సంగీతం ఒక సుధార్ణవం. రాగం ఒక తరంగం; స్వరం ఒక కణం. ప్రతిరాగానికి హృదయం ఉంది; ఒక తత్త్వం ఉంది. ఏకాగ్రచిత్తంతో తపస్సు చేస్తే గానీ రాగహృదయం, రాగతత్త్వం సాక్షాత్కరించవు. వాటిని సాక్షాత్కరింపచేసుకొన్న తపస్సంపన్నుడు పండిత్ రవిశంకర్.

రవిశంకర్ సితార్ కచేరీ వినటం మహా భాగ్యం. ఆ భాగ్యం దక్షిణ భారతంలో మద్రాసు వారికి దక్కినంతగా ఇంకెవరికీ దక్కలేదు. రవిశంకర్ కచేరీలు మద్రాసులో తరుచుగా-ఏడాదికి ఐదారుసార్లు-జరుగుతూ ఉంటాయి. మొన్న ఏప్రిల్ 13వ తేదీని - తమిళ సంవత్సరాదినాడు-మద్రాసు మ్యూజిక్ అకాడమీ హాలులో ఆయన కచేరీ చేశారు. సుమారు మూడున్నర గంటల సేపు శ్రోతలను తన స్వరార్ణవంలో ముంచి ఎత్తారు. రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయిన కచేరీ పదకొండున్నర గంటలకు అంతమయింది. నాలుగు రాగాలు-జోగ్, మారుబేహాగ్, దర్బారీకానడ, పహాడీ-వాయించారు.

మొదట జోగ్ రాగం ఇరవై నిమిషాలసేపు వాయించారు. ఇది కర్ణాటక సంగీతంలోని 'నాట' రాగానికి సమంగా ఉంటుంది. రెండవ రాగం 'మారుబేహాగ్' సుమారు ముప్పావుగంట సేపు వాయించారు. తర్వాత పావుగంట విశ్రాంతి, కచేరీ రెండవ భాగంలో మొదట 'దర్బారీకానడ' రాగం గంటపైగా వాయించారు. కచేరీ మొత్తం మీద విశేషమైన అంశం, శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసిన అంశం ఇదే. సితార్ మామూలుగా వాయించే పద్ధతిలోకాక-ప్రాచీన సంప్రదాయంలో-వీణ వాయించే పద్ధతిలో వాయించారు. రేడియోలో వింటే వీణ అనే అనుకుంటాము. అయితే బాణీమాత్రం హిందూస్థానీ బాణియే. దీనికి పక్క వాద్యం తబలా ఉండదు. మొత్తం అంతా ఆలాపనే ఉంటుంది. ముందు మంద్రస్థాయి అంతా మథించిన తర్వాత మధ్య స్థాయిలోకి ప్రవేశించటం, దానిని పూర్తిగా మథించిన తర్వాత తారస్థాయిలోకి ప్రవేశించటం జరుగుతుంది. ఈ పద్ధతి వీణమీదనే కానీ సితార్ మీద వాయించరు మామూలుగా. ఈ సంప్రదాయం పదహారవ శతాబ్దం నుంచి వచ్చిందట. అంత ప్రాచీనమైన వాద్యం కాదు సితార్. దర్బారీ కానడరాగం చాలా ప్రసిద్ధమైనది. రాగతత్త్వం విషాదంగా ఉంటుంది. ఈ రాగాన్ని రవిశంకర్ అద్భుతంగా వాయించారు. దీని తర్వాత పహాడీ రాగంలో ధున్ వాయించారు. పహాడీ కూడా ప్రసిద్ధమైనదే. ఇది చాలా లలితంగా, ఉత్సాహాన్ని కలిగించేదిగా ఉంటుంది. సాధారణంగా ఈ రాగాన్ని ఎవరు పాడినా బాగానే ఉంటుంది. అందులో రవిశంకర్ వంటి మహా విద్వాంసుడు వాయిస్తే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అల్లారఖా తబలా వాయించారు. అల్లారఖా రవిశంకర్ కు కుడిభుజం. రవిశంకర్ ఎక్కడ కచేరీ చేసినా పక్కవాద్యం అల్లారఖాయే. రవిశంకర్ కు సరిజోడు ఆయన. కచేరీ ముగిసే ముందు ఆయన అద్భుత లయవిన్యాసంతో శ్రోతలను దిగ్ర్భాంతులను చేశారు. తబలా వాద్యంలో ఆయనతో సమానమైనవారిని ఒక చేతి వేళ్లమీద లెక్కించవచ్చు.

