాయి. వాటిలో కొన్ని సైగల్ చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాలు శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోయాయి. ఆదృష్టవశాత్తు 'చండీదాస్', 'దేవదాస్', 'ప్రెసిడెంట్', 'స్ట్రీట్ సింగర్' వంటి మంచి చిత్రాల ప్రతులు ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. న్యూథియేటర్సులో ఉండగా సైగల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వారిలో ముఖ్యులు-బారువా, నితిన్ బోస్, దేవకీ బోన్, ఫణి మజుందార్, సంగీత దర్శకులలో ముఖ్యులు-ఆర్.సి. బోరాల్, పంకజ్ మల్లిక్, తిమిర్ బరన్. బొంబాయిలో సైగల్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన వారిలో ఖేంచంద్ ప్రకాశ్, జ్ఞాన్ దత్. నౌషాద్ ముఖ్యులు. సైగల్ సరసన కథానాయికలుగా కలకత్తాలో ఉమాదేవి, కానన్ దేవి, సుమిత్రాదేవి, జమున, లీలా దేశాయ్, బొంబాయిలో ఖుర్షీద్, సురయ్యా నటించారు.

విడి రికార్డులు

సినిమా పాటలుకాక విడిగా సైగల్ చాలా రికార్డులు ఇచ్చాడు. వాటిలో అతను గజల్ లు, గీత్ లు, భజన్ లు పాడాడు. అవన్నీ ఆ రోజులలో దేశమంతటా మారుమ్రోగాయి. ముఖ్యంగా గజల్ పాడడంలో సైగల్ కు ఒక ప్రత్యేక శైలి ఉంది. అతని తర్వాత వచ్చిన వారిలో చాలామంది ఆ శైలిని అనుకరించారు. కాని సైగల్ విశిష్టతను వారెవరు సాధించలేకపోయారు. సైగల్ మొట్ట మొదటి రికార్డును హిందూస్థాన్ రికార్డింగ్ కంపెనీ 1932లో విడుదల చేసింది. ఆ తర్వాత అతని పాటలన్నీ హిందూస్థాన్ రికార్డులలోనే వచ్చాయి. సైగల్ పాటల సాహిత్యం ఎవరిదైనా, సంగీతం ఎవరిదైనా అవన్నీ సైగల్ కాపీ రైట్ పాటల్లా అనిపిస్తాయి. ఏ పాట పాడినా, ఎలా పాడినా సైగల్ పాడితే చాలు పరవశంతో వినేవారు.

సహజ నటన

సైగల్ నటన గురించి ఈ మధ్య కొన్ని పత్రికలలో వాదోపవాదాలు జరిగాయి. అతడు మంచి గాయకుడే తప్ప నటుడు కాడని. పాటల కోసమే ఆ రోజులలో అతని సినిమాలను జనం విరగబడి చూసేవారని ఒక వాదం. సైగల్ తనకుతాను ఒక ఇమేజ్ ను సృష్టించుకొనకపోవడం వల్ల, ప్రయత్న పూర్వకమైన నటన అతనిలో వెతికి చూసినా కనిపించనందువల్ల కొందరికి అతడు గొప్ప నటుడుగా కనిపించకపోవచ్చు. అతడు తర్ఫీదు పొందిన నటుడు కాడు-సహజనటుడు. అతని కదలికలలో కాని, మాటలలో కాని, ముఖంలో భావాలను వ్యక్తం చేయడంలో కాని తెచ్చి పెట్టుకున్నతనం మచ్చుకైనా కనిపించదు. అతడు ప్రతిభావంతుడైన, అసాధారణ నటుడని ఒప్పుకోవడానికి 'దేవదాన్' ఒక్కటి చూస్తే చాలు. అయితే అతడు నటించినవన్నీ 'దేవదాన్' అంతటి మంచి చిత్రాలు కావు. అతడు ధరించినవన్నీ అంతగొప్ప పాత్రలు కావు. రచయిత, దర్శకుడు కలిసి సృష్టించిన మేరకు అతడు ఏ పాత్రకు అన్యాయం చేయలేదు. అసలు అతని సినిమాలేవీ చూడకపోయినా 'దుఖ్ కే', 'బాబుల్ మొరా', 'సోజారాజకుమారీ', 'ప్రీత్ మేహై జీవన్', 'జబ్ దిల్ హీ టూట్ గయా' వంటి పాటలు వింటేనే అతను గొప్ప నటుడై ఉంటాడని అనిపిస్తుంది. తెరపై పాడుతున్నప్పటి అతని నటన మరీ ప్రత్యేకంగా చెప్పుకోతగ్గది. చాలా మంది హీరోలు పాట పాడుతుంటే కృత్రిమంగా ఉంటుంది కాని, సైగల్ పాడుతుంటే చాలా సహజంగా ఉంటుంది.

ఆ రోజులలో చాలా సినిమాలు ఫొటోగ్రాఫ్ చేసిన నాటకాల వలె ఉండేవి. (తెలుగులో ఇప్పటికీ చాలా సినిమాలు అలాగే ఉంటున్నాయి) న్యూ థియేటర్స్, ప్రభాత్, బాంబేటాకీస్ సంస్థల చిత్రాలు మాత్రమే అందుకు భిన్నంగా ఉండేవి. ఆ రోజులలో ప్రముఖ సినీ నటులు చాలా మంది సరాసరి నాటకరంగం నుంచి వచ్చిన వారే. వారి నటన నాటక ఫక్కీలోనే ఉండేది. సొహ్రాబ్ మోడీ, ఫృధ్వీరాజ్ ల నటనను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నాటక ఫక్కీలో కాకుండా సినిమాకు అవసరమైన విధంగా, సహజంగా నటించిన చాలా కొద్ది మందిలో ఖచ్చితంగా సైగల్ ఒకడు. సైగల్ కు నాటకానుభవం లేకపోవడం ఇందుకు ముఖ్యకారణం కావచ్చు.

సినిమా నటనపట్ల, నేపథ్యగానం పట్ల ఆసక్తిగలవారు, నేర్చుకోవాలన్న జిజ్ఞాసగలవారు, సైగల్ సినిమాలను, పాటలను పునశ్చరణ చేయడం అవసరం. ముఖ్యంగా సినిమా నటనలో తర్ఫీదు ఇస్తున్న సంస్థలు 'చండీదాస్', 'దేవదాస్', 'ప్రెసిడెంట్', 'స్ట్రీట్ సింగర్' వంటి మంచి చిత్రాలను ఎంపికచేసి విద్యార్థులకు చూపడం మంచిది.

నండూరి పార్థసారథి
(1976 జనవరి 18వ తేదీన ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post