Defiant Ones Title Picture

ఒక నీగ్రోనీ, ఒక శ్వేతజాతి యువకుణ్ణీ ఒకే గొలుసుకు బంధించి పోలీసులు తీసుకుపోతూ వుంటారు. నీగ్రో, శ్వేతజాతులమధ్య తరాల తరబడి రగులుతున్న పరస్పర భీషణద్వేషాగ్ని వారిరువురిలో రేగుతున్నది. ఇద్దరినీ ఒకే గొలుసుకు బంధించి నందుకు అసహ్యం, నిస్సహాయత, ఒకరి నొకరు కోపంతో కొరకొర చూసుకుంటూ వుంటారు - పోలీసు కారు కొండదారి వెంట సాగిపోతూంది. నీగ్రో యువకుడు నిర్లక్ష్యంగా, కర్ణకఠోరంగా గీతం ఆలపిస్తూ వుంటాడు. కారులోని వారందరికీ జుగుప్స రేగుతుంది. శ్వేతజాతి యువకుడు కయ్యానికి కాలుదువ్వుతాడు. నీగ్రోయువకుడు తలబడతాడు. ఫలితంగా పోలీసు లారీ బాట పక్కన అగాధంలోనికి దొరలిపోతుంది. పలువురు మృతిచెందుతారు. యువకులిద్దరూ క్షేమంగా బ్రతుకుతారు. తప్పించుకుని పారిపోవటం యిద్దరికీ అవసరమే.

Defiant Ones Picture 1
సిడ్నీ పొయిటీర్, టోనీకర్టిస్

కొండలు అడవులు దాటుకుంటూ, పడరాని పాట్లు పడుతూ, లేస్తూ, పరుగెత్తుతుంటారు. చీకటిపడగానే ఏ పొలాలలోనో నిద్రిస్తూ వుంటారు. తిండిలేక కప్పలను కాల్చుకుతింటారు. గొలుసును ఛేదించాలని విశ్వప్రయత్నం చేసి నిస్సృహతో నిట్టూరుస్తారు. అది విడదీయరాని బంధం. కష్టాలను సమానంగా పంచుకోవలసి వస్తుంది. ఒకరు కాలుజారి గోతిలో పడితే రెండవ వ్యక్తి కూడా పడవలసి వస్తుంది. ఇష్టం లేకున్నా ఒకరి గాయాలకు మరొకరు కట్లు కట్టుకుంటారు. ఇద్దరూ కోలుకోకుంటే తిరిగి ప్రయాణం సాగించటం కష్టం. వెనుక పోలీసులు వేటకుక్కలతో వెంటాడుతున్నారు. క్రమంగా పరస్పర మమకారం అంకురిస్తుంది; పెంపొందుతుంది. సిగరెట్టుకూడా చెరిసగం పీల్చుకుంటారు.

ఒక పట్టణం చేరుకుంటారు. ఆకలి బాధకు ఒర్వలేక అర్ధరాత్రి ఒకరి వంటింట్లో ప్రవేశిస్తారు. చీకటిలో పళ్ళాలనీ, గిన్నెలనీ తన్నేస్తారు. చప్పుడవుతుంది. లైట్లు వెలుగుతాయి. కేకలతో జనం పోగవుతారు. మళ్ళీ పట్టుబడతారు. వారిని గుంజకి కట్టేసి అందరూ వెళ్ళిపోతారు. ఒక మహానుభావుడు వచ్చి యిద్దరినీ కట్లు విప్పి పంపేస్తాడు.

Defiant Ones Picture 2
సిడ్నీ పొయిటీర్, టోనీకర్టిస్

మళ్ళీ ప్రయాణం చేసి ఒక నిర్జన ప్రదేశంలో వున్న ఒక కుటీరానికి వస్తారు. ఆ యింట్లో ఒక అందమైన యువతి ఒంటరిగా వుంటున్నది. ఆమె శ్వేతయువకుని ప్రేమిస్తుంది. ఆమె వారి గొలుసులు తెంపుతుంది. ఆ యువకులను వేరుచేసి, శ్వేత యువకుని తనకు కట్టి వేసుకోవాలని ఆమె ఉద్దేశ్యం. కాని గొలుసులు విడిపోయినా, అంతకంటే దృఢంగా ఆ యువకుల హృదయాలు పెనవేసుకున్నాయి. ఆమె వుద్దేశం గమనించి, మళ్ళీ యిద్దరూ తప్పించుకుని పారిపోతారు.