రవిశంకర్ సితార్ కచేరీ వినడమే కాదు, చూడటం కూడా ఒక గొప్ప అనుభవం. రాగాన్ని ప్రారంభించబోయేముందు ఆ రాగాన్ని గురించి క్లుప్తంగా వివరిస్తారు. తర్వాత సితార్ తంతులపై వేళ్లు ఆనించగానే కన్నులు మూసుకుని రాగధ్యాన నిమగ్నులైపోతారు. మనస్సును రాగజలధిలో నిమజ్జనం చేస్తారు. ఆ రాగతత్త్వం స్వరాలలోనే కాక ఆయన ముఖంలో కూడా ప్రదర్శితమవుతుంది. కళాకారునిలోని 'ఆర్తి'ని శ్రోతలలో కూడా రగిలించుతారు. ఆ రాగాన్ని మథిస్తూ తాను పొందిన దివ్యానుభవాన్ని అందరిలో ఆవిష్కరిస్తారు. తనను అందరిలోనూ నెలకొల్పుకుంటారు. అప్పుడు సభలోని ఒక్కొక్క రసహృదయుడు ఒక్కొక్క రవిశంకర్ అవుతాడు. శ్రోతలందరినీ భావనాలోకంలోనికి తీసుకువెళ్లి, తాను విహరించే సీమలన్నింటినీ చూపుతారు రవిశంకర్. ఆ సమయంలో సభామందిరం గంభీరంగా, పవిత్రమైన దేవాలయంలా ఉంటుంది. ఆలాపన ముగిసి, పల్లవిలో ప్రవేశించగానే ఆయన కన్నులు తెరుస్తారు. పరవశించి ఉన్న శ్రోతలను జాగృతం చేస్తారు; ఉత్తేజపరుస్తారు; సభామందిరం మళ్లీ చైతన్యవంతమవుతుంది. అల్లారఖా తబలాతో రవి శంకర్ ను అనుసరిస్తారు. ఒకరి నొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరిపై ఒకరు చమత్కార విన్యాసాలు చేస్తూ, ఒకరి నొకరు తరుముకుంటూ, అంతకంతకు అధికవేగంతో రాగమార్గాన పరుగులుతీస్తారు. ముగింపులో వేగం మహోద్ధృతమవు తుంది. తబలాపగిలిపోతుందేమో, సితార్ తంతులు తెగిపోతాయేమో ననిపిస్తుంది. రాగం ముగియగానే శ్రోతలు పెద్ద పెట్టున కరతాళద్వనులు వర్షిస్తారు. ఆ వర్షాన్ని హర్షంతో స్వీకరిస్తారు రవిశంకర్, అల్లారఖా.

సితారా పథంలో ధ్రువతార రవిశంకర్. దేశంలో సితార్ విద్వాంసులు చాలా మంది ఉన్నారు. అందరిలోనూ అగ్రగణ్యుడు రవిశంకర్. దాదాపు ఆయనంత గొప్పగా సితార్ వాయించగలవారు ఒకరిద్దరు దేశంలో లేకపోలేదు. కాని ఆయన అగ్రగణ్యత కేవలం పాండిత్యాన్నిబట్టే కాదు. సితార్ వాదనలోగల పాండిత్యం ఒక్కటే ఆయన జీవిత సమస్తంకాదు. అంతకుమించి ఆయన చేసిన కృషి, సాధించిన విజయం అధికం. హిందూస్థానీ సంగీతానికి, భారతీయ సంగీతానికి, ఇంకా విస్తృతపరిథిలో ప్రపంచ సంగీతానికి ఆయన చేసిన సేవ అపారం. హిందూస్థానీ కర్ణాటక సంగీతాల మధ్య, శాస్త్రీయ లలిత జానపద సంగీత ప్రక్రియల మధ్య, ప్రాచీన ఆధునిక సంగీత సంప్రదాయాల మధ్య, భారతీయ పాశ్చాత్య సంగీతాల మధ్య, వివిధ జంత్రవాద్యాల మధ్య సమన్వయం కోసం ఆయన చేసిన కృషి ఎవ్వరూ చేయలేదు.

బొంబాయిలో ఆయన 'కిన్నెర సంగీత పాఠశాల'ను ఒకదాన్ని స్థాపించారు. అందులో ఎందరో సంగీతం అభ్యసిస్తున్నారు. దేశ విదేశాలలో ఆయనకు తనకంటే పెద్దవారైన శిష్యులు అనేకులు ఉన్నారు (రవిశంకర్ వయస్సు నలభై అయిదు మాత్రమే). వారిలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. వారందరూ ఆయన చేస్తున్న ప్రయోగాలకు చేయూత ఇస్తున్నారు. చాలా మంది గొప్ప గాయకుల ఊహకైనా అందని లక్ష్యాలు రవిశంకర్ కు ఉన్నాయి. కొందరు ఆయనను దురాశాపరుడని కూడా అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా ఆయన నిరంతరం కృషి జరుపుతూనే ఉంటారు.

