Humor Icon

ఇతరులపై పెత్తనం, పెద్దరికం చెలాయించే తత్వం అంతో యింతో సాధారణంగా అందరిలో వుంటుంది. కనీసం చెలాయించాలన్న కోరికైనా వుంటుంది. ఎవరిమట్టుకువారు సాగినంతవరకు ఆ కోరికను తీర్చుకుంటూ వుంటారు. పెద్దరికం చెలాయించే తత్వం ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా వ్యక్తమవుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ బుద్ధి తెలుగు మేష్టారు మొదలు నిక్సన్ వరకు అందరిలో వేర్వేరు మోతాదుల్లో ఉంటుంది.

బడిపంతులు విద్యార్థులపై పెత్తనం చెలాయిస్తాడు. అధికారి గుమాస్తాపై పెత్తనం చెలాయిస్తాడు. పెళ్ళాం మీద మొగుడు. (మెతకవాడైతే మొగుడి మీద పెళ్ళాం), సక్కుబాయి మీద అత్తగారు, (వెర్రిబాగులదైతే అత్తగారి మీద కోడలు) పెత్తనం చెలాయిస్తారు. సినీ రచయితపై దర్శకుడు, దర్శకునిపై నిర్మాత, నిర్మాతపై డిస్ట్రిబ్యూటర్, వీళ్లందరిపై హీరో పెత్తనం చెలాయిస్తారు. బడుగు దేశాలపై అగ్రదేశాలు, నల్లవారిపై తెల్లవారు, అడుక్కుతినేవాళ్లపై అడ్డమైనవాడు పెత్తనం చెలాయిస్తారు.

పెత్తనం లేదా పెద్దరికం చెలాయించే తత్వం అధములలో అధికంగా వుంటుంది. సగటు మనుషుల్లో సగటు ప్రమాణంలో వుంటుంది. సంస్కారులలో స్వల్పంగా వుంటుంది. ఇతరులపై పెత్తనం చెలాయించడానికి కావలసినవి మూడు - ధనం, బలం, అధికారం. ఈ మూడింటినిబట్టే మిగతావన్నీ. ఎవరు ఎంతగా పెత్తనం చెలాయిస్తారనేది వారికి ఈ మూడింటిలో ఏది వుంది, ఏది లేదు, ఏదేది ఎంతెంత వుంది అనేదానిపై ఆధారపడి వుంటుంది. ఈ మూడూ ఉన్నవాడు అధముడైతే అతనిలోని పెత్తందారీబుద్ధి రాక్షస ప్రవృత్తిగా వ్యక్తమవుతుంది. అతడు ఇతరులను పీడిస్తాడు, హింసిస్తాడు. అణచి వేస్తాడు. దక్షిణాఫ్రికా శ్వేత ప్రభుత్వంలా ప్రవర్తిస్తాడు.

ధనబలం, అధికారం వున్నప్పటికీ సంస్కారి అయితే ఇతరులపై పెత్తనం చెలాయించడు; తనలో పెత్తందారీ బుద్ధి వున్నా దానిని అణచి వేసుకుంటాడు; దురహంకారంగా, దౌష్ట్యంగా వ్యక్తం కానివ్వడు; ప్రయత్నపూర్వకంగానైనా అతడు ఔదార్యాన్ని ప్రదర్శిస్తాడు. ధనం, బలం, అధికారం అధమునికి దురహంకారాన్ని యిస్తే, సంస్కారికి ఆత్మ విశ్వాసాన్ని యిస్తాయి. ఈ మూడూ ఉన్న సంస్కారి బలహీనులపై పెత్తనం చెలాయించడానికి బదులు, వారికి మార్గదర్శకుడవుతాడు.

పెత్తనం చెలాయించడం వేరు, నాయకత్వం వహించడం వేరు. ఆ రెండూ ఒకటి కాదు. పెత్తనం అధముల లక్షణం. నాయకత్వం అధికుల లక్షణం. అథములు ధనం, బలం, అధికారం ఈ మూడింటిని మాత్రమే ఆశ్రయిస్తారు. నాయకులు ప్రతిభ, నిజాయితీ సమర్థత ప్రధానమైనవిగా భావిస్తారు. వారికి ప్రతిభే ధనం, నిజాయితీయే బలం, సమర్థతే అధికారం. కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి నాయకత్వం ఎప్పుడూ అవసరమే. నాయకత్వం వహించడం తప్పుకాదు. అది గొప్పవిషయం. ఐతే ప్రతిభ, నిజాయితీ సమర్థత వున్నవారికి మాత్రమే అర్హత వుంటుంది. ఆ మూడూ ఉన్నవారు నాయకత్వం వహించకపోవడమే తప్పవుతుంది.

