Title Picture
బి.సరోజాదేవి, ఎన్.టి.రామారావు

ఈ చిత్రం ఆర్థికంగా అఖండ విజయం సాధించడమంటూ జరిగితే అందుకు కారణం ముప్పాతికపాళ్ళు ఆత్రేయ గారి కలం చలవేనని చెప్పవలసివస్తుంది. అంతేకాదు, ఆయన కలం ఈ చిత్రంలో విచ్చల విడిగా చిందులు తొక్కిందని కూడా చెప్పక తప్పదు. తెలుగు (సినిమా) తనం ఉట్టిపడే సన్నివేశాలతో, సంభాషణలతో, పాటలు, నృత్యాలు వగైరా హంగులతో ఈ చిత్రం సగటు ప్రయాణా(16 వేల అడుగులు)న్ని అధిగమించింది.

చిత్రం మంచితనానికి, నిడివికి లంకె తప్పదని నిరూపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్న అగ్రశ్రేణి తెలుగు దర్శకులు, రచయితలలో ఆత్రేయ ఒకరు (ముఖ్యులు). కనీసం 16వేల అడుగులన్నాలేనిదే చిత్రంలో హంగులన్నీ ఇమడవు. బాక్సాఫీస్ సూత్రాలన్నీ జమపడవు. ఒకవిధంగా వీరి దృక్పథం సబబైనదే. పుష్ఠిగల శ్రేష్టమైన ఆహారం కొద్దిగా పెడితే తిండిపోతులకు రుచించదు. చెత్తయినా సరే పది ఆధర్వులతో శేరు బియ్యపు అన్నం తింటే గాని వాళ్ళు త్రేన్చరు. తెలుగు ప్రేక్షకుల అభిరుచి కూడా అలాగే ఉంది. ఈ కారణం వల్లనే 'ఇంటికి దీపం ఇల్లాలే' చిత్రం నిడివి 16 వేలకు పైగా సాగింది.

ఈమధ్య చాలా చిత్రాలలో వలెనే ఈ చిత్రంలో కూడా ఆత్రేయ కొన్ని ప్రేమ సిద్ధాంతాలు పొందుపరచారు. ఇది ఇద్దరమ్మాయిలూ ఇద్దరబ్బాయిల కథ.

Picture
జగ్గయ్య, ఇ.వి.సరోజ

రాజశేఖరం(రామారావు), చంద్రశేఖరం(జగ్గయ్య) అన్నదమ్ములు. జనం ఇద్దరినీ ముద్దుగా శేఖరం అని పిలుస్తారు. (పేరులో ఏముందని అంటారు కాని, ఈ కథ కిటుకు అంతా ఈ పేర్లలోనే ఉంది. పేరు మీదే ఇంత పెద్ద కథ అల్లారు ఆత్రేయ). చంద్రశేఖరాన్ని మాలతి (ఇ.వి.సరోజ) ప్రేమిస్తుంది. అతను సుగుణ (బి. సరోజాదేవి)ను ప్రేమిస్తాడు. ఆమె అతన్ని ప్రేమిస్తుంది. రాజశేఖరం ఎవర్నీ ప్రేమించడు. అదే చికాకుగా, చాదస్తంగా ఉంటుంది. ముప్పయ్యేళ్ళు వొచ్చి ఎవర్నీ ప్రేమించకపోవడం ఏమిటి! అతనికి త్రాగుడు (పిత్రార్జితం), అనుమానం (స్వార్జితం) సంక్రమించాయి. వారికి బోలెడు ఆస్తి, లంకంత ఇల్లు ఉన్నాయి. కాని ఇంటికి దీపం (ఇల్లాలే) లేదు. వాళ్ళ అమ్మ (కన్నాంబ)కు అదే మనాది పట్టుకుంది. దీపం పెడితేగాని ఇల్లు చక్కబడదనీ, సీనియర్ శేఖరం బాగుపడడనీ తలచి ఆవిడ అతనికి పెళ్ళి చేయాలనుకుంటుంది. అతనూ ఒప్పుకున్నాడు. ఏతావాతా సుగుణకూ, (సీ) శేఖరానికీ పెళ్ళి ఖాయపడింది. ఫలానా ఊరు, ఫలానా వారబ్బాయి శేఖరం అనేసరికి తను ప్రేమించిన చంద్రశేఖరమే కాబోలు అనుకుంది ఆ అమ్మాయి. వాళ్ళ నాన్న (నాగయ్య) ఫొటో చూపించినా మొహమాటపడి చూడకుండా ఒప్పేసుకుంది. ఇది ఇల్లా ఉండగా (జూ) శేఖరం తనను ప్రేమించడం లేదని తెలుసుకొని మాలతి ఆత్మహత్య చేసుకోబోయి ప్రజాసేవ కోసం నర్సుగా మారిపోయింది. ససేమిరా మరో పెళ్ళి చేసుకోనంది. స్త్రీ ఒక్క పురుషుని కంటే ఎక్కువ ప్రేమించలేదని ఆమె సిద్ధాంతం.

