'కథ, దర్శకత్వం : శ్రీధర్; మాటలు : ఆచార్య ఆత్రేయ; పాటలు : ఆత్రేయ, ఆరుద్ర, సముద్రాల (సీ), కార్తీక్; కెమేరా : విన్సెంట్; సంగీతం : ఎ.ఎం. రాజా; ప్లేబ్యాక్ : ఎ.యం. రాజా, సుశీల, జిక్కి, జానకి; నిర్మాతలు : ఎస్. కృష్ణమూర్తి, టి. గోవిందరాజన్, శ్రీధర్; నటీనటులు : నాగేశ్వరరావు, బి. సరోజాదేవి, కృష్ణకుమారి, జగ్గయ్య, రేలంగి, గిరిజ, గుమ్మడి-వగైరా.
వేసవి కాలంలో చల్లని, తియ్యని పానీయం తాగినంత హాయినిచ్చింది వీనస్ పిక్చర్సు వారి తొలి కానుక 'పెళ్ళికానుక'. 18,375 అడుగుల కాలంలో ఒక్క అడుగైనా చిరాకు కల్గించకుండా, అన్నిరకాల అభిరుచులవారికీ నూటికి నూరు పాళ్ళు వినోదం సరఫరా చేస్తుంది; విసుగెత్తిన తెలుగు ప్రేక్షకులకు విశ్రాంతినిస్తుంది; తెలుగు చిత్రమని జ్ఞప్తివుంచుకుని, వినోదం కోసం వెళ్ళితే ఈ చిత్రం ఆశాభంగం కల్గించదు.
చాలా బలంగల కథ : నాయికా నాయకులు వాసంతి (బి. సరోజాదేవి), భాస్కర్ (నాగేశ్వరరావు), కాలేజీలో ఒకరి కొకరు పరిచయమై ప్రేమించుకుంటారు. భాస్కర్ ఆమెకు వ్రాసిన ప్రేమలేఖ ప్రిన్సిపాల్ చేతికి చిక్కి, అతను డిస్మిస్ అవుతాడు. వాసంతి తమయింట్లోనే భాస్కర్ కు ఒక గది అద్దెకు యిప్పిస్తుంది.
వారి ప్రేమ పెంపొందుతుంది. వాసంతికి తల్లి, గీత (కృష్ణకుమారి) అనే ఒక అక్క కూడా ఉంటారు. వాసంతి కాలేజీలో చదువుతూ ఉండటం వలన గీత కుటుంబ భారమంతా మోస్తూ ఉంటుంది. చెల్లిలిని ప్రాణంకంటే ఎక్కువగా చూసుకుంటుంది. గీత భాస్కర్ ను ప్రేమిస్తుంది. తన చెల్లెలు అతని ప్రేమిస్తున్నదని ఆమెకు తెలియదు. తన ఆశలను పెంచుకుంటుంది. వాసంతి పరీక్ష పాసై ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. భాస్కర్ కు జ్వరం వస్తే గీత సేవ చేస్తుంది. పెళ్ళి ప్రస్తావన రాగా గీత తన మనోభిప్రాయాన్ని చెల్లెలికి వెల్లడిస్తుంది. చెల్లెలు నిర్ఘాంతపోతుంది. చిన్న తనం నుంచి తనను ప్రాణాధికంగా ప్రేమించిన అక్క కోర్కె, తన ప్రేమ వల్ల భగ్నం కావటం ఇష్టం లేకపోతుంది. తనను మరిచిపోయి, తన అక్కను వివాహమాడి తన కోసం ఆమెను సుఖపెట్టమని వాసంతి భాస్కర్ ను వేడుకొంటుంది. ప్రమాణం చేయించుకొంటుంది. గీత, భాస్కర్ లకు వివాహమవుతుంది. ఉద్యోగం ట్రాన్స్ ఫర్ కావటం వల్ల గీత, భాస్కర్ విశాఖపట్టణం వెళ్లిపోతారు. వాసంతి పని చేస్తున్న ఆఫీసు మేనేజరు రఘు (జగ్గయ్య) వాసంతిని ప్రేమిస్తాడు. తన అభిప్రాయం చెబుతాడు. ఆమె తన విషాదగాధ అతనికి చెప్తుంది. ఆమె మంచితనానికి ముగ్ధుడై, భగ్నహృదయుడై అతడు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెళ్లిపోతాడు ఎక్కడికో. కొంత కాలానికి వాసంతి తల్లి మరణిస్తుంది. వాసంతి అక్క ఇంటికి చేరుతుంది. అప్పటికి గీతకు ఒక బాబు పుట్టుతాడు. తర్వాత గీతలో అనుమానాలు చెలరేగుతాయి. ఇవి గ్రహించి వాసంతి యిల్లు విడిచి వెళ్లిపోతుంది. కారు క్రింద పడి గాయాలతో ఒకాయన యింటికి చేరుతుంది. నిజం తెలుసుకున్న గీత పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. వాసంతిని చేరదీసిన ఆయన కుమారుడే రఘు. మళ్ళీ ఇద్దరూ తారసిల్లుతారు. అతని సుగుణాలకు ఆమె ముగ్ధురాలవుతుంది. వివాహం చేసుకోకుండా అక్కవద్దకు వెళ్లడం ఆమె సంసారంలో కలవరం తేవటమే అవుతుందని భావిస్తుంది. అతడిని వివాహమాడటానికే నిశ్చయించుకుంటుంది. గీత జబ్బుతో మంచంపట్టి మరణిస్తుంది. వాసంతిని బాబుకు తల్లిగా చేయమని కడసారి కోర్కె కోరుతుంది. భాస్కర్ ప్రమాణం చేస్తాడు. ఇంతలో వాసంతి పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తుంది. బాబును తీసుకుని త్వరత్వరగా వెళ్తాడు. కాని సమయం మించిపోతుంది. బాబును వాసంతికి పెళ్లి కానుకగా సమర్పించి ఎక్కడికో వెళ్లిపోతాడు.
