Humor Icon

మీడియా ప్రతి నిధులందరికీ స్వాగతం, సుస్వాగతం -

వచ్చేవారం నుంచి మేము ప్రత్యేకంగా రాజకీయ పార్టీలకు, కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, మహిళా సంఘాలకు, వివిధ సామాజిక వర్గాలకు సేవలందించడానికై ఈవెంట్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ సంస్థనొక దాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మా కాన్ సెప్ట్ ను మీ అందరికీ వివరించడానికి, మీ పత్రికలలో, చానెల్స్ లో అడ్వాన్స్ పబ్లిసిటీని అర్ధించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతున్నది.

ఇప్పుడు మన నగరంలో స్వాతంత్ర్యదినోత్సవాలు, అవతరణ దినోత్సవాలు, విలీన దినోత్సవాలు, విమోచన దినోత్సవాలు, విద్రోహ దినోత్సవాలు, వేర్పాటు దినోత్సవాలు, నిరసన దినోత్సవాలు, సంతాపదినోత్సవాలు, సంస్మరణ దినోత్సవాలు మొదలైన రకరకాల దినోత్సవాలు ఎడతెరిపిలేకుండా ఏడాది పొడుగునా జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. వీటికి తోడు ధర్నాలు, ఊరేగింపులు, మానవహారాలు, రాస్తారోకోలు, రైల్ రోకోలు, జైల్ భరోలు, రాళ్ళ వర్షాలు, దిష్టిబొమ్మల తగులవేతలు, బస్సుల దహనకాండలు, తిట్టిపోతలు, దుమ్మెత్తిపోతలు మున్నగు ఎన్నో వెరైటీ సామాజిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని గమనిస్తుంటే మనకు రోజూ యిన్ని లక్షల మానవగంటల తీరిక, యింత అపారమైన సర్ ప్లస్ హ్యూమన్ ఎనర్జీ అందుబాటులో వున్నాయి కదా అని గర్వం కలుగుతున్నది.

ఐతే, ఈ కార్యక్రమాలన్నింటి నిర్వహణకు ఒక సమీకృత వ్యవస్థ లేకపోవడం వల్ల ఆయా వర్గాల వారు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారందరికీ అవసరమైన సేవలను వీలైనంత చౌకగా అందించడానికే ఈ సంస్థను ప్రారంభిస్తున్నాము.

