Title Picture

ఫిలిం అవార్డులు పంపిణీ చేసే ప్రైవేటు సంస్థలు ఈ మధ్య దేశమంతటా కుక్కగొడుగుల్లాగా మొలుచుకొస్తున్నాయి. జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న అవార్డులు చాలక, చలన చిత్ర పత్రికలు, క్లబ్ లు, విమర్శకుల సంఘాలు, ప్రేక్షక సంఘాలు, హీరోల అభిమాన సంఘాలు కూడా యథాశక్తిని అవార్డులు ప్రదానం చేస్తూ తమ ''చలనచిత్ర కళాభిమానాన్ని'' చాటుకుంటున్నాయి. ఇదంతా తేలిగ్గా డబ్బు చేసుకునే మోసకారి వ్యాపారంగా తయారయిందని ఈ మధ్య కేంద్ర సమాచార మంత్రి శుక్లా ఘాటుగా విమర్శించారు. అయితే, ప్రైవేటు అవార్డులను నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పారు.

మంత్రిగారి విమర్శను బట్టి అవార్డుల వ్యవహారం శ్రుతిమించుతున్నదని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే, శ్రుతిమించే స్థితిలో తప్ప సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా వ్యాఖ్యానించదు. సినిమాలలో హింస, పచ్చి శృంగారం పేట్రేగిపోతున్నా కేంద్ర ప్రభుత్వం సంవత్సరాల తరబడి చూసీచూడనట్లు ఊరుకుంది. సుమారు రెండు సంవత్సరాలుగా హెచ్చరికలు చేస్తూ వచ్చింది. అయినా మన నిర్మాతలకు చీమకుట్టినట్లు అనిపించలేదు. ఆత్యక పరిస్థితి ప్రకటించిన తర్వాత గత సెప్టెంబరులో కఠినంగా హెచ్చరించడం జరిగింది. సెక్స్, వైలెన్స్ ఎక్కువగా ఉండే చిత్రాలను రిపేరు చేయడానికి కూడా అవకాశ మివ్వకుండా పూర్తిగా నిషేధిస్తామని బెదిరించినా నిర్మాతలు ధోరణి మార్చుకోలేదు. ఇక లాభం లేదని ప్రభుత్వం ఐదు భారీ హిందీ చిత్రాలను నిషేధించింది. 'గాసిప్' సినిమా పత్రికల విషయంలో కూడా ప్రభుత్వం చాలా కాలం ఇలాగే ఉపేక్షించి, ఆత్యయిక పరిస్థితి ప్రకటించిన తరువాత గట్టి చర్య తీసుకుంది. అందుచేత, అవార్డులిచ్చే ప్రైవేటు సంస్థలు మంత్రిగారి విమర్శను తొలి హెచ్చరికగా అర్థం చేసుకోవడం వివేకం. 'అవార్డు' అనే మాటను అపహాస్యం పాలు చేస్తున్న ఈ ప్రైవేటు అవార్డులు ఇలాగే కొనసాగితే వాటిపై ఏదో ఒకవిధమైన ఆంక్ష విధించడం ఖాయం.

సరసమైన ధరలకు అవార్డులు

అసలు ప్రభుత్వం ఆంక్ష విధించడం కూడా అవసరం లేకుండానే ఈ నకిలీ అవార్డులకు పిదపకాలం వస్తుంది. ఎందుకంటే చాలా 'అవార్డులు' ఈనాడు డబ్బుకు అమ్ముడు పోతున్నాయనీ, అమ్మకం కోసమే అవార్డులు ప్రారంభిస్తున్నారనీ జనానికి తెలిసిపోయింది. బొంబాయి సినిమా గాసిప్ పత్రికలు ఈ అవార్డులను, వాటిని స్వీకరిస్తున్న హీరోలను బాగా వేళాకోళం పట్టించాయి. ఏదో అవార్డు అందుకుంటే ప్రతిష్ఠ పెరుగుతుందనీ, ఆ ప్రతిష్ఠను తర్వాత నెమ్మదిగా కరకురూకలుగా మార్చుకోవచ్చుననీ కొందరు హీరోలు ఆశపడుతూ, 'అవార్డు'ల కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారు. నకిలీ అవార్డుల వల్ల ప్రతిష్ఠకు బదులు అప్రతిష్ఠ పెరుగుతుందని హీరోలు గుర్తించే రోజు వస్తుంది. అప్పుడు ఉచితంగా అవార్డులు ఇచ్చినా వారు స్వీకరించరు. అవార్డులకు మార్కెట్ లో గిరాకీ తగ్గిపోయే నాటికి అవార్డుల వ్యాపారం అంతరిస్తుంది.

