Title Picture
విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్

విశ్వకవి శతజయంతి సందర్భంగా భారత ఫిలిం పరిశ్రమ యావత్తూ నేడు గురుదేవునికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. రవీంద్రుని శతజయంతి సందర్భంగా ప్రత్యేకంగా నిర్మించబడిన చిత్రాలు ఈ వారం విడుదలైనాయి. దేశమంతటా అత్యంత వైభవంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలలో ఫిలిం పరిశ్రమ గణనీయమైన పాత్రను నిర్వహిస్తున్నది.

ఫిలింస్ డివిజన్ తరపున సత్యజిత్ రాయ్ నిర్మించిన 'రవీంద్రనాథ్ టాగోర్' డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శనకు ప్రధాని నెహ్రూ మే 2వ తేదీన ఢిల్లీ సప్రూహౌస్ లో ప్రారంభోత్సవం జరపడంతో రవీంద్ర శతజయంత్యుత్సవాలు దేశవ్యాప్తంగా ప్రారంభమైనాయి. మే 2వ తేదీనే ఈ చిత్రం రాష్ట్ర రాజధానులన్నింటిలోనూ ప్రదర్శితమయింది.

ఈ చిత్రం కాక టాగోర్ రచించిన 'పోస్ట్ మాస్టర్', 'మణిహార', 'సమాప్తి' అనే మూడు కథలను 'తీన్ కన్య' అనే పేరిట ఒకే చిత్రంగా సత్యజిత్ రాయ్ నిర్మించారు. ఈ చిత్రం న్యూఢిల్లీ, కలకత్తా, మద్రాసు, బొంబాయి, బెంగళూరు, అహమ్మదాబాద్ లలో ఒకేసారి విడుదల అయింది.

Ray Picture
సత్యజిత్ రాయ్

బెంగాల్ చలన చిత్ర సంఘం భారీ ఎత్తున కార్యక్రమాన్ని రూపొందించింది. టాగోర్ రచించిన 'పూజారిణి', 'అభిసార్', 'పురాతన్ భృత్య', 'దుయ్ బిఘాజమీ' అనే నాలుగు గీతాలు ఆధారంగా ప్రఖ్యాత దర్శకుడు దేవకీబోస్ నిర్మించిన 'అర్ఘ్య' అనే చిత్ర ప్రదర్శనం కూడా ఈ కార్యక్రమంలో చేర్చబడింది. ఈ చిత్ర ప్రదర్శనకు మే 8వ తేదీన కలకత్తాలో ప్రధాని నెహ్రూ ప్రారంభోత్సవం జరుపుతారు.

బెంగాలీ చిత్ర రంగంపై రవీంద్ర సాహిత్య ప్రభావం

వర్తమాన భారతీయ చలన చిత్రాలలో-ముఖ్యంగా బెంగాలీ చిత్రాలలో రవీంద్రుని సాహిత్య ప్రభావం విశేషంగా ప్రతిబింబిస్తున్నది. రవీంద్రుని సాహిత్యానికి సమ్మోహితులై, ఈనాడు బెంగాలీ చిత్రరంగంలో అనేకమంది యువదర్శకులు, నిర్మాతలు వ్యాపార తృష్ణకు, సంకుచిత మనస్తత్వానికి స్వస్తి చెప్పి గురుదేవుని విశ్వమానవ కళ్యాణ దృక్పథాన్ని అలవరచుకొని, వాస్తవికతకు అధిక ప్రాధాన్యమిస్తూ రవీంద్రుని కథలను అత్యంత శ్రద్ధాభక్తులతో వెండితెరకు అనువదిస్తున్నారు.

నిష్కర్షగా చెప్పాలంటే ఒక్కపది సంవత్సరాల క్రితం చలన చిత్రరంగంలో ఈ ధోరణి లేనేలేదు. ధనతృష్ణ, చౌకబారు అభిరుచులు గల నిర్మాతలకు, దర్శకులకు విశ్వకవి తాత్విక దృక్పథం కేవలం చాదస్తంగా కనుపించింది. వ్యాపార దృష్ట్యా ఆయన సాహిత్యాన్ని వెండి తెరకు ఎంత దూరంగా ఉంచితే అంత శ్రేయస్కరమని వారు భావించారు. చెదురు మదురుగా ఎవరైనా సాహసించి ఆయన కథలను చేపట్టితే అవి దారుణంగా పరాజయం పొందాయి.

విశ్వకవి సాహిత్యాన్నీ, తత్వాన్ని సుబోధకంగా, ఉదాత్తంగా వెండితెరకు అనువదించాలంటే అసాధారణమైన సాహసం, ప్రతిభ, సంస్కారం, చిత్తశుద్ధి అవసరం.

