వెనక ఫొటోలు: ఇనాయత్ ఖాన్, ఇమ్ దాద్ ఖాన్, వహీద్ ఖాన్

సితార్ నవాజ్ ఉస్తాద్ విలాయత్ ఖాన్ 1928లో కృష్ణాష్టమి రోజున ఇప్పటి బాంగ్లాదేశ్ లోని గౌరీపూర్ లో గొప్ప సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వైపు, తల్లి వైపు అందరూ సంగీత విద్వాంసులే. తండ్రి వైపు ఇప్పటికి ఆరు తరాలుగా ఆయన తాత ముత్తాతలందరూ వారి కాలంలో సాటిలేని సితార్ విద్వాంసులు. ఆరు తరాల క్రితం వారిది రాజపుత్ర కుటుంబం. ఆ తరంలో విలాయత్ ఖాన్ పూర్వీకుడు సరోజన్ సింగ్ నవగాం అనే ఒక చిన్న రాజపుత్ర సంస్థానానికి అధిపతి. ఆయన రాణా ప్రతాప్ సింగ్ సమకాలికుడు. ఆయన కుమారుడు తురబ్ ఖాన్ ఇస్లాం మతం పుచ్చుకున్నాడు. ఆయన కుమారుడు సాహెబ్ దాద్ ఖాన్. ఆయన సుర్ బహార్ వాద్యాన్ని సృష్టించినవాడు. ఆయన కుమారుడు ఇమ్ దాద్ ఖాన్. సితార్ వాదనంలో విప్లవం తీసుకువచ్చి 'ఇమ్ దాద్ ఖానీబాజ్' అనే ఒక స్టైల్ ను ప్రవేశపెట్టాడు. ఆయన కుమారుడు ఇనాయత్ ఖాన్ దేశంలో సితార్ ను విపరీతంగా ప్రచారంలోకి తీసుకువచ్చి, సితార్ చక్రవర్తిగా ప్రకాశించారు. ఆయన తమ్ముడు వహీద్ ఖాన్ కూడా గొప్ప సితార్ విద్వాంసుడు. వారిద్దరూ సితార్ తోపాటు సుర్ బహర్ కూడా అద్భుతంగా వాయించేవారు. ఇద్దరూ కలిసి కచేరీలు చేస్తూ ఉండేవారు. ఇనాయత్ ఖాన్ కుమారుడు ఈనాడు సితార్ చక్రవర్తిగా వెలుగొందుతున్న విలాయత్ ఖాన్. ఈయన తమ్ముడు ఇమ్రాత్ ఖాన్ సితార్, సుర్ బహార్ వాద్యాలు రెండింటిలోనూ ప్రవీణుడు. కిందటి తరంలో ఇనాయత్ ఖాన్, వహీద్ ఖాన్ లు కలిసి కచేరీలు చేసినట్టే ఈ తరంలో విలాయత్ ఖాన్, ఇమ్రాత్ ఖాన్ లు సితార్-సుర్ బహార్ జుగల్ బందీ కచేరీలు చేస్తున్నారు. విలాయత్ ఖాన్ కుమారుడు షుజాత్ ఖాన్ పది హేనేళ్ళవాడు. అతను నాలుగైదేళ్ళ క్రిందటే కచేరీలు చేయడం ప్రారంభించాడు. తండ్రి అంతటివాడు కాగల లక్షణాలు అతనిలో కనిపిస్తున్నాయట. విలాయత్ ఖాన్ కు ఆ పిల్లాడి తర్వాత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరికీ రాగాలపేర్లు పెట్టారు. పెద్ద అమ్మాయి పేరు యమన్. రెండో అమ్మాయి పేరు జిలా. వారిద్దరూ కూడా సితార్ వాయిస్తారు.

విలాయత్ ఖాన్ తల్లి ఎన్నడూ కచేరీలు చేయకపోయినా గొప్పగా పాడుతుందట. ఆమె తండ్రి బందేహసన్ ఖాన్, సోదరుడు జిందాహసన్ ఖాన్ గొప్ప సంగీత విద్వాంసులు. జిందాహసన్ ఖాన్ ఇప్పటి పెద్ద తరం ప్రముఖ విద్వాంసులలో ఒకరు. ఇప్పటి యువతరం సితార్ విద్వాంసులలో ప్రముఖుడైన ఉస్తాద్ రయిస్ ఖాన్ విలాయత్ కు సొంత మేనల్లుడు.

