Humor Icon

"ఏల్రు గుడివాడ, ఏల్రు గుడివాడా, ఆ... ఎవరండీ వచ్చేదీ... ఎల్లిపోతోందీ" అంటూ క్లీనర్ కుర్రాడు అరుస్తున్నాడు 1123 పుట్ బోర్డ్ మీద నుంచుని. ఎవరూ వచ్చేవాళ్ళూ లేకపోవడం వల్ల, సవిలాసంగా యీలవేసి ''రా....యిట్'' అని కేక పెట్టి, కడ్డీ పట్టుకుని వేళ్ళాడుతూ నుంచున్నాడు క్లీనర్ కుర్రాడు. 1123 వయ్యారంగా, ఠీవిగా బయల్దేరింది. ఏలూరు బస్ స్టాండ్ నించి హారన్ మోగిస్తూ వాయువేగ మనో వేగాలతో పోతోంది 1123. ''ఎంతయినా చెవర్లెట్ చెవర్లెటే కదండీ'' అని కుర్రాడు పక్కనున్న పెద్ద మనిషితో బ్రహ్మాండంగా కోసేస్తున్నాడు. కార్లో వాళ్ళంతా చెవులు నిక్కబొడుచుకుని వింటున్నారు ఆసక్తితో. ''అరే మొన్న మనకీనూ ఆ 75 గాడికీను పడిందిరా కామ్టేషన్. మేం పుట్టగుంట దగ్గర ఆగే తలికి నాయాల కాస్ చేసిపారేశాడు. బోళ్ళంత మంది ఆడంగులూ, లగేజీ పడిందసె. మళ్ళీ బయల్దేరేసరికే రెండు నిమిషాలు పట్టింది. తస్సదియ్య బాబూరావు అప్పటికే 'లింగాల' దాటిపోతే!. ఇహ మనవాడు పోనిచ్చాడు చూసుకో, నా సామిరంగా, చెవర్లెట్ తడాఖా అంతా చూపించాడనుకో. భూమ్మీద నిలిచిందా. మేఘాల మీద పోతే. ఆరుగొలను వచ్చేతలికీ కాస్ చేసి పారేశాడు. బాబూరావు మొహం యింతయిపోయిందంటే నమ్ము'' అని బ్రహ్మాండంగా కోసేస్తున్నాడు క్లీనరు.

చెకింగు వచ్చిన కాసేపు తప్ప క్లీనర్ దే ప్రతాపమంతా, ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏల్తుంటాడు కారు నందటినీ. వాడి నోరు మూతబడదు. అసలు క్లీనర్లంతా ఇంతే. వాళ్ళ భాష అంతా ఇదే ధోరణిలో ఉంటుంది. నవ్వుకుంటూ, సిగరెట్ పీలుస్తూ, ఈల వేసుకుంటూ సినిమా పుస్తకం తీసి బిగ్గర పాటలు పాడుతూ ఆడవాళ్ళ వైపు ఫోజులు విసురుతూ ఉంటాడు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే కార్ల వాళ్ళదంతా ఒక ప్రత్యేక ప్రపంచం. వాళ్ళు మాట్లాడేది కార్ల భాష. ఈ క్లీనర్ కుర్రాళ్ళు సీటు ఉన్నా కూర్చోరు. కడ్డీ పట్టుకు వేళ్ళాడుతూ నుంచుంటారు విలాసంగా. కారు జంక్షన్ దాకా వచ్చి సడన్ బ్రెకు వేసి గుడివాడ రోడ్డు వైపు వచ్చి నిలిచింది. డ్రైవరు, కండక్టరు, క్లీనరూ దర్జాగా దిగి పోజుగా వొళ్ళు విరుచుకుని అందరూ చూసేలా హోటల్లోకి వెళ్ళారు. కాఫీ త్రాగి, సిగరెట్ ముట్టించేసరికి ''ఎనక బస్సు వచ్చింది లెగండి'' అని కుర్రాడు హెచ్చరించాడు. అందరూ బస్సు ఎక్కారు. కారు మళ్ళీ వాయువేగాన పోతోంది.

