srgmp Icon

రవిశంకర్ వినూత్న ప్రయోగం

హిందూస్థానీ సంగీతం గురించి తెలుసుకోగోరే వారందరూ తప్పక చదవ వలసిన పుస్తకం పండిత్ రవిశంకర్ రచించిన 'My music, my life'. హిందూస్థానీ సంగీతం పట్ల ఆసక్తి ఉండి, శాస్త్ర పరిజ్ఞానం అంతగా లేని వారు తేలికగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఆయన ఆ పుస్తకాన్ని రచించారు. ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లోని సంగీత ప్రియులను మనస్సులో పెట్టుకుని రచించారు. అందులో ఆయన తన (హిందూస్థానీ) సంగీతం గురించి, తన జీవితం గురించి సంగ్రహంగా అయినా సమగ్రంగా రాశారు. సంగీత శాస్త్రానికి సంబంధించిన వివరాల జోలికి మరీ ఎక్కువగా పోకుండా, భారతీయ సంగీతాన్ని గురించి - ముఖ్యంగా హిందూస్థానీ సంగీతాన్ని గురించి - తెలుసుకోవలసిన ముఖ్యాంశాలను వేటినీ విడిచి పెట్టకుండా చాలా పకడ్బందీగా రచించారు. 1/4 డెమీ సైజులో 160 పేజీలున్న ఈ పుస్తకంలో ఫొటోలు చిత్రాలు అరవై పైగా ఉన్నాయి. వికాస్ పబ్లికేషన్స్ (బొంబాయి) వారు ప్రచురించిన ఈ పుస్తకం వెల 40 రూపాయలు.

అల్హయ్యా బిలావల్ రికార్డు
ఈ నెల (జూన్)లో రవిశంకర్ తాజా రికార్డు ఒకటి విడుదలయింది. ఆయన ఒక్కరూ వాయించిన రికార్డులు, మెనూహిన్ తో, అలీఅక్బర్ తో, లండన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో కలిసి వాయించిన రికార్డులు, ఆయన సంగీతం సమకూర్చిన ఇంగ్లీషు సినిమా 'చార్లీ' సౌండ్ ట్రాక్ రికార్డుతో కలిపితే ఈ తాజా రికార్డు 31 వది. శాస్త్రీయ సంగీతానికి సంబంధించినంతవరకు దేశంలో మరెవ్వరూ ఇన్ని ఎల్.పి. రికార్డులు యివ్వలేదు. మన దేశంలో ఎల్.పి. రికార్డులు ఉత్పత్తి కావడం ప్రారంభించినప్పటి నుంచి రికార్డుల సంఖ్యలో ఆయనే అగ్రగణ్యుడుగా ఉన్నారు. ఎల్.పి. రికార్డులు కాక, ఇ.పి. రికార్డులు ('అనూరాధ'తో కలిపి) మొత్తం పది వచ్చాయి.

హిందూస్థానీ సంగీత విద్వాంసులలో ఈనాడు రవిశంకర్ కు, అలీ అక్బర్ ఖాన్ కు ఉన్నంత ప్రచారం, గిరాకీ మరెవ్వరికీ లేదు. దేశ విదేశాలలో వీరికి ఉన్నంత మంది శిష్యులు మరెవ్వరికీ లేరు. ప్రపంచంలో ఎక్కడైనా సరే వీరిద్దరిలో ఏ ఒక్కరు కచేరీ చేసినా హాలు కిటకిట లాడిపోతుంది. ఇక ఇద్దరూ కలిసి కచేరీ చేస్తే టిక్కెట్ల కోసం రద్దీ చెప్పడానికి వీల్లేదు. ఇద్దరూ బాల్యమిత్రులు, ఒకే గురువుగారి శిష్యులు, బావ, బావమరదులు. స్వర్గీయ అల్లాఉద్దీన్ ఖాన్ వారికి గురువు మాత్రమే కాక అలీ అక్బర్ కు తండ్రి, రవిశంకర్ కు మామగారు కూడా. మైహర్ గ్రామంలో ఇద్దరూ సంగీతం నేర్చుకొనే రోజుల్లోనే గురువు గారు కచేరీ చేసినప్పుడల్లా వారిద్దరూ వేదికపై ఆయన పక్కన కూర్చుని సితార్, సరోద్ వాయించేవారు. ఆ తర్వాత ఇద్దరూ స్వయంగా కచేరీలు చేయడం ప్రారంభించిన తర్వాత కూడా, అప్పుడప్పుడూ కలిసి కచేరీలు చేస్తూ ఉండేవారు. వారిద్దరి సితార్, సరోద్ జుగల్ బందీలు (జంట కచేరీలు) దేశంలో చాలా ప్రసిద్ధమైనాయి. క్రమంగా ఇద్దరూ దేశవిదేశాలలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని క్షణం తీరికలేని బిజీ ఆర్టిస్టులై పోవడంతో ఇద్దరూ కలిసి కచేరీలు చేయడం అరుదైపోయింది. 1963లో ఎడింబరో అంతర్జాతీయ సంగీతోత్సవంలో భారత ప్రతినిధులుగా వారిద్దరూ జంట కచేరీ చేశారు.

