అనుభూతికి ఆకృతి కల్పించాలనే ఆర్తి కళాసృష్టికి మూలం. ఆ ఆర్తి సంగీతంగా, సాహిత్యంగా, శిల్పంగా, నృత్యంగా వ్యక్తమవుతుంది. సృష్టి తత్త్వాన్ని నిర్దేశించేది దృష్టి. సామాన్యుని దృష్టికి వస్తువు వస్తువుగానే కనిపిస్తుంది. కళాకారుని దృష్టికి ప్రకృతిలోని ప్రతి వస్తువు విశ్వసౌందర్యానికి సంకేతంగా కనిపిస్తుంది. ఆ సౌందర్యాన్ని కళాకారుడు స్వరాలు, రేఖలు, ఆంగిక చాలనాల సంకేతాలతో వ్యాఖ్యానిస్తాడు. కళలు సార్వజనీనమైనవి, సార్వకాలికమైనవి, సార్వదేశికమైనవి. అయినా కళలను ఆవిష్కరించే సంప్రదాయాలు దేశకాల పాత్రలను ఆశ్రయించి వివిధంగా ఉంటాయి.

ఈ మధ్య మద్రాసులో రెండు రోజులు ఫ్రెంచి బాలే (నృత్య) ప్రదర్శనలు జరిగాయి. మద్రాసు నాట్య సంఘం ఆధ్వర్యాన రాజా అన్నామలై హాలులో 'బాలే క్లాసిక్ డి ఫ్రాన్స్' బృందం వారు ఈ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రేక్షకులలో ఎక్కువమంది విదేశీయులు-ముఖ్యంగా పాశ్చాత్యులు-ఉన్నారు. భారతీయులలో చాలా మంది నిజంగా కళాభిమానం గలవారు. బాలే సంప్రదాయంతో పరిచయం ఉన్న పాశ్చాత్యులు ఆనందించినంతగా భారతీయ ప్రేక్షకులు ఆనందించలేకపోవటం సహజం. అయితే పరిపక్వమైన రసహృదయం గలవారు ఎటువంటి కళా సంప్రదాయానైనా శీఘ్రంగా అవగాహన చేసుకోగలరు. అందుకే ఈ బాలే ప్రదర్శనం మద్రాసు ప్రేక్షకుల అభిమానాన్ని విశేషంగా చూరగొన్నది.

లలిత కళలలో నృత్యానికిగల ప్రత్యేక స్వభావం తెలిసినవారికి బాలేను అర్థం చేసుకోవటం కష్టం కాదు. సంగీత సాహిత్య శిల్పకళల మూడింటి స్వభావాలు నృత్యంలో ఉన్నాయి. సంగీతంలో మాదిరిగానే నృత్యంలో కూడా లయ ఉంది. సంగీతంలోని స్వరవిన్యాసంలాగానే నృత్యంలో కవిత్వం ఉంది. అర్థ శబ్దాలంకారాలు కవిత్వంలో వలెనే నృత్యంలో కూడా ఉన్నాయి. కొన్ని ఆంగిక చాలనాలు అర్థస్ఫూర్తి కోసం ఉద్దేశించినవైతే మరికొన్ని కేవలం సౌందర్యస్ఫూర్తి కోసం ఉద్దేశించినవి. ఒక్కొక్క చాలనం ఒక్కొక్క పదమని ఊహించుకుంటే నృత్యం అంగవిన్యాసాలతో అల్లే కమనీయకవనంలా అనిపిస్తుంది. శిల్పంలోవలె, చిత్రలేఖనంలోవలె నృత్యంలో కూడా రేఖా విన్యాసం ఉంది. నర్తకి కరచరణ చాలనాలతో గాలిలో సుందరమైన రేఖలు సృజిస్తుంది. ఆరితేరిన చిత్రకారుని రేఖలో ఎంత బలం, స్పష్టత ఉంటుందో గొప్ప నర్తకి గాలిలో గీసే రేఖకు కూడా అంత స్పష్టత ఉంటుంది. కాని ఆ రేఖలకు అస్తిత్వంలేదు, అవి క్షణభంగురాలు. రసహృదయంలో ఆ రేఖలు కల్పించే అనుభూతి మాత్రం అమరమై ఉంటుంది. లలితకళలు నాలుగూ సంగమించిన సుందర ప్రపంచాన్ని దర్శిస్తున్న అనుభూతి కలుగుతుంది బాలే చూసినప్పుడు.

