ప్రధానంగా సితార్ విద్వాంసుడే అయినప్పటికీ సంగీత రంగంలో రవిశంకర్ స్పృశించని పార్శ్వం లేదు; చేయని ప్రయోగం లేదు. నూతన రాగాల సృష్టిలో, వాద్య సమ్మేళన ప్రయోగాలలో, నృత్య సంగీత రూపకాల రచనలో, ప్రాక్పశ్చిమ సంగీత సంయోగ సాధనలో, చలన చిత్ర సంగీతంలో ఆయన అనన్య ప్రతిభను ప్రదర్శించాడు. ఒక్క హిందూస్థానీ సంగీతమే కాదు-కర్ణాటక సంగీతం, జానపద సంగీతం, రవీంద్ర సంగీతం, పాశ్చాత్య సంగీతం, పాప్, జాజ్... ఇంకా ఎన్నో సంగీత రీతులను అధ్యయనం చేసి, వాటన్నింటినీ ఆయన సంగీత రచనలలో ఇముడ్చుకున్నాడు.

అందం, ఆకర్షణ, అదృష్టం, అసాధారణ ప్రతిభ... భారతీయ సంగీత రంగంలో ఈ లక్షణాలన్నింటినీ కలబోసుకున్న ఒకే ఒక్క కళాకారుడు పండిత్ రవిశంకర్. 'షోమన్ షిప్', 'వన్ అప్ మన్ షిప్', గ్లామర్, పబ్లిసిటీ, పలుకుబడి, కీలక స్థానాలలో ఉన్న వ్యక్తులతో సరైన సమయంలో పరిచయాలు కల్పించుకోవడం, ఒక్కొక్కప్పుడు తను వెళ్ళి కలవకుండా గొప్ప వాళ్ళే వచ్చి తనను పరిచయం చేసుకొనే ఏర్పాట్లు చేసుకోగలగడం, శిష్య ప్రశిష్య సేనను పోగుచేసుకొనడం, వారి చేత తనకు అవసరమైన పనులు చేయించుకోగలగడం, పై స్థాయి అవార్డులన్నీ సాటి వారిలో తనకే ముందుగా లభించేటట్లు చూసుకోవడం, తన వెంటపడే అందమైన స్త్రీలతో ప్లే బాయ్ ఇమేజ్ పెంచుకోవడం-ఇవన్నీ రవిశంకర్ వ్యక్తిత్వానికి సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవలసిన సంగతులు. అయితే అసలు సరుకు లేకుండా ఏ వ్యక్తీ ఎల్లకాలం అగ్రస్థానంలో నిలబడలేడు. నిస్సందేహంగా రవిశంకర్ ఒక అద్భుత కళాకారుడు; అనితర, బహుముఖ ప్రజ్ఞాశాలి; గొప్ప కళాకారులందరూ అసూయ పడేటంతటి గొప్పతనం సంపాదించుకున్నవాడు.

రవిశంకర్ రెండు సార్లు ఆత్మకథ రచించుకొని ప్రచురించుకున్నాడు. 'మై మ్యూజిక్ మై లైఫ్' పేరుతో మొదటిది 1968లో ప్రచురితమయింది. రెండోది 'రాగమాల' పేరుతో 1997లో ప్రచురితమయింది. రెండూ ఇంగ్లీషు రచనలే. పైన చెప్పిన ఆయన లక్షణాలన్నీ స్పష్టంగానో, తెరచాటుగానో ఆ రెండు రచనలలో కనిపిస్తాయి. ఆయన రెండో ఆత్మకథా గ్రంథంలో నిజానికి ఆయన శృంగార జీవిత విశేషాలే హైలైట్. ఏది రాసినా ఒక్క బిగిని చదివించగల నేర్పు ఆయనకు ఉంది. 92 సంవత్సరాల జీవితంలో ఆయన ఎప్పుడూ హీరో నంబర్ వన్నే.

