Title Picture

(వైజ్ఞానిక నవల. రచన : రావూరి భరద్వాజ ; ప్రచురణ : బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు; ప్రాప్తి స్థానం 6, సుంకురామ శెట్టి వీధి, మద్రాసు-1. క్రౌన్ సైజు : 100 పేజీలు; వెల : 2 రూపాయలు)

'దేశం, కాలం, పాత్ర-ఈ మూడింటి పరస్పర సంబంధాల పరిణామమే జీవితం. దాని విశ్లేషణమే నవలకానీ, కథకానీ, కావ్యంకానీ. దేశ కాల పరిస్థితుల పరిధిలో కొందరు వ్యక్తుల పరస్పర ప్రవర్తన, దానిపై రచయిత వ్యాఖ్యానం కలిపి నవల అవుతుంది. కషాయంలాగా కనిపించే ఈ నిర్వచనాన్ని పక్కన పెట్టి, సామాన్య పాఠకుల దృష్టితో చూద్దాం. నవల అనగానే అందులో కొందరు మగవాళ్ళూ, ఆడవాళ్ళూ ఉంటారనీ, వాళ్ల వల్ల కొన్ని సంఘటనలు సంభవిస్తాయనీ, వాటి గమనానికి ఒక ప్రయోజనం, హేతువు, గమ్యం ఉంటాయనీ అనుకుంటారు పాఠకులు. అందుకని ఈ 'జలప్రళయం' చదివిన పాఠకులు-దీనికి 'వైజ్ఞానిక నవల' అని ఎందుకు పేరు పెట్టారా అని ఆశ్చర్యపోవడం సహజం.

ఈ పుస్తకంలో మనుషులు ఉన్నారు కానీ, వాళ్ళను పాత్రలుగా జమకట్టడానికి వీల్లేదు. ఇందులో సంఘటనలు ఏమీ లేవు; కథ లేదు; మనస్తత్వచిత్రణ లేదు. ఉన్నవి ఏమిటంటే-భూగోళం, ఖగోళం, గంద్రగోళం, తదితరగోళాలు. ఇది కథకాదు, నవలకాదు. గ్రహాల గమనం, అవి పుట్టిన తీరు, వాటి గురుత్వాకర్షణ శక్తి మొదలయిన వివరాలు ఆధారంగా రచయిత చేసిన ఊహాగానం ఇది. అందుకని దీనికి 'వైజ్ఞానిక ఊహాగానం' అని పేరు పెడితే సమంజసంగా ఉండేది. ఈ ఊహాగానం కూడా పుస్తకం చివరిలో ప్రారంభమవుతుంది. ఈలోగా అన్నీ ఉపన్యాసాలు, సంఖ్యా వివరాలు.

ఇందులో సభలు, సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మానవజాతి కళ్యాణాన్ని గురించి, నాగరికతను గురించి పొడుగాటి ఉపన్యాసాలు ఇస్తారు. భూమి పుట్టిన తేదీ ఏది? అది ఎప్పుడు పెచ్చుగట్టడం ప్రారంభించింది? భూకంపాలు ఎలా వస్తున్నాయి? పర్వతాలు, జలపాతాలు ఎలా పుట్టుకొచ్చాయి? అంగారక గ్రహం చుట్టు కొలత ఎంత? చంద్రమండలం తూకం ఎంత? భూమి నుంచి అంగారక గ్రహానికి, చంద్రమండలానికి దూరాలు ఎంతెంత? చంద్రుని ఆకర్షణ బలంవల్ల భూమి ఆత్మ ప్రదక్షిణ కాలంలో నూరు సంవత్సరాలకు ఎంత తేడా వస్తుంది? (0.001 సెకండుట!), జలప్రళయము లెట్లు సంభవించుచున్నవి మొదలయిన వివరాలను చర్చిస్తారు.

ఇది కేవలం ఖగోళ శాస్త్రపు సంఖ్యా వివరాల జంత్రీ అనుకుంటారేమోనని రచయిత మధ్య మధ్య ".....అంటూ పైపులోకి పొగాకు దట్టించాడు వాల్కాట్"; "....పైపును పళ్ళ మధ్య బిగించి గుప్పున పొగవదుల్తూ తలపంకించాడు" అని కొంత 'యాక్షన్' వ్రాశారు. అటువంటి 'యాక్షన్ బిట్టు'లు వచ్చినప్పుడల్లా పాఠకులు 'ఓహో ఇది నవల కాబోలు' అనుకోవాలి. ఈ వంద పేజీల నవలలో దాదాపు 80 పేజీలు ఈ ఉపన్యాసాలూ, సంఖ్యా వివరాలూ ఉన్నాయి. చివరిలో జలప్రళయం (ఊహాగానం) వస్తుంది. రచయిత చెప్పదలుచుకున్నది ఆ చివరి భాగమే. అది ఏమిటంటే-చంద్రుడు భూమికేసి జరిగినా, భూమి చంద్రుడికేసి జరిగినా చంద్రాకర్షణశక్తి వల్ల సముద్రాలు పొంగి జలప్రళయం సంభవిస్తుంది. భూమికి ఆకర్షణశక్తి హెచ్చినా, చంద్రుడు తన గురుత్వాకర్షణశక్తి కొంత కోల్పోయినా ఇది సంభవిస్తుంది. అలా జలప్రళయం సంభవిస్తే ఏం జరుగుతుంది అని రచయిత ఊహాగానం చేశారు. ఎన్నో సహస్రాబ్దాలుగా మానవుడు నిర్మించిన నాగరకత, అధికార దాహంతో ఎన్నో యుద్ధాలు చేసి నిర్మించిన సామ్రాజ్యాలు నామరూపాలు లేకుండా పోతాయి. భూమిమీద మనిషి అనే విత్తనం లేకుండా పోతుంది. కాగా ఆ చివరి క్షణంలో మానవులు "అయ్యో! భూమి మీద ఉన్న కొద్ది కాలమైనా శాంతిగా, అన్యోన్యంగా జీవించలేకపోయామే, పరస్పరం అసూయా ద్వేషాలతో దుమ్మెత్తి పోసుకున్నామే!" అని పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఆత్మకు నశింపులేదు. మానవజాతి ఈ భూమి మీద నశిస్తే మరొక గ్రహంపై అంకురిస్తుంది. జీవపదార్థానికి చావులేదు. ఇది ఒక పరిణామ క్రమం మాత్రమే. ఇది రచయిత చెప్పదలచుకున్నది. ఇది చివరి కాసిని పేజీలలో చెప్పారు. పఠనీయంగా ఉన్న భాగం అదే. భాష చాలా గంభీరంగా ఉంది. నవలగా వ్రాయడానికి ప్రయత్నించకుండా ఇందులో సగం సైజులో చిన్న ఊహాగానంగా, వ్రాస్తే చాలా బాగుండి ఉండేది. భూగోళ, ఖగోళశాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిగల పిల్లలకు ఈ పుస్తకం చక్కని సమాచార దర్పణంగా పనికివస్తుంది. మొత్తం మీద ఒకసారి చదువతగిన పుస్తకం.

నండూరి పార్థసారథి
(1964 జనవరి 29వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Next Post