Title Picture

ఆరోగ్యకరమైన ఫిలిం పబ్లిసిటికి ఫిలిం జర్మలిస్టుల విధి, బాధ్యతలు

సినిమా ప్రచారం కోసం వార్తాపత్రికలలో ప్రకటనలు వేయడం అన్నది సినిమా పుట్టినప్పటి నుంచి వున్నది. మనదేశంలో చలన చిత్రాల నిర్మాణం ప్రారంభం కాకముందే ఫ్రాన్స్ నుంచి వచ్చిన ల్యూమెరీ సోదరుల తొలి చిత్రాలు ప్రప్రథమంగా 1896 జూలై 7వ తేదీ రాత్రి బొంబాయిలోని వాట్సన్ హోటెల్ లో ప్రదర్శించినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో అదేరోజు సంచికలో ఒక సంగ్రహ ప్రకటనగా అడ్వర్టయిజ్ మెంట్ వెలువడింది. దేశంలో ఫిలిం పబ్లిసిటీ ఆవిధంగా ప్రారంభమయింది. ఆ తర్వాత వాల్ పోస్టర్లు, జట్కాబండీ ప్రచారం వాడుకలోకి వచ్చాయి. తర్వాత పెద్ద పెద్ద హోర్డింగులు వచ్చాయి. రేడియో ద్వారా, స్లయిడ్ల ద్వారా, ట్రయిలర్ల ద్వారా ప్రచారం మామూలయింది. మాటాపలుకూ లేకుండా కేవలం ఒకటి రెండు నిమిషాలసేపు తెరపై కదిలే బొమ్మగా కనిపించిన స్థాయి నుంచి 70 ఎం.ఎం., సినేరమా, సర్కోరమా స్థాయికి సినిమా ఎంత బ్రహ్మాండంగా ఎదిగిందో, సినిమా పబ్లిసిటీ కూడా ఒకనాటి సంగ్రహ ప్రకటన స్థాయి నుంచి అనేక రూపాలుగా మహావటవృక్షంలా విస్తరించుకున్నది. ఈనాడు చలన చిత్ర పరిశ్రమలో పబ్లిసిటీ ఒక ప్రత్యేకమైన శాఖగా తయారయింది. చిత్రనిర్మాణ వ్యయంతో పాటు పబ్లిసిటీ ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. పబ్లిసిటీ లేకపోతే ఎంత మంచి చిత్రమైనా ఆర్థిక విజయం సాధించలేదని అనుభవ పూర్వకంగా గ్రహించడం వల్లనే నిర్మాతలు పబ్లిసిటీ కోసం లక్షలు వెచ్చిస్తున్నారు. సినిమా ప్రచారానికి అన్నిటికంటే చౌకపద్ధతి, అన్నిటికంటే శక్తి వంతమైన పద్ధతి పత్రికలకు అడ్వర్టయిజ్ మెంట్లు ఇవ్వడం, అడ్వర్టయిజ్ మెంట్ల ద్వారా పత్రికలకు బోలెడు ఆదాయం వస్తుంది. నిజానికి పత్రికలకు ప్రధాన ఆదాయ మార్గం అడ్వర్డయిజుమెంట్లే. ఎక్కువగా సర్క్యులేషన్ వున్న పత్రికలకు అడ్వర్జయిజుమెంట్లు ఎక్కువ వస్తాయి. అడ్వర్డయిజుమెంట్ల వల్ల పత్రికల ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆర్థిక స్తోమత పెరిగితే పత్రికలు తక్కువ వెలకు ఎక్కువ పేజీలు ఇవ్వగలుగుతాయి. తక్కువ వెలకు ఎక్కువ పేజీలు ఇవ్వగలిగే పత్రికల సర్క్యులేషన్ ఎక్కువగా వుంటుంది. ఈ విధంగా పత్రికల సర్క్యులేషన్ కు అడ్వర్టయిజు మెంట్లకు అవినాభావసంబంధం ఏర్పడింది. ఇప్పుడు పెద్ద పత్రికలలో సగానికి సగం పేజీలు అడ్వర్టయిజుమెంట్లు ఆక్రమిస్తున్నాయి. అడ్వర్టయిజు మెంట్లలో ముఖ్యమైనవి సినిమాలకు సంబంధించినవి. విడుదలయే రోజున పెద్దసైజు అడ్వర్టయిజుమెంట్లు ఇస్తున్నారు. ఇందులో ఆక్షేపింపవలసినదేమీలేదు. కాని, ఈ అడ్వర్టయిజుమెంట్లు పరోక్షంగా పత్రికా స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నాయి. ఈ ధోరణి జర్నలిజంకు వేరుపురుగుగా తయారయింది.