కానుమోలు దాకా వచ్చేసరికి క్లీనరు ''వెధవ వస్తున్నాడు'' అని మనస్సులో గొణుక్కుని ''చెకింగ్ వత్తుండాడు. కూతంత స్లో చెయ్యండి బుచ్చియ్ గారూ'' అన్నాడు. 'కార్లు స్లో' చేశారు. నల్లగా, లావుగా, ఎత్తుగా నిగ నిగలాడే ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ ఎక్కి ''రా... యిట్'' అన్నాడు. కారు పోతోంది. ఆ వచ్చిన వ్యక్తి చెకింగ్ మాణిక్యాలరావు. అతనే మన కథా నాయకుడు. కాకీ నిక్కరు, హాఫ్ షర్టూ వేసుకున్నాడు. జేబులో పెన్నూ, పర్సూ వున్నాయి. కుడిచేతికి వున్న ఆరు వేళ్ళలోనూ ఐదు వేళ్ళకి ఉంగరాలున్నాయి. వస్తూనే 'ఏరా బామ్మరిదీ కులాసాగా వున్నావా' అంటూ సరదాగా క్లీనరు వీపు మీద చరిచాడు. అతని వీపు పేలిపోయింది. మాణిక్కాలరావు ఏ బస్సు ఎక్కినా క్లీనర్ ని వీపుమీద చరవటం, 'ఏరా బామ్మరిదీ' అనటం సరదా. క్లీనర్లు బస్సుకి రాజులవుతే యితను మొత్తం 'ఏల్రుగుడాడ' రూటుకే చక్రవర్తి. కార్లోని ఆడవాళ్ళకేసి పోజులు విసురుతూ ఈలవేస్తూ, కుర్రాణ్ణి 'ఏరా బామ్మరిదీ' అని మొట్టికాయలు మొట్టుతుంటాడు. కార్లో కాస్త అందమైన ఆడవాళ్ళుంటే యీ ప్రవర్తనే కాస్త మోతాదు హెచ్చుతుంది. అతను చరిచే చరుపులకు ఏడిస్తే కార్లోవున్న అందమైన అమ్మాయిలు ఎక్కడ నవ్వుతారోనని ఆ బామ్మరిది బిక్క మొగంతో లేని నవ్వు తెచ్చుకుంటుంటాడు. ఆ మాణిక్యాలకి యిలాంటి బామ్మరుదులు ఒక 40 మంది వున్నారు ఆ రూటులో. అతగాడు కారు ఎక్కుతుంటేనే క్లీనర్ల ప్రతాపం అణిగిపోతుంది. మనస్సులో తెగ తిట్టుకుంటారు. క్లీనరు ఎంతో కష్టపడి ఏలూరి దగ్గర్నుంచి జంక్షన్ దాకా తెచ్చుకున్న ప్రతిష్టనంతా కానుమోలు దగ్గర ఎక్కిన మాణిక్కాలరావు మంట గలిపేస్తున్నాడు. అయితే ఆంజనేయులు వారి గుడి దగ్గర అతను దిగిపోగానే, మళ్ళీ ప్రతిష్ఠని పునః ప్రతిష్ఠించుకోవాలంటే క్లీనరుకి 'పుట్టగుంట' దాకా రావాల్సి వుంటుంది. అతను దిగివెళ్ళగానే ''వెదవ నాయాల, మోట ఎదవ, మరీగాడిద సరసం అండీ, పెద్ద పోజూ వాడూను చూశారుగా'' అంటూ మొదలెట్తాడు క్లీనర్. కాని అతని ఎదురుగుండా కిక్కురు మనలేడు. ఎంతయినా పెద్ద ఆఫీసరు కదా.

ఇక యీ మాణిక్కాలరావు అన్నిటిలోనూ తన ప్రత్యేకత చూపుకుంటూనే వుంటాడు. అందరు చెకింగులు పెన్సిళ్ళతో సంతకాలు చేస్తే యితను పెన్ ఉపయోగించేవాడు. ఈ మధ్య అప్పుడప్పుడు వాళ్ళు కూడా పెన్ తో సంతకాలు చేస్తుండటం వల్ల ప్రస్తుతం ఎర్రసిరాతో సంతకం చేస్తున్నాడు. ఇది వరకు దాకా చార్మినార్ సిగరెట్లు కాల్చేవాడు. ఇప్పుడిప్పుడు క్లీనర్ దగ్గర్నుంచీ బీడీలు మానేసి సిగరెట్లు తాగటం మొదలు పెట్టేసరికి బ్రాండు బర్ల్కీకి మార్చక తప్పలేదు. ఇదంతా మన కథానాయకుణ్ణి గురించిన ఉపోద్ఘాతం. ఇక అసలు కథలోకి వద్దాం.