పెత్తనం చెలాయించడానికి కావలసిన ధనం, బలం, అధికారం, నాయకత్వం వహించడానికి కావలసిన ప్రతిభ, నిజాయితీ, సమర్థత లేక, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడేవారికి ఇతరుల పై పెత్తనం చలాయించాలన్న కోరిక ప్రబలంగా వుంటుంది. ఆ కోరికను ఏదో విధంగా తీర్చుకోవాలి. కనుక, ఇతరులపై పెత్తనం చెలాయిస్తే దవడపగలకొడతారు కనుక, తనకు లోకువైన పెళ్ళాందవడ పగలకొడతాడు.

పై అధికారికీ, ఊళ్ళో పెద్దలకీ, ఇంట్లో పెళ్ళానికీ కూడా లోకువైన బడిపంతులు విద్యార్థుల వీపులు చిట్లగొడతాడు. ఆ కొట్టడం కూడా జాగ్రత్తగా పేద వాళ్ళ పిల్లలను ఎంచుకుని మరీ కొడతాడు. (డబ్బు అధికారం గల వాళ్ళ పిల్లలను కొడితే ఉద్యోగం ఊడిపోతుంది) రౌడీరంగన్న, కత్తుల రత్తయ్య లాంటి వారి పిల్లలజోలికి కూడా పోడు (డొక్క చిరిగే ప్రమాదం ఉన్నది) మేష్టారికి గల బలం, అధికారం తన దగ్గర చదువుకునే ధనహీనుల, బలహీనుల పిల్లలకు మాత్రమే పరిమితం.

వియత్నాంలో పరాభవం పొందిన నిక్సన్ బడుగుదేశాలపై తన ప్రతాపాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాడు. నిజమైన నాయకునికి కావలసిన ప్రతిభ, నిజాయితీ సమర్థత తనలో కొరవడిన సంగతి ఆయనకి తెలుసు. వియత్నాంలో ఓడిపోగా, ఐక్యరాజ్యసమితిలో మాట చెల్లకపోగా, అంతర్జాతీయ విపణిలో పలుకుబడి తగ్గిపోగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుతో ఆయన అమెరికాకుగల ధనాన్ని, బలాన్ని అధికారాన్ని చూపి వర్థమాన దేశాలను బెదించడానికి ప్రయత్నిస్తున్నాడు. భారతదేశం తన పెద్దరికాన్ని గౌరవించి, తన సలహా పాటించలేదనే కోపంతో పదవ నౌకాదళాన్ని చూపి భయపెట్టాలనుకున్నాడు. భారతదేశం భయపడలేదన్న కసితో ఆర్థిక సహాయం ఆపుచేశాడు. పాకిస్తాన్ కు శాయశక్తులా సహాయం చేశాడు. ఈ రకం కసి ఇన్ఫీరియారిటీ లక్షణం.

ప్రతి మనిషికీ అంతో యింతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వుంటుంది. దాన్ని కప్పి పెట్టుకోవడానికి ఇతరులపై పెద్దరికం చెలాయిస్తారు. నిశానీదారుడైన మంత్రి ఐ.ఎ.ఎస్. ఆఫీసరుకు కసితీరా ఆజ్ఞలు జారీచేస్తాడు. ఆ ఆఫీసరు ఎంత సమర్థుడు, నిజాయితీపరుడు అయినప్పటికీ తన అధికారాన్ని పెద్దరికాన్ని ప్రత్యేకంగా గుర్తించి, గౌరవించకపోతే ఏ మాత్రం అవకాశం దొరికినా అతడిపై 'క్రమశిక్షణ చర్య' తీసుకుంటాడు.