ఇప్పుడు ఏటా క్రమం తప్పకుండా అవార్డులిస్తున్న వారిలో అందరికంటే ముందుగా మొదలు పెట్టిన వారు 'ఫిలింఫేర్' పత్రిక వారు. 1952వ సంవత్సరం నుంచి వారు అవార్డుల వ్యవహారాన్ని సమర్థవంతంగా, ఘనంగా నిర్వహిస్తున్నారు. 1953 నుంచి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రారంభించింది. 1964 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందీ అవార్డులు రాష్ట్ర స్థాయిలో ప్రారంభించింది. ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ ప్రభుత్వాలు కూడా రాష్ట్ర స్థాయి అవార్డులిస్తున్నాయి. నాలుగైదు సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ హిందీ చిత్రాలకు అవార్డులిస్తున్నది. 'షమ', 'సుషమ' పత్రికలు కూడా హిందీ చిత్రాలకి ఏటా అవార్డులిస్తున్నాయి. కలకత్తాలో బెంగాల్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులిస్తున్నది. కర్ణాటకలో 'లావణ్య' అనే ఒక సినిమా పత్రిక కన్నడ చిత్రాలకు, కళాకారులకు లావణ్య అవార్డులు ఇస్తున్నది. మద్రాసులోని ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ చాలాకాలంగా దక్షిణాది చలన చిత్రాలకు, సినీ కళాకారులకు అవార్డులిస్తున్నది. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సినీగోయర్స్ అసోసియేషన్ కూడా అవార్డులు ఇస్తున్నది. కొన్ని తెలుగు పత్రికలు అవార్డులు ప్రదానం చేయక పోయినా 'సినీబాలట్' లు నిర్వహిస్తున్నాయి. కొన్ని సంస్థలు ప్రముఖ సినీ కళాకారులకు ఘనంగా బిరుద ప్రదానాలు చేస్తున్నాయి.

దురభిమాన సంఘాలు

అభిమాన సంఘాలు సరేసరి. ఆంధ్రప్రదేశ్ లో అవి లేని పట్టణాలు లేవు. అభిమాన సంఘాల విషయంలో మనతో పోటీపడగలవారు ఒక్క తమిళులు మాత్రమే. (బెంగుళూరులో 'ఎం.జి.ఆర్. ఫాన్స్ ఇంటర్నేషనల్' ఒకటి ఉంది. దానికి పోటీగా 'ఎం.కె. ముత్తు ఫాన్స్ ఇంటర్నేషనల్' అని ఒకటి బయలుదేరింది. ఎం.కె. ముత్తు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు. అతను హీరోగా నటించిన మొదటి చిత్రం విడుదల కాకముందే అతడి 'అంతర్జాతీయ అభిమాన సంస్థ' వెలసింది. మొదటి చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ ఆ బోర్డు కనిపించలేదు).

చిత్తశుద్ధి, నిజాయితీ గల కొన్ని ఫిలిం అవార్డు ప్రదాన సంస్థలు

సినిమా తారల పట్ల మోజు ప్రపంచంలో అన్ని దేశాలలోనూ ఉంది. కాని అభిమాన సంఘాలు, అవార్డులు మన దేశంలో ఉన్నంత వేలం వెర్రిగా మరే దేశంలోనూ లేవు. సన్మానాలకు, బిరుదులకు, పూలమాలలకు కూడా మన దేశంలో ఉన్నంత గిరాకీ మరి ఏ దేశంలోనూ లేదు. ఆరోగ్యకరమైన చలనచిత్ర విమర్శకు మన దేశంలో స్థానం లేకుండాపోయింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో 'విమర్శ' అనేది పూజ్యం. చలనచిత్ర సమీక్షలు వ్యాపార ధోరణిలో సాగుతున్నాయి. అగ్ర నటుల నటనను విమర్శిస్తే ఆ నటుల అభిమాన సంఘాలవారు వచ్చి డొక్క చించుతారేమోననే భయం కూడా పత్రికల వారికి పట్టుకుంది. ఈ దురభిమాన సంఘాలకు కొందరు నటీనటుల ఆర్థిక ఆశీస్సులు కూడా లభిస్తున్నాయి.

ఒక హీరోను ఆరాధించడానికి అభిమాన సంఘాన్ని నెలకొల్పుకోవలసిన అవసరం ఏముంది? సంఘంగా ఏర్పడే సరికి వారికి కొంత 'బలం' వస్తుంది. తాము చేయదలచుకొన్న కొన్ని పనులు చేయడానికి ఆ 'బలం' అవసరం. తమ అభిమాన నటుని చిత్రాలన్నీ విజయవంతం కావడానికి వీలైనంత ఎక్కువ డబ్బు ఖర్చు చేసి, వీలైనన్ని ఎక్కువ సార్లు ఆ సినిమాలు చూడడం, ఆ సినిమాలను వందరోజులు లాగించవలసిందిగా థియేటర్లపై ఒత్తిడి తీసుకురావడం, వందరోజుల పండగకు వచ్చినప్పుడు అభిమాన నటునికి పూలమాలలు వేసి, సన్మానించడం, నినాదాలు చేయడం, తమ అభిమాన నటునికి అవార్డులు రావడానికి వీలుగా పత్రికలలోని బాలట్ పత్రాలను నింపి పోస్టుచేయడం, ప్రత్యర్థినటుని పోస్టర్లపై పేడముద్దలు విసరడం-ఇవి అభిమాన సంఘాల ప్రధాన కార్యకలాపాలు. అభిమాన సంఘాల మధ్య కొట్లాటలు జరిగి, హత్యలు వరకు వెళ్ళినట్లు కొన్ని సంవత్సరాల క్రిందట పత్రికలలో వార్తలు చదివాం. అయితే, ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఉండడం కోసం సానుభూతి సంపాదించడం కోసం ఇటీవల కొన్ని అభిమాన సంఘాలు ప్రజాహిత కార్యక్రమాలు సాగిస్తున్నాయి. పేదలకు అన్నదానం చేయడం, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం, బస్ షెల్టర్లు నిర్మించడం వంటి మంచి పనులు చేస్తున్నాయి. మంచి పనులు చేయడంలో కూడా ప్రత్యర్థి సంఘాలు పోటీ పడుతున్నాయి. ఇది సంతోషించదగిన విషయమే అయినప్పటికీ, అసలు అభిమాన సంఘం స్థాపించడం అనేదే ఆరోగ్యకరమైన విషయంకాదు. అటువంటి సంఘాలను నటీనటులు ప్రోత్సహించడం మంచిదికాదు. కాని దురదృష్టవశాత్తూ మన నటీనటులు తమకు ఎన్ని అభిమాన సంఘాలుంటే అంత గొప్పగా భావిస్తున్నారు. తమ కెరీర్ ఆ సంఘాలపైనే ఆధారపడి ఉంటుందనుకొంటున్నారు. ఈ సినిమా జ్వరాన్ని ఉపయోగపెట్టుకొని, సినిమా రంగంతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవటానికి, సినిమా వారి నుంచి విరాళాలు సేకరించడానికి కొన్ని నకిలీ సంస్థలు అవార్డులు, బిరుదులు ప్రదానం చేస్తున్నాయి. ఈ రకం అవార్డులకు, బిరుదులకు విలువలేదని ప్రజలకు తెలుసు.