మాణిక్కాలరావు ట్రిప్ షీట్ తీసి అంతా చూసి లెక్క ఏదో కాస్త తప్పితే కండక్టరుని గట్టిగా నాల్గు చీవాట్లు పెట్టి అడుగున ఎర్రసిరాతో సంతకం చేశాడు. ఇంతలో బస్సు ఆగింది. ఒక అందమైన అమ్మాయి, ఆమె భర్త, ఒక చంటి పిల్లాడు ఎక్కారు. బస్సులో వేరే ఖాళీ లేకపోవడం చేత యిద్దరూ ఒకే సీటులో కూర్చున్నారు పక్క పక్కగా. బస్సు కదిలింది. ఎవరిగొడవలో వారున్నారు. భార్యా భర్తలిద్దరు నవ్వుకుంటూ కబుర్లలో మునిగిపోయారు. వారిద్దరి మధ్య వారి తొమ్మిది నెలల పంట ఆడుకుంటున్నాడు. ఆయన్ని చూస్తున్న కొద్దీ మాణిక్కానికి కడుపు తరుక్కుపోతోంది. క్లీనరు వీపు మీద చరిచి ''ఏరా బామ్మరిదీ'' అన్నాడు. ఫలితం కనిపించలేదు. ఈల పాట పాడాడు. ఏవో బిగ్గరగా మాట్లాడుతున్నాడు. కాని ఆమె తన వైపు తల తిప్పలేదు. వాళ్ళు కబుర్లాపలేదు. మాణిక్కాలు క్రుంగిపోతున్నాడు. ఎక్కడైనా ఆడంగులు ఎక్కుతారేమో, ఆయన్నక్కణ్ణుంచి తరిమేసి అక్కడ కూర్చోపెట్టొచ్చు అనుకున్నాడు. బస్సు ఎన్నిసార్లు ఆగినా మగవాళ్ళు ఎక్కుతున్నారు గాని ఆడవాళ్ళు ఎక్కడం లేదు.

