దాదాపు అర్ధ శతాబ్దం పాటు హిందూస్థానీ సంగీత ప్రియులను-ముఖ్యంగా గజల్ వ్యసనపరులను నిషాలో ముంచి ఎత్తిన బేగం అఖ్తర్ అక్టోబరు 30వ తేదీ రాత్రి శాశ్వతంగా కన్నుమూసి, తన లక్షలాది ఆరాధకులను దుఃఖసాగరంలో ముంచివేసింది. ఠుమ్రీ, దాద్రా, గజల్ సంగీత రంగంలో ఇప్పట్లో ఎవరూ భర్తీ చేయలేని ఒక మహా శూన్య ప్రదేశాన్ని సృష్టించి, తానొక మరపురాని మధుర స్మృతిగా మారిపోయింది.

గజల్ లు (ఉర్దూ శృంగార గీతాలు) గానం చేయడంలో ఈ శతాబ్దం మొత్తం మీద పురుషులలో స్వర్గీయ కె.ఎల్. సైగల్, స్త్రీలలో బేగం అఖ్తర్ సాటిలేని వారు. ఇప్పుడు వారిద్దరూ లేరు. మగవారిలో సైగల్ తర్వాతి తరంలో తలత్ మహమూద్ దాదాపు అంతటి పేరు తెచ్చుకున్నారు. కాని, స్త్రీలలో బేగం అఖ్తర్ దరిదాపుల్లోకి రాగలిగిన వారెవరూ ఇప్పటివరకు లేరు. గజల్ సంగీతానికి సంబంధించినంత వరకు ఆవిడ మకుటంలేని మహారాణిగా ప్రకాశించింది.

బేగం అఖ్తర్ స్వస్థలం లక్నో. ఆవిడ ఎనిమిదవ యేటనే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాభ్యాసం ప్రారంభించింది. పటియాలాకు చెందిన ఉస్తాద్ అటా మహమ్మద్ ఖాన్ వద్ద, తర్వాత ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ వద్ద ధ్రుపద్, ధమార్, ఖయాల్ సంగీత రీతులను నేర్చుకున్నది. ఆ రోజుల్లో గయ గొప్ప సంగీత కేంద్రంగా ఉండేది. ఆమె తల్లితో కలిసి గయకు వలసపోయి అక్కడ ప్రముఖ విద్వాంసుడు ఉస్తాద్ గులాం మహమ్మద్ ఖాన్ వద్ద శిష్యరికం చేసింది. గయ నుంచి కలకత్తాకు వెళ్ళి, అక్కడ జద్దన్ బాయ్ (సినీతార నర్గీస్ తల్లి) వద్ద, ఉస్తాద్ మొయిజుద్దీన్ ఖాన్ వద్ద ఠుమ్రీ సంగీతం నేర్చుకున్నది.

ధ్రుపద్, ధమార్, ఖయాల్, తరానా వంటి శుద్ద శాస్త్రీయ సంగీత రీతులకంటే ఠుమ్రీ, దాద్రావంటి లలిత శాస్త్రీయ రీతులు గజల్, గీత్ వంటి లలిత సంగీత రచనలు తన ప్రతిభా ప్రకాశానికి తగినవని ఆమె గుర్తించింది. శుద్ధశాస్త్రీయ రచనలలోకంటే ఠుమ్రీ, దాద్రాలలోనూ, అంతకంటే గజల్, గీత్ లలోనూ సాహిత్య ప్రాధాన్యం ఎక్కువ. బేగం అఖ్తర్ తన గానంతో గజల్ లోని ప్రతి పదానికి ప్రాణం పోస్తుంది. పుస్తకంలో చదువుతున్నప్పుడు మామూలుగానే ఉన్నాయనిపించే భావాలు ఆమె పాడుతుంటే వెయ్యి రెట్లు చైతన్యాన్ని పుంజుకుంటాయి. వీటి అందాలు జిగేలుమని మిరుమిట్లు గొలుపుతాయి. ఆమె పాడుతుంటే గజల్ కు భాష్యం చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.

