రవిశంకర్ 'సితార్ కాంచెటో' రికార్డు

'వెస్ట్ మీట్స్ ఈస్ట్' శీర్షికతో విడుదలయిన రవిశంకర్-యెహూదీ మెనూహిన్ సితార్-వైలిన్ జుగల్ బందీ (డ్యూయెట్) రికార్డులు రెండు, లండన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో కలిసి రవిశంకర్ యిచ్చిన 'సితార్ కాంచెటో' రికార్డు చరిత్రాత్మకమైనవి. భారతీయ సంగీత రాయబారిగా రవిశంకర్ సాధించిన ప్రాక్పశ్చిమ సంగీత మైత్రికి చిహ్నాలుగా అవి శాశ్వతంగా నిలిచిపోగలవు. కేవలం ప్రయోగాత్మకమైనవి కావడమే వాటి విశిష్టత కాదు. ఆ రికార్డులలోని సంగీతం అతి శ్రేష్ఠంగా, అపూర్వంగా, అద్భుతంగా ఉన్నది. సంగీత ప్రియులందరూ-ముఖ్యంగా హిందూస్థానీ సంగీత ప్రియులందరూ-తప్పక కొని, విని, భద్రం చేసుకోవలసిన రికార్డులు అవి. వాటిలోని సంగీతం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. వింటే మధురమధురంగా మళ్లీమళ్లీ జ్ఞాపకం వస్తుంది. సితార్ వాదకునిగానూ, సంగీత రచయితగానూ రవిశంకర్ ప్రతిభ ఆ మూడు రికార్డులలో వ్యక్తమైనంత సమగ్రంగా ఇతర రికార్డులలో వ్యక్తం కాలేదు. ఆ మూడూ గ్రామఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియావారు విడుదల చేసిన స్టీరియో లాంగ్ ప్లే రికార్డులు.

మెనూహిన్ ప్రపంచ విఖ్యాత వైలిన్ విద్వాంసుడు. ఆయన 1916లో న్యూయార్క్ లో జన్మించారు. ఏడవయేటనే ఆయన కచేరీలు చేయడం ప్రారంభించారు. అతిచిన్న తనంలోనే ఆయన యూరప్ లోని అన్ని ప్రధాన నగరాలలోనూ కచేరీలు చేశారు. 11వ యేట ఆయన న్యూయార్క్ సింఫనీ ఆర్కెస్ట్రాతో కలిసి బీతోవెన్ వైలిన్ కాంచెటో వాయించగా విద్వాంసులు, విమర్శకులు ఆశ్చర్యచకితులై ఆయన ప్రతిభకు జోహారులర్పించారు. అంత చిన్న వయస్సులో అంత ప్రావీణ్యం ఎలా సాధించారో వారి ఊహకు అందలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ బహుమతులు, బిరుదులు, సత్కారాలు లెక్కకు మిక్కిలిగా లభించాయి. 1968లో ఆయనకు నెహ్రూ అవార్డు లభించింది. రవిశంకర్, మెనూహిన్ ల తొలి సమావేశం 1930 ప్రాంతాల్లోనే జరిగింది. అప్పుడు రవిశంకర్ పారిస్ లో అన్నగారితో కలిసి ఉండేవారు. మెనూహిన్ గురువుగారైన జార్జి ఎనెస్కో ఉదయశంకర్ కు మిత్రుడు. ఒకసారి మెనూహిన్ గురువుగారి వెంట ఉదయశంకర్ ఇంటికి వచ్చాడు. అప్పటికి మెనూహిన్ ఇంకా నిక్కర్లు వేసుకునే కుర్రాడు. ఆ రోజుల్లోనే ఒకసారి మెనూహిన్ వైలిన్ ప్రాక్టీస్ చేస్తుండగా విని రవిశంకర్ ముగ్ధుడైనాడు. అప్పటి నుంచి మెనూహిన్ ను ఆదర్శంగా పెట్టుకున్నారు రవిశంకర్. తిరిగి 1951లో మెనూహిన్ మొదటిసారిగా భారత దేశానికి వచ్చినప్పుడు ఇద్దరూ ఢిల్లీలో కలుసుకున్నారు. ఈసారి రవిశంకర్ సితార్ వాదనం విని మొనూహిన్ ముగ్ధుడైనారు. అప్పటి నుంచి ఇద్దరూ స్నేహితులైనారు. వారి ప్రగాఢ మైత్రి ప్రాక్పశ్చిమ సంగీత మైత్రికి ప్రాతిపదిక అయింది. రవిశంకర్ స్నేహంతో మెనూహిన్ భారతీయ సంగీత తత్వాన్ని బాగా ఆకళింపు చేసుకున్నారు. భారతీయ సంగీతమంత గొప్పది ప్రపంచంలో మరేదీ లేదని ఆయన అంటారు. రవిశంకర్ నుంచి సంగీత పాఠాలు నేర్చుకొనకపోయినా ఇప్పుడు ఆయన రవిశంకర్ ను తన గురువుగా భావిస్తున్నారు. అది ఆ మహావిద్వాంసుని వినయానికి నిదర్శనం.