పీటలమీద కూర్చోబోయే సమయానికి అసలు రహస్యం తెలిసి సుగుణ బావురుమంటుంది. తండ్రిని బ్రతిమాలితే ఆయన ఎదురు బ్రతిమాలాడు 'బ్రతికినన్నాళ్ళు బతకను, ఈనాలుగు రోజులూ నా పరువు నిలబెట్టు, నువ్వు చాలా కాలం బ్రతికేదానివే కదా!' అనటంతో మంగళసూత్రం కట్టించుకుంటే పాతప్రేమను భర్తకు బదిలీ చేయడం సాధ్యమేనని ఈమె సిద్ధాంతం. అందుకే సరేనని పెళ్ళి చేసుకుంది. సూత్రం కడుతుంటే (సీ) శేఖరం చేతి మీద ఆమె కన్నీరు పడుతుంది. 'ఓహో' అనుకొని, సూత్రం కట్టేసి, తర్వాత ఆమెను నానాహింసపెడతాడు. ఇది వరకు ఎవర్ని ప్రేమించావో చెప్పు అని నిగ్గదీస్తాడు. 'మీరేనాదైవం' అంది అమ్మాయి. తర్వాత (జూ) శేఖరానికి సుగుణకు మధ్య వదినా మరదుల సంఘర్షణ (మనకు సుపరిచితమే) జరుగుతుంది. ఆ తర్వాత అన్నగారి అనుమానం, బీభత్సం, భయానకం, ఉత్కంఠ, పశ్చాత్తాపం... చివరికి చంద్రశేఖరానికి, మాలతికి వివాహం.

వి.ఎన్. రెడ్డి గారి దర్శకత్వం కట్టుదిట్టంగా ఉంది. చిత్రంలో ఎక్కడా ఆట్టే విసుగనిపించదు. ఛాయాగ్రహణం చక్కగా ఉంది. మొత్తం ఎనిమిది పాటలున్నాయి. ఆత్రేయ రచించిన 'కాపలా... హహహ... కాపలా' అనేపాట, దాని వరస బాగున్నాయి. సంగీతంలో విశేషమేమీలేదు. ఆత్రేయ సంభాషణలు వాడిగా, వేడిగా, పసందుగా ఉన్నాయి.

రామారావు సరికొత్త పాత్రను తన మామూలు ధోరణిలో నిర్వహించాడు. సరోజ లిద్దరి తెలుగు పలుకుబడి ముద్దుముద్దుగా ముచ్చటగా ఉంది. చక్కగా నటించారు. మిగతా వారి నటనలు యథాపూర్వంగా ఉన్నాయి.

ఈ చిత్రాన్ని విజయవాడలో పత్రికా విలేఖరులకు ప్రత్యేకంగా చూపకుండా మొదటి రోజు మొదటి ఆటకు ఆహ్వానించారు. ఒకవిధంగా ఇది మంచిపద్ధతే. మన వాక్యంతో పాటు జనవాక్యం (టాక్) కూడా వ్రాయడానికి వీలవుతుంది. ఈ 'జనం' అనే పదానికి సినీపరిభాషలో ప్రత్యేక నిర్వచనం ఉంది. చొక్కాలు చిరిగినా, కుస్తీ పట్టవలసి వచ్చినా, లాఠీదెబ్బలు తిన్నా వెనుకంజవేయక, సాహసంగా తప్పనిసరిగా మొదటి మూడు నాలుగు రోజులలోనే చిత్రాన్ని చూడాలనుకునే, చూసే ప్రేక్షకులు ఈ 'జనం'. వీరి అభిప్రాయమే 'జనవాక్యం'. 'ఇంటికి దీపం ఇల్లాలే' చిత్రానికి 'జనవాక్యం' ఇలా ఉంది.

"ఆత్రేయ శరత్ 'బాబు' లాగా రచించాడు. రామారావు నటన ఆమోఘం. జగ్గయ్య అద్భుతం. సరోజాదేవి అపూర్వం. సంగీతం ఫరవాలేదు. డాన్సులు ఓ మోస్తరు. మొత్తం మీద పిక్చరు బ్రహ్మాండం".

దర్శకుడు: వి.ఎన్.రెడ్డి; నిర్మాత: టి.ఆర్.రామన్న; రచన: ఆత్రేయ; సంగీతం: విశ్వనాథం-రామ్మూర్తి; పాటలు: ఆత్రేయ, శ్రీశ్రీ; కెమెరా: గోపీకృష్ణ; తారాగణం: ఎన్.టి.రామారావు, జగ్గయ్య, రేలంగి, రమణారెడ్డి, నాగయ్య, బి.సరోజాదేవి, ఇ.వి.సరోజ, గిరిజ, కన్నాంబ, మాలతి వగైరా.

నండూరి పార్థసారథి
(1961 ఫిబ్రవరి 5వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post