అవార్డుల లక్ష్యం

ప్రేక్షకుల అభిరుచిని పెంపొందింపజేయడం, ఉత్తమాభిరుచితో కళాత్మకమైన చిత్రాలు నిర్మించే వారిని ప్రోత్సహించడం, చలన చిత్ర కళాకారుల మధ్య, సాంకేతిక నిపుణుల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి అవకాశం కల్పించడం, నిజమైన మంచి చిత్రాలు ఆర్థికంగా కూడా విజయం సాధించడానికి-కనీసం దివాళా తీయకుండా ఉండడానికి-యాథాశక్తిని దోహదం చేయడం అవార్డుల లక్ష్యం కావాలి. అవార్డులు ఇచ్చే సంస్థ సంకుచిత దృష్టితోకాక, విశాలదృష్టితో న్యాయమైన నియమాలను నిర్దేశించుకుని, ఆ నియమాలను అక్షరాలా పాటిస్తున్నదనీ, న్యాయనిర్ణేతలుగా నియుక్తులైన వారు నిజాయితీ గలవారనీ, మంచి చెడ్డలను నిర్ణయించడానికి అర్హతగలవారనీ ప్రజలకు విశ్వాసం కుదిరినప్పుడే అవార్డులకు విలువ లభిస్తుంది. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న అవార్డులే తమ లక్ష్యాలను సాధించగలుగుతాయి. ఒక చిత్రానికి బంగారు పతకం లభించినప్పుడు, ఆ పతకం ఇచ్చిన వారి విచక్షణా శక్తి మీద నమ్మకంగల వారందరూ ఆ చిత్రాన్ని చూస్తారు. అవార్డు వల్ల ఆ చిత్రానికి ఆర్థిక విజయావకాశం పెరుగుతుంది.

మన దేశంలో నిజంగా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నవి-జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు మాత్రమే. మిగిలిన అవార్డులన్నింటికంటే ఈ రెండు అవార్డుల ఎన్నిక పద్ధతి శాస్త్రీయంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే, ఈ రెండు అవార్డుల స్వభావాలు పూర్తిగా భిన్నమైనవి. ఫిలింఫేర్ అవార్డులకు చిత్రాలను, కళాకారులను పాఠకులే ఎన్నుకుంటారు. బ్యాలట్ పత్రాలను పరిశీలించి, లెక్కించి, ఫలితాలను ప్రకటించడం మాత్రమే న్యాయనిర్ణేతల పని. మొదట హిందీ చిత్రాలకు మాత్రమే పరిమితమైన ఈ అవార్డులు ఇప్పుడు ఇతర భాషా చిత్రాలకు కూడా ఇవ్వబడుతున్నాయి. ప్రాంతీయ భాషా చిత్రాలకు 'ఉత్తమ చిత్రం', 'ఉత్తమ దర్శకుడు', 'ఉత్తమ నటుడు', 'ఉత్తమనటి' అవార్డులు మాత్రం ఇస్తున్నారు. హిందీ చిత్రాలకు 'ఉత్తమ సహాయ నటుడు', 'సహాయనటి', 'ఉత్తమ సంగీతం', 'ఛాయాగ్రహణం', 'శబ్దగ్రహణం' వంటి పెక్కు ఇతర అవార్డులు కూడా ఇస్తున్నారు. అయితే ఫిలింఫేర్ అవార్డులు జాతీయస్థాయి అవార్డులు కావు. ఒక్కొక్క భాషలో ఒక్కొక్క ఉత్తమ చిత్రాన్ని ఎన్నిక చేయడమే కాని, దేశం మొత్తం మీద ఒక ఉత్తమ చిత్రాన్ని ఎన్నికచేయడం లేదు.