'వెస్ట్ మీట్స్ ఈస్ట్' రికార్డులలో మొదటిది (ASD 2294) 1967లో విడుదలయింది. ఇందులో ఒకవైపు రవిశంకర్, మెనూహిన్ పూర్తిగా భారతీయ సంగీతం వినిపించారు. రెండో వైపున మెనూహిన్, ఆయన చెల్లెలు హెఫ్జిబా మెనూహిన్ పూర్తిగా పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం వినిపించారు. జార్జి ఎనెస్కో రచించిన ఒక 'సొనాటా'ను వారు వాయించారు. మెనూహిన్ వైలిన్ కు పక్కవాద్యంగా హెఫ్జిబా పియానో వాయించింది. రికార్డు మొదటి వైపున మొదట సుమారు మూడు నిమిషాలు మెనూహిన్ 'గుణ్ కలి' రాగం సోలో వాయించారు. ఆ కాసేటిలోనే కొద్దిగా ఆలాప్ వాయించి, తర్వాత 'గత్' వాయించారు. 'గుణ్ కలి' రాగం 'భైరవ్' థాట్ (మేళకర్త)కు చెందిన రాగం. 'భైరవ్' కర్ణాటక సంగీతంలోని 'మాయామాళవగౌళ'కు సమమైనది. 'గుణ్ కలి' రాగం గాంధార, నిషాదాలు మినహాయించిన 'మయామాళవగౌళ' లాగా ఉంటుంది. మెనూహిన్ వాయించిన 'గత్'ను రవిశంకర్ రచించారు. అది ప్రభాత రాగం కనుక దానికి 'ప్రభాతి' అని ఆయన పేరు పెట్టారు. ఈ అంశం చెప్పుకోదగినంత బాగా లేదు. దీని తర్వాత రవిశంకర్ ఒక్కరూ 'పూర్యాకళ్యాణ్' వాయించారు. ఇది కర్ణాటక సంగీతంలోని 'గమనశ్రమ్' రాగానికి సమమైనది. మంద్రస్థాయితో మొదలుపెట్టి ఆలాప్ లో రాగస్వరూపాన్ని సమగ్రంగా చిత్రించారు. తర్వాత 'జోడ్' (కర్ణాటక సంగీతంలోని 'తానం') వాయించారు. దాని తర్వాత 'గత్' వాయించారు. ఈ రాగాన్ని ఆయన సుమారు పది నిమిషాల సేపు తన సహజశైలిలో గొప్పగా వాయించారు.

దీని తర్వాత రవిశంకర్, మెనూహిన్ కలిసి 'తిలంగ్' రాగం సుమారు 11 నిమిషాలు మహాద్భుతంగా వాయించారు. ఈ ఒక్క అంశం కోసమే ఈ రికార్డును కొనుక్కోవచ్చు. ఈ రాగంలో ముందు రవిశంకర్ ఆలాప్ ప్రారంభించారు. తర్వాత మెనూహిన్ అందుకున్నారు. మొదలు పెట్టడమే తారస్థాయిలో మొదలుపెట్టి, కొద్ది క్షణాలలోనే వైలిన్ పై తన అద్వితీయ పాండిత్యాన్ని ప్రదర్శించారు. చాలా సన్నగా, నాజూకుగా, రహస్యం చెబుతున్నంత సుతారంగా వాయించారు. తారస్థాయి నుంచి ఇంకాఇంకా పై పైకి పోయి వైలిన్ నాదం ఈలలాగా వినిపించింది. ఆ పైన అది వాయులీనమై వైలిన్ కు వాయులీనమనే అనువాదాన్ని సార్థకం చేసింది. వైలిన్ ను అంత పైస్థాయిలో వాయించగలవారు బహుశా మన దేశంలో ఎవరూ లేరు (కొంతవరకు ఎం.ఎస్.గోపాలకృష్ణన్ ఆ మాదిరిగా వాయించగలరు). ఆలాప్ లో రాగస్వరూపాన్ని పూర్తిగా చిత్రించిన తర్వాత రవి, మెనూహిన్ తీన్ తాల్ (16 మాత్రలు) ధ్రుత్ లయలో గత్ ను అందుకున్నారు. ఒకరి నొకరు ఉత్సాహ పరచుకొంటూ, ఉత్తేజ పరచుకొంటూ, కవ్వించుకొంటూ, ఒకరిపై ఒకరు చమత్కార బాణాలు రువ్వుకుంటూ వాయించారు. వారిద్దరినీ కవ్విస్తూ, సవాల్ చేస్తూ అల్లారఖా అద్భుతంగా తబలా వాయించారు. చివరికి ముగ్గురూ కలిసి ఝంఝా మారుతవేగంతో 'ఝాలా' వాయించారు. ఈ 'తిలంగ్' గత్ ను రవిశంకర్ రచించారు. ఈ రచనకు 'స్వరకాకలి' అని ఆయన పేరు పెట్టారు. ఈ అంశాన్ని రవి, మోనూహిన్ 1966లో బాత్ ఫెస్టివల్ లో వాయించారు. ఇందులో మెనూహిన్ కొన్ని చోట్ల ఉధృతమైన వరదలాగా త్రోసుకు వచ్చి రవిశంకర్ ను ముంచి వేసినట్లు అనిపించింది.

'వెస్ట్ మీట్స్ ఈస్ట్' రికార్డులలో రెండవది (EASD 1346) 1970లో విడుదలయింది. ఇందులో మొదటి వైపు 14 నిమిషాల సేపు ఇద్దరూ కలిసి 'పీలూ' రాగం వాయించారు. ఇది కూడా 'తిలంగ్' అంత అద్భుతంగానూ ఉంది. అయితే ఇందులో వైలిన్ కంటే సితార్ చాలా బావుంది. ఇందులో వైలిన్ నాదం 'తిలంగ్'లో ఉన్నంత సున్నితంగా లేదు. కాని 'పీలూ' వాయించిన నాటికి మెనూహిన్ హిందూస్థానీ సంగీత పరిజ్ఞానం ఇంకా పెరిగింది. దీని తర్వాత రవిశంకర్ ఒక్కరూ ఒక అందమైన 'ధున్' వాయించారు. అది జానపద ఛాయలు కనిపించే లలిత శాస్త్రీయ రచన. రెండో వైపున రవిశంకర్ ఒక్కరూ 15 నిమిషాల సేపు 'ఆనందభైరవ్' రాగంలో ఆలాప్, జోడ్, గత్ వాయించారు. ఇది 'భైరవ్' థాట్ కు చెందిన గంభీర ప్రకృతిగల ప్రభాత రాగం. దీని తర్వాత మెనూహిన్, నెల్ గాట్కోవ్ స్కీ కలిసి వైలిన్ యుగళంపై పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం వినిపించారు. ఈ రికార్డులో వాయించిన 'పీలూ' రచననే రవిశంకర్, మెనూహిన్ లు 1967 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి కచేరీలో వాయించారు.

ఈ రెండు రికార్డులలోనూ మెనూహిన్ ప్రదర్శించిన ప్రతిభను బట్టి, ఆయన అప్పటికప్పుడు స్వయంగా స్వరకల్పన చేసి వాయిస్తున్నట్లే అనిపిస్తుంది. కాని, నిజానికి ఆయన హిందూస్థానీ సంగీతం క్రమపద్ధతిలో నేర్చుకోలేదు. ఆయన వాయించిన ఆలాప్, గత్, తాన్ లు అన్నీ రవిశంకర్ ముందుగా రచించి యిచ్చినవే. కాగితం మీద నొటేషన్ చూస్తూ, రవిశంకర్ తో కలిసి ప్రాక్టీస్ చేసి ఆయన వాయించారు. హిందూస్థానీ సంగీతపు గమకాలు ఆయన వైలిన్ మీద పలకలేదు. అయినా రాగ సౌందర్యం చెడకుండా రవిశంకర్ కు సరియైన జోడీగా ఆయన గొప్పగా వాయించారు. ఆయన వైలిన్ పై మన రాగాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి.

ఈ రెండు రికార్డులు ప్రపంచమంతటా విపరీతంగా అమ్ముడైనాయి.

నండూరి పార్థసారథి
(1974 జూన్ 7వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post