Title Picture

(నవల. రచన : సింగరాజు లింగమూర్తి ; ప్రచురణ, ప్రాప్తిస్థానం : నవోదయ పబ్లిషర్స్, విజయవాడ-2; క్రౌన్ సైజు : 227 పేజీలు; వెల : 4 రూపాయలు)

సగటు తెలుగు సినిమా ధోరణిలో నడిచిన సగటు నవల ఇది. అందుచేత సగటు పాఠకులకు నచ్చవచ్చును. చిరపరిచయమైన కథను చిరపరిచయమైన ధోరణిలో రచించారు రచయిత. ఇతివృత్తంలో కాని, భావంలోకాని, భాషలోకాని నవ్యత్వం కనిపించదు. ఈ నవల మొదట 'భారతి'లో సీరియల్ గా ప్రచురితమయింది.

ఇందులో కథానాయకుడు ఒక ఎన్.జి.ఓ. బ్రహ్మచారి. మామూలుగా ఎన్.జీ.ఓలందరి మాదిరిగానే అతనికీ గంపెడు సంసారం; తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెలు, ఆ చెల్లెలు కూతురు కొడుకు-ఇంతమంది ఉన్నారు. ఇతను వంద రూపాయల్లో వీళ్ళందరినీ పోషించాలి. అతను ఇంటికి రాగానే వీళ్ళంతా ఆకలితో నకనకలాడుతూ ఉంటారు. ఎవరికో ఒకరికి విడవకుండా జబ్బు చేస్తూ ఉంటుంది. తల్లి వెచ్చాలు తెమ్మంటుంది. తండ్రి చుట్టలు తెమ్మంటాడు. తమ్ముడు పుస్తకాలు తెమ్మంటాడు. చెల్లెలు తన కూతురికి మందులు తెమ్మంటుంది. బయట అప్పుల వాళ్ళు డబ్బు తెమ్మంటారు. అతను నెలకు నూటికి పదహారు రూపాయల వడ్డీకి అప్పు తీసుకుంటాడు. (వడ్డీ రేటు ఎంత ఎక్కువగా ఉంటే కథనాయకుడిపై అంత సానుభూతి కలుగుతుంది.) ఆ డబ్బును దారిలో ఎవరో కొట్టేస్తారు (పరాకాష్ఠ). నవలలో దాదాపు నాలుగవ వంతు ఈ దారిద్ర్య వర్ణన ఉంది. కథానాయకుడు నటుడు. అతన్ని ఒక లక్షాధికారి కూతురు, ఇంకో పేద అమ్మాయి ప్రేమిస్తారు. అతను లక్షాధికారి కూతురిని ప్రేమిస్తాడు. తర్వాత కొన్ని అపార్థాలు, ఎడబాటు సంభవించి చివరికి మబ్బులు తొలగిపోతాయి. ఇద్దరికీ పెళ్ళవుతుంది. రెండవ అమ్మాయి ప్రేమను త్యాగం చేస్తుంది. ఈలోగా అతను ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీలో ఉత్తమ నటుడుగా ఎన్నికవుతాడు. ఒక సినిమా సంస్థ అతనికి కథానాయకుడి వేషానికి అవకాశం ఇస్తుంది. కాని అతను నాటక రంగం అభివృద్ధి కోసం సినిమా అవకాశాన్ని త్యాగం చేస్తాడు. ఇదీ స్థూలంగా కథ.

ముఖచిత్రం చాలా ఆకర్షణీయంగా, ప్రథమ వీక్షణంలో నవలపై సదభిప్రాయం కలిగించగల విధంగా ఉంది. ధర కొంచెం ఎక్కువే అయినా చూడగానే కొనాలనిపించే విధంగా అందంగా ప్రచురించారు.

నండూరి పార్థసారథి
(1964 ఆగష్టు 15వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post