విలాయత్ ఖాన్ కు చదువు అంటలేదు. గొప్ప సంగీత కుటుంబంలో పుట్టినా చదువు లేకపోతే సంఘంలో బ్రతకడం కష్టమనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు విలాయత్ ను ఐదోయేటనే బళ్ళోవేశారు. కాని, రోజూ స్కూలుకు బలవంతంగా, కొట్టి పంపించవలసి వచ్చేది. అలా రెండు మూడు సంతవత్సరాలు గడిచాక విలాయత్ కు స్కూలు చదువు దుర్భరమైపోయింది. కొట్టి చంపినా సరే ఇంకా స్కూలు గడప తొక్కనని భీష్మించుకు కూర్చున్నాడు. అందరు నాన్నగార్ల లాగే ఇనాయత్ ఖాన్ గారు కూడా 'చదువుకోకపోతే గొడ్లను కాస్తావుట్రా' అని అడిగారు కొడుకుని. 'సితార్ వాయిస్తాను' అని సమాధానమిచ్చాడు విలాయత్. 'సరే నీ ఖర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది' అని కొడుకును చదువుమానిపించాడు ఇనాయత్ ఖాన్. అప్పటి నుంచి ఏకదీక్షగా సాధన చేయడం ప్రారంభించాడు విలాయత్. అసలు బళ్ళో వేయకముందే నాలుగో యేటనే ఆయన తండ్రి వద్ద సితార్ పాఠాలు ప్రారంభించాడు. స్కూలు మానేసిన తర్వాత తండ్రి వద్ద నేర్చుకోవడం, కూర్చుని సాధన చేయడం-ఇదే విలాయత్ కు దిన చర్య అయింది, శిక్షణ విషయంలో ఇనాయత్ ఖాన్ గారు చాలా కఠినంగా ఉండేవారు. తను చెప్పినట్లుగా వాయించలేకపోతే నిర్దాక్షిణ్యంగా కొడుకును బాదేవారు. పెద్దయిన తర్వాత కొడుకు తనంత గొప్పవాడు కాకపోతే తనకు చెడ్డపేరు వస్తుందనీ, నలుగురూ నవ్వుతారనీ ఆయన బాధపడేవారు. ఒక సారి కోపంతో కొడుకుని కొట్టి, 'నీ చెయ్యి విరిచేస్తే మంచిది. అప్పుడు చెయ్యిలేదు కాబట్టి వాయించలేకపోతున్నాడు, లేకపోతే తండ్రి అంత గొప్పగా వాయించేవాడు అని అనుకుంటారు జనం. ఆ విధంగానైనా నాకు అపకీర్తి రాకుండా ఉంటుంది అని' అన్నారట. అటువంటి మాటలతో పౌరుషం వచ్చి విలాయత్ ఇంకా ఎక్కువగా సాధన చేసేవాడు.

ఇనాయత్ ఖాన్, ఒడిలో ఇమ్రాత్ ఖాన్, సితార్ తో విలాయత్ ఖాన్

విలాయత్ ఎనిమిదో యేటనే తండ్రితో కలిసి కచేరీలు చేయడం ప్రారంభించాడు. ఎనిమిదవ ఏటనే హీరాబాయ్ బరోడేకర్, కేసర్ బాయ్ కేర్కర్, హఫీజ్ అలీఖాన్, ముష్తాఖ్ హుస్సేన్ ఖాన్, అహమ్మద్ జాన్ తిరఖ్వా వంటి మహా విద్వాంసులకు ఉద్దేశించిన సంగీత మహాసభలో ఆయన సితార్ సోలో కచేరీ చేశాడు. తొమ్మిదో యేట ఆయన మొదటి 78 ఆర్.పి.ఎం.రికార్డు విడుదలయింది. ఆ రికార్డులో తండ్రీ కొడుకు లిద్దరూ కలిసి వాయించారు. (ఆ రికార్డు ఇప్పుడు దుర్లభం). ఆ తర్వాత ఏడాదికే 1938లో ఇనాయత్ ఖాన్ మరణించారు. అప్పటికి విలాయత్ కు పదేళ్ళు. తమ్ముడు ఇమ్రాత్ ఖాన్ కు రెండేళ్ళు. తండ్రి మరణంతో గురువు లేకపోవడం వల్ల విలాయత్ సితార్ సాధనకు తాత్కాలికంగా అవరోధం ఏర్పడింది. అయితే, అదృష్టవశాత్తు అప్పటికే ఆయన సంగీతానికి గట్టి పునాది పడింది.