వారు ఎన్ని అగాధాలూ, నదులూ, కొండలు దాటిపోతున్నా, వేటకుక్కలు పసికట్టుతూనే వున్నాయి, పోలీసులు వెన్నాడుతునే వున్నారు. యువకులు అలసిసొలసి అడుగైనా ముందుకు వెయ్యలేక ఒకరినొకరు కౌగలించుకొని పడుకుంటారు. నీగ్రో యువకుడు నిర్లక్ష్యంగా, స్వేచ్ఛగా ఎలుగెత్తి, తృప్తిగా, కర్ణకఠోరంగా గీతం ఆలాపిస్తూ, మిత్రునికి జోలపాడుతూ వుంటాడు. పోలీసులు వింటారు. పిస్తోలుపట్టుకుని పోలీసు అధికారి వారి ఎదుట నిలబడతాడు. ఎదుట ఏమీ లేనట్లే, పోలీసును చూస్తూనే నీగ్రో నవ్వుతూ, తృప్తిగా పాడుతూ వుంటాడు. పోలీసు పిస్తోలు జేబులోపెట్టేస్తాడు.

Defiant Ones Picture 3
సిడ్నీ పొయిటీర్, టోనీకర్టిస్
- ది ఎండ్ -

నల్లజాతికీ, తెల్లజాతికీ మధ్య వైషమ్యానికి చిహ్నంగా యీ చిత్రాన్ని 'బ్లాక్ అండ్ వైట్'లో చిత్రించారు. ఈ చిత్రంలో నిరాడంబరమూ, వాస్తవికమూ అయిన వాతావరణం, పరాకాష్ట నందుకొన్న దర్శకత్వం, కెమేరా పనితనం, హృదయంగమమైన నిశ్శబ్దమూ, సానుభూతి కల్గించగల సహజమైన నటన, ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభవాన్నిస్తాయి. ఇందులో కెమేరా నిర్వహించిన పాత్ర అద్భుతం. పోలీసులు తరుముకు వస్తుంటే, కొండలు, గుట్టలు, అడవులు, గోతులు, పొలాలు, నదులూ దాటుకుంటూ, పడుతూ, లేస్తూ, భయం భయంగా, కంగారుగా, తొట్రుపడుతూ, రొప్పుతూ, రోజుతూ, వగర్చుతూ, పరుగెత్తుతుంది కెమేరా ఆ యువకులతోపాటు. అలసి, సొలసి, ఆదమరిచి, నిశ్శంతగా, హాయిగా వారు నిద్రిస్తుంటే, నిశ్శబ్దంగా మెల్లగా, రహస్యంగా, వారికి నిద్రాభంగం కల్గించకుండా, పిల్లిలా అడుగులువేస్తూ వారిని సమీపిస్తుంది కెమేరా.

చిత్రంలో సంభాషణలు బహుకొద్ది. సంగీతం యింకా కొద్ది. చిత్రమంతటా నిశ్శబ్దమే ఉత్కంఠను వ్యాఖ్యానిస్తుంది. ఈ మధ్య చాలా ఇంగ్లీషు చిత్రాలలో చెవులు బద్దలుచేసే పియానోలూ, ట్రంపెట్లూ, హేమండార్గన్లతో విసుగెత్తిన ప్రేక్షకులను యీ చిత్రం ఎంతో సేదతీరుస్తుంది.

ఆఫ్రికాలో తెల్లవారు నీగ్రోజాతిని సర్వనాశనం చేద్దామనుకొంటున్న యీ రోజుల్లో ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం యిది. చిత్ర పరిశ్రమలోనివారికీ, ప్రేక్షకులకూ కూడా యీ చిత్రం ఒక సందేశం. తెలుగు నిర్మాతలు, దర్శకులు, ఛాయాగ్రాహకులూ, యీ చిత్రాన్ని తప్పక చూడవలసివుంది.

Stanley Kramer
దర్శకుడు స్టాన్లీ క్రామర్

దీని దర్శకుడు స్టాన్లీ క్రామర్, శ్వేత యువకునిగా టోనీకర్టిస్, నీగ్రో యువకునిగా సిడ్నీ పొయిటీర్ నటించారు. 1960 మే 23వ తేదీన ఈ చిత్రం విడుదలై విజయవాడ అలంకార్ టాకీసులో ప్రదర్శింపబడుతున్నది.

నండూరి పార్థసారథి
(1960 మే 23వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post