Title Picture

ఒకాయనకు ఇద్దరు కూతుళ్ళు; ఇద్దరినీ కాలేజీలో చదివిస్తున్నాడు. పెద్దమ్మాయి (సయీదాఖాన్) బుద్ధిమంతురాలు, లక్షణంగా ఒక అబ్బాయి (ప్రదీప్)ని ప్రేమించింది. ఎన్.సి.సి.లో స్వర్ణపతకం పొందింది. చివరి క్లైమాక్సులో కోర్టు సీనుకు ఉపయోగిస్తుందనే దూరదృష్టితో లా చదువుతుంది. ఫస్టున ప్యాసవుతుందని వేరే చెప్పనక్కరలేదు. చిన్న అమ్మాయి (నళినీ ఛోంకార్)కి ఒట్టి గ్లామరే గాని పెద్ద అందమూ లేదు, గుణమూలేదు. ఆమె చెడు సావాసాలుపట్టి కుటుంబానికి అప్రతిష్ఠ తెచ్చింది. ఇంట్లో వాళ్ళు వెళ్ళగొట్టారు. ఆమె ఒక దుష్టుని (మదన్ పూరీ) చేతిలో చిక్కుతుంది. ఈ అమ్మాయిని బట్టి పెద్దమ్మాయికి కూడా చెడ్డ పేరు వస్తుంది. నాయకుడు కూడా అనుమానించి దూషిస్తాడు. చివరికి చెల్లెలు మీద అన్యాయంగా హత్యానేరం పడుతుంది. నాయికా నాయకులు నానా సాహసాలు చేసి ఆవిడను రక్షిస్తారు.

ఈ చిత్రం రెయిన్ బో మూవీస్ సంస్థకు ఉన్న పేరును నిలబెట్టింది. నారంగ్ ఇదివరకు నిర్మించిన చిత్రాల సరసనే ఈ చిత్రం కూడా నిలబడుతుంది. బొంబాయివాళీ సినీ ప్రేమపట్ల శ్రద్దాసక్తులు గలవారంతా ఈ చిత్రాన్ని చూడవచ్చును. సర్వోదయ సిద్ధాంతులు దీన్ని చూడకపోవడం వారికి, చిత్ర నిర్మాతకు కూడా శ్రేయస్కరం.

రవి సంగీతం ఆయన అభిమానులకు నచ్చుతుందేమో. ఏడు పాటలలో 'సబ్ బజతారహే' అన్న పాట చక్కగా ఉంది. సింహళంలో చిత్రీకరించిన దృశ్యాలలో వర్ణఛాయా గ్రహణం చాలా చక్కకగా ఉంది.

నిర్మాత: నారంగ్; దర్శకత్వం: ఆర్. భట్టాచార్య; సంగీతం: రవి; పాటలు: రాజేంద్రకిషన్; తారాగణం: ప్రదీప్ కుమార్, సయీదాఖాన్, జానీవాకర్, నళినీ ఛోంకార్, స్మృతిబిస్వాస్, మదన్ పూరీ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 జూలై 30వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post