ఇనాయత్ ఖాన్ పోయిన తర్వాత ఆయన తమ్ముడు వహీద్ ఖాన్ విలాయత్ కు సితార్ నేర్పడం ప్రారంభించారు. మాతామహుడు బందేహసన్ ఖాన్, మేనమామ జిందాహసన్ ఖాన్ గాత్ర సంగీతం నేర్పేవారు. మధ్య మధ్య తల్లి కూడా విలాయత్ సంగీత సాధనను పర్యవేక్షిస్తూ ఉండేది. తానాలను తానుపాడి ఆ విధంగా వాయించమని చెప్పేది ఆవిడ. విలాయత్ సితార్ ను ఆ విధంగా పలికించలేకపోతే ఆవిడ పలికించి చూపేది. తండ్రి పోయిన తర్వాత పట్టుదల ఇంకా పెరిగి విలాయత్ రోజుకు 12 గంటలు, 14 గంటలు సాధన చేశారు. అలా ఒక ఏడాది గడిచింది. పదకొండో యేట ఆయన మేనమామతో కలిసి ఢిల్లీ వెళ్ళి, సరాసరి ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ ను కలుసుకున్నారు. ఇనాయత్ ఖాన్ కుమారుడనీ, సితార్ బాగా వాయిస్తాడనీ తెలుసుకుని ఆయన విలాయత్ ను ఎంతో ఆదరించారు. రేడియో స్టేషన్ ఆవరణలోనే ఒక చిన్న గది యిచ్చి, నెలకు 50 రూపాయల జీతంతో ఉద్యోగం కూడా యిచ్చారు. అంత చిన్న వయస్సులోనే ఆయన తన సంపాదనపై తాను ఆధారపడుతూ ఒంటరిగా జీవించాడు. తర్వాత రేడియో స్టేషన్ లో పని చేసే మరొక అధికారి ఆయనను చేరదీసి, తన ఇంట్లో ఉంచుకున్నారు. గురువులేకుండా, స్వయంగా రాత్రింబవళ్ళు ఏకదీక్షతో సాధన చేసి విలాయత్ ఖాన్ పదిహేనేళ్ళకే సితార్ వాదనంలో అద్భుతమైన ప్రావీణ్యం సాధించారు.

ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ రికమెండేషన్ తో 1944లో తన పదహారో యేట విలాయత్ ఖాన్ బొంబాయిలో జరిగిన ఒక గొప్ప సంగీత మహాసభలో కచేరీ చేసి సంగీత ప్రియులను ఆనందాశ్చర్యాలలో ముంచివేశారు. మహావిద్వాంసులకు ఉద్దేశించిన మహాసభలో ఈ కుర్రాడు వాయించడం ఏమిటని మొదట్లో నిర్వాహకులు ముఖం చిట్లించుకున్నారు. 20 నిమిషాలకు మించి వాయించడానికి వీల్లేదని షరతు పెట్టారు. సరేనని వేదిక ఎక్కాడు విలాయత్ ఖాన్. తబలా విద్వాంసులలో ప్రముఖుడైన అనోఖీలాల్ ను ప్రక్క వాద్యానికి ఎంచుకున్నాడు. 'ఇంత చిన్న కుర్రాడికి అంత పెద్ద తబలా విద్వాంసుడు కావలసి వచ్చాడా' అని ముక్కున వేలేసుకున్నారు పెద్దలు. కుర్రాడు మంచి పొగరుమీద ఉన్నాడనుకున్నారు. 'పోనీ కుర్రాడేదో ముచ్చట పడ్డాడు' అని వేదిక మీదికి వచ్చి కూర్చున్న అనోఖీలాల్ కొద్ది నిమిషాలలోనే విలాయత్ ధాటికి అదిరిపోయాడు. విలాయత్ సరాసరి ధ్రుత్ లయలో ప్రారంభించి, అంతకంతకు వేగం పెంచాడు. జనం ఉత్సాహంతో వెర్రెత్తిపోయారు. 20 నిమిషాలు కాకుండానే అనోఖీలాల్ విలాయత్ ధాటికి తట్టుకోలేక, తబలా అవతలపడేసి చేతులెత్తేశాడు. "అయ్యబాబోయ్ వీడు మనిషి కాడు-భూతం, భూతాలకి తబలా వాయించడం నా వల్ల కాదు" అని లేచి వెళ్ళిపోయాడు. కచేరీ ఆగిపోయింది. టైము అయిపోయిందని విలాయత్ కూడా లేచాడు. హాల్లో జనం ఏమైనా సరే కచేరీ కొనసాగవలసిందేనని గోల చేస్తూ కుర్చీలు విరగ్గొట్టడం మొదలు పెట్టారు. నిర్వాహకులు వేదిక మీదికి వచ్చి విలాయత్ ను కౌగలించుకుని 'ఇరవై నిమిషాలు కాదు, ఇరవై గంటలు వాయించు' అని అనుమతిచ్చారు. తర్వాత అజిమ్ ఖాన్ అనే మరొక తబలా విద్వాంసుని పెట్టుకుని విలాయత్ కచేరీ కొనసాగించాడు.

ఆనాటి నుంచి సాటిలేని మేటి సితార్ విద్వాంసునిగా, 'సితార్ నవాజ్' గా విలాయత్ ఖాన్ విరాజిల్లుతున్నారు. తండ్రిని మించిన కొడుకు అనిపించుకోగలిగారు.

నండూరి పార్థసారథి
(1974 ఆగస్టు 2వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post