Title Picture

ఆడఖైదీలపై ఆడవాళ్ళ అత్యాచారాలు

నేరస్థులను దండించి, సంస్కరించి, సమాజంలో నేర ప్రవృత్తిని అదుపు చేయడానికి తోడ్పడవలసిన జైళ్ళే అవినీతి నిలయాలై, నేరాలను ఇంకా ప్రోత్సహిస్తూ, నేరస్థులు బాగుపడడానికి అవకాశం లేకుండా చేస్తున్న విషయాన్ని అత్యంత వాస్తవికంగా చూపించిన విలక్షణ చిత్రం 'ది కాంక్రీట్ జంగిల్'. ఆడవాళ్ళే నిర్వహిస్తున్న ఆడవాళ్ళ జైలులో బైట ప్రపంచానికి ఏ మాత్రం తెలియకుండా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో సమాజం దృష్టికి తీసుకువస్తుంది ఈ చిత్రం. ఈ ఆమెరికన్ చిత్రానికి దర్శకుడు టామ్ డిసిమోన్. ఇంతకు ముందు మరే దర్శకుడూ ఇటువంటి ఇతివృత్తాన్ని తీసుకున్నట్టు లేదు. ఇది అమెరికాలో నిజంగా జరిగిన కథ అని నిర్మాతలు చెబుతున్నారు. కాని, అమెరికాలోనే కాదు - మరే దేశంలోనైనా ఇలాంటి కథ జరిగే అవకాశం ఉంది.

మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ చేసే ఒక యువకుడు తనను నమ్మి, ప్రేమించిన ఒక అమాయకురాలిని మోసగించి, ఆమెను ఒక కేసులో ఇరికించి, తను తప్పించుకుంటాడు. అతని నేరానికి ఆమె బలి అవుతుంది. ఆమెకు మూడేళ్ళ జైలు శిక్ష పడుతుంది. శిక్ష అనుభవిస్తున్నా ఆమె గుడ్డిగా అతన్ని నమ్ముతుంది. అతడి రహస్యాన్ని కాపాడుతుంది. "ఇదంతా మనకోసమే చేస్తున్నాను. ఈ స్మగ్లింగ్ తో బోలెడు డబ్బు సంపాదిస్తే నువ్వు విడుదలైన తర్వాత మనం హాయిగా బతకవచ్చు" అని చెబుతాడు అతడు.

ఆడఖైదీల కోసం ప్రత్యేకంగా జైలు ఉంది. అందులో ఆఫీసర్లంతా ఆడవాళ్ళే. ఉద్యోగులంతా ఆడవాళ్ళే. ఒక్క గార్డు మాత్రమే మగవాడు. ఆ జైల్లో మంచాలు, పరుపులు, స్నానాలగదులు, భోజనం అన్నీ శుభ్రంగా ఉంటాయి. అయినా అదో నరకం. మామూలుగా ఆడఖైదీలను మగ అధికారులు హింసించడం, మానభంగం చేయడం వంటివి వింటూ ఉంటాము. కాని ఈ ఆడవాళ్ళ జైలులో ఆడ ఖైదీలపై ఆడవాళ్ళే అత్యాచారాలు చేస్తుంటారు. ఖైదీలలో కొందరు బరితెగించిన ఆడరౌడీలు. వాళ్ళు తమకు నచ్చిన సాటి ఖైదీలను కామకలాపాల కోసం లోబరచుకుంటూ ఉంటారు. లొంగకపోతే వాళ్ళని తీవ్రంగా హింసిస్తూ ఉంటారు. ఆడఖైదీలు కాట్ల కుక్కల్లాగా పోట్లాడుకునే దృశ్యాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఈ ఆడరౌడీల నాయకురాలికీ జైలు వార్డెన్ కీ సన్నిహిత సంబంధాలున్నాయి ఆ నాయకురాలితో కుమ్మక్కై వార్డెనే మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంది. తనతో కలిసివచ్చే ఖైదీలు చేసే తప్పులను కప్పిపెడుతూ కలిసిరాని ఖైదీలను హింసిస్తూ ఉంటుంది వార్డెన్.

