హైదరాబాద్, డిసెంబర్ 12 : జంటనగరాల సంగీత ప్రియులు మొన్న రాత్రి రెండున్నర గంటలసేపు అంజాద్ అలీఖాన్ సరోద్ స్వరసుధార్ణవంలో వోలలాడారు. అంజాద్ అలీ హైదరాబాద్ రావడం అరుదే. ఎల్.పి. రికార్డుల ద్వారా సుపరిచితుడే అయినా ఆయన కచేరీ వినడం చాలా మందికి ఇదే మొదటిసారి. తన తండ్రి స్వర్గీయ ఉస్తాద్ హఫీజ్ అలీఖాన్ స్మృతి చిహ్నంగా ఒక సంగీత మందిరాన్ని నిర్మించడానికి నిధులు సేకరించడానికై దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో కచేరీలు చేస్తూ ఆయన ఇక్కడికి వచ్చారు.

కిందటి తరంలోని ఇద్దరు సరోద్ మహావిద్వాంసులలో హఫీజ్ అలీఖాన్ ఒకరు; ఆయనకు సమ ఉజ్జీ ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్. ఇద్దరూ ఒకే గురువు దగ్గర నేర్చుకున్న సేనియా ఘరానా విద్వంసులు. అల్లాఉద్దీన్ ఖాన్ కుమారుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్. హఫీజ్ అలీ కుమారుడు అంజాద్ అలీ. ఒకప్పుడు వారిద్దరి మధ్య ఉన్నంత పోటీ ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉంది. ఘరానా ఒకటే అయినా ఇద్దరి వాదన శైలులూ భిన్నమైనవి. అలీ అక్బర్ కంటే అంజాద్ అలీ పాతికేళ్ళు చిన్నవాడు. (అంజాద్ వయస్సు ముప్పై అయిదే) అయినా ప్రావీణ్యంలో, కీర్తిలో అలీ అక్బర్ స్థాయినందుకున్నాడు.

అంజాద్ అలీ కచేరీ అద్యంతం చైతన్య మాధురీ స్రవంతిగా సాగిపోతుంది. కచేరీ ఎక్కడా మామూలుతనానికి దిగజారిపోదు. మామూలుగా సరోద్ వాదనం సితార్ అంత చురుకుగా సాగదు. కాని అంజాద్ అలీ నిరంతర సాధనతో సితార్ తో సమానమైన వేగాన్ని సాధించాడు. అంతే కాదు-విలాయత్ ఖాన్ సితార్ పై సాధించినట్లు అంజాద్ అలీ సరోద్ పై 'గాయకీ అంగ్' (గాత్రశైలి)ను సాధించాడు. సరోద్ కు ఒక కొత్త 'డైమన్షన్' ఇచ్చాడు. వాద్య సంగీత ప్రపంచంలో దాని గౌరవాన్ని ఇనుమడింపజేశాడు. అసలు సరోద్ పుట్టిందే వారి కుటుంబంలో. అంజాద్ అలీ తాతగారి తండ్రి ఉస్తాద్ గులాం అలీ ఖాన్ 'రబాబ్' అనే పర్షియన్ వాద్యాన్ని భారతీయ సంగీతానికి అనుగుణంగా మార్చి సరోద్ ను సృష్టించారు.

అంజాద్ అలీ ఐదో యేట సంగీతాభ్యాసం మొదలు పెట్టి పదేళ్ళకే కచేరీలు ప్రారంభించాడు. పదిహేనేళ్ళకే 'ఉస్తాద్'గా గుర్తింపు పొందాడు. పాతికేళ్ళకే 'పద్మశ్రీ' అందుకున్న ఘనత దేశం మొత్తం మీద బహుశా అంజాద్ అలీ ఒక్కడికే దక్కింది. బిస్మిల్లా, విలాయత్, రవిశంకర్ ల లాగా కచేరీల మొదలు పెట్టిన మొదటి క్షణం నుంచి శ్రోతలను ఆకట్టుకోగల శక్తి అంజాద్ అలీకి ఉంది. ఆయన కచేరీ వినముచ్చటగానే కాదు-చూడ ముచ్చటగా కూడా ఉంటుంది. ఆయన సంగీతం ఎంత సుందరమో, ఆయన రూపమూ అంత సుందరం. ఆయన కొనగోళ్ళ నుంచి సరోద్ తంతులపై జాలువారే స్వరాలు గులాబీ రేకులపై నిలిచే హేమంత ప్రభాత తుషార బిందువులలా స్వచ్ఛంగా మెరుస్తాయి. మామూలుగా సరోద్ ఝాలా సితార్ ఝాలా అంత రంజకంగా ఉండదు. కాని అంజాద్ అలీ ఝాలా తుమ్మెదల రుంకారంలా శ్రుతి మధురంగా, జలపాతాల గర్జనలా గంభీరంగా ఉంటుంది.

మొన్న రవీంద్ర భారతి కచేరీలో అంజాద్ అలీ 'దుర్గా' రాగంతో ప్రారంభించాడు. కర్ణాటక సంగీతంలోని శుద్ధ సావేరి (సరిమపదస సదపమరిస)కి సమమైన ఈ రాగాన్ని పావుగంటసేపు మాత్రమే వాయించాడు. రెండు నిమిషాలు క్లుప్తంగా ఆలాపన వాయించి, తర్వాత తీన్ తాల్ లో మధ్యలయ 'గత్' వాయించాడు. తర్వాత అతిప్రసిద్ధమైన గంభీరమైన 'మార్వా' రాగాన్ని దాదాపు గంటసేపు వాయించాడు. హిందుస్థానీ సంగీత సంప్రదాయంలోని పది జనకరాగాల్లో ఒకటి 'మార్వా'. ఈ రాగంలో ఇరవై నిమిషాల సేపు ఆలాప్, జోడ్, ఝాలా అద్భుతంగా వాయించి తన ప్రతిభను, ప్రావీణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించాడు. తర్వాత విలంబిత్, ధ్రుత్ గత్ లను వాయించి శ్రోతలను ముగ్ధులను చేశాడు. విరామం తర్వాత 'తిలక్ కామోద్', 'శహనకానడ' రాగాలను వాయించాడు. ఈ రెండూ ఆయన తండ్రిగారి అభిమాన రాగాలట. 'తిలక్ కామోద్'లో తీన్ తాల్ విలంబిత్ గత్ వాయించిన తర్వాత, ఆపకుండా వెంటనే 'శహనకానడ' విలంబిత్ గత్ అందుకున్నాడు. విలంబిత్ తర్వాత అదే రాగంలో రెండు మధ్య లయగత్ లు, ఒక ధ్రుత్ గత్ వాయించాడు. ధ్రుత్ లో విపరీతమైన వేగాన్ని ప్రదర్శించి శ్రోతలను ఆశ్చర్య చకితులను చేశాడు.

కచేరీ చివరలో ఒక మిశ్ర ఖమాజ్ ధున్, ఒక చిన్న భాటియాలీ ధున్ వాయించాడు. కుమార్ బోస్ తబ్లా పక్క వాద్యం ప్రశంసనీయంగా ఉంది. మామూలుగా హిందుస్థానీ సంగీత కచేరీలు మూడున్నర, నాలుగు గంటలసేపు జరుగుతాయి. అంజాద్ అలీ కచేరీ రెండున్నర గంటలు మాత్రమే జరగడం శ్రోతలకు కొంత ఆశాభంగం కలిగించినా, ఆయన వినిపించిన సంగీతం చిరస్మరణియమైనది.

నండూరి పార్థసారథి
(1978 డిసెంబర్ 12వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Next Post