ఇంతలో అతను దిగాల్సిన చోటు వచ్చింది. ''అరే బుచ్చీ స్లో చెయ్యరా'' అని దిగకమునుపే 'రా... యిట్' అని విలాసంగా దిగబోయి బోర్ల పక్కలుగా పడ్డాడు. కారు దూసుకుపోయింది ఆగకుండా. కార్లో వాళ్ళంతా నవ్వుకోవడం వినిపించింది అతనికి. ఆ అమ్మాయి అద్దంలోంచి తనని చూడటం కళ్ళారా చూశాడు. మోకాళ్ళూ మోచేతులు కొట్టుకుపోయాయి. అవమానంతో మొహం ముడుచుకుపోయింది. క్లీనర్ కుర్రాడి కసి తీరింది. 40 మంది క్లీనరు కుర్రాళ్లూ ఏకగ్రీవంగా దేవుణ్ణి ప్రార్థించివుంటారు ఇలా జరగాలని. ''ఎదవ నాయాలు... తిక్క కుదిరింది. లేకపోతే అంత పోజు, అదిరి పాటా, కారు కాస్త 'స్లో' అయ్యేదాకా ఆగితే వాడి పరువేమయినా పోతుందా? మంచి శాస్తి జరిగిందిలే'' అన్నాడు క్లీనరు. మాణిక్కాలరావు ఆరేళ్ళ సర్వీసులో ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు. సాయంకాలం అయ్యేసరికి ఈ వార్త కార్ల ప్రపంచమంతా మోగిపోయింది. క్లీనరు కుర్రాళ్ళంతా సంతోషించారు. తోటి చెకింగులంతా సన్నగా చివాట్లు పెట్టారు అంత అదిరిపాటా అంటూ. మిగతా వాళ్ళంతా సంసారులు. కాస్త నెమ్మదస్తులు. తర్వాత 4, 5 రోజుల వరకూ మాణిక్యం ప్రతాపం అణిగిపోయింది. మొత్తానికి రూట్ అంతా చిన్నబోయింది అతని హడావిడి లేకపోయేసరికి. తరవాత మళ్ళీ పుంజుకొని ప్రస్తుతం మునుపటి లాగానే ఉన్నాడు. మాణిక్కాలరావు వేళ్ళకి ఉన్న ఐదు ఉంగరాల్ని చూసి సంబంధాల మీద సంబంధాలు వస్తున్నాయి పెళ్ళికి. చివరికి ఒక సంబంధం నిశ్చయించుకుని లగ్నం పెట్టుకున్నారు. మూడు వేలో, నాలుగు వేలో కట్నం ఇస్తున్నారు. మాణిక్కాలరావు ఎంత లావుగా, ఎత్తుగా, నల్లగా ఉన్నాడో పెళ్ళి కూతురు అంత సన్నగా, పొట్టిగా, ఎర్రగా ఉంటుంది. ఈ నలభై మంది కాక ఇంకో ఇద్దరు బామ్మర్దులు అదనంగా వస్తున్నారు. ఇంకా పది రోజులు మాత్రమే ఉంది పెళ్ళి. అందరికీ శుభలేఖలు పంచిపెడుతూ మంచి జల్సాగా ఉన్నాడు. తొమ్మిది రోజులు గడిచిపోయి పదవ రోజు ఇట్టే వచ్చింది. పెళ్ళి పందిరంతా డ్రైవర్లతో, కండక్టర్లతో, క్లీనర్లతో చెకింగులతో కిక్కిరిసిపోయింది. పెళ్ళి పెత్తనమంతా క్లీనరు కుర్రాళ్ళదే. ఎక్కడ చూసినా తామే అయి పనులు చేస్తున్నారు. వీళ్ళందరికీ 1123 క్లీనరు నాయకుడు. ముహూర్తం సమీపించింది. వధువు గళాన వరుడు మంగళసూత్రం కట్టాడు. అందరూ అక్షతలు చల్లారు. వధూవరులను ఆశీర్వదించారు. ఇక భోజనాలు ప్రారంభమయినాయి. క్లీనరు కుర్రాళ్ళంతా తలొకటీ పట్టుకుని వడ్డిస్తున్నారు. మాణిక్కాలు అన్ని పంక్తులూ తిరుగుతూ అందరికీ అన్నీ అందుతున్నాయో లేవో అని చెకింగ్ చేస్తున్నాడు. అరే 1475 మామగారికి పప్పు కావాలంట కూతంత కనుక్కో అన్నాడు. పెళ్ళి పందిరంతా కార్ల భాషే వినిపిస్తూంది. మిస్టర్ 1123 అప్పడాలు, వడియాలు పుచ్చుకున్నాడు. ''ఆ... అప్పడాలు, వడియాలు... అప్పడాలు, వడియాలు... ఎవరికండీ'' అంటూ ఆ తొందరిలో మర్చిపోయి ''ఆ ఏల్రు గుడివాడ ఏల్రు గుడివాడ వెళ్ళిపోతోంది'' అని అన్నాడు. అందరూ నవ్వేసరికి స్పహ వచ్చింది ఆ కుర్రాడికి. మొత్తాన్నికి సలక్షణంగా జరిగిపోయింది భోజనోత్సవం. 40 మంది బామ్మర్దులు విసుకూ విరామం లేకుండా పనిచేస్తుంటే సలక్షణంగా జరగక ఏం చేస్తుంది. 1475 కిళ్లీలు పంచిపెడుతున్నాడు. ''ఆ... కిళ్లీలు తీసుకోండి... ఆ బుచ్చియ్యగారూ కిళ్లీ తీసుకోండి... ఆ ఇంకెవరికండీ...'' అంటూ మర్చిపోయి అలవాటు ప్రకారం ''ఆ పంతులుగారూ మీ టికెట్టు తీసుకోండి... యింకెవరికి రావాలండీ చిల్లర'' అంటున్నాడు.