రవిశంకర్ తన జీవితమంతా నిత్య నూతనోత్సాహి, ప్రయోగశీలి. పదేళ్ళ వయస్సులో అన్నగారైన ఉదయశంకర్ తో కలిసి యూరప్ లో, అమెరికాలో పర్యటించినప్పటి నుంచి జీవిత చరమాంకం వరకు తన కెరీర్ లో ఆయన ఎన్నడూ ఒక మెట్టు దిగలేదు. అతి తార స్థాయిలో అతిద్రుత్ ఝాలా లాగా సాగిపోయింది ఆయన కళా జీవితం. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, సంగీత నాటక అకాడమీ విశిష్ట సభ్యత్వం, అనేక స్వదేశీ, విదేశీ విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లు, మెగసేసే అవార్డు, సంగీతంలో నోబెల్ బహుమతి అనదగిన పోలార్ మ్యూజిక్ ప్రైజ్, గ్రామీ అవార్డు-ఇలాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలేవీ ఆయన కంటే ముందు హిందుస్థానీ సంగీతంలో మరెవ్వరికీ రాలేదు. ఈ అవార్డులందుకొనే యోగ్యత ఆయనకు లేదని ఎవరూ ఆక్షేపించలేకపోయారు.

ప్రధానంగా సితార్ విద్వాంసుడే అయినప్పటికీ సంగీత రంగంలో రవిశంకర్ స్పృశించని పార్శ్వం లేదు; చేయని ప్రయోగం లేదు. నూతన రాగాల సృష్టిలో, వాద్య సమ్మేళన ప్రయోగాలలో, నృత్య సంగీత రూపకాల రచనలో, ప్రాక్పశ్చిమ సంగీత సంయోగ సాధనలో, చలన చిత్ర సంగీతంలో ఆయన అనన్య ప్రతిభను ప్రదర్శించాడు. ఒక హిందూస్థానీ సంగీతమే కాదు-కర్ణాటక సంగీతం, జానపద సంగీతం, రవీంద్ర సంగీతం, పాశ్చాత్య సంగీతం, పాప్, జాజ్... ఇంకా ఎన్నో సంగీత రీతులను అధ్యయనం చేసి, వాటన్నింటినీ తన సంగీత రచనలలో ఇముడ్చుకున్నాడు. హంసధ్వని, చారుకేశి, కీరవాణి, సింహేంద్రమధ్యమ్, వాచస్పతి, మలయమారుతం వంటి కర్ణాటక రాగాలను ఆయన హిందుస్థానీ శైలిలో వాయించి వాటికి కొత్త అందాలు తెచ్చారు. బైరాగి, రసియా, పరమేశ్వరి, కామేశ్వరి, గంగేశ్వరి, జోగేశ్వరి, రంగేశ్వరి, తిలక్ శ్యామ్, వసంత పంచమ్, రజత్ కల్యాణ్ వంటి కొత్త రాగాలను సృష్టించారు.

రవిశంకర్ సుమారుగా ఒక డజను చలన చిత్రాలకు సంగీతం సమకూర్చాడు. సత్యజిత్ రాయ్ తీసిన 'పథేర్ పాంచాలీ', 'అపరాజిత', 'అపూర్ సంసార్', 'పరస్ పత్థర్', తపన్ సిన్హా తీసిన 'కాబూలీ వాలా', హృషీకేశ్ ముఖర్జీ తీసిన 'అనూరాధ', మృణాళ్ సేన్ తీసిన 'జెనిసిస్', రిచర్డ్అటెన్ బరో తీసిన 'గాంధీ', గుల్జార్ తీసిన 'మీరా', హాలీవుడ్ చిత్రం 'చార్లీ', వీటన్నింటికంటే ముందు 1948లోనే కె.ఎ. అబ్బాస్ తీసిన 'ధర్తీకే లాల్', చేతన్ ఆనంద్ తీసిన 'నీచానగర్' చిత్రాలకు ఆయన సంగీత రచన చేశాడు. వీటన్నింటికంటే గొప్పది నార్మన్ మెక్ లారెన్ అనే ఒక అసాధారణ షార్ట్ ఫిల్మ్ మేకర్ తీసిన 'ఛైరీ టైల్' (chairy tale) అనే అద్భుత చిత్రానికి రవిశంకర్ కూర్చిన నేపథ్య సంగీతం. మెక్ లారెన్ తీసినవన్నీ విచిత్రమైన పావుగంటలోపు నిడివిగల లఘు చిత్రాలే. వాటిని ఫిల్మ్ సొసైటీల సభ్యులు మాత్రమే చూసి ఉంటారు. 'ఛైరీ టేల్'లో స్క్రీన్ మీద మెక్ లారెన్, ఒక కుర్చీ, నేపథ్యంలో రవిశంకర్ సితార్, చతుర్ లాల్ తబ్లా శబ్దాలు మాత్రమే కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఐదారు నిమిషాల పూర్తి హాస్య చిత్రం అది. రవిశంకర్ సంగీత ప్రతిభకు అదొక గొప్ప ఉదాహరణ.

1920 ఏప్రిల్ 20వ తేదీన వారణాసిలో ఒక బెంగాలీ బ్రాహ్మణ పండిత కుటుంబంలో రవిశంకర్ జన్మించారు. నలుగురు మగబిడ్డల తర్వాత కడసారివాడు ఆయన. తండ్రితో కలిసి జీవించిన జ్ఞాపకాలేవీ ఆయనకు లేవు. ఆయనకు కాస్త ఊహ తెలిసే నాటికి తండ్రి పండిత్ శ్యామ్ శంకర్ ఐదుగురు పిల్లలను, భార్యను వదిలి ఇంగ్లండ్ కు పోయి ఒక ఇంగ్లీష్ వనితను వివాహం చేసుకున్నాడు. ఆయన బెంగాలీ, సంస్కృతం, ఇంగ్లీషుభాషలలో పాండిత్యం ఉన్నవాడు, స్ఫురద్రూపి, విలాస పురుషుడు. తల్లిని, తమని వదలివేసిన తండ్రి అంటే రవిశంకర్ కి చాలా కోపం ఉండేది. రవిశంకర్ పెద్దఅన్న గారు ఉదయశంకర్ ప్రఖ్యాత నృత్య కళాకారుడు. ఆయన 1920లోనే యూరప్ లో ప్రదర్శనలను ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన రవిశంకర్ కంటే ఇరవయ్యేళ్ళు పెద్దవాడు. పాశ్చాత్య దేశాలలో భారతీయ నృత్యాలను ప్రదర్శించడానికై 1930లో ఉదయశంకర్ ఒక పెద్ద బృందాన్ని తీసుకువెళ్ళినప్పుడు అన్న వెంట రవిశంకర్ కూడా వెళ్ళాడు. అన్న ప్రదర్శించిన పెక్కు నృత్య రూపకాలలో తను కూడా చిన్నచిన్న వేషాలు వేసి, నృత్యాలు చేశాడు. ఆ విధంగా రవిశంకర్ కళాజీవితం పదేళ్ళ వయస్సులో నృత్యంతో ప్రారంభమయింది. ఆయన బడిచదువు పదేళ్ళ వయస్సులోనే ఆగిపోయింది. ఆ తర్వాత చదువంతా ప్రపంచమనే బడిలోనే.

1930 నుంచి 1938 దాకా ఎనిమిదేళ్ళ పాటు లండన్, పారిస్, బెర్లిన్, న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా వంటి ప్రముఖ నగరాలలో అన్న ప్రదర్శించిన కార్యక్రమాలన్నింటిలో రవిశంకర్ నృత్యాలు చేశాడు. కొన్నిసార్లు ఆడ వేషాలు వేశాడు. ఎవరి శిక్షణ లేకుండానే చేతికందిన వాద్యం తీసుకుని వాయించేస్తూ ఉండేవాడు. ఊహాశక్తితో తనకు తానే నేర్చుకొనే లక్షణం అన్న నుంచే ఆయనకు అబ్బింది. ఆ కాలంలో విష్ణుదాస్ షిరాలీ, తిమిర్ బరన్, ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ వంటి గొప్ప సంగీత కళాకారులు ఉదయశంకర్ బృందంలో ఉండేవారు. ఆర్కెస్ట్రాను వారు కండక్ట్ చేస్తుంటే రవిశంకర్ శ్రద్ధగా గమనిస్తూ ఉండేవాడు. క్రైస్లర్, కాసల్స్, టాస్కోనినీ వంటి గొప్ప కళాకారుల కచేరీలను వినే అవకాశం కూడా ఆ రోజుల్లోనే లభించింది. ఎనిమిదేళ్ళ ప్రపంచయాత్ర తర్వాత రవిశంకర్ నృత్య ప్రదర్శనలకు స్వస్తి చెప్పి స్వదేశానికి తిరిగి వచ్చి, తిన్నగా మధ్యప్రదేశ్ లోని మైహార్ కు వెళ్ళారు. అక్కడ ఉస్తాద్ అల్లా ఉద్దీన్ ఖాన్ గురుకులంలో చేరి ఏడేళ్ళపాటు ఏకాగ్రదీక్షతో సితార్ నేర్చుకుని, గొప్ప కళాకారుడుగా ప్రపంచంలో అడుగుపెట్టాడు. అత్యల్పకాలంలోనే ఆయన అగ్రశ్రేణి సితార్ విద్వాంసుడుగా గుర్తింపు పొందారు. ఆయన ప్రతిభకు, గురుభక్తికి, వ్యక్తిత్వానికి ముగ్ధుడైన అల్లాఉద్దీన్ ఖాన్ తన కుమార్తె అన్నపూర్ణా దేవిని రవిశంకర్ కు ఇచ్చి వివాహం చేశారు. అల్లా ఉద్దీన్ ఖాన్ రాంపూర్ సేనియా బీన్ కార్ ఘరానాకు చెందిన గొప్ప సరోద్ విద్వాంసుడు. ఆయన సరోద్ ఒక్కటే కాకుండా దాదాపు అన్ని తంత్రీ వాద్యాలను వాయించేవాడు. ఆయన తన కుమారుడు అలీ అక్బర్ ఖాన్ ను గొప్ప సరోద్ విద్వాంసుడుగా, కుమార్తె అన్నపూర్ణాదేవిని సుర్ బహర్ విద్వాంసురాలిగా తీర్చి దిద్దారు. రవిశంకర్, అలీ అక్బర్, అన్నపూర్ణా దేవి కలిసి సంగీత సాధన చేస్తూ ఉండేవారు. 1945 నుంచి రవిశంకర్, అలీఅక్బర్ జుగల్బందీ కచేరీలు చేస్తుండేవారు.