ఎస్సెల్సీ తప్పిన ఎడిటర్ అస్తమానం ఎమ్మే చదివిన సబ్ ఎడిటర్ రాసే వాటిల్లో తప్పులు పట్టుకుంటూ వుంటాడు. ఎర్రసిరాతో హెడ్డింగులు దిద్దుతూ, చీవాట్లు పెడుతూ వుంటాడు. కాకా పట్టకపోతే సంజాయిషీ నోటీసులు జారీచేస్తాడు. అతడిపై కసికొద్దీ తనలాగా ఎస్సెల్సీ తప్పిన ఒక కాకారాయుడికి ప్రమోషన్ ఇస్తాడు. తన కంటే సమర్థుణ్ణి ఎంతగా శిక్షిస్తే అంతగా తనకు అధిక్యం వస్తుందని అనుకుంటాడు.

సంస్కారహీనుడెప్పుడూ అధికారంలో తనకంటే క్రింద మెట్టుమీద వున్నవాడి వ్యక్తిత్వాన్ని గౌరవించలేడు, ఆత్మ గౌరవాన్ని సహించలేడు. ఏడుపుగొట్టు అధికారి నున్నగా గడ్డం గీసుకుని, తాంబూలం సేవించే గుమాస్తాను చూసి ఓర్వలేడు. మాసినగడ్డంతో చిరిగిన బట్టలతో, తుమ్మల్లో పొద్దూకిన మొహంతో వచ్చే గుమాస్తాను మహా ఆప్యాయంగా చేరదీస్తాడు. అడక్కుండానే 'అప్పుకావాలా, అడ్వాన్సు కావాలా, సెలవు కావాలా, ప్రమోషన్ కావాలా'? అని తనే పరామర్శించి, అతగాడి మనోరథం ఈడేరుస్తాడు. అటువంటి అధికారి పెత్తనంలో కొత్తబట్టలు వేసుకోవడమే క్రమశిక్షణారాహిత్యం అవుతుంది.

డబ్బు, పలుకుబడి మాత్రమేవుండి, చదువు, సంస్కారం వగైరాలు లేని సినిమా నిర్మాత సమర్థుడైన రచయిత దగ్గర దర్శకునిదగ్గర ఇన్ఫీరియారిటీ ఫీలవుతాడు. తన డబ్బుతో వారి వ్యక్తిత్వాలను కొనేసి, వారిపై 'విజయం' సాధించాలనుకుంటాడు. మామూలుగా రచయితలను, దర్శకులను 'మేధావులుగా' గుర్తిస్తారు. అందరూ (వారికి డొక్కశుద్ధి వున్నా లేకపోయినా), సినిమా ప్రొడ్యూసర్ ను కేవలం పెట్టుబడి దారునిగా, వ్యాపారిగా మాత్రమే గుర్తిస్తారు; ఆయనకు బాధగా వుంటుంది. తన వద్ద డబ్బు తీసుకునేవారు, తనపై ఆధారపడేవారు తనకంటే అధికులుగా గుర్తింపబడటం ఆయన సహించలేడు. అందుచేత అడుగడుగునా అడ్డుతగులుతూ, "అలాకాదు ఇలా వుండాలి" అని అజ్మాయిషీ చేస్తూ, "అయ్యా చిత్తం, అలాగేనండీ" అని వారు అంగీకరిస్తుంటే, తన ఆధిక్యానికి తానే మురిసిపోతూ వుంటాడు. ఆత్మవంచనలోనే ఆయనకు ఆనందం లభిస్తుంది.

ఒక మహా సౌందర్య రాశిని మానభంగం చేసిన పరమ కురూపికి కలిగే 'విజయగర్వం', ఒక మహా రచయిత చేత చెత్తకథ రాయించుకున్న ప్రొడ్యూసర్ కు కలిగే 'విజయగర్వం' ఒక్క మాదిరివే. ప్రపంచంలో వ్యక్తిత్వం, ఆత్మాభిమానం చాలా అపురూపమైనవి. అవిలేని ధనవంతులు ఎంత డబ్బయినాపోసి వాటిని కొనడానికి ప్రయత్నిస్తూ వుంటారు.