జాతీయ అవార్డులు

నిజంగా జాతీయ అవార్డు లనిపించుకోవడానికి అర్హమైనవి, దేశం మొత్తం మీద మిక్కిలి ప్రతిష్ఠాకరమైనవి, ప్రమాణాలలో అత్యున్నతమైనవి కేంద్ర ప్రభుత్వపు అవార్డులు. ఈ అవార్డులకు చిత్రాలను, కళాకారులను ఎన్నికచేస్తున్నవారు ప్రేక్షకులు కారు. కేంద్ర ప్రభుత్వంచే నియోగించబడిన వివిధ రంగాలకు చెందిన కొందరు మేధావులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తూ ఈ అవార్డులను నిర్ణయిస్తున్నారు. ఈ అవార్డుల నిర్ణయంలో చలనచిత్ర పరిశ్రమకేమీ ప్రమేయం లేదు. ప్రజాభిప్రాయంతో బాక్సాఫీస్ వసూళ్ళతో నిమిత్తం లేకుండా కేవలం కళకు సంబంధించిన విలువలను దృష్టిలో పెట్టుకుని ఈ అవార్డులను నిర్ణయిస్తున్నారు. అవార్డుల నిర్ణయంపై ఏ ఏడాది కా ఏడాది ప్రజల నుంచి వచ్చే విమర్శలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, తగు విధంగా పద్ధతులను మార్చుతూ, తప్పులు దిద్దుకుంటూ కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. ఇందువల్ల జాతీయఅవార్డుల విలువ అంతకంతకు పెరుగుతున్నది. ప్రభుత్వం అంతకంతకు అవార్డుల సంఖ్య పెంచడమే కాక, నగదు బహుమతుల విలువకూడా పెంచుతున్నది.

1953లో ప్రారంభించబడిన ఈ అవార్డులు 1965 వరకు 'ప్రభుత్వ అవార్డులు' (స్టేట్అవార్డ్)గా పిలువబడుతూ ఉండేవి. 1966 నుంచి 'జాతీయ అవార్డులు' (నేషనల్అవార్డ్స్)గా వాటిపేరు మార్చడం జరిగింది. 1965 వరకు జాతీయస్థాయిలో ఉత్తమచిత్రానికి రాష్ట్రపతి సువర్ణపతకం, మరి రెండు చిత్రాలకు జాతీయస్థాయి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రాంతీయస్థాయిలో ఒక్కొక్క భాషలో ఒక్కొక్క చిత్రానికి రజతపతకం, ఒకటి లేక రెండు చిత్రాలకు యోగ్యతా పత్రాలు ఇవ్వబడుతూ ఉండేవి. అర్హమయిన చిత్రాలు లేవనుకున్నప్పుడు ఒక్కొక్క భాషలో రజతపతకం ఇవ్వడం మానివేసేవారు. 1966లో జాతీయస్థాయిలో ఒక్కచిత్రానికి సువర్ణపతకం ఇచ్చి, రెండు, మూడు స్థానాలకు చిత్రాలను ఎన్నిక చేయలేదు. 1967 నుంచి జాతీయ స్థాయిలో రెండు ఉత్తమ చిత్రాలను మాత్రమే ఎన్నిక చేస్తున్నారు. అయితే, 1965 నుంచి అదనంగా 'జాతీయసమైక్యతకు దోహదం చేసే' ఒక చిత్రానికి అవార్డు ఇవ్వడం ప్రారంభించారు. 1967 నుంచి జాతీయ స్థాయిలో ఉత్తమదర్శకునికి, ఉత్తమ నటునికి, ఉత్తమ నటికి, సంగీత దర్శకునికి, నేపథ్య గాయనికి, గాయకునికి, రచయితకు, తెలుపు-నలుపులో, కలర్ లో ఉత్తమ ఛాయాగ్రాహకులకు కూడా అవార్డులు ఇస్తున్నారు. షార్ట్ ఫిల్ములకు, డాక్యుమెంటరీలకు, ప్రయోగాత్మక చిత్రాలకు, యానిమేషన్ చిత్రాలకు, విద్యాచిత్రాలకు కూడా ఇప్పుడు అవార్డులు ఇస్తున్నారు. 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు' ఇవ్వడం ప్రారంభించింది. భారత చలన చిత్ర కళాభ్యుదయానికి విశేషంగా దోహదం చేసిన పెద్దతరం ప్రముఖులకు ఆ అవార్డును ఇస్తున్నది. 1974 సంవత్సరానికి గాను ఈ అవార్డును మన బి.ఎన్. రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు రాష్ట్రపతి సువర్ణపతకం పొందిన చిత్రనిర్మాతకు 20 వేల రూపాయలు నగదు బహుమతి ఇచ్చేది. ఇప్పుడు నిర్మాతకు 40 వేలు, దర్శకునికి 15 వేలు ఇస్తున్నది. ద్వితీయ ఉత్తమ చిత్ర నిర్మాతకు 15 వేలు, దర్శకునికి పదివేలు ఇస్తున్నది. జాతీయ సమైక్యతకు దోహదం చేసే ఉత్తమ చిత్ర నిర్మాతకు 30 వేలు, దర్శకునికి 10 వేలు, ఇస్తున్నది. ప్రాంతీయ స్థాయి ఉత్తమ చిత్ర నిర్మాతకు పది వేలు, దర్శకునికి 5 వేలు ఇస్తున్నది. జాతీయస్థాయిలో ఉత్తమ దర్శకునికి 20 వేలు, ఉత్తమ నటునికి, నటికి, సంగీత దర్శకునికి, స్క్రీన్ ప్లే రచయితకు 10 వేలు చొప్పున ఇస్తున్నది. క్రిందటి సంవత్సరం నుంచి స్వర్ణ, రజత పతకాలకు బదులు స్వర్ణ, రజత కమలాలు ఇవ్వడం ప్రారంభించింది.