  • ఈ సర్వీసులలో భాగంగా మేము అన్ని రకముల, అన్ని సైజుల దిష్టి బొమ్మలను, వాటిని దహనం చేయడానికి కావలసిన కిరసనాయిలును సప్లయి చేయగలము.
  • నిరాహార దీక్షలకు వలసిన టెంట్లు, బల్లలు, పరుపులు, దుప్పట్లు, దిళ్ళు, పెడస్టల్ ఫాన్లు, మైకులు, లౌడ్ స్వీకర్లు, మినరల్ వాటర్ బాటిళ్ళు, పూల దండలు, జెండాలు, ఫ్లెక్సీ బ్యానర్లు, వీడియో కవరేజ్ మొదలైన సమస్త సౌకర్యాలు సమకూర్చుతాము. అన్నట్టు... మోస్ట్ ఇంపార్టెంటు... దీక్ష విరమణకు అవసరమైన నిమ్మరసం ఎల్లవేళలా సిద్ధంగా ఉంచుతాము. దానిని దీక్షితునికి సకాలంలో అందించడానికి తగినంత స్టేచర్ కలిగిన నేతను కూడా మేము ఏర్పాటు చేస్తాము. ఎప్పటి కప్పుడు దీక్షితుని బి.పి., పల్స్ రేటు, బరువు మానిటర్ చేసి, బులెటిన్ జారీ చేయడానికి ఒక ఆంతరంగిక డాక్టరును ఏర్పాటు చేస్తాము. దీక్షితుని కోసం ప్రత్యేకంగా ఒక ఇంప్రువైజ్డ్ టాయ్ లెట్ ను అందుబాటులో ఉంచుతాము. దీక్షితుడు కోరినట్లయితే రహస్యంగా టాయ్ లెట్ లోనే కొన్ని త్రెప్టిన్ బిస్కట్లు కూడా ఉంచగలము. (ఇడ్లీలు కావాలన్నా ఇబ్బంది లేదు) ఇదంతా పూర్తి గోప్యంగా జరుగుతుందని హామీ ఇస్తున్నాము.
  • ఇవి కాక యింకా నడిరోడ్డు వంటా వార్పులు, భోజనాలు, వడ్డనలు, కబడ్డీలు, క్రికెట్లు, బతకమ్మాటలు, పేకాటలు, ప్రత్యర్థుల చిత్రపటాలతో గాడిదలు, దున్నపోతులు, పందుల ఊరేగింపులు, చీపుళ్ళు, కంకర్రాళ్ళు, కర్రలు, డప్పులు, గొంగళీలు, గజ్జెలు, చిందులు, పాటలు... మొదలైన సమస్తహంగులూ ఏర్పాటు చేయగలము. ఊరేగింపులకు అవసరమైన అన్ని వయోవర్గాల మానవ వనరులను సైతం సమకూర్చగలము. వీటన్నింటికీ దేనికి దానికి సెపరేటు రేటు వసూలు చేస్తాము. ఉదాహరణకు - వెయ్యి మీటర్ల పొడుగు పంక్తిలో రెండు వేల మంది భోంచేయవచ్చు. అంతకు తక్కువ ఆర్డరు తీసుకోము. మాకు గిట్టదు. ఏమేం పదార్థాలు వండాలో చెబితే అవే వండుతాము. బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయలు, పెరుగు మొదలైనవన్నీ మావే. పాత్ర సామాగ్రి అంతా మాదే. విస్తళ్ళు, ప్లాస్టిక్ గ్లాసులు, మినరల్ వాటర్ సప్లయి మాదే. వంటంతా మేమే చేస్తాము. కావాలంటే మధ్య మధ్య ఆందోళన కారులు వచ్చి గంజి వార్చుతూ, గరిటలతో కలేబెడుతూ, తిరగమోత బెడుతూ ఫోటోలు తీయించుకుంటే మాకు అభ్యంతరం లేదు.
  • ఇకపోతే, రాళ్ళరువ్వకం, ప్రజా ఆస్తుల, ప్రభుత్వాస్తుల తగులవేత, లాఠీచార్జీ సందర్భాలలో ప్రథమ చికిత్సకు ఏర్పాటు చేస్తాం. బాష్ప వాయువు నుంచి రక్షణకు ఉల్లిపాయల ముక్కలు అందుబాటులో ఉంచగలం. ఈ ఆందోళనల్లో పాల్గొనడానికి మేము సప్లయి చేసే నినాద బాలలు, నినాద యువకులకు ఒక్కొక్కరికి గంటకి యింత అని రేటు వసూలు చేస్తాము. వారికి భోజనాలు మావే. తీవ్రంగా గాయపడిన వారి చికిత్స ఖర్చులను మాత్రం ఆందోళనల నిర్వాహకులే భరించవలసి ఉంటుంది.
  • ఆందోళనకారులపై ప్రభుత్వం తీసుకొనే చర్యలతో మాకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఆందోళనకారులు తమ సొంత బాధ్యతపైనే ఆయా కార్యక్రమాలను నిర్వహించుకోవలసి వుంటుంది. ఈవెంట్ మేనేజ్ మెంట్ మాత్రమే మా బాధ్యత. ఈ సేవల ద్వారా మేము ప్రతి రోజూ కొన్ని వేలమంది నిరుద్యోగ, నిరక్షరాస్య, బాధ్యతారహిత బాలలకు, యువకులకు ఉపాధి కల్పించగలుగుతాము. అంతే కాక, గార్బేజ్ నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే విధంగా వ్యర్థమైపోతున్న హ్యూమన్ ఎనర్జీని ఉపయోగంలోకి తీసుకు రాగలుగుతాము.
  • రాజకీయ నేతల బహిరంగ సభలకు లక్షలాది ప్రజలను లారీలలో తోలుకు రావడమే కాక వారందరికీ బిర్యానీ, పులిహోర పొట్లాలను సప్లయి చేయడం కూడా మా సేవలలో ఒకటి.
  • మరొక్క అతిముఖ్య విషయం. ఇప్పటి దాకా మేము చెప్పిన విషయాలను బట్టి మేము కేవలం రాజకీయ కార్యకలాపాలకు మాత్రమే సేవలందిస్తామని అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాము. మేము అరాజకీయ కార్యకలాపాలకు సైతం సేవలందిస్తాము.
  • ఈ సేవలను అందించడంలో మేము ఏ మాత్రం వర్గవివక్షకు పాల్పడబోమని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాము. అన్ని పార్టీలూ; అన్ని వర్గాలూ మాకు సమానమే. మా రేటు చెల్లించే మాటైతే ఎవరికైనా సరే ఒకే విధమైన అంకిత భావంతో సేవలందించగలము. ఉదాహరణకు - ఒకానొక సమస్యపై రెండు వర్గాల వారు ఘర్షణ పడుతున్నట్లయితే తగిన రేటు చెల్లించేటట్లయితే ఇరు వర్గాలకూ వారు కోరే సామగ్రిని - అనగా రాళ్ళు, కోడిగుడ్లు, దిష్టిబొమ్మలు, కిరసనాయిలు, గాడిదలు, పందులు మున్నగు వాటిని - నిష్పక్షపాతంగా సప్లయి చేయగలమని మనవి చేస్తున్నాము.
  • అపూర్వమైన ఈ నూతన ప్రయోగానికి రెస్పాన్సు ప్రోత్సాహకరంగా ఉండే పక్షంలో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కడప, వరంగల్ వంటి ఇతర పట్టణాలకు సైతం ఈ సేవలను విస్తరింపచేయగలము.

ఈ సేవాపథకానికి తగు ప్రచారం కల్పించవలసిందింగా మీడియా వారిని అభ్యర్థిస్తున్నాము.

నం.పా.సా
(ఇది ఇంతకు ముందు ప్రచురితం కానిది)

Previous Post Next Post