పెళ్ళయిన మర్నాటి నుంచీ మళ్ళీ మాణిక్కాలరావు లైను మీదికి రాక తప్పలేదు. పెళ్ళి అయిన దర్జా పోకమునుపే మళ్ళీ యూనిఫారమ్ వేసుకుని రావటానికి నామోషీ వేసింది. ఓనరుగారి దగ్గర కెళ్ళి పర్మిషను తెచ్చుకున్నాడు వారం రోజులుకి. పసుపు కుంకుమ అంటిన మధుపర్కాలతో మళ్ళీ బస్సు ఎక్కాడు. పసుపుతో నిండిన తల్లోంచి అక్షింతలు దులుపుకున్నాడు పోజుగా. ఇలా వారం రోజులు మధుపర్కాలతో లైనుమీదికి వచ్చేవాడు. తర్వాత యిక యూనిఫారమ్ వెయ్యక తప్పలేదు. అయినా దర్జాకి లోపం రాకుండా గంజిపెట్టి యిస్త్రీ చేసిన నిక్కరూ షర్టూ వేసుకొస్తున్నాడు. తాత్కాలికంగా బ్రాండు బర్ల్కీ నుంచి గోల్డ్ ప్లేక్ కి మార్చాడు. తర్వాత క్రమంగా యింకో వారం తిరిగే సరికి మామూలు మనిషయ్యాడు.

రోజు లెంత మందకొడిగా గడుస్తున్నా కార్ల ప్రపంచంలో వారికి మాత్రం అవి నిత్య నూతనంగానే వుంటాయి. ఏ 'భలే రాముడు' సినిమా బోర్డు మీదో రెండో వారం పోయి మూడో వారం పోస్టర్ వచ్చినప్పుడు మాత్రం తెలుస్తుంది వారం గడిచిపోయినట్లు మాణిక్కాలరావుకి. ''తస్సదియ్య ఒక్క ట్రిప్పులాగా ఎల్లిపోయిందే వారం'' అనుకునేవాడు. ఒక రోజు 1475 ట్రిప్ షీట్ మీద ఎర్రసిరా సంతకం పెట్టి యాదృచ్చికంగా ఆడవాళ్ళ సీటు వైపు దృష్టి సారించాడు. అక్కడ ఒక మాదిరి అందమైన అమ్మాయి కనుపించింది. ''ఏమిటి యిందాకట్నుంచీ చూశాను కానూ'' అనుకుంటూ ''ఏరా బామ్మరిదీ'' అని కుర్రాడి బుజం మీద చరిచాడు. ఆ అందమైన అమ్మాయి అతని ఐదు వుంగరాలకేసి, మొహం కేసి చూసినట్లే చూసి అంతలోనే సిగ్గు ముంచుకొచ్చేసి తల వంచుకుని కాలి బొటన వ్రేలితో నేల గీటుతూ వుండిపోయింది. మాణిక్కాలరావు కాస్త ఆలోచించాడు. తన ప్రతాపం యింకా ఎలా చూపించాలా అని. వెంటనే ముందు సీట్లో కూచున్న హైస్కూలు కుర్రాడితో ''ఏం పంతులూ ఎస్.ఎల్.సి. చదువుతున్నావుగా నేనడిగే లెక్క చెప్పు చూద్దాం. పైని కొన్ని కొంగలు పోతున్నాయి. కింద కొన్ని కొంగలు పోతున్నాయి. మీ లోంచి మాలోకి ఒక టొస్తే మీకు రెట్టింపవుతాం అన్నాయి పైవి. కిందియి అన్నాయి గందా మీలోంచి మాలో కొక టొస్తే మీరు మేము సమానమవుతాం అని. ఏయి ఎన్నో సెప్పు సూద్దాం'' అన్నాడు. కుర్రాడు కాస్త ఆలోచించాడు. ఏదో చెప్పటానికి నోరు తెరిచాడు. కొంపతీసి రైటు చెప్పేస్తే తన ప్రతిష్ఠంతా పోతుందని మాణిక్కం, ''ఏడు, ఐదు గదంటయ్యా, దీనికింత సేపా, చదువుకున్నోళ్ళకంటే సాకలోళ్ళు మెరుగంట'' అన్నాడు. కుర్రాడు తల వంచుకున్నాడు మనవాడు నెగ్గాడు. ఆ అమ్మాయి ఎర్రటి పెదవుల చివర నన్నటి హాసరేఖ మెరిసిమాయమైంది. అతనికి బ్రహ్మానందమైంది.