పాశ్చాత్య సంప్రదాయమైన 'ఆర్కెస్ట్రేషన్'ను భారతీయ సంగీతంలో ప్రవేశపెట్టాలనీ, అందుకు అనుగుణంగా మన వాద్యాలను మలచుకోవాలనీ ఆయన వాంఛ. 'ఆర్కెస్ట్రేషన్' మన సినిమా సంగీతంలో ఉండనే ఉన్నది. కానీ శాస్త్రీయ సంగీతంలో కూడా దానిని ప్రవేశపెట్టి, ప్రచారంలోకి తీసుకురావాలని ఆయన కోరిక. అందుకోసం ఆయన ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలను ఒకసారి ఢిల్లీలో ప్రదర్శించారు కూడా. కొందరు హర్షించారు. మరి కొందరు భారతీయ సంగీతం మంటగలిసిపోతున్నదని వాపోయారు. వాద్య సంగీతంలో 'ఆర్కెస్ట్రేషన్' లాగానే, గాత్ర సంగీతంలో 'ఖోరస్' అనే పాశ్చాత్య సంప్రదాయాన్ని ప్రవేశపెట్టడానికి ఆయన ప్రయోగాలు చేశారు. గాయకులు విశృంఖలంగా గానం చేయటం మన భారతీయ సంప్రదాయమనీ, కోరస్ లోనూ, ఆర్కెస్ట్రాలోనూ పాల్గొనే గాయకులకు ఆవిధమైన స్వేచ్ఛ ఉండదనీ, గీతాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అందరూ తలా ఒక ముక్క వాయించటం సంప్రదాయవిరుద్ధమనీ ఆతివాదులు వాదించారు. కాని రవిశంకర్ ఎన్ని ప్రయోగాలు చేసినా భారతీయతను కలుషితం చేయలేదు.

హిందూస్థానీ సంగీతం వింటేనే మైలపడిపోతామని భావించే కర్ణాటక సంగీత విద్వాంసులు, జానపద సంగీతం అసలు సంగీతమే కాదనేవారు కూడా ఇంకా ఉన్నారు. కానీ రవిశంకర్ కు అటువంటి పట్టింపులు ఏవీ లేవు. సంగీతం ఏ దేశానికి, ఏ జాతికి చెందినదైనా పవిత్రమైనదేనని భావిస్తారు ఆయన. మంచిని ఎక్కడి నుంచి అయినా స్వీకరించవచ్చునని ఆయన నమ్మకం. భారతీయ వాద్యాలయిన సితార్ ను, సరోద్ ను, పాశ్చాత్య వాద్యమయిన బాంజోను ఒక్క వాద్యంలో ఇమడ్చటానికి ఆయన ప్రయోగాలు చేశారు.

దేశంలోనూ, విదేశాలలోనూ ఆయన పర్యటించినంతగా మరెవ్వరూ పర్యటించలేదు. వివిధ సంగీత సంప్రదాయాలను ఆయన అధ్యయనం చేసినంత విస్తృతంగా ఇంకెవరూ చేయలేదు. భారతీయ సంగీతాన్ని ఆయన విదేశాలలో ఎంత గానో ప్రచారం చేశారు. మన సంగీతం పట్ల విదేశీయులెందరికో భక్తి శ్రద్ధలు కలిగించారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం ఎడింబరో అంతర్జాతీయ సంగీత మహాసభలో భారతదేశం తరపున ఆయన పాల్గొన్నారు. భారతీయ సంగీతం ఎంత ఉన్నతమైనదో, ఎంత ఉదాత్తమైనదో ప్రపంచ ప్రసిద్ధ సంగీతవేత్తలందరి ఎదుట ఆయన నిరూపించారు.

ఇటీవలనే ఆయన ఆరునెలలపాటు అమెరికాలో పర్యటించి, పెక్కు నగరాలలో కచేరీలు చేశారు. కొన్ని విశ్వవిద్యాలయాలలో భారతీయ సంగీతాన్ని గురించి ప్రసంగాలు చేశారు. ఆమెరికా పర్యటన తర్వాత న్యూజీలెండ్, ఆస్ట్రేలియాలలో పర్యటించి కచేరీలు చేశారు. ప్రతి చోటా సంగీతాభిమానులు ఆయన ప్రతిభకు జోహార్లు అర్పించారు. ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలలో కూడా పర్యటించాలని ఆయన అనుకుంటున్నారు. వచ్చే సెప్టెంబరులో ఇంగ్లండ్ లో జరుగనున్న కామన్ వెల్త్ ఉత్సవంలో ఆయన కచేరీ చేయబోతున్నారు.

రవిశంకర్ శిష్యులు ఆయనంతటివారైతే భారతీయ సంగీతం మూడు పువ్వులు, ఆరుకాయలై వర్థిల్లుతుంది.

నండూరి పార్థసారథి
(1965 మే 12వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Next Post