1973 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రాలను, కళాకారులను ఎన్నికచేసే పద్ధతి మార్చింది. అదివరకు బొంబాయి, మద్రాసు, కలకత్తాలలోని ప్రాంతీయ సంఘాలు మొదట వడపోతపోసి, కొన్ని చిత్రాలను కేంద్ర సంఘానికి పంపుతూ ఉండేవి. కేంద్ర సంఘం ఆ చిత్రాలను మాత్రమే పరిశీలించి, వాటిలో నుంచి ఉత్తమమైన వాటిని ఎన్నిక చేసేది. ప్రాంతీయ సంఘాలలో సినిమా రంగానికి సంబంధించినవారు ఎక్కువగా ఉండేవారు. వారు తమ మొదటి వడపోతలోనే కొన్ని మంచి చిత్రాలను తొక్కిపట్టినట్లయితే, ఆ చిత్రాలు కేంద్ర సంఘం దృష్టిలోకి వచ్చే అవకాశం ఉండేదికాదు. ఆ విధంగా మన తెలుగులో కొన్ని మంచి చిత్రాలకు అన్యాయం జరగడం, కొన్ని చౌకబారు చిత్రాలకు రజతపతకాలు లభించడం జరిగింది. అటువంటి అన్యాయానికి ఆస్కారం లేకుండా చేయడం కోసం, చలన చిత్రాల కళాప్రమాణాలను నిర్దాక్షిణ్యంగా పరీక్షించడం కోసం 1973లో కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ సంఘాలను రద్దు చేసింది. 24 మంది న్యాయనిర్ణేతలతో ఒకే కేంద్ర సంఘాన్ని నియమించింది. వారిని ఐదు బృందాలుగా విభజించి, ఒక్కొక్క బృందం కొన్ని భాషల చిత్రాలను చూసే ఏర్పాటు చేసింది. ఒక్కొక్క బృందం ఎన్నికచేసిన చిత్రాలను మొత్తం సభ్యులందరూ పరిశీలించి, ఉత్తమమైన వాటిని నిర్ణయించారు. కళాత్మక చిత్రాలను మాత్రమే ఎన్నిక చేయాలనీ, అటువంటి చిత్రాలు కొన్ని భాషలలో లేకపోతే, ఆ భాషలలో రజతపతకాలు ఇవ్వనవసరం లేదనీ, బాక్సాఫీస్ ఫార్ములా చిత్రాలకు బహుమతులివ్వనక్కరలేదనీ నిర్ణయించడం జరిగింది. ఫలితంగా 1973లో తెలుగు, గుజరాతీ, మరాఠీ మరికొన్ని ఇతర భాషలలో ఒక్క చిత్రానికి కూడా బహుమతి రాలేదు. దేశం మొత్తం మీద వ్యాపార సరళిలో నిర్మించిన ఒక్క చిత్రానికి కూడా బహుమతి రాకపోవడం సినీ వాణిజ్య వర్గాలకు ఆగ్రహం కలిగించింది. కేంద్ర ప్రభుత్వపు ధోరణిని వారు తీవ్రంగా విమర్శించారు. జాతీయ అవార్డులను బహిష్కరిస్తామని బెదిరించారు. అయినా, కేంద్రం ఈ బెదిరింపులకు లొంగలేదు. అయితే, 1974లో ప్రజాసామాన్యానికి నచ్చే, ఉత్తమ వినోదాత్మక, చిత్రానికి ఒక ప్రత్యేక అవార్డును ఏర్పాటు చేసింది. ఈ అవార్డు నందుకొన్న మొదటి చిత్రం 'కోరా కాగజ్'. అయినా జాతీయ అవార్డుల పట్ల భారీ నిర్మాతలలో అసంతృప్తి సమసిపోలేదు.