మర్నాడు మళ్ళీ అదే వేళకి అదే బస్సులో మళ్ళీ యిద్దరూ తటస్థపడ్డారు. యీ రోజు ఆమె పదవులపై హాసరేఖ ప్రస్ఫుటంగా కనుపించింది. ఎంతో సిగ్గుగా వినయంగా వుంది. తల వంచుకునే వుంది. యీ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఆమె రోజూ ఆ చారి వెంట ప్రయాణం చేస్తూనే వుంది. ప్రతిరోజూ పొద్దున్నే గుడివాడ వెళ్ళటం సాయంకాలం తిరిగి రావటం. ఒక రోజు సాయంత్రం కారు దిగి పోతూ మాణిక్కాలరావుతో సిగ్గుగా, ''ఏమండీ కాస్త సామాను దింపిస్తారా'' అనడిగింది. వుబ్బి తబ్బిబ్బయిపోయాడు మనవాడు. ''అరే బామ్మరిదీ సామాను దించరా'' అని సామాను దింపించాడు. మర్నాడు కాస్త లగేజీ ఎక్కువ పడింది. యీ రోజు కూడా ఆమె సామాను దింపించమంది. సామాను దించగానే కారు వెళ్ళిపోయింది. మాణిక్కాలు అక్కడే దిగిపోయాడు. ''మీరు మరీనండీ కాస్తంత యింటిదాకా తెప్పించకూడదూ సామాను'' అంది నాజూకుగా. ఆ రోజు సామాను స్వయంగా ఆమె యింటికి చేర్చిపెట్టాడు.

కాలేజీ చదువుకి పట్నం వెళ్ళిపోవడం వల్ల తర్వాత మూడేళ్ళ వరకు జరిగిన కథ నాకు తెలీదు. మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఈమధ్య యీ రూటు మీదుగా వచ్చాను. మాణిక్కాలరావు ఎక్కడా కన్పించలేదు. అతని హడావుడి లేక చిన్నపోయింది కార్ల ప్రపంచం అంతా. ''చెకింగు వస్తున్నాడు స్లో చెయ్యండి జానయ్యగారూ'' అని అరిచాడు క్లీనర్. కార్లు స్లో చేశారు. నల్లగా, సన్నగా, పొడుగ్గా, వున్న ఒక వ్యక్తి ఎక్కాడు. ట్రిప్ షీట్ తీసి పెన్సిల్ తో సంతకం చేశాడు. ''ఏరా మాణిక్కం సెలవు పెట్టావు గదంట్రా'' అని క్లీనర్ కుర్రాడు ఆ వ్యక్తితో అంటున్నాడు. కరెంటు షాక్ తిన్నట్లు అదిరిపడి పరకాయించి చూశాను. మాణిక్కాలరావ్ పోలికలున్నాయి మొహంలో. గుడ్లు లోతుకుపోయి వున్నాయి. అపాదమస్తకం పరీక్షించాను. చేతికి ఉంగరాలు లేవు చార్మినార్ సిగరెట్ తాగుతున్నాడు. మూడు సంవత్సరాల్లో ఎంత మార్పు!.

తర్వాత మా వూళ్ళో కుటుంబరావుని కనుక్కుంటే చెప్పాడు అతని కథ. ఆ అమ్మాయికి యితనికి మధ్య స్నేహం దిన దిన ప్రవర్థమానమయిందట. రోజూ ఆమె యింటికి వెళ్తూండేవాడట. యింతకీ ఆమె ఆ వూరికి పట్నం నుంచి అప్పుడే దిగుమతియైన తాజా సరుకట. ఆమే అతని యింటినీ, ఒంటినీ గుల్లచేసి, పీల్చి పిప్పి చేసి పట్నం తుర్రుమందిట. ఏమయితేనేం, యీ మూడేళ్ళలోనూ అతనిలోనూ, కార్ల ప్రపంచంలోనూ పెద్ద మార్పు వచ్చింది. మునుపటి మాణిక్కాలరావు యిప్పుడు లేడు. యిదివరకు తరచు వినిపించే బామ్మరిదీ పదం యిప్పుడు వినిపించడం లేదు.

నండూరి పార్థసారథి
(1958 మార్చి 12వ తేదీన ఆంద్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post