సినిమా రంగంలో స్థిరపడిన ఎవరో ఒక సగటు రచయిత చేత తనకు కావలసిన నాసిరకం కథ రాయించుకోడం కంటే ఏదయినా ఒక పెద్ద వారపత్రికలో సీరియల్ గా ప్రచురింపబడి, బహుళ ప్రజాదరణపొంది, అకాడమీ బహుమతికూడా పొందిన ఒక ప్రముఖ రచయిత (రచయిత్రి అయితే శ్రేష్టం) నవలను తన చిత్తం వచ్చినట్లు చిత్రహింస చేయడంలో నిర్మాతకు సంతృప్తి ఎక్కువ. నిర్మాత అభిరుచిని ఆకళింపు చేసుకుని రచయిత కష్టపడి చెమటోడ్చి చెత్తకథ రాసిచ్చినా నిర్మాతగారు అందులో మార్పులు, కూర్పులు, చేర్పులు చేయక మానరు. అది ఆయన డబ్బిచ్చి కొనుక్కున్న హక్కు.

డబ్బు యిస్తున్నందుకు రచయితపైన, దర్శకునిపైన నిర్మాతకు ఎంత అధికారం వున్నదో, నిర్మాతపై ఆయనకు పెట్టుబడి పెడుతున్న డిస్ట్రిబ్యూటర్ కూ అంత అధికారం వున్నది. తన కిందివారిపై పెత్తనం చెలాయించే వాడెప్పుడూ తనపై వాడి పెత్తనానికి తలవంచుతాడు. ఇతరుల పెత్తనానికి తలవంచని ఆత్మాభిమాని ఎప్పుడూ తన క్రిందివారిపై పెత్తనం చెలాయించడు.

అన్నికాలాల్లో, అన్ని దేశాల్లో, అన్ని రంగాల్లో, అన్ని అంతస్తుల్లో పెత్తందారులు వుంటూనే ఉన్నారు. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణాసురుడు, ద్వాపర యుగంలో నరకాసురుడు, కలియుగంలో యాహ్యాఖాన్ పెత్తందారి తత్వానికి పీఠాధిపతులే. ప్రభువులు, నియంతలు దేశస్థాయిలో పెత్తనం చెలాయిస్తే, కండలు తిరిగిన రౌడీలు, వారిని మేపే భూస్వాములు, రచ్చబండ పెద్దలు, గ్రామస్థాయిలో పెత్తనం చెలాయిస్తారు. పెత్తనం అంటే వూచకోత కోయడం, కొరడాలతో బాదడమేకాదు. సాంఘికంగా ఆర్థికంగా బలహీన వర్గాలను పీడించడం, బెదరించడం, భయపెట్టడం, ఒత్తిడి చేయడం కూడా పెత్తనమే.

భుజబలం గలవాడు "చంపేస్తా జాగర్త" అని బెదిరిస్తాడు. అధికారం గలవాడు "ఉద్యోగం ఊడపీకించేయిస్తా నువ్వూ, నీ పిల్లలూ అల్లాడిపోతారు జాగ్రత్త" అని బెదరిస్తాడు. డబ్బుగలవాడు అన్ని రకాలుగా బెదరిస్తాడు. డబ్బుంటే భుజబలాన్ని, అధికారాన్ని కూడా కొనుక్కోవచ్చు.

పెత్తనం వున్న ప్రతిచోటా ప్రతిఘటనకూడా వుంటుంది. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తు ఎగిరినట్లు పెత్తనం ఎంత ఎక్కువగా వుంటే ప్రతిఘటన అంత ఎక్కువగా ఉంటుంది. ప్రతిభ, నిజాయితీ, సమర్థత గలవారు, పెత్తనాన్ని సహించలేని ఆత్మాభిమానులు, నైతికధీరులు పీడతవర్గానికి నాయకులై పెత్తందారులను ప్రతిఘటిస్తారు. స్వాతంత్రోద్యమాలు, కార్మికోద్యమాలు అన్నీ ప్రతిఘటన ఫలితాలే.

ధనాన్ని, బలాన్ని, అధికారాన్ని ప్రతిఘటించడానికి అన్నిటికంటే ముఖ్యంగా కావలసినది నైతిక ధైర్యం. ప్రతిభ, నిజాయితీ, సమర్థత వున్నా, నైతిక ధైర్యం లేకపోతే పెత్తనాన్ని ప్రతిఘటించలేరు. ఆ మూడూ వున్నవారు నైతిక ధైర్యాన్ని పుంజుకొని నాయకత్వం వహించినప్పుడే సమాజానికి గానీ, దేశానికి గానీ భద్రత చేకూరుతుంది.

నండూరి పార్థసారథి
(1972లో 'స్వాతి' మాసపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post