ఉదయశంకర్ కు సహజంగా నృత్య విద్య అబ్బినట్లుగా రవిశంకర్ కు సహజంగా సంగీతం అబ్బింది. ప్రత్యేకంగా ఎవరి దగ్గర నేర్చుకోకుండానే ఆయన చాలా చిన్నతనం నుంచే చక్కగా పాడేవారు. అసలు వారి కుటుంబంలో అందరికీ ఏదో ఒక కళలో 'పిచ్చ' ఉండేది. వాళ్ళ నాన్నగారు ఒక గొప్ప విద్వాంసుని దగ్గర కొంతకాలం ధ్రుపద్ సంగీతం నేర్చుకున్నారు. పాట కచేరీలు చేయకపోయినా ఆయన చాలా బాగా పాడేవారట. రవిశంకర్ రెండో అన్నగారు రాజేంద్రశంకర్ కు సంగీతం, నాటకాల 'పిచ్చ' ఉండేది. వాళ్ళ ఇంట్లో హార్మోనియం, ఫ్లూట్, సితార్, ఇస్రాజ్ వంటి వాద్యాలు, ఒక పాత గ్రామఫోను ఉండేవి. రవీంద్ర సంగీతం రికార్డులు, నాటకాల పాటల రికార్డులు, సినిమా రికార్డులు బోలెడు ఉండేవి. రవిశంకర్ అవి వింటూ. ఆ పాటలు నేర్చుకుని పాడుతూ ఉండేవారు. ఎవరూ చూడకుండా ఇంట్లో ఉన్న వాద్యాలు వాయించడానికి ప్రయత్నించేవారు.

1930లో ఉదయశంకర్ తోపాటు కుటుంబమంతా వారణాసిలో కాపురం ఎత్తేసి పారిస్ కు వెళ్ళారు. అప్పటికి రవిశంకర్ కు పదేళ్ళు. పారిస్ లో వారి భవనంలో రాత్రింబవళ్ళు సంగీత నృత్యాల రిహార్సల్సు జరుగుతూ ఉండేవి. రవిశంకర్ వాటిని శ్రద్ధగా గమనించేవారు. తనూ ఒక సితార్ తీసుకుని, ఓ మూలకు పోయి కూర్చుని ప్రాక్టీస్ చేసేవారు. వాద్య బృందంలో సితార్ వాయించే ఆయనకి ఎప్పుడైనా తీరిక చిక్కితే "అలా కాదు నాయనా, ఇలా వాయించాలి" అని చెప్పి వెడుతూ ఉండేవాడు. ఆ రోజుల్లో సితార్, ఇస్రాజ్, సరోద్ వాద్యాలు రవిశంకర్ ను ఎక్కువగా ఆకర్షించాయి. ఆయన నృత్యం కూడా సొంతంగా ప్రాక్టీస్ చేసేవారు. ఆయన ఆసక్తి గమనించి ఉదయశంకర్ కొన్ని చిన్న అంశాలను ఆయనకు నేర్పేవారు. 1933 నుంచి 1938 వరకు ఉదయశంకర్ నృత్య రూపకాలలో రవిశంకర్ కూడా వేషాలు వేసి, నృత్యాలు చేస్తూ ఉండేవారు.

ఉదయశంకర్ దగ్గర గొప్ప రికార్డ్ కలెక్షన్ ఉండేది. హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం, జాజ్ సంగీతం, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం రికార్డులు ఎన్నో ఉండేవి. అవన్నీ రవిశంకర్ శ్రద్ధగా వినేవారు. అన్నగారితో పాటు పర్యటిస్తూ, యూరప్ లోని పెక్కు నగరాలలో ఎన్నో శాస్త్రీయ సంగీత కచేరీలు విన్నారు. ప్రపంచ విఖ్యాత విద్వాంసులైన టాస్కోనినీ, పాడెరెవ్స్కీ, కాసల్స్, హైఫెట్జ్, ఫ్రిట్జ్ క్రైస్లర్ల కచేరీలను విన్నారు. భారతీయ సంగీత నృత్యాలను గురించి తెలుసుకునేందుకు, చర్చించేందుకు కొందరు విద్వాంసులు ఉదయశంకర్ వద్దకు వస్తూ ఉండేవారు. వారు మన సంగీతాన్ని విమర్శించడం రవిశంకర్ కు బాధాకరంగా ఉండేది. ''మీ సంగీతం అంత బోరుగా ఉంటుందేమండీ? ఎంత సేపు వాయించినా ఒకే రకంగా ఉంటుంది. వాయించిందే వాయిస్తున్నట్లుగా ఉంటుంది. ఎక్కడ మొదలు పెడతారో, ఎక్కడ ఆపుచేస్తారో తెలియదు'' అని వారు ఆక్షేపించేవారు. మన సంగీతంలో 'హార్మొనీ', 'కౌంటర్ పాయింట్' బొత్తిగా లేకపోవడం వల్ల వారికి అలా అనిపించేది.

