Title Picture

పర్బత్ ఫిలింస్ వారి 'ఏక్ ఫూల్ చార్ కాంటే' చిత్రం కాలక్షేపానికి బఠాణీ వంటిది. 14 వేలపై చిల్లర అడుగులపాటు ప్రేక్షకులను నవ్వించడమే ఈ చిత్రం పరమార్థం. మోతాదు మించిన హాస్యంతో ప్రేక్షకుల పొట్టలను చెక్కలు చేసే దురుద్దేశం ఈ చిత్రానికి లేదు. లాలిత్యం, మాధుర్యం మొదలయినవి ఈ హాస్యంలో ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇందులో వహీదారెహమాన్ ఉంది. అందుకే ఒకసారి చూసిన వారికి మరొకసారి చూడాలనిపిస్తుంది ఈ చిత్రం. ఇందులో అసంతృప్తి కలిగించే అంశాలలో సంగీతం ఒకటి. చాలా మంది ఆశించేటంత బ్రహ్మాండంగాలేదు శంకర్ జై కిషన్ సంగీతం.

అసలు ఈ చిత్రం కిటుకు అంతా కథలో ఉంది. ఇందులో వహీదారెహమాన్, సునీల్ దత్ నాయికానాయకులు. చిత్రం ప్రారంభ సన్నివేశంలోనే వారు ప్రేమించుకుంటారు. వహీదాకు నలుగురు బాబాయిలు; పెద్దాయన డేవిడ్, రెండో ఆయన ధూమల్, మూడో అతను రషీద్ ఖాన్, నాలుగో అతను జానీవాకర్. నలుగురు నాలుగు శాఖలలో ప్రత్యేక చాదస్తం గలవారు. డేవిడ్ నటకుడు, ధూమల్ భక్తుడు, రషