Title Picture

ఇన్నాళ్ళకు తెలుగులో సంతృప్తికరమైన డబ్బింగు చిత్రం ఒక్కటి వచ్చింది. బలంగల కథతో, జవంగల కథనంతో, గతి తప్పని నడకతో, పదునైన మాటలతో 'తల్లిఇచ్చిన ఆజ్ఞ' సంతృప్తికరమైన చిత్రంగా రూపొందింది. దృశ్యం, శ్రవ్యం ఈమధ్య ఏ డబ్బింగు చిత్రంలోనూ కని విని ఎరగనంత చక్కగా సమన్వయించాయి. సహజంగానే కథ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకోగలది కావడం వల్ల, దానికి అద్భుతమైన రచన తోడై చాలా సందర్భాలలో ఇది డబ్బింగు చిత్రమన్న విషయాన్ని మరపింపచేస్తుంది.

శంకర్, పరోపకారం ఇద్దరూ వ్యాపారంలో భాగస్వాములు. పరోపకారం శంకర్ భార్యపై అత్యాచారం చేస్తాడు. శంకర్ ను జైలుకు పంపుతాడు. అతని చావుకు కారకుడవుతాడు. శంకర్ కు ఒక కొడుకు - గణేశ్. పరోపకారంపై పగ తీర్చుకోమని తల్లి అతనికి బాల్యం నుంచి నూరిపోస్తుంది. పెంచి, పెద్ద వాణ్ణి చేసి కడసారిగా పగను జ్ఞాపకం చేసి, మాట తీసుకొని చనిపోతుంది. గణేశ్ పరోపకారాన్ని వెంటాడుతాడు. అతని కూతుర్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆమెకు తెలియకుండా, అతన్ని పాతాళగృహంలో బంధిస్తాడు. అతని మూలంగా తన కుటుంబం ఎన్ని కష్టాలపాలు అయిందో, ఎన్ని కుటుంబాలు అతని వల్ల ఎన్నెన్ని కష్టాలు పడ్డాయో అన్ని విధాలా అతన్ని కష్టపెట్టాడు. పరోపకారానికి కష్టాలంటే ఏమిటో తెలుస్తుంది. అతనిలో పరివర్తన కలుగుతుంది. ఈలోగా ఒక దుష్ట వకీలు వల్ల గణేశ్ అనేక కష్టాలకు లోనవుతాడు. చివరికి పరోపకారాన్ని చెరనుంచి విడుదల చేసి ఆదరిద్దామని అనుకుంటాడు. కాని కూతురుపై బెంగతో ఆమెను చూద్దామన్న తహతహతో పరోపకారం చెర నుంచి తప్పించుకుంటాడు. పొరపాటున విలన్ వకీలు చేత చిక్కుతాడు. వకీలు ఎవరో వ్యక్తిని హత్య చేసి ఆ శవం కుళ్ళిపోయేవరకు ఉంచి, అది పరోపకారం శవమనీ, గణేశ్ అతన్ని ఖూనీ చేశాడనీ ఫిర్యాదు చేస్తాడు. పరోపకారం మళ్ళీ తప్పించుకొని కోర్టుకు వచ్చి, గణేశ్ కు శిక్షపడకుండా కాపాడుతాడు. చివరికి పరోపకారం మరణిస్తాడు.

కథ, కథనం ఎక్కడా చవకబారుగా లేకుండా హుందాగా, ఉన్నతంగా ఉన్నాయి. అంతకంటే శ్రీశ్రీ రచన మరీ అద్భుతం అనిపించే విధంగా ఉన్నది. ఎస్.వి.రంగారావుకు అతని సొంత గొంతునే ఉపయోగించి ఉంటే ఇది డబ్బింగు చిత్రమన్న విషయం అంతగా గుర్తుకు వచ్చేది కాదు. చిత్రం అంతటా సంభాషణలకు ప్రాముఖ్యం ఉన్నది. ముఖ్యంగా చిత్రం ద్వితీయార్ధమంతా కేవలం సంభాషణల మీదనే నడుస్తుంది. దృశ్యాలన్నీ ఎక్కువ భాగం కెమెరాకు సన్నిహితంగా మెదులుతాయి. ఇన్ని ఇబ్బందులున్నా కూడా, బారెడు బారెడు డైలాగులను అతి సునాయాసంగా లొంగతీసుకుని, భాషపై ధీమాగా స్వారీ చేశారు శ్రీశ్రీ. భాషపై ఆయనకు గల ప్రభుత్వం ముఖ్యంగా పాటలలో మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది. వెనకటి కవులు శతావధానాలు, సహస్రావధానాలు చేస్తే శ్రీశ్రీ ఈనాడు డబ్బింగు అవధానాలు చేస్తూ అంత గొప్పగానూ దిగ్ర్భమ కలిగిస్తున్నారు.

చిత్రంలో హాస్యంపాలు తక్కువయినా దాని లోటు కనుపించదు. అడుగడుగునా ప్రేక్షకులకు ఉత్సాహం, ఉద్వేగం, ఉత్కంఠ కలుగుతాయి. తమిళనటరాజు శివాజీగణేశన్ నటన తెలుగు ప్రేక్షకులకు ఆకర్షణీయంగా ఉంటుంది. పరిచయమయింది డబ్బింగు చిత్రాల ద్వారానే అయినా, అతను ఏనాడో ఆంధ్రుల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. సావిత్రి, రంగారావు, నంబియార్, పండరీబాయి, ఎం.ఎన్.రాజంల నటన మితంగా, సంతృప్తికరంగా ఉంది. అందరూ ఒకసారి చూడతగిన చిత్రం. దీనికి తమిళంలో రాష్ట్రపతి యోగ్యతాపత్రం లభించింది.

కథ, సినేరియో, దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి; సంగీతం: ఎస్.ఎం.ఎస్.నాయుడు; మాటలు, పాటలు : శ్రీశ్రీ; తారాగణం: శివాజీగనేశన్, సావిత్రి, ఎస్.వి.రంగారావు, నంబియార్, ఎం.ఎన్.రాజం, పండరీబాయి వగైరా.

నండూరి పార్థసారథి
(1961 మార్చి 5వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post