నందీ అవార్డులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1964 నుంచి తెలుగు చిత్రాలకు నందీ అవార్డులు ఇస్తున్నది. ఈ అవార్డులు మొదటి నుంచి మేధావులవైపు కాక సామాన్య ప్రేక్షకులవైపు మొగ్గు చూపుతున్నాయి. ఒకటి, రెండు చిత్రాలు తప్ప స్వర్ణ నందిని గెలుచుకున్న చిత్రాలన్నీ ఆర్థికంగా విజయవంతమైన బాక్సాఫీస్ చిత్రాలే. 'సాక్షి' వంటి చక్కని కొత్తరకం చిత్రానికి, 'సంపూర్ణ రామాయణం' వంటి కావ్యస్థాయి పౌరాణిక చిత్రానికి కనీసం కంచు నందులు కూడా లభించకపోవడం కళాభిజ్ఞులు ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల విషయంలో తన నియమాలను తానే పాటించడం లేదు. ఇతర భాషల నుంచి అనువదించబడిన చిత్రాలకు, పోటీకి అర్హతలు లేవని ప్రకటించిన ప్రభుత్వం అనువాద చిత్రాలకు స్వర్ణ నందులు ఇచ్చింది. విశ్వనాథ్ దర్శకత్వంలో వెలువడిన 'కాలం మారింది' బిమల్ రాయ్ తీసిన 'సుజాత'కు అనుకరణ. 'శారద' చిత్రం 'యావజన్మదమైత్రి' కన్నడ చిత్రానికి అనువాదం. బాపు దర్శకత్వంలో వెలువడిన 'బాలరాజుకథ' తమిళ చిత్రం 'వా రాజా వా'కు అనువాదం. మధుసూదనరావు దర్శకత్వం వహించిన 'గుడిగంటలు' తమిళ చిత్రం 'ఆలయమణి'కి అనువాదం. ఈ రెండు అనువాద చిత్రాలకు కూడా నందీ అవార్డులు లభించాయి. రెండవ ఉత్తమ కథ బహుమతి పొందిన 'మనుషులు మట్టిబొమ్మలు' కూడా అనువాదకథ అని చెప్పబడుతున్నది.

నందీ అవార్డుల న్యాయనిర్ణేతల సంఘంలో ఐదుగురున్నారు. వారు తమతమ రంగాలలో మేధావులే అయినప్పటికీ, చలనచిత్రరంగానికి సంబంధించినంత వరకు వారికి అవసరమైనంత పరిజ్ఞానం ఉన్నట్లు తోచదు. తెలుగు చిత్రాలను, దేశంలోని ఇతర భాషా చిత్రాలను, దేశానికి దిగుమతి అయ్యే విదేశీ చిత్రాలను, ఫిలింసొసైటీల ద్వారా, ఆర్కైవ్స్ ద్వారా రాయబార కార్యాలయాల ద్వారా లభించే రకరకాల ప్రయోగాత్మక చిత్రాలను చూస్తూ, దేశదేశాల చలనచిత్ర రీతులను గమనిస్తూ ఉండేవారు. స్వదేశీ, విదేశీ సినిమా పత్రికలను, పుస్తకాలను చదువుతూ ఉండేవారు. సినిమాకు సంబంధించిన సాంకేతిక విషయాలు తెలిసినవారు న్యాయ నిర్ణేతలుగా ఉండడానికి అర్హులు. 'ఇంతోటి చౌకబారు తెలుగు చిత్రాల పరిశీలనకు అంత పరిజ్ఞానం కావాలా?' అంటే అది వేరే విషయం.

జాతీయ అవార్డులలో ప్రాంతీయ స్థాయి బహుమతులను సైతం పొందలేకపోతున్న తెలుగు నిర్మాతలకు, దర్శకులకు నందీ అవార్డులు ఏటేటా గొప్ప ఊరట కలిగిస్తున్న మాట నిజం. ఫిలింఫేర్ అవార్డులు (ప్రజాభిమానానికి చిహ్నాలు కనుక) కూడా తెలుగు వారికి గర్వకారణంగానే ఉన్నాయి.

కర్ణాటక అవార్డులు

పొరుగునవున్న కర్ణాటక ప్రభుత్వం ధోరణి చాలా భిన్నంగా ఉంది. వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చి, కళాత్మకంగా నిర్మించే చిత్రాలను కర్ణాటక ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా అటువంటి చిత్రాలకే ఆవార్టులు లభిస్తున్నాయి. 'సంస్కార', 'వంశవృక్ష', 'కాడు', 'చోమనదుడి' చిత్రాలు మేధావుల ప్రశంసలందుకోవడమేకాక, ఆర్థికంగాకూడా విజయవంతమైనాయి. ఈ సంవత్సరం 'ఫిలింఫేర్' అవార్డులలో ఉత్తమ కన్నడ చిత్రంగా 'చోమనదుడి' ఎన్నికయింది. ఆ చిత్రాన్ని తీసిన బి.వి.కారంత్ ఉత్తమ దర్శకుడుగా ఎన్నికైనారు. 'లావణ్య' పత్రిక ఇచ్చే అవార్డులలోకూడా ఉత్తమ చిత్రం, ఉత్తమకథ, ఉత్తమ ఛాయాగ్రహణం అవార్డులు 'చోమనదుడి'కి లభించాయి. 'ఫిలింఫేర్' అవార్డులు, 'లావణ్య' అవార్డులుకూడా కన్నడ ప్రేక్షకులు ఎన్నుకున్నవే. తెలుగులో ఫిలింఫేర్ అవార్డులు నాలుగూ 'జీవనజ్యోతి'కే లభించాయి. 'చోమనదుడి', 'జీవనజ్యోతి' చిత్రాలను రెండిటినీ చూసిన వారికి కన్నడ చిత్రాలకు, తెలుగు చిత్రాలకు స్థాయిలో ఎంత అంతరం ఉన్నదో, వారి ప్రేక్షకులకు, మన ప్రేక్షకులకు అభిరుచిలో ఎంత వ్యత్యాసం ఉన్నదో తేలిగ్గా తెలుస్తుంది.