అడ్వర్టయిజుమెంట్ల కోసం అంతో యింతో ప్రలోభపడని పత్రికలు లేవనే చెప్పాలి. చిత్రాలను విమర్శిస్తే అడ్వర్టయిజుమెంట్లు రావేమోనని భయపడుతున్నారు. ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని దుయ్యబట్టే పత్రికలు కూడా ఒక చెత్త సినిమాని 'చెత్త' అని రాయడానికి భయపడుతున్నాయి. అంటే పత్రికల మీద ప్రభుత్వాల ఒత్తిడికంటే అడ్వర్టయిజుమెంట్లు ఇచ్చే సినీ వ్యాపారాల పరోక్షపు ఒత్తిడి ఎక్కువగా వుందన్న మాట. సినిమా వ్యాపారులు తమ ప్రచారావసరాల కోసం పత్రికాభిప్రాయాన్ని టోకుగా, కారు చౌకగా కొనుక్కుంటున్నారన్నమాట. నిజానికి నిరక్షరాస్యులలో ఎక్కువమంది పల్లెల్లోనే వుంటున్నారు. పట్టణాలలో, నగరాలలో నిరక్షరాస్యులు తక్కువ. సినిమా థియేటర్లన్నీ నగరాల్లో, పట్టణాలలో కేంద్రీకృతమైనాయి. అంటే సినిమాలు చూస్తున్న వారిలో అత్యధిక సంఖ్యాకులు అక్షరాస్యులే అయివుండాలి. నిరక్షరాస్యులందరూ కాకపోయినా, వారిలో చాలా మంది పత్రికలు చూస్తూవుంటారు. వార్తలు చదవకపోయినా సినిమా బొమ్మలు, అడ్వర్టయిజుమెంట్లు చూస్తారు. అభిమానతారల బొమ్మలు కత్తిరించి పెట్టుకుంటారు. సినిమా నిర్మాతలు పత్రికలకు అడ్వర్టయిజ్ మెంట్లు ఇవ్వడం మానివేస్తే ఇతరత్రా ప్రచారం కోసం ఇప్పటికంటే చాలా ఎక్కువ ధనం ఖర్చు పెట్టవలసి వుంటుంది. ఈ విషయం పత్రికలవారు గుర్తించి తమ భావప్రకటన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం అవసరం.

ఈనాడు సినిమా పట్ల ప్రజలకు విపరీతమైన మోజు వున్నందువల్లనే దిన, వార, మాస పత్రికలన్నీ సినిమా శీర్షికలను నిర్వహిస్తున్నాయి. అయితే అన్నింటికంటే ఎక్కువగా బెదిరింపుకు, ఒత్తిడులకు, ప్రలోభానికి లోనై స్వాతంత్ర్యం కోల్పోతున్న పత్రికలు సినిమా పత్రికలే. పత్రిక యజమానులు అడ్వర్టయిజుమెంట్ల కోసం ప్రలోభపడుతుంటే జర్నలిస్టులు అల్పమైన బహుమతుల కోసం ప్రలోభపడుతున్నారు. బహుమతుల కోసం ప్రలోభపడని వారు కూడా తమ ఉద్యోగాలు వూడిపోతాయనే భయంతో ధైర్యంగా విమర్శలు రాయలేకపోతున్నారు.