రాక్కెన్ రోల్, బెల్లీ డాన్స్, కాన్ కాన్ (cancan), స్ట్రిప్ టీజ్ వంటి ఆధునిక పాశ్చాత్య నృత్యాలకు బాలే సంప్రదాయానికి పోలిక లేదు. అవన్నీ కేవలం ఇంద్రియాలను రెచ్చగొట్టే చౌకబారు నృత్యాలు. అవి రసహృదయాన్ని స్పృశించలేవు. వాటిని బట్టి పాశ్చాత్య నృత్యకళ విలువలను కొలవకూడదు. బాలే శుద్ధమైన, శాస్త్రీయమైన నృత్య సంప్రదాయం. మనదేశంలో భరతనాట్యం, కథక్, కూచిపూడి, మణిపురి, కథకళి సంప్రదాయాలకు ఎటువంటి గౌరవం ఉన్నదో పాశ్యాత్య దేశాలలో బాలేకు అంతటి గౌరవం ఉంది. బాలే రష్యాలో విశేషంగా అభివృద్ధి చెందింది. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీలలోనూ, ఇతర పాశ్చాత్యదేశాలలోనూ ఈ సంప్రదాయం ఉంది.

బాలే అంటే సంగీత నృత్యరూపకం అని చెప్పవచ్చు. అయితే మన రూపకాలలో మాదిరిగా బాలేలో గీతాలు ఉండవు; గాత్ర సంగీతం ఉండదు, నేపథ్య వాద్య సంగీతం మాత్రం ఉంటుంది. అది కూడా నృత్యానికి కొంత దోహదం ఇచ్చేందుకే గానీ, అత్యవసరమైనది కాదు. రంగాలంకరణ అంటూ ఏమీ ఉండదు. 'లైటింగ్ ఎఫెక్టు'లనబడేవి ఉండవు. దుస్తులు నృత్యానికి అనువుగా రూపొందించబడినవేగానీ ఆకర్షణకోసం, ఆడంబరం కోసం ఉద్దేశించినవి కావు. ఒక్కమాటలో చెప్పాలంటే బాలేలో నృత్యానికి తప్ప మరి ఏ అంశానికి ప్రాధాన్యం ఉండదు. కేవలం నర్తకీ నర్తకుల కళా ప్రాభవం వల్లనే రాణించవలసినది బాలే. నృత్యంలో కూడా అభినయం ఉండదు. ముఖంలో ఎటువంటి భావాలు ప్రదర్శించకుండా అంగ విన్యాసం ద్వారానే భావ వ్యక్తీకరణం చేయటం దీని లక్షణం. ఖచ్చితంగా చెప్పాలంటే-మన నాట్యశాస్త్రంలో చెప్పిన 'నృత్తం' అనే పదం దీనికి వర్తిస్తుంది. అభినయ రహితమైన అంగ విన్యాసం నృత్తం అనీ, అభినయంతో కూడినది నృత్యమనీ మన శాస్త్రకారులు చెప్పారు. అయితే ఇప్పుడు మనదేశంలో నృత్తం అనేది ప్రచారంలో లేదు. మన శాస్త్రీయ నృత్య సంప్రదాయాలన్నింటిలోనూ అభినయం ఉన్నది. అయితే సాహిత్యం, అభినయం, రంగాలంకరణ మొదలయిన హంగులన్నీ ఉన్న మన యక్షగానం వంటిది యూరప్ దేశంలో కూడా ఉంది. అదే ఆపెరా.