భారతీయ శాస్త్రీయ సంగీతం, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం స్వరూప స్వభావాలలో పూర్తిగా భిన్నమైనవి. ఒకటి ఉత్తర ధ్రువం, రెండోది దక్షిణ ధ్రువం. వారి దృష్టిలో 'హార్మొనీ' లేకపోతే అది సంగీతమే కాదు. మన సంగీత శాస్త్రం ప్రకారం పాశ్చాత్య సంగీతం అపస్వరాలపుట్ట. అపస్వరాలేకాదు-అపశ్రుతి కూడా వారి సంగీతంలో భాగం. వారి సంగీతపు ప్రాతిపదికే పూర్తిగా వేరు. వారు, మనం ఒకరి సంగీతాన్ని ఒకరు విని ఆనందించ గలగాలంటే అవగాహన అవసరం. అందుకు కొంత శిక్షణ కావాలి. తమ సంగీతాన్ని అవతలి వారి సంగీతంతో పోల్చుకుని వినడం మానెయ్యాలి. తమ సంగీతాన్ని కాసేపు మరిచిపోయి, అవతలివారి సంగీతాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలవాటైన తర్వాత అందులోని అందం తెలుస్తుంది.

నిజానికి ఆ రోజుల్లో ఉదయశంకర్ పాశ్చాత్యులకు వినిపించింది అచ్చమైన హిందూస్థానీ సంగీతం కానేకాదు. అది నృత్యాల కోసం ప్రత్యేకంగా రచించిన మూడు నాలుగు నిమిషాల వాద్య సంగీతం మాత్రమే. అందులో జానపద సంగీతం కూడా కలిసి ఉండేది. అంత చిన్న చిన్న బిట్లు వినే బోరుగా ఉందనేవారు, మన అచ్ఛమైన కషాయం లాంటి శాస్త్రీయ సంగీతాన్ని అసలు వినగలరా? మన విద్వాంసులు ఒక్కొక్క రాగాన్ని రెండేసి, మూడేసి గంటలసేపు వాయిస్తారు. అది పాశ్చాత్యుల ఊహకు కూడా అందదు. పెద్దయిన తర్వాత మన శాస్త్రీయ సంగీతాన్ని పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసి, మన గొప్పతనాన్ని వారు అంగీకరించేటట్లు చేయాలని రవిశంకర్ ఆ రోజుల్లోనే ప్రతిజ్ఞ చేశారు.

ఉదయశంకర్ బృందంలో ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ చేరిన తర్వాత, రవిశంకర్ ఆయన దగ్గర అప్పుడప్పుడూ సితార్ పాఠాలు నేర్చుకుంటూ ఉండేవారు. ఉస్తాద్ ఆయనను విపరీతంగా ఆకర్షించారు. క్రమంగా రవిశంకర్ కు నృత్యం పట్ల ఆసక్తి తగ్గిపోయి, సంగీతం పట్ల - ముఖ్యంగా సితార్ పట్ల - ఆసక్తి పెరిగింది. 1938లో ఉదయశంకర్ బృందం స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రవిశంకర్ మధ్యప్రదేశ్ లోని మైహార్ కు వెళ్ళి, అల్లాయుద్దీన్ ఖాన్ వద్ద ఆరు సంవత్సరాలు శిష్యరికం చేసి, గొప్ప విద్వాంసుడుగా తయారైనారు.

1948 నుంచి 1956 వరకు ఆయన 'ఆకాశవాణి' ఢిల్లీ కేంద్రంలో 'జాతీయ వాద్య బృందం' సంగీత దర్శకునిగా పనిచేశారు. హిందూస్థానీ సంగీతంలో 'ఆర్కెస్ట్రేషన్' విషయమై ఆయన చాలా కృషి చేశారు. ఆశాఖలో ఆయన చేసినంత కృషి దేశంలో మరెవ్వరూ చేయలేదు. 1951లో ప్రపంచ విఖ్యాత వైలిన్ విద్వాంసుడు యెహూదీ మెనూహిన్ మొదటిసారిగా భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఆయనకు, రవిశంకర్ కు స్నేహం ఏర్పడింది. రవిశంకర్ సితార్ వాదనం విని ఆయన ముగ్ధులైనారు. రవిశంకర్ ద్వారా ఆయన భారతీయ సంగీతాన్ని గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. తర్వాత 1956లో ఆయనే రవిశంకర్ ను పాశ్చాత్య శ్రోతలకు పరిచయం చేశారు. పశ్చిమ దేశాలలో రవిశంకర్ సంగీత ప్రచార జైత్రయాత్రలు ఆ సంవత్సరంలోనే ప్రారంభమైనాయి. అప్పటి నుంచి ఆయన స్వదేశంలో కంటే విదేశాలలోనే ఎక్కువకాలం గడుపుతున్నారు. ఈ 18 సంవత్సరాలలో ఆయన యూరప్ లోని దాదాపు అన్ని దేశాలలో కచేరీలు చేశారు. అమెరికా, కెనడా, రష్యా, చైనా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలలో కూడా కచేరీలు చేశారు.