ఈనాడు చాలా సినిమా పత్రికలు నిర్మాతలు స్వయంగా ప్రచారం కోసం నిర్వహిస్తున్నట్లు లేదా పోషిస్తున్నట్లున్న పత్రికలలాగా వుంటున్నాయి. కొన్ని పత్రికలు అభిమాన సంఘాలు నడుపుతున్న వాటిల్లాగా వుంటున్నాయి.

ఇప్పుడు ఏది ఫిలిం జర్మలిజమో, ఏది ఫిలిం పబ్లిసిటీయో చెప్పటానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. సినిమా తారల పట్ల మోజుగల వారందరూ ఫిలిం జర్నలిజంలోకి చొరబడుతున్నారు. ప్రపంచంలో ఎందుకూ పనికిరానివాడు ఫిలిం జర్మలిస్టుగా పనికివస్తాడు అనే అపవాదు కలుగుతున్నది. ఒక దినపత్రికలో అప్రెంటిస్ గా చేరాలన్నా ఇప్పుడు ఎం.ఏ. డిగ్రీ కావాలంటున్నారు. ఆరునెలలో ఏడాదో శిక్షణ పొందితే గాని సబ్ ఎడిటర్ గా ఉద్యోగం ధ్రువపరచరు. ఫిలిం జర్మలిస్టుకి ఈ అర్హతలేవీ అక్కర్లేదు. మూడో ఫారం తప్పినా ఫిలిం పత్రికకి నిర్వాహకుడు కావచ్చు. 'జయప్రద అందంగా వుంటుందని నేనూ, జయసుధ అందంగా వుంటుందని నా మిత్రుడూ వాదించుకుంటున్నాం. మీరు ఎవరితో ఏకీభవిస్తారు ఎడిటర్జీ' అని సినిమా పత్రికకు ప్రశ్న పంపడంతో కెరీర్ ప్రారంభమవుతుంది. తర్వాత ఎవరికో ఒకరికి అభిమాన సంఘం ప్రారంభిస్తాడు. ఇంకో ఏడాదిలో చిన్న సినిమా పత్రిక ప్రారంభిస్తాడు. తారలను ఆశ్రయించి ఏదో సినిమాకి పి.ఆర్.ఓ. అవుతాడు. కొన్నాళ్ళకి నిర్మాత అయినా అవుతాడు. ఈవిధంగా సినిమా రంగంలో ప్రవేశించడానికి చౌకబారు ఫిలిం జర్మలిజం ఒక మెట్టుగా ఉపయోగపడుతున్నది. ఈ పరిస్థితిలో ఫిలిం జర్మలిజంకు, ఫిలిం పబ్లిసిటీకి తేడా ఏముంటుంది?

చిత్తశుద్ధి, డొక్కశుద్ధిగల ఫిలిం జర్మలిస్టులు బొత్తిగా లేకపోలేదు. ఈ మైనారిటీ వర్గం వారు తమ భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి, ఫిలిం జర్నలిజానికి స్వాస్థ్యం చేకూర్చడానికి ఒక ఉద్యమ స్థాయిలో పోరాటం సాగించడం అవసరం, చౌకబారు ధోరణులను ప్రతిఘటించి, ఒక గౌరవనీయమైన వృత్తిగా ఫిలిం జర్మలిజానికి గుర్తింపు సంపాదించాలి. ఫిలిం జర్మలిస్టు అంటే ఆత్మగౌరవాన్ని తెగనమ్ముకునే వాడుకాదని అందరూ గుర్తించేటట్లు చేయాలి. అప్పుడే ప్రేక్షకులకు ఆరోగ్యకరమయిన ఫిలిం విజ్ఞానాన్ని అందజేయగల ఫిలిం పబ్లిసిటీ సమకూరుతుంది.

నండూరి పార్థసారథి
(ఏప్రిల్ 7, 1978లో 'సినీ హెరాల్డ్' వారపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post