మన శాస్త్రీయ నృత్యాలలో భావం అంగ విన్యాసం ద్వారా, అభినయం ద్వారా, గీతం ద్వారా, సంగీతం ద్వారా వ్యక్తమవుతుంది. అంగవిన్యాసంలో, అభినయంలో అర్థస్ఫూర్తి లేకపోయినా ఆ నృత్యం వ్యక్తం చేయదలచిన భావం ఏమిటో గీతంలోనూ, సంగీతంలోనూ తెలుస్తూనే ఉంటుంది. అంగవిన్యాసం బాగా లేకపోయినా అభినయంతో దానిని కొంత కమ్ముకునే అవకాశం ఉంది. బాలేలో ఇటువంటి అవకాశాలు లేవు. గీతం, సంగీతం, అభినయం ఇవేవీ నర్తకుని ఆదుకోవు. కేవలం అతని ప్రతిభతోనే ప్రేక్షక హృదయాలను రంజింపచేయాలి. బాలేలో సంగీతం లయకోసం, 'టెంపో' కోసం మాత్రమే ఉద్దేశించింది. నర్తకీ నర్తకులలో సంగీతజ్ఞానం ఎక్కువగా ఉన్నవారు మిగిలినవాళ్లకంటే ఎక్కువగా రాణించే అవకాశం ఉంది.

బాలే సామూహిక నృత్యం. బాలేకు ఇతి వృత్తం ఉంటుంది. ఆ ఇతివృత్తాన్ని ఆంగిక చాలనాలతో ప్రదర్శించాలి. అభినయ రహితమైన అంగవిన్యాసం యాంత్రికంగా ఉంటుందని అనుకుంటే పొరపాటు. బాలేలో - అంగవిన్యాసంలో-నర్తకి వ్యక్తిత్వం, నర్తకి ఆత్మ కనిపిస్తాయి. అటువంటి నృత్యమే హృదయాన్ని స్పృశిస్తుంది. తదితరమైన నృత్యం నృత్యంకాదు-అది వ్యాయామం, కాకపోతే సర్కస్ అవుతుంది. ఆంగిక చాలనం గురువువద్ద నేర్చుకోవచ్చును, నిరంతర సాధనతో సాధించవచ్చును. కానీ ఆ చాలనంలో ఆత్మను చూపటం నేర్చుకుంటే వచ్చేది కాదు, సాధనవల్ల అబ్బేది కూడా కాదు. అది జన్మతః సిద్ధించవలసిన లక్షణం. కళలో కళాకారుని ఆత్మ అసంకల్పితంగానే దర్శనమిస్తుంది.

French Ballet Picture

మిగతా కళలలన్నింటికంటే అపురూపమైనది నృత్యం. కళాహృదయం, కళాసృజనశక్తి ఉన్నా కూడా అంగసౌష్ఠవం, ముఖసౌందర్యం నృత్యానికి అత్యవసరం. అవిలేని నృత్యం ఎంత గొప్పగా ఉన్నా వికృతంగా ఉంటుంది. బాలేలో శారీరక సౌందర్యానికి చాలా ప్రాముఖ్యం ఉంది. బృందంలో అందరి శారీరక పరిమాణాలూ ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి, దుస్తులు, అలంకరణ అందరికీ ఒకేమాదిరిగా ఉంటాయి. హంసతూలికలవలె తేలికగా, తెల్లగా ఉండే దుస్తులతో, దూదిపింజెలవలె, మబ్బుతునకలవలె అందంగా, స్వేచ్ఛగా తేలిపోతూ ఉంటారు. ఒంటికాలి బొటన వ్రేలిమీద నిలబడి బొంగరం లాగా గిరగిర తిరిగిపోతారు. శరీరంలోని ప్రతి కదలికలోనూ విశేషమైన మార్దవం, లావణ్యం కనిపిస్తాయి. మగవారి దుస్తులు ఒంటిని గట్టిగా అంటి పెట్టుకుని బిగుతుగా ఉంటాయి. వారు అతి సునాయాసంగా దూది బొమ్మను ఎత్తేసినట్లు ఆడవారిని ఎత్తేస్తారు. నృత్యంలో ఎటువంటి చప్పుళ్లు వినిపించవు. నేపథ్య సంగీతం కూడా చాలా సన్నగా, లలితంగా, దూరం నుంచి లీలగా వినిపిస్తున్నట్లు ఉంటుంది.

