Title Picture

దర్శకత్వం: కడారు నాగభూషణం; నిర్వహణ: కడారు వెంకటేశ్వరరావు; మాటలు: సదాశివబ్రహ్మం; పాటలు: సదాశివబ్రహ్మం, ఆరుద్ర, వడ్డాది, వేణుగోపాల్; సంగీతం: అశ్వత్థామ, సాలూరు హనుమంతరావు; ఛాయగ్రహణం: లక్ష్మణ్ గోరే; శిల్పం: గోఖలే; నృత్యం: పసుమర్తి; నటీనటులు: జగ్గయ్య, జమున, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, కన్నాంబ, గిరిజ వగైరా.

వెండి తెరకు సన్నిహితంగా ఉండి తిలకించే వారికి నచ్చే విధంగా, నూటికి దాదాపు 75 మంది మెచ్చే విధంగా, కడారు నాగభూషణం గారి నుంచి ఆశించదగినంత స్థాయిలో నీతి, నినాద ప్రధాన చిత్రంగా రూపొందింది 'ధర్మమే జయం'. వెనక కడారు వారి చిత్రాలు (కనీసం ఒక్కటైనా) చూసినవారికి ఈ చిత్రం ఆశాభంగం కల్గించదు. మెజారిటీ తెలుగు చలన చిత్ర లక్షణ లక్షితం ఈ చిత్రం. చర్విత చర్వణమయే చరిత్రకు ఈ చిత్రమే తార్కాణమేమోననిపిస్తుంది. ఫలితం మాట ప్రజానిర్ణయానికి వదిలేస్తే కడారు నాగభూషణం గారు శాయశక్తులా కష్టపడి చెమటోడ్చి ఈ చిత్రం నిర్మించారని చెప్పవచ్చును.

ధర్మమే జయం, సత్యమే జయం, శ్రీరాముడే ఆరాధ్య దైవము, పతియే ధైవము, ప్రజాసేవయే మానవ ధర్మము, వదినను తల్లి వలె ప్రేమించుము, కష్టపడి చదువుకొనుము వంటి నీతులూ; పెట్టుబడిదారీ విధానం నశించాలి, కార్మికుల కోర్కెలను గమనించాలి, కష్టపడి చెమటోడ్చి పనిచేసి ఉత్పత్తులను పెంచాలి, భారత రిపబ్లిక్ వర్ధిల్లాలి, ఐకమత్యమే కార్మికులకు బలం అనే నినాదాలూ - కలిసి 16 వేల అడుగుల పైచిల్లర పొడుగున కూర్చిన తోరణం 'ధర్మమే జయం'.

'ప్రజాసేవ' (పత్రిక)యే తన సర్వస్వంగా భావించే దేముడివంటి మాధవరావు (గుమ్మడి), భర్త అడుగుజాడలలో నడచుకొనే సహధర్మచారిణి అన్నపూర్ణ (కన్నాంబ), వదినను తల్లి కంటే మిన్నగా ప్రేమించే లక్ష్మణుని వంటి మరిది ప్రభాకర్ (జగ్గయ్య) బీదవర్గానికి చెందిన వారు. మిల్లు యజమాని భుజంగరావు (మిక్కిలినేని), ఆయన కూతురు కమల (జమున), కొడుకు చిదంబరం (రేలంగి), భుజంగరావు బావ మరిది రమేశం (రమణారెడ్డి), ఆయన ఏకైక కూతురు గిరిజ (గిరిజ) ధనికవర్గానికి చెందిన వారు. ప్రభాకర్, కమల, గిరిజ ఒకే కాలేజీలో బి.యే చదువుతూ ఉంటారు. గిరిజ ప్రభాకర్ నీ, అతను కమలనీ, కమల అతన్నీ ప్రేమించుకొంటారు. ముగ్గురూ కలిసి నాటకాలాడుతూ, సైకిళ్ళు తొక్కుతూ, ఉమ్మడిగా బి.యే తప్పుతారు. ఈలోగా మాధవరావు అప్పులవాళ్ళ అగ్నిపరీక్షలో అనేకసార్లు తప్పుతాడు. అయినా అతడు కార్మికులపక్షం వీడిపోక 'ప్రజాసేవ'ను సాగిస్తూ ఉంటాడు. తర్వాత ప్రభాకర్, కమల, గిరిజ సెప్టెంబరు పరీక్షలో ఫస్టు క్లాసులో పాసవుతారు. "ప్రభాకర్ తో పెళ్ళి చేస్తే చెయ్యి, లేదా ఇల్లు విడిచిపోయి, నీ పరువు గంగలో కలుపుతా" అని కమల తండ్రిని బెదిరిస్తుంది. గిరిజ తనని పెళ్ళి చేసుకోమని ఎంత వేధించినా, "ఎప్పటికైనా గొప్పవారు గొప్పవారే, కొద్ది వారు కొద్ది వారే" అని అన్న ఎంత చెప్పినా, కమలనే వివాహం చేసుకుంటానని ప్రభాకర్ పంతం పట్టాడు. ఇద్దరికీ పెళ్ళవుతుంది. తర్వాత ఇల్లరికం, భుజంగరావు మరణం, మాధవరావుకు అపనిందలు తటస్థిస్తాయి. ప్రభాకర్ కు ధనమదం వస్తుంది. కమల భర్తను తృణీకరిస్తుంది. పగ తీర్చుకోవాలనుకున్న గిరిజ చివరకు చనిపోతుంది. చివరికి అంతా పశ్చాత్తాపపడి కథను సుఖాంతం చేస్తారు.