మొదట్లో రవిశంకర్ ఒక్కొక్క రాగాన్ని 20లేక30 నిమిషాలసేపు మాత్రమే వాయించేవారు. ఒక రాగాన్ని ప్రారంభించబోయే ముందు ఆ రాగ లక్షణాన్ని గురించి ఒకటి రెండు నిమిషాల సేపు క్లుప్తంగా వివరించేవారు. పాశ్చాత్యులకు నచ్చడం కోసం రవిశంకర్ మన సంగీతాన్ని మార్చి వినిపిస్తున్నారనీ, కనీసం గంటసేపు వాయించవలసిన రాగాన్ని 20 నిమిషాలకు కుదించి వేస్తున్నారనీ మన దేశంలో కొందరు పండితులు విమర్శించేవారు. కాని, రవిశంకర్ రాగాలను కొద్దిసేపు వాయించినా వాటి సౌందర్యాన్ని ఏ మాత్రం చెడనివ్వలేదు. వాటి లక్షణాలను ఏ మాత్రం మార్చలేదు. మహా పండితులు సైతం గ్రామఫోన్ రికార్డులు ఇవ్వడం కోసం ఒక్కొక్క రాగాన్ని మూడేసి నిమిషాలలో పాడడం లేదా? అంత మాత్రాన రాగ సౌందర్యం చెడుతున్నదా? ఇ.పి,లు వచ్చిన తర్వాత విద్వాంసులు ఒక్కొక్కరాగాన్ని ఏడు నిమిషాలు పాడుతున్నారు. ఎల్.పి.లు వచ్చిన తర్వాత 20 నిమిషాలు పాడుతున్నారు. మూడు నిమిషాలైనా, మూడు గంటలైనా రాగ సౌందర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించ గలగాలి. కళాకారుని గొప్పతనం అందులోనే కనిపిస్తుంది. ఆలాప్, జోడ్, ఝాలా, విలంబిత్, ధ్రుత్ గత్ లు వాయించినా, అన్నింటినీ చక్కగా బాలెన్స్ చేసుకుని ఇరవై నిమిషాలలో ఇమిడ్చేవారు రవిశంకర్. మధ్య మధ్య తబలా సోలోకు ఛాన్సు ఇచ్చేవారు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో...

క్రమంగా పాశ్చాత్యులకు సితార్ నాదం, హిందూస్థానీ సంగీతం అలవాటైనాయి, రాగాలలోని అందాన్ని వారు గ్రహించడం మొదలు పెట్టారు. పాశ్చాత్య శాస్త్రీయ సంగీత విద్వాంసులను, జాజ్ కళాకారులను, 'పాప్' గాయకులను, సాధారణ శ్రోతలను కూడా రవిశంకర్ విశేషంగా ఆకర్షించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆయన కొంత కాలం భారతీయ సంగీతాన్ని గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. లాస్ ఏంజెలెస్ లో సంగీత విద్యాలయాన్ని నెలకొల్పి, సంగీతం బోధించారు. బీటిల్స్ గాయక చతుష్టయంలోని జార్జి హారిసన్ ఆయనకు శిష్యుడైనాడు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఆయనకు సంగీతంలో డాక్టరేట్ ఇచ్చింది. 1966లో బాత్ ఫెస్టివల్ లో మెనూహిన్, ఆయన కలిసి వైలిన్, సితార్ డ్యూయెట్ వాయించారు. మళ్ళీ 1967లో ఐక్యరాజ్య సమితిలో ఇద్దరూ కలిసి కచేరీ చేశారు. ఆ రెండు కచేరీలు రెండు ఎల్.పి. రికార్డులుగా వచ్చాయి. 1971లో లండన్ సింఫనీ అర్కెస్ట్రాతో కలిసి లండన్ లోని రాయల్ ఫెస్టివల్ హాలులో కచేరీ చేశారు. అది మరొక ఎల్.పి. వచ్చింది.

నండూరి పార్థసారథి
(1974 మే 24వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post