'బాలే క్లాసిక్ డి ఫ్రాన్స్' బృందం అంతర్జాతీయ ఖ్యాతి పొందినది. ఫ్రాన్స్ విదేశాంగ శాఖ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యాన ఈ బృందం ప్రపంచ పర్యటన చేస్తూ భారతదేశానికి వచ్చింది. ఈ బృందంలో నర్తకీ నర్తకులు, నిర్వాహకులు అందరూ కలిసి ఇరవై ఏడుమంది ఉన్నారు. ప్రధాన నర్తకీమణులు లియాన్ డేడ్, నీనా వైరొబోవా.

French Ballet Picture
నీనా వైరొబోవా

కళాప్రజ్ఞలోనూ, సౌందర్యంలోనూ కూడా నీనా వైరొబోవా కంటే లియాన్ డేడ్ మిన్న. లియాన్ డేడ్ వయస్సు 32 సంవత్సరాలు. ఆమె పదిహేడవ ఏటనే ప్రసిద్ధ బాలెరినాగా పేరు పొందింది. 'ది నైట్ అండ్ ది యంగ్ గర్ల్', 'స్నోవైట్', 'జిసెల్', 'శ్వాన్ లేక్', 'రోమియో జూలియట్', 'స్లీపింగ్ బ్యూటీ' బాలేల ద్వారా దేశ విదేశాలలో నృత్యకళాభిజ్ఞుల గౌరవాభిమానాలను చూరగొన్నది. మాస్కోలో ఏ విదేశీ నర్తకీ పొందని గౌరవాన్ని ఆమె పొందింది. మాస్కో ఆమెను ఐదుసార్లు ఆహ్వానించింది. తీర్చిదిద్దిన సుందర శిల్పంలా ఉండే ఆమె శరీరం, ఠీవిగా, సుకుమారంగా, నిర్దుష్టంగా ఉండే ఆమె అంగవిన్యాసం ప్రేక్షక హృదయంలో చెరగని ముద్రవేస్తాయి. ఆమె నృత్యం కీట్స్ కవిత్వంలా, కోయిల పాటలా విషాద మిళితమైన మాధుర్యాన్ని చవిచూపిస్తుంది.

ఈ బృందం మొదటి రోజు అయిదు అంశాలను ప్రదర్శించింది. అవి 'కాన్ స్టాంటియా', 'డాన్ కి యోటీ', 'లైఫోరైన్స్', 'రోమియో అండ్ జూలియట్', 'బ్లాక్ అండ్ వైట్'. వీటిలో 'లైఫోరైన్స్', 'రోమియో అండ్ జూలియట్' ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి. 'లేఫోరైన్స్' సర్కస్ వాళ్ల జీవితాన్ని వ్యాఖ్యానించేది. నిత్య జీవితంలో దారిద్ర్యం అనుభవిస్తున్నా, సర్కస్ వేషాలు వేసుకునేసరికి కష్టాలన్నీ మరిచిపోయి, ప్రేక్షకులందరికీ కష్టాలు మరపింపచేస్తారు సర్కస్ మనుషులు. 'రోమియో అండ్ జూలియట్' ఇతివృత్తం ప్రసిద్ధమైనదే. జూలియట్ గా లియాన్ డేడ్ నృత్యం చిరస్మరణీయంగా ఉంది. ఇందులో ఆమె విషాదాన్ని ఎంత గొప్పగా పోషించిందో 'డాన్ కియోటి'లో హాస్యాన్ని కూడా అంత గొప్పగా పోషించింది.

రెండున్నర గంటలసేపు ఒక్క అపశ్రుతి గానీ, ఒక్క అపగతి గానీ లేకుండా ప్రదర్శనం విశిష్టంగా సాగింది. ఇంత గొప్ప ప్రదర్శనాన్ని చూడగలగటం మద్రాసు ప్రేక్షకుల అదృష్టం.

రెండవనాటి కార్యక్రమంలో ఈ బృందం 'జిసెల్' అనే బాలేను ప్రదర్శించింది.

విదేశాలతో భారత సాంస్కృతిక సంబంధాలు విస్తృతమై, ముందు ముందు ఇటువంటి ప్రదర్శనలు తిలకించే అవకాశాలు ఇంకా ఎక్కువగా వస్తాయని ఆశిద్దాం.

నండూరి పార్థసారథి
(1965 సెప్టెంబరు 15వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post