1945-48 సంవత్సరాల మధ్య కాలంలో రవిశంకర్ 'ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్' (ఇప్టా)లో చేరి కొన్ని సంగీత నృత్య రూపకాలకు సంగీత దర్శకత్వం వహించారు. వాటిలో 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' రూపకం విశేష ప్రశంసలందుకున్నది. ఆయన అప్పుడే అబ్బాస్ తీసిన 'ధర్తీకే లాల్', చేతన్ ఆనంద్ తీసిన 'నీచానగర్' చలన చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 1948లో 'ఆకాశవాణి' ఢిల్లీ కేంద్రంలో చేరి, జాతీయ వాద్య బృందం తొలి సంగీత దర్శకుడుగా ఎన్నో సంగీత రచనలు చేశారు. వాద్యబృంద రచనలకు ఆయన ఒక ఒరవడి పెట్టారు. ఆ రోజుల్లోనే 'సారేజహాఁసేఅచ్ఛా' దేశభక్తి గీతానికి స్వరరచన చేశారు. ఇంచుమించు 'జనగణమన'తో సమానమైన గుర్తింపు పొందిన ఆ గీతానికి స్వరకర్త రవిశంకర్ అని చాలా మందికి తెలియదు.

ఏడేళ్ళ తరువాత 'ఆకాశవాణి' నుంచి బయటకు వచ్చిన రవిశంకర్ 1956లో సంగీత దిగ్విజయ యాత్ర ప్రారంభించారు. ప్రపంచ విఖ్యాత వైలిన్ విద్వాంసుడు యెహూదీ మెనూహిన్ ఆయనను ఆమెరికా శ్రోతలకు పరిచయం చేశారు. రవిశంకర్ మొదటి లాంగ్ ప్లేయింగ్ రికార్డు అప్పుడే అమెరికాలో విడుదలయింది. పాశ్చాత్య శ్రోతలకు బోరుకొట్టకుండా భారతీయ సంగీతాన్ని నెమ్మదినెమ్మదిగా అలవాటు చేయాలనే ఉద్దేశంతో రవిశంకర్ మొదట్లో ఒక రాగాన్ని ఇరవై నిమిషాలకు మించకుండా వాయించేవారు. మొత్తం కచేరీ గంటకు మించేది కాదు. ఆ వ్యవధిలోనే తబ్లా సోలోకు కూడా అవకాశమిచ్చేవారు. అమెరికా, యూరప్ లోని పెక్కు విశ్వవిద్యాలయాలలో ఆయన సోదాహరణ ప్రసంగాలు చేశారు. ఎన్నో అంతర్జాతీయ సంగీతోత్సవాలలో కచేరీలు చేశారు. పాప్, జాజ్ కళాకారులతో కలిసి కొత్త కొత్త ప్రయోగాలు చేశారు. 'ఇండో జాజ్' ప్యూజన్ సంగీతాలకు ఆద్యుడు ఆయనే.