ఇంత విషాద సన్నివేశాలతో ప్రేక్షకుల మనస్సులకు అలసట కలుగకుండా, రేలంగి సంసారపు పిట్టకథను అడుగడుగునా చక్కగా అల్లుకుంటూ వచ్చారు. అసలు కథతో అతడికి నిమిత్తం ఏమీ లేకపోయినా, అడపాతడపా బలవంతంగా చొరబడి కడుపు చెక్కలయ్యేట్టు నవ్వించి గప్ చిప్ గా నిష్క్రమిస్తూ ఉంటాడు. కొన్ని సన్నివేశాలలో మరీ కంటతడి పెట్టించేటంత అద్భుతంగా ఉంది రేలంగి హాస్యం. కృష్ణకుమారి చాలా నిండుగా, మితంగా, ప్రశాంతంగా, హాయిగా నటించింది. చిత్రం అంతటా ఆమె మీద ఎనలేని సానుభూతి కలుగుతుంది. బి. సరోజాదేవి తెలుగు ఉచ్చారణ ముద్దుముద్దుగా ఉంది. ఎంత అందంగా ఉందో అంత సమర్థవంతంగా నటించింది. తెలుగు, తమిళం, హిందీ రంగాలలో కూడా ఈమెకు ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నదనిపిస్తుంది. నాగేశ్వరరావుకు ఇటువంటి పాత్ర నిర్వహించటం సరిక్రొత్తకాదు. ఆయన నటన మామూలుగా బావుంది. జగ్గయ్య మితంగా నటించాడు.
ఈ చిత్రంలో దర్శకత్వాన్నీ, ఛాయాగ్రహణాన్నీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నత స్థాయిలో ఉన్నది. చిత్రంలో ఎక్కడా, ఏ అంశము కూడా అతిగా లేకుండా, 'నీట్'గా ఉంది. చిత్రీకరణలో దర్శకుడు ఎంతో ప్రతిభ ప్రదర్శించాడు. ఒక్క సన్నివేశం కూడా బిగువు తగ్గటం గానీ, నీరసంగా గానీ లేదు. చకచకనడిచే కథకు పాటలుగానీ, నృత్యాలుగానీ అనవసరంగా అవరోధం కల్పించటం జరగలేదు. తెలుగు చిత్రాల అవధిలో పరికిస్తే కెమేరాపని చాలా గొప్పగా ఉందని చెప్పవచ్చును. కెమేరా ఒక్కక్షణం కూడా సోమరిగా నిలవకుండా చాలా చరుకుగా, విహరించింది. చిత్రమంతటా ప్రతి దృశ్యమూ నేత్రపర్వంగా ఉంది.
ఎ.యం. రాజా సంగీతం ఈ మధ్య చాలా చిత్రాలలో కంటే చక్కగా ఉన్నది. ఉన్నవి ఎనిమిదే పాటలు. దాదాపు అన్నీ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా 'పులకించని మది పులకించు', 'ఆడేపాడే పసివాడ' (దీపావళిపాట) అనే పాటల వరసలు చక్కగా ఉన్నాయి. అన్ని పాటలు జనానికి అందుబాటులో ఉంటాయి. ఈ చిత్రంలోని పాటలన్నీ తమిళంలో (కళ్యాణపరిసు) రికార్డు బ్రేక్ చేశాయి. అంత విపరీతంగా ఏ సినిమా రికార్డులా అమ్ముడుపోలేదట. తెలుగులోనూ ఒకటి రెండు పాటలు అంత విశేషంగానూ ఆదరణపొందే అవకాశమున్నది. సాధ్యమైనంత వరకు శబ్దం అధికం కాకుండా వాద్యాలను లలితంగానే ప్రయోగించాడు రాజా.
'నా అమర ప్రేమను త్యాగం చేశాను. నా సర్వస్వాన్నీ అర్పించాను'. 'ఆత్మార్పణ', 'అమృత మూర్తి' 'భగృహృదయం' వగైరా పదాలు వాడకుండా ఉంటే పాత్రలమీద ప్రేక్షకులకు ఇంకా ఎక్కువ గౌరవమూ, సానుభూతీ కలిగే అవకాశం ఉన్నది. ఆత్రేయ రచన ఆయనకు బాగా అలవాటైన దోరణిలో ఉన్నది. ఆయన స్క్రిప్టు వ్రాస్తే 100 రోజులు నడిచి తీరుతుందని వాదించేవారు ఈ చిత్రంతో మరొకసారి నెగ్గుతారు. ఆయన సృష్టించిన హాస్యం బావుంది.
ఈ చిత్రం లోగడ 'కణ్యాణపరిసు' అనే పేరిట తమిళంలో రజతోత్సవాలు జరుపుకుంది. పిన్నాపెద్దా అంతా కుటుంబసమేతంగా చూసి వినోదించతగిన చిత్రం 'పెళ్లికానుక'. ఆర్థిక విజయం నిస్సందేహం.
నండూరి పార్థసారథి
(1960 మే 1వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)
Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works