కర్ణాటక ప్రభుత్వం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికంటే, కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువగా నగదు బహుమతులిస్తున్నది. ఉత్తమ కన్నడ చిత్రానికి 50 వేలు, దర్శకునికి 5 వేలు, ఒక స్వర్ణపతకం; మూడవ చిత్రానికి 20 వేలు, దర్శకునికి వెయ్యి రూపాయలు, రజతపతకం ఇస్తున్నది. ఉత్తమ నటునికి, నటికి నాలుగు వేలు చొప్పున, సహాయ నటునికి, సహాయ నటికి రెండు వేలు చొప్పున, ఉత్తమ కథకు, స్ర్కీన్ ప్లేకు 1500 చొప్పున ఇస్తున్నది. సంగీత దర్శకునికి 2500 ఇస్తున్నది. ఇవికాక వెయ్యేసి రూపాయల బహుమతులు కొన్ని ఉన్నాయి. కర్ణాటకలో చౌకగా, న్యూవేవ్ తరహాలో రెండు లక్షలతో ఎవరైనా చిత్రం నిర్మిస్తే, ఉత్తమ చిత్రంగా బహుమతి సంపాదించుకుంటే బాక్సాఫీస్ వసూళ్ళతో నిమిత్తం లేకుండానే పెట్టుబడి రాబట్టుకునే అవకాశం ఉంది. 50 వేలు అవార్డు ధనం లభిస్తుంది. కేంద్ర బహుమతి లభిస్తే మరికొంత డబ్బు వస్తుంది. కర్ణాటక ప్రభుత్వం వినోదం పన్ను రద్దు చేస్తోంది. ఈనాడు దేశంలో చలన చిత్రాల కళా ప్రమాణాలు పెంచాలంటే ఇటువంటి ప్రోత్సాహాలే అవసరం.

జాతీయస్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూకూడా కేంద్రప్రభుత్వం శాస్త్రీయమైన పద్ధతిలో అవార్డులు ఇస్తూ ఉండగా మనదేశంలో ఇతరులు అవార్డులు ఇవ్వడం అనవసరం. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాలలో చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి పరచుకోవడం కోసం సబ్సిడీలు ఇస్తూ, పరిశ్రమ వారి అభిమానాన్ని చూరగొనడం కోసం అవార్డులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, గుజరాత్ ప్రభుత్వాలు ఇస్తున్న అవార్డులలో ఇదే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వడంతో పాటు, నిరాడంబరమైన, కళాత్మక చిత్రాలను ప్రోత్సహించడానికి వాటికి ప్రత్యేకంగా నగదు బహుమతులు ఇవ్వడం, వినోదం పన్ను మినహాయించడం మంచిది కాని, అవార్డులు ఇవ్వడం అనవసరం. తెలుగులో మంచి చిత్రాలు లేకపోయినా, ఉన్న వాటిల్లోంచి ఏదో ఒక దాన్ని ఎన్నిక చేసి, బంగారు నంది ఇచ్చి, మనకు మనం సంతోషించవచ్చుగాని, 'మా బంగారు చిత్రం ఇది' అంటే ఇతర భాషల వారు ముక్కు మీద వేలు వేసుకుంటారు. మన చిత్రాలను మనం మెచ్చుకోవడం కాదు. ఇతరులు మెచ్చుకోవాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. రాష్ట్రం బయట పేరుతెచ్చుకొన్న, జాతీయ అవార్డులు పొందిన తెలుగు చిత్రాలకు ప్రోత్సాహసూచకంగా, ప్రశంసా పురస్కారంగా రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతులు ఇవ్వవచ్చు. శతదినోత్సవ, రజతోత్సవ చిత్రాలకే బంగారు నందులు, వెండి నందులు ఇవ్వడం, డబ్బుగల నిర్మాతలకే డబ్బుముట్టచెప్పడం అనవసరం.

వ్యాపార దృష్టితో భారీచిత్రాలు నిర్మించే వారు ఇక జాతీయ అవార్డులపై ఆశ వదులుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పోటీగా, 'ఆస్కార్' అవార్డుల పద్ధతిలో చలనచిత్ర పరిశ్రమ సొంత అవార్డులను ప్రారంభించాలని భారత చలన చిత్ర నిర్మాతల సంఘం (ఐ.ఎం.పి.పి.ఎ) యోచిస్తున్నది. ఈ విషయంలో తమకు సలహా ఇవ్వవలసిందని ఆ సంఘం ఆస్కార్ కమిటీ (అమెరికా)ని కోరిందట కూడా.

'ఆస్కార్' అవార్డులు

ఇక్కడ మనం 'ఆస్కార్' అవార్డుల సంగతి తెలుసుకోవడం అవసరం. 'అమెరికన్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్' 1937లో ఈ అవార్డులను ప్రారంభించింది. బహుశ ప్రపంచం మొత్తం మీద చలన చిత్రాలకు అవార్డులివ్వడం అదే మొదలు. (1931 వరకు వాటిని అకాడమీ అవార్డులనేవారు. 1931లో అకాడమీలో కొత్తగా లైబ్రరియన్ గా చేరిన ఒకావిడ అవార్డు చిహ్నమైన ప్రతిమను చూసి, 'అచ్చంగా మా అంకుల్ ఆస్కార్ లా ఉన్నాడు' అని ఆశ్చర్యపోయిందట. అది విన్న ఒక జర్నలిస్టు ఆ వ్యాఖ్యను పత్రికలోకి ఎక్కించాడు. అలా 'నిక్ నేమ్'గా ప్రారంభమై, దరిమిలా అదే అవార్డుకు పేరుగా మారింది).

