Title Picture

(నవల రచన : కీ.శే. గోపీచంద్; ప్రచురణ, ప్రాప్తిస్థానం : నవోదయ పబ్లిషర్స్, విజయవాడ-2; క్రౌన్ సైజు : 330 పేజీలు; వెల : ఆరు రూపాయలు)

ప్రభుత్వ యంత్రాంగమనే 'యమపాశం'లో చిక్కుకున్న గుమాస్తా జీవితానికి ప్రతిబింబం ఈ పుస్తకం. అడుగడుగునా విరక్తి పుట్టించే నిస్సారమైన జీవితంలాగా ఉంటుంది ఇది.

చీఫ్ సెక్రటేరియట్ లో పనిచేసే వారి నుంచి మచ్చుకు ఒక సగటు గుమాస్తాను తీసుకుని, అతని దారిద్ర్యాన్ని, సంసార బాధ్యతలను, ఆఫీసు గొడవలను, సమస్యలను వర్ణించారు రచయిత. గుమాస్తా పాత్రను చాటుచేసుకుని ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. కొన్ని చోట్ల పాత్రపరంగా కాక తానే స్వయంగా జోక్యం చేసుకుని విమర్శలు చేశారు. విమర్శలో వ్యంగ్యం లేదు-సూటిగానే ఉంది.

ప్రభుత్వోద్యోగిగా గడించిన అనుభవంతో గోపీచంద్ ఈ 'నవల'ను వ్రాసినట్లు 'మున్నుడి'లో పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని రచయిత పరిశీలించిన తీరు బాగుంది, విమర్శబాగుంది. కాని నవలగా ఇది జయప్రదమైన ప్రయత్నం కాదు. ప్రభుత్వాన్ని నిర్దాక్షిణ్యంగా విమర్శించి, లోపాలను ఎత్తిచూపే రచనలు అవసరమే. అటువంటివి చాలా తక్కువగా కూడా ఉన్నాయి. కానీ రచయిత విమర్శల గొడవలో పడి తను వ్రాస్తున్నది నవల అనీ, దానికి ఒక కథ, కథకు గమనం, గమనానికి లయ ఉండాలనీ మరిచిపోయారు. ఆవేశంలో, ఝంఝావేగంతో విమర్శ చేస్తూ-మధ్యలో హఠాత్తుగా కథ జ్ఞాపకం రాగా, నాలిక కరుచుకుని, విమర్శను కట్టి పెట్టి, మళ్లీ కథలోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. మాటి మాటికీ కథ ఆయన విమర్శకు బంధంగా తగుల్కొంటుంది. ఆయన దీనిని నవలగాకాక ఒక బృహత్ వ్యాసంగా వ్రాస్తే బాగుండేది. ఇంకా స్వేచ్ఛగా, నిరాటంకంగా విమర్శించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఇది-నవల వ్రాయబోయి వ్యాసం, లేక వ్యాసం వ్రాయబోయి నవల వ్రాసినట్లుగా రూపొందింది. ఈ రచనలో పారడీ కూడా ఏమీలేదు.

సగటు గుమాస్తా జీవితంలో రసవత్తరమైన ఘట్టాలు ఏమి ఉంటాయి? అతని జీవితం ఎప్పుడూ ఒకే రకంగా, నిస్సారంగా, ఏమాత్రం ఆకర్షణ లేకుండా, ఉత్కంఠ అసలే లేకుండా ఉంటుంది. ఈ నవలా అలాగే ఉంది. గుమాస్తా జీవితంలోని ఏ భాగాన్ని పట్టుకుని చూసినా ఒకేమాదిరిగా ఉంటుంది. ఈ నవలలో ఏ పేజీ తిప్పిచూసినా కథ ఎక్కడి దక్కడే ఉంటుంది. నవలను ముందు నుంచి వెనక్కు చదివినా, వెనక నుంచి ముందుకు చదివినా దాదాపు ఒకేరకంగా, అంతటా విమర్శలు, సమస్యలే కనిపిస్తాయి. నవల ఆదిమధ్యాంతరహితంగా కనిపిస్తుంది.

గెజిటెడ్ ఆఫీసర్ల మనస్తత్వం, గుమాస్తాల మనస్తత్వం, లంచాలు ఇచ్చిపుచ్చుకోవటాలలో లౌక్యం, అప్పులవాళ్ల మనస్తత్వం, ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను గురించి రచయిత చాలా చక్కగా వర్ణించారు. ప్రభుత్వానికి ఇది గొడ్డలిపెట్టు.

గోపీకృష్ణ అనే అతను రాజమ్మకు అన్న అని పదిహేనవ పేజీలో వ్రాశారు. 85వ పేజీలో అతను తమ్ముడుగా మారి, మళ్లీ 95వ పేజీలో అన్నగా మారాడు.

మంత్రులు, ప్రభుత్వోద్యోగులు తప్పక చదవ వలసిన పుస్తకం 'యమపాశం'. ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉంది.

నండూరి పార్థసారథి
(1965 ఏప్రిల్ 14వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post