ఈ లక్షణాలు గల వ్యక్తి ఒక శుభముహూర్తంలో బెంగాలీ చిత్రరంగంలో అవతరించాడు. ఆయనే నితిన్ బోస్. టాగోర్ కథలు 'దృష్టిదాన్', 'నౌకాడుబి' ఆయన చేతుల్లో కళాఖండాలుగా రూపొందాయి.

టాగోర్ కథలను ఎంత సుబోధకంగా, కళాత్మకంగా, ఉదాత్తంగా వెండితెరకు అనువదించవచ్చునో దేవకీబోస్ నిర్మించిన 'చిరకుమార్ సభ' చిత్రం చక్కగా నిరూపిస్తుంది.

Bose Picture
దేవకీబోస్, నితిన్ బోస్

ఆ తర్వాత 1955లో శ్రీ సత్యజిత్ రాయ్ చిత్ర రంగంలోనికి ఒక మహత్తర విప్లవాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. టాగోర్ విశ్వజనీన దృక్పథాన్ని, తాత్విక దృక్పథాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని, అలవరచుకున్న వ్యక్తి సత్యజిత్ రాయ్. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ చిత్రాలను నిర్మిస్తున్న వారు ఇప్పుడు బెంగాలీ రంగంలో కనీసం ఐదారుగురు ఉన్నారు. భారతీయ చిత్రరంగానికి పట్టిన బూజు దులపడం వీరు ఉద్యమంగా పెట్టుకున్నారు. వీరిలో - సత్యజిత్ రాయ్ అనుయాయులలో తపన్ సిన్హా ప్రథముడు. సత్యజిత్ రాయ్ తో ప్రారంభమైన నూతన శకంలో ప్రప్రథమంగా టాగోర్ కథను చేపట్టిన వ్యక్తి తపన్ సిన్హా. 1956లో అయన నిర్మించిన 'కాబూలీవాలా' చిత్రం రాష్ట్రపతి స్వర్ణపతకాన్ని పొందింది. అంతర్జాతీయంగా కూడా ఆ చిత్రం కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించుకొన్నది.

Tapan Picture
తపన్ సిన్హా

ఇప్పుడు బెంగాలీ యువదర్శకులంతా టాగోర్ కథలపై తమ దృష్టిని కేంద్రీకరించారు. 'కాబూలీవాలా' చిత్రం తర్వాత తపన్ సిన్హా రవీంద్రుని 'హంగ్రీస్టోన్స్' కథ ఆధారంగా 'క్షుధిత్ పాషాణ్' చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ఈ సంవత్సరం అఖిల భారత స్థాయిన రెండవ ఉత్తమ చిత్రంగా ఎన్నికై, రాష్ట్రపతి పతకాన్ని పొందింది.

'నష్టనీర్' కథను సత్యజిత్ రాయ్ నిర్మించబోతున్నాడు. 'జీవితొ-మృతొ', 'ఛుట్టీ' కథలుకూడా తెరకెక్కుతున్నాయి. 'కాబూలీవాలా' కథను బిమల్ రాయ్ ఇప్పుడు హిందీలో నిర్మిస్తున్నారు.

బెంగాలీ చిత్రాలలో రవీంద్రుని గీతాలు

బెంగాలీ చలన చిత్రకారులలో విశ్వకవి కథల పట్ల భక్తి, గౌరవం పెరగడంతోపాటు, ఆయన గీతాలకు కూడా చలనచిత్రాలలో విశేషాదరణ లభిస్తున్నది. విశ్వకవి లేఖిని నుంచి అమృత వాహినిగా వెలువడిన గీతాలను అత్యంత శ్రద్ధా భక్తులతో వారు తమ చిత్రాలలో పొందుపరుచుకొంటున్నారు. జయదేవుడు, మీరా, కబీర్, గాలిబ్ మున్నగువారి కీర్తనలకు వలెనే రవీంద్రుని గీతాలుకూడా బెంగాలీ చిత్రాలలో చాలా తరచుగా ఉపయోగించబడుతున్నాయి. ప్రతి చిత్రంలోనూ గురుదేవుని గీతాలు కనీసం రెండు మూడు ఉంటున్నాయి.

రవీంద్రుని గీతాలు అన్ని చిత్రాలకు, అన్ని సన్నివేశాలకు అతికేవికావు. వాటి శ్రావ్యత, మాధుర్యం, లాలిత్యం, చెడకుండా ఉపయోగించుకోవడం అందరికీ సాధ్యమయేది కాదు. ఎటువంటి చిత్రాలలో, ఎటువంటి సందర్భాలలో ఎలా వాటిని వాడుకోవాలో తెలియాలంటే విశ్వ కవి తాత్విక దృష్టినీ, భావుకతను పరిపూర్ణంగా అర్ధం చేసుకొన్నవారికే అది సాధ్యమవుతుంది.

నిజానికి కొందరు దర్శకులు గరుదేవుని గీతాలను అస్తవ్యస్తంగా ఉపయోగించడం కూడా జరుగుతున్నది. కవిత్వం అంటే ఏమిటో తెలియని వారు కూడా, పండితుల మెప్పుకు, మెహర్బానీకి, తమకు సంస్కారం, కళాత్మ ఉన్నాయని చాటుకొనేందుకు గురుదేవుని గీతాలను తమ చిత్రాలలో ఉపయోగిస్తున్నారు. గురుదేవుని గీతాలకు జరుగుతున్న ఈ దురన్యాయానికి పరిశ్రమలోని వారెంతో మంది విచారిస్తున్నారు కూడా. రవీంద్రుని సాహిత్యంపై సర్వహక్కులుగల విశ్వభారతివారు, ఈ గీతాలను ఎవరికిపడితే వారికి ఇవ్వరాదనీ, పాత్రత ఎరిగి వాటిని ఇవ్వాలనీ పలువురు సూచిస్తున్నారు.

రవీంద్రుని గీతాలను ప్రప్రథమంగా సినిమాలలో ప్రవేశపెట్టినవారు న్యూథియేటర్స్ వారు. చలన చిత్రాలలో రవీంద్రుని గీతాలకు విశేషగౌరవ ప్రతిష్టలు చేకూర్చి పెట్టిన గాయకులు పంకజ్ మల్లిక్, హేమంత కుమార్, సుచిత్ర మైత్ర, సంధ్యా ముఖర్జీ. వీరు 'రవీంద్ర సంగీతం'లో ప్రత్యేకంగా కృషిచేసిన వారు; రవీంద్రుని బాణీని పుణికి పుచ్చుకున్నవారు.

Singers Picture
పంకజ్ మల్లిక్, హేమంత కుమార్, సుచిత్ర మైత్ర, సంధ్యా ముఖర్జీ

రవీంద్ర సంగీతం

'రవీంద్ర సంగీతం' ఓ విలక్షణమైన సంగీతం. దాని సంప్రదాయం దానిదే. అది నూటికి నూరు పాళ్లు రవీంద్రుని స్వతంత్ర బాణీ. ఈ బాణీని ఆయన శాస్త్రీయ సంగీతం నుంచి సృష్టించారని కొందరు, జానపద సంగీతం నుంచి సృష్టించారని మరి కొందరు అంటారు. కాని నిజానికి ఆ బాణీని గురించి ఇదమిత్థమని చెప్పడం సాధ్యం కాదు. దానికి భాష్యం చెప్పడం కష్టం.

రవీంద్ర సంగీతం కేవలం రవీంద్రుని గీతాలతో మాత్రమే మేళవించుతుంది. మరొక తరహా గీతాలకు ఈ బాణీ సరిపడదు. తన గీతాలకోసం ఉద్దేశించే గురుదేవుడు ఈ అద్భుత సంగీతాన్ని సృష్టించాడు. ఆయన గీతాల నుంచి ఈ సంగీతాన్ని వేరుచేస్తే ఆ గీతాలు రెక్కలులేని పక్షులవుతాయి. తన భావుకతను, సంస్కారాన్ని, తాత్విక దృక్పథాన్ని, విశ్వమానవ ప్రేమను వ్యక్తం చేసేందుకు సాధనంగా ఆయన ఈ సంగీతాన్ని సృష్టి చేశారు.

ఆయన సన్నిధిలో ఉండి, ఆయన ముఖతా యీ సంగీతాన్ని విని, ఆయనను సంపూర్ణంగా అవగాహన చేసుకున్న గాయకులకే ఆయన బాణిని చక్కగా అనుకరించడం సాధ్యమవుతుంది. రవీంద్ర సంగీతం కేవలం బెంగాలీల సంపద. గురుదేవుడు బెంగాలీలో రచించిన గీతాల ద్వారానే ఆ సంగీతాన్ని వినాలి కాని, మరొక భాషలోనికి ఆ సంగీతాన్ని తర్జుమా చేయడం సాధ్యం కాదు. మరొక భాషలోని పదజాలంతో ఆ సంగీతానికి పొత్తు కుదరదు.

నండూరి పార్థసారథి
(1961 మే 7వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post