ఆస్కార్ అవార్డులు ఇచ్చే అకాడమీలో అందరూ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారే ఉంటారు, నిర్మాతలు, దర్శకులు, నటులు, నటీమణులు, సంగీతదర్శకులు, ఛాయా గ్రాహకులు, శబ్దగ్రాహకులు, ఇతర సాంకేతిక నిపుణులు మొత్తం మూడు వేలమంది పైగా సభ్యులు ఉన్నారు. ఉత్తమ చిత్రాల, కళాకారుల ఎన్నికలో వారందరికీ ఓటింగ్ హక్కు ఉంది. ఉన్నత కళా ప్రమాణాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని వారిని ఎన్నిక చేస్తారు. ఫలానా చిత్రం ప్రజాదరణ పొందినదా లేదా అనేది వారికి అనవసరం. ఆర్థికంగా ఏ మాత్రం విజయం పొందలేని చిత్రాలు, అగ్రనటులు, దర్శకులు లేని అతి నిరాడంబరమైన చిత్రాలు కూడా ఆస్కార్ అవార్డులు పొందడం ఇందుకు నిదర్శనం. చిత్రాల ఎన్నిక రెండుదశలలో జరుగుతుంది. మొదట సభ్యులందరూ తమ వోటు పత్రాల మీద తమకు నచ్చిన చిత్రం పేరు వ్రాస్తారు. ఎక్కువ వోట్లు వచ్చిన ఐదు చిత్రాలు తుదిపోటీకి 'నామినేట్' చేయబడుతాయి. ఉత్తమ నటన, స్క్రీన్ ప్లే, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి శాఖలలో ఉత్తములను ఎన్నుకోవడానికి ఆయాశాఖలలోని ప్రవీణులు మాత్రమే వోటింగ్ లో పాల్గొంటారు. ఆయా శాఖలలో ఎక్కువ వోట్లు వచ్చిన ఐదేసి మంది పేర్లను తుదిపోటీకి నామినేట్ చేస్తారు. ఈ నామినేషన్లపై జరిగే తుది ఎన్నికలో మొత్తం సభ్యులందరూ పాల్గొంటారు. మెజారిటీని బట్టి ఫలితాలను నిర్ణయిస్తారు. వోటింగ్ రహస్య బ్యాలట్ పద్ధతిలో జరుగుతుంది. బహుమతి ప్రదానోత్సవంలో స్టేజీ మీద ఆ కవర్లను తెరచి ఫలితాలు ప్రకటిస్తారు. చివరి నిమిషం దాకా ఫలితాలు ఎవ్వరికీ తెలియవు.

అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వాలు కాదుకదా, అసలు ఫెడరల్ ప్రభుత్వమే అవార్డులు ఇవ్వడంలేదు. అందుకే చలన చిత్ర పరిశ్రమవారు స్వయంగా అవార్డులను నిర్వహిస్తున్నారు. వారికి వేరే అవార్డులు అవసరం లేదు. కాని మనదేశంలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా అవార్డులిస్తున్నది, ఇక పరిశ్రమవారు స్వయంగా అవార్డులు ప్రారంభించడం దేనికి? వ్యాపార సరళి చిత్రాలకు అవార్డు లివ్వడమే వారి ధ్యేయమైతే, 'షోలే', 'బాబీ' స్థాయి చిత్రాలకే వారి 'జాతీయ' అవార్డులు లభిస్తాయి. అంతటి భారీ చిత్రాలతో తెలుగు, తమిళ వ్యాపార చిత్రాలు ఎలాగూ పోటీపడలేవు. ఇతర ప్రాంతీయ చలన చిత్రాల నోట్లో మట్టే. హిందీ చిత్రాల డామినేషన్ ని మనవాళ్ళు సహించలేరు. ఇంతకీ-ఆడలేక మద్దెల ఓడన్నట్లు-మనం మంచి చిత్రాలు తీయలేక కేంద్ర అవార్డులను విమర్శించడం, బహిష్కరించడం, పోటీగా అవార్డులు ప్రారంభించడం అవివేకం.

కేంద్ర అవార్డుల ఎన్నికలో లోపాలుంటే విమర్శించవచ్చు. మార్పులను సూచించవచ్చు. క్షణ్ణంగా చర్చించి మరింత శాస్త్రీయమైన పద్ధతిని రూపొందించుకోవచ్చు. మన వ్యాపార చిత్రాల నిర్మాతలు ఎంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా మొత్తం మీద మన జాతీయ అవార్డుల ప్రమాణం ఉన్నతంగా ఉన్నదనడానికి ఒక్కటే నిదర్శనం - అవార్డులు పొందిన ఎన్నో చిత్రాలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో గర్వించదగ్గ అవార్డులను సాధించాయి.

నండూరి పార్థసారథి
(1976 జూన్ 20వ తేదీన ప్రజాతంత్రలో ప్రచురితమయింది)

Previous Post Next Post