ఠుమ్రీలు, దాద్రాలు, గజల్ లు శృంగార రస ప్రధాన రచనలు. వాటిలో సంయోగ శృంగారం, వియోగ శృంగారం కూడా వుంటాయి. గజల్ లలో వియోగ శృంగారం ఎక్కువ. గాలిబ్ గజల్ లు అతి ప్రసిద్ధమైనవి. వీటిలో నాయిక కడగంటి చూపుల తూపులతో ప్రియుని హృదయాన్ని తూట్లు పొడిచే కఠినాత్మురాలు. నాయకుడు ఆమె అనుగ్రహం కోసం తపించిపోయే దీనుడు. ఈ కవితలన్నీ మధుపాత్రలతో, అధరామృతంతో, నిట్టూర్పులతో, చూపులతూపులతో, విరహానలంతో నిండి ఉంటాయి. చరణాలు ద్విపదల రూపంలో ఉంటాయి. చరణాలన్నింటికీ ట్యూను ఒకే విధంగా ఉంటుంది. ఈ శతాబ్దంలో గాలిబ్ గజల్ ను విపరీతంగా ప్రచారం చేసిన గాయని బేగం అఖ్తర్. గజల్ గానానికి ఆమె ఒక ఒరవడి పెట్టింది. ఆమె కచేరీ చేస్తుంటే మొత్తం సభ అంతా గజల్ కవితా మధుపానంతో మత్తెక్కి తూగుతున్నట్లుగా ఉంటుంది. కచేరి పావుగంట గడిచేసరికి శ్రోతలకు ఒంటిమీద స్పృహ ఉండదు. సంగీతాన్ని ఆనందించాలో, సాహిత్యాన్ని ఆనందించాలో తెలియక, అంత ఆనందాన్ని ఇముడ్చుకునే శక్తిలేక శ్రోతలు ఉక్కిరిబిక్కిరి అవుతారు. ప్రతీ చరణానికి 'వాహ్ వాహ్' అంటూ శ్రోతలు మెలికలు తిరిగిపోతారు. ఒక్కొక్క శ్రోత ఒక్కొక్క గాలిబై విరహంతో వేగిపోతాడు. బేగం అఖ్తర్ తన గజల్ గానంతో రెండు తరాల శ్రోతల హృదయాలను నిరంకుశంగా పరిపాలించింది. లక్షలాది శ్రోతల హృదయాల్లో చిచ్చుపెట్టింది. ఆమె కచేరి వింటే ప్రేమ గొడవ తెలియని అమాయక హృదయంలో కూడా విరహాంకురం పడుతుంది. 64వ ఏట అస్తమించే వరకు ఆవిడ గానం పట్ల గజల్ ప్రియులకు మోహం తగ్గలేదు.

అక్టోబరు 26వ తేదీ రాత్రి అహమ్మదా బాద్ లో కచేరీ చేసిన కొద్ది సేపటికి ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత కొంత కోలుకుంది. కాని 30వ తేదీ సాయంత్రం ఆమె పరిస్థితి మళ్ళీ విషమించింది. ఆ రాత్రి 9 గంటలకు ఆమె లక్షలాది సంగీత ప్రియులవద్ద శాశ్వతంగా వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె కచేరీల స్మృతులు, గ్రామఫోన్ రికార్డులు మాత్రం మిగిలాయి ఆమె అభిమానులకు. ఆమె రికార్డులు అరడజను ఎల్.పి.లు, డజను ఇ.పి.లు, రెండు సూపర్ సెవెన్ రికార్డులు ఉన్నాయి. వాటిలో ECSD 2374 నంబరు ఎల్.పి.లో ఆమె ఠుమ్రీలు, దాద్రాలు గానం చేసింది. గాలిబ్ శత వర్థంతి సందర్భంగా 1969లో విడుదలైన ఒక ఎల్.పి. (ECSD 2399)లో ఆమె అన్నీ గాలిబ్ గజళ్ళను పాడింది. మిగిలిన రికార్డులలో గాలిబ్ వేకాక, షకీల్ బదయూనీ, కైఫీ ఆజ్మీ వంటి ఆధునిక ఉర్దూ కవుల గజల్ లను కూడా గానం చేసింది. ECSD 2444 రికార్డులో ఆమె పాటల్లో అతి ప్రసిద్ధమైనవి పన్నెండు ఉన్నాయి. ఇదివరకు 78 ఆర్.పి.యం రికార్డులలో విపరీతంగా పాపులర్ అయిన 'దీవానా బనానా హైతో', 'న సోచా న సంఝా', 'ఐ మొహబ్బత్ తేరే అంజామ్ నే', 'కోయలియా మత్ కర్ పుకార్' వంటి పాటలు ఆ రికార్డులో వున్నాయి. ఆ పాటలు కచేరీలలో కూడా తరచుగా శ్రోతల కోరికపై పాడుతూ ఉండేది ఆవిడ. కొన్ని ఇ.పి. లలో ముస్లిం భక్తిగీతాలు పాడింది.

బేగం అఖ్తర్ గొప్ప భక్తురాలు. ఆవిడ రోజుకు రెండు సార్లు ఖురాన్ పారాయణం చేసేదట. ముస్లిం వనిత అయినా శ్రీకృష్ణునిపట్ల ఆమెకు భక్తి ఎక్కువ. హిందూస్థానీ సంగీతానికి చేసిన విశేష సేవకు పరిగణనగా ఆమెకు సంగీత నాటక అకాడమీ అవార్డు, 'పద్మశ్రీ' అవార్డు లభించాయి. సుమారు 35 ఏండ్ల క్రితం సత్యజిత్ రే తీసిన 'జల్సాఘర్' చిత్రంలో ఆమె ఒక చిన్న కచేరీ చేసింది. ఆమె శిష్యురాండ్రలో ముఖ్యులు శాంతి హీరానంద్, అంజలీ బెనర్జీ, దీపకీ బోస్, వసుంధరా పండిత్.

నండూరి పార్థసారథి
(1974 డిసెంబర్ 27వ తేదీన ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైనది)

Previous Post