కథానాయిక ఎలిజబెత్ డెమింగ్స్ జైలులోకి అడుగుపెట్టగానే ఆమెను లోబరచుకోడానికి ప్రయత్నిస్తుంది నాయకురాలు. కాని ఆమె లొంగక పోవడంతో ఆమెపై పగబట్టి హింసిస్తూ ఉంటుంది. నాయకురాలు తనకు సహకరించని ఇద్దరు ఖైదీలను హత్య కూడా చేస్తుంది. జైలుగార్డు ఒక ఖైదీని మానభంగం చేస్తాడు. ఆ ఖైదీ గర్భవతియై బిడ్డను కంటుంది. వార్డెన్ ఎంత రహస్యంగా ఉంచాలనుకున్నా ఇక్కడ జరిగే ఘోరాలు జైలు డిప్యూటీ డైరెక్టరుకు తెలుస్తాయి. ఆమె చాలా నిజాయితీ పరురాలు. వార్డెన్ కీ ఆమెకీ రెండు మూడు సార్లు ఘర్షణ జరుగుతుంది. వార్డెన్ పై చర్య తీసుకోవడానికి సాక్ష్యాధారాలకై ఆమె ఎదురుచూస్తూ ఉంటుంది. ఖైదీలలో ఎవరైనా తనకు నమ్మకంగా సమాచారం అందిస్తారేమోనని చూస్తూ ఉంటుంది. కాని ఎవరైనా రహస్య సమాచారం అందిస్తే తర్వాత వార్డెన్ చేతుల్లో నరకం అనుభవించాల్సి వస్తుంది. డిఫ్యూటీ డైరెక్టరు రెండు మూడుసార్లు ఎలిజిబెత్ ను పిలిచి అడుగుతుంది. ఆమె భయపడి చెప్పకపోయినా అనుమానించి, తప్పుడు నేరం బనాయించి ఆమెను చీకటి కొట్లోకి తోయిస్తుంది వార్డెన్. అక్కడ గార్డు ఆమెను మానభంగం చేస్తాడు. ఆ తర్వాత ఆమెను అభిమానించే సాటి ఖైదీ హత్య జరుగుతుంది. అప్పటికి ఎలిజిబెత్ కి తెగింపు వస్తుంది. ప్రియుడు తనను వంచించాడని కూడా అర్థం చేసుకుంటుంది. ఆమె అందించిన సమాచారంతో వార్డెన్ ను ఆరెస్టు చేస్తారు. ఆమె జైలు నుంచి విడుదలవుతుంది.

ఈ చిత్రంలో సెక్స్ చాలా ఎక్కువగా ఉందని ప్రచారం కావడంతో జనం ఎగబడుతున్నారు. బెంగుళూరు బ్లూమూన్ లో నాలుగోవారం మంచి కలెక్షన్స్ తో నడుస్తున్నది. అయితే అసలు ప్రతిలోని చాలా దృశ్యాలను సెన్సార్ వారు కత్తిరించేశారు. అందుచేత ఇది అతిగా అనిపించదు. సెన్సార్ వారు కొంచెం అతిగా కత్తిరించారేమోనని కూడా అనిపిస్తుంది.

హీరోయిన్ ట్రేసీ బ్రెగ్మన్ చాలా బాగా నటించింది. ఆమె మాత్రమే కాదు, చిత్రంలో ప్రతి ఒక్కరూ చక్కగా నటించారు. సినిమా చూస్తున్నట్లు కాక వాస్తవ జీవితాలను చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.

నండూరి పార్థసారథి
(1985 సెప్టెంబరు 30వ తేదీన ఆంధ్రప్రభ బెంగళూరు ఎడిషన్ లో ప్రచురితమయింది.)

Previous Post Next Post