సితార్ వాదకుడుగా, సంగీత ప్రచారకుడుగా, బోధకుడుగా, నిత్య నూతన ప్రయోగశీలిగా మాత్రమేకాక, స్వయంగా కొన్ని అద్భుత రాగాలను సృష్టించి, భారతీయ సంగీత భాండారానికి సమర్పించిన గొప్ప పండితుడుగా కూడా రవిశంకర్ పేరు శాశ్వతంగా నిలిచిపోగలదు. 'రసియా', 'అహీర్ లలిత్', 'తిలక్ శ్యామ్', 'నటభైరవ్', 'బైరాగి', 'కామేశ్వరి', 'పరమేశ్వరి', 'గంగేశ్వరి', 'రంగేశ్వరి' రాగాలు ఆయన స్వయంగా సృష్టించినవి. ఈ రాగాలన్నీ ఆయన జీవిత కాలంలోనే విశేషంగా ప్రచారంలోకి రావడం ఆయన అదృష్టం. ఎందుకంటే గొప్ప విద్వాంసులు సాధారణంగా సమకాలికుల రాగాలను ఆదరించరు. కాని, రవిశంకర్ తన పైతరం విద్వాంసుల గౌరవాన్నికూడా చూరగొన గలిగారు. 'నట భైరవ్', 'బైరాగి' రాగాలను పైతరం విద్వాంసులు కూడా గానం చేస్తున్నందు వల్ల అవి రవిశంకర్ సొంత రాగాలని చాలా మందికి తెలియదు. అవి ప్రాచీనమైన రాగాలనే చాలా మంది అనుకుంటున్నారు.

లండన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో కలిసి రవిశంకర్ యిచ్చిన కాంచెర్టో ఫర్ సితార్ అండ్ ఆర్కెస్ట్రా రికార్డు (ASD2752) రెండు సంవత్సరాల క్రితం విడుదల అయింది. ఈ రికార్డులో రవిశంకర్ సృజనాత్మక ప్రతిభ పరాకాష్ఠనందుకున్నది. హిందూస్థానీ సంగీతంలో ఆర్కెస్ట్రేషన్ (వాద్య సమ్మేళనం) విషయమై దాదాపు ఇరవై సంవత్సరాలు ఆయన చేసిన కృషి, పాశ్చాత్య వాద్య బృందంపై హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని పలికించాలని ఆయన కన్న కలలు ఈ రికార్డుతో ఫలించాయి.

ఉదయశంకర్ కు సహజంగా నృత్య విద్య అబ్బినట్లుగా రవిశంకర్ కు సహజంగా సంగీతం అబ్బింది. ప్రత్యేకంగా ఎవరి దగ్గర నేర్చుకోకుండానే ఆయన చాలా చిన్నతనం నుంచే చక్కగా పాడేవారు. అసలు వారి కుటుంబంలో అందరికీ ఏదో ఒక కళలో 'పిచ్చ' ఉండేది. వాళ్ళ నాన్నగారు ఒక గొప్ప విద్వాంసుని దగ్గర కొంతకాలం ధ్రుపద్ సంగీతం నేర్చుకున్నారు. పాట కచేరీలు చేయకపోయినా ఆయన చాలా బాగా పాడేవారట. రవిశంకర్ రెండో అన్నగారు రాజేంద్రశంకర్ కు సంగీతం, నాటకాల 'పిచ్చ' ఉండేది. వాళ్ళ ఇంట్లో హార్మోనియం, ఫ్లూట్, సితార్, ఇస్రాజ్ వంటి వాద్యాలు, ఒక పాత గ్రామఫోను ఉండేవి. రవీంద్ర సంగీతం రికార్డులు, నాటకాల పాటల రికార్డులు, సినిమా రికార్డులు బోలెడు ఉండేవి. రవిశంకర్ అవి వింటూ. ఆ పాటలు నేర్చుకుని పాడుతూ ఉండేవారు. ఎవరూ చూడకుండా ఇంట్లో ఉన్న వాద్యాలు వాయించడానికి ప్రయత్నించేవారు.

సంగీతం ఒక సుధార్ణవం. రాగం ఒక తరంగం; స్వరం ఒక కణం. ప్రతిరాగానికి హృదయం ఉంది; ఒక తత్త్వం ఉంది. ఏకాగ్రచిత్తంతో తపస్సు చేస్తే గానీ రాగహృదయం, రాగతత్త్వం సాక్షాత్కరించవు. వాటిని సాక్షాత్కరింపచేసుకొన్న తపస్సంపన్నుడు పండిత్ రవిశంకర్.