Title Picture

బాలల చలనచిత్ర సంఘం వారు 'గురుభక్తి', 'ఏకత' చిత్రాలను నిర్మించారు. వీటిలో 'ఏకత' చిత్రం నిడివి 2,875 అడుగులు. ప్రదర్శనకాలం 30 నిమిషాలు ఉంటుంది. ఐకమత్యాన్ని గురించి ప్రబోధించే చిత్రం ఇది. భారతదేశంలో పూర్వం రాజులు తమలో తాము కక్షలు పెంచుకోవడం వల్ల విదేశీశత్రువులు మన దేశం మీదికి దండెత్తి సర్వనాశనం చేశారనీ, అందరూ ఐకమత్యంతో మెలగితే ఏశక్తీ మనను ఎదిరించలేదనీ ఒక పాఠశాలలో ఉపాధ్యాయిని పిల్లలకు చెబుతున్నట్లుగా దీనిని చిత్రీకరించారు. దేశద్రోహి అంభి వల్ల పురుషోత్తముడు అలెగ్జాండర్ చేతుల్లో ఎలా ఓడిపోయాడో ఆమె ఉదాహరణగా చెబుతుంది.

పూర్వం సొహ్రాబ్ మోడీ నిర్మించిన 'సికిందర్' చిత్రంలోని కొన్ని భాగాలనూ, మరొక పాత హిందీ చిత్రంలోని భాగాలనూ కత్తిరించి ఇందులో పొందుపరిచారు. స్కూలులో ఉపాధ్యాయిని పిల్లలకు బోధిస్తున్న కాస్త భాగాన్ని మాత్రం కొత్తగా చిత్రీకరించారు. 13-17 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలల కోసం ఉద్దేశించి ఈ చిత్రాన్ని నిర్మించారు దర్శకుడు కేదారశర్మ.

రెండవ చిత్రం 'గురుభక్తి' నిడివి 4,939 అడుగులు. దీని ప్రదర్శనకాలం 60 నిమిషాలు. ఇది ఏకలవ్యుని కథ. ఏకలవ్యుడు ద్రోణాచార్యునికి గురుదక్షిణగా బొటనవ్రేలును కోసి ఇచ్చినట్లు ఈ చిత్రంలో చూపలేదు. దీనికి రాజేంద్రకుమార్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కేదార్ శర్మ రాశారు. సంగీతం స్నేహల్ భట్కర్ సమకూర్చాడు. ఛాయాగ్రహణం ప్రకాశ్ మల్హోత్రా.

హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళం, బెంగాలీ, మళయాళం, కన్నడం, అస్సామీ, ఒరియా, కాశ్మీరీ, మరాటీ భాషలలో ఈ చిత్రాల ప్రతులను తయారు చేశారు.

వార్తా చిత్రాలనూ, డాక్యుమెంటరీ చిత్రాలనూ నిర్మించడంలో ఘనవిజయాన్ని సాధించిన భారత ప్రభుత్వం పిల్లల చిత్రాలను నిర్మించడంలో అపజయం పొందిందని చెప్పక తప్పదు. ఈ చిత్రాలన్నీ డాక్యుమెంటరీ పద్దతిలో నిర్మించబడినాయి. శైలి సరళంగా లేదు. గమనం మందకొడిగా ఉంది. వినోదం, ఉల్లాసం కలిగించే సన్నివేశాలు మచ్చుకు కూడా లేవు. ఈ చిత్రాలు విద్యావంతులకోసం, మేధావులకోసం నిర్మించారేమో నన్న అనుమానం కూడా తోస్తుంది. కాని ఇవి వారికీ నచ్చవు. పిల్లలకు ఇటువంటి చిత్రాలు బొత్తిగా పనికిరావు. పిల్లలకు నీతిని బోధించవలసిందేగానీ ఈ పద్ధతిలో మాత్రం కాదు. వినోదం, ఉల్లాసం కలిగించాలి. చూసిన తర్వాత పిల్లలకు తృప్తికలగాలి. అర్థంకాకుండా ఎక్కడా ఉండకూడదు.

'గురుభక్తి' చిత్రంలో చాలా చోట్ల విసుగనిపిస్తుంది-పిన్నలకు, పెద్దలకు కూడా. ఇది 7-12 సంవత్సరాల మధ్య వయస్కులయిన పిల్లల కోసం ఉద్దేశించబడినదిట.

పిల్లలకు ఎటువంటి చిత్రాలు కావాలి అన్న విషయమై బాలల చిత్రసంఘం ఒక గోష్ఠిని ఏర్పాటు చేయడం అవసరం. పిల్లలకు కావలసిన చిత్రాలు ఎలా ఉండాలో సరైన అభిప్రాయం లేకుండా ఎన్ని చిత్రాలు నిర్మించినా నిష్ఫలం.

ప్రభుత్వసంస్థ నిర్మించిన చిత్రాలు కనుక వీటికి ప్రధాని నెహ్రూ, రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రభృతులు అద్భుతం, ఆమోఘం అని సర్టిఫికేట్లు ఇవ్వవచ్చును. కావలసింది వాళ్ల సర్టిఫికెట్లు కాదు, పిల్లల సర్టిఫికెట్లు.

'ట్రాన్స్-కాంటినెంట్' అని ఇటీవల ఒక హాలీవుడ్ చిత్రం విడుదల అయింది. ఈ చిత్రం అంతా ఇద్దరు చిన్న పిల్లల రైలు ప్రయాణం. ఈ రైలు ప్రయాణాన్ని రెండు రీళ్ళలో చిత్రీకరించారు. పిల్లలు మొదటి సారిగా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు పొందే అద్భుతమైన అనుభూతిని ఈ చిత్రంలో గొప్పగా చిత్రీకరించారు. నదులు, పర్వతాలు, లోయలు, అడవులు, గుహలు, పచ్చిక మైదానాలు, పట్టణాలు... ఇంకా ఎన్నెన్నో దృశ్యాలు ఈ చిత్రంలో చూస్తాము. ప్రేక్షకులకు రైలు ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. పిల్లల మనస్తత్వాన్ని చక్కగా అవగాహన చేసుకొని నిర్మించిన చిత్రం ఇది. ఇందులో సంభాషణలు లేవు. వ్యాఖ్యానం మాత్రం ఉంటుంది. ఇటువంటి చిత్రాలను బాలల చిత్ర సంఘం వారు మన భాషలలోనికి డబ్ చేస్తే మంచిది. 'గురుభక్తి' లాంటి చిత్రాలకంటే అవి మన పిల్లలను బాగా ఆకర్షించగలవు. మొదట వినోదం, తర్వాత విజ్ఞానం. విజ్ఞానం కోసం వినోదాన్ని బలిపెట్టకూడదు.

నండూరి పార్థసారథి
(1961 సెప్టెంబర్ 22వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post