రవిశంకర్, జార్జి హారిసన్

1965 ప్రాంతంలో బీటిల్స్ గాయకులు ఆయనకు చేరువయ్యారు. జార్జి హారిసన్ ఆయన వద్ద సితార్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. అలాగే మెనూహిన్ అభిమానులు కూడా రవిశంకర్ అభిమాన వర్గంలో చేరారు. 1971లో రవిశంకర్ కోరికపై బంగ్లాదేశ్ శరణార్ధుల సహాయార్థం జార్జి హారిసన్ పాప్ గాయకులను కూడగట్టుకొని బ్రహ్మాండమైన కచేరీ నిర్వహించాడు. ఆ కచేరీ రవిశంకర్, అలీ అక్బర్ ల జుగల్బందీతో ప్రారంభమయింది. ఆ కచేరీ రికార్డుల అమ్మకాల ద్వారా ఒక్క ఏడాదిలో పదకొండు కోట్ల రూపాయల ధనం లభించింది.

రవిశంకర్, యెహూదీ మెనూహిన్ కలిసి 'వెస్ట్ మీట్స్ ఈస్ట్' అనే శీర్షికతో మూడు ఎల్.పి. రికార్డులు ఇచ్చారు. తర్వాత రవిశంకర్ 'ఈస్ట్ గ్రీట్స్ ఈస్ట్' అనే శీర్షికతో ఇద్దరు జాపనీస్ కళాకారులతో కలిసి మరో రికార్డు ఇచ్చారు. 'జాజ్ మీన్' అనే శీర్షికతో ఇండో జాజ్ రికార్డు ఇచ్చారు. భారతీయ సంగీతం ఆర్కెస్ట్రేషన్ కు ఒదగదు. కాని, రవిశంకర్ ఒదిగించారు. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో అనుసంధాన పరుస్తూ రెండు అద్భుతమైన 'కాన్ చెటో' (concerto) లను ఆయన రచించారు. 1971లో రచించిన మొదటి కాన్ చెటోను ఆండ్రే ప్రెవిన్, 1983లో రచించిన రెండో కాన్ చెటోను జుబిన్ మెహతా కండక్ట్ చేశారు. ఆ రెండు రికార్డులు సంగీత ప్రియులందరూ కొని, విని, భద్రపరచుకోదగినవి. కాన్ చెటో అనేది పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ. అది ఒక ప్రధాన వాద్యానికి, వాద్య బృందానికి మధ్య జుగల్ బందీ లాంటిది.

ఇప్పుడు దేశంలో సితార్ వాదనంలో రెండే బాణీలున్నాయి. ఒకటి రవిశంకర్ బాణీ, రెండోది విలాయత్ ఖాన్ బాణీ. రవిశంకర్ ది సేనియా బీన్ కార్ ఘరానా. దాన్ని ఇప్పుడు మైహార్ ఘరానా అంటున్నారు. విలాయత్ ఖాన్ ది ఇమ్దాద్ ఖాన్ ఘరానా. ఇప్పుడు దీన్ని విలాయత్ ఖాన్ ఘరానా అంటున్నారు. కనుక రవిశంకర్ బాణీని రవిశంకర్ ఘరానా అనడం సముచితంగా ఉంటుంది. దేశంలోని సితార వాదకులలో దాదాపు నూటికి తొంబైమంది ఈ రెండు బాణీలలో ఏదో ఒకదానిని అనుసరించేవారే. రవిశంకర్, విలాయత్ ఖాన్ లు కాకుండా స్వతంత్రమైన శైలి కల మరో సితార్ విద్వాంసుడు ఉస్తాద్ అబ్దుల్ హలీమ్ జాఫర్ ఖాన్. కానీ, ఆయన శిష్య వర్గం చాలా చిన్నది.

కడచిన పదేళ్ళలో అగ్రశ్రేణి హిందూస్థానీ వాద్య సంగీత విద్వాంసులు విలాయత్ ఖాన్, బిస్మిల్లాఖాన్, అలీ అక్బర్ ఖాన్, ఇప్పుడు రవిశంకర్ అస్తమించడంతో ఆస్థాయి వారెవరూ రంగంలో మిగల్లేదు.

నండూరి పార్థసారథి
(2012 లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమయింది)

Previous Post