కడారు వారి దర్శకత్వంతో సరితూగే స్థాయిలో రచన, సంగీత దర్శకత్వం, మిగతావన్నీ సాగాయి. రెండు భజనపాటలు, ఒక సైకిల్ సాంగు, రెండు ప్రేమ గీతాలు, రెండు యుగళ గీతాలు, ఒక విషాదగీతం, ఒక కామెడీపాటతో సహా మొత్తం 14 పాటలున్నాయి. పాటల రచనకు కొన్ని మచ్చుతునకలు: 'స్టూడెంట్స్ అన్నిటికీ ముందున ఉంటాము, సూదంటు రాయికి మల్లే చక్కని హృదయాలు', 'స్వాతంత్ర్యం లేనినాడు పోరినాము మన మేగా, మన రాష్ట్రంలేనినాడు తీసుకొచ్చాం మనమేగా', 'చల్లని చక్కని విశాల దేశం సంసేవిస్తామూ, సరిహద్దు (మెక్ మెుహన్ రేఖ) ఏ ప్రొద్దూ సరిగా రక్షిస్తాం' - ఇది సైకిల్ సాంగు; 'మొదటి ప్రేమే ఎంతో సొగసు, దాని సాటి ఏదీ లేదు, చెలిమి తేనెలోన తేలెనుమనసు, వలపు హాయి హాయి చాలును మనకు' - ఇది యుగళగీతం; 'నా కోర్కెలే చెలువారే, మదిలో ఆనందమే మితిమీరే మధురభావాలు రేగాయి. ఓ-మనమదిలో ఈ రేయి' - ఇది మరో యుగళ గీతం; 'దేవదేవ ఈ పరీక్ష దేనికోసమో' - ఇది విషాద గీతం. ఈ రచనకు దీటైన స్థాయిలోనే సంగీత రచన సాగింది. కొన్ని పాటలు మరీ చెవి కోసేసుకోబుద్ధి పుట్టించాయి. మిగతా నృత్యాలు, కళ, అలంకరణ యథోచితంగా ఉన్నాయి. నటీనటులు తథోచితంగా నటించారు.

చిత్రం అంతా చూసిం తర్వాత 'ఔరా!' అనిపిస్తుంది. 'ఎప్పటికైనా గొప్పవారు గొప్పవారే, కొద్ది వారు కొద్ది వారే' అని సినిమాలో మాధవరావు చెప్పిన నీతి జ్ఞాపకం వస్తుంది. నాగభూషణం గారి 'ధర్మం' జయిస్తుందో లేదో చూడవలసి ఉంది.

నండూరి పార్థసారథి
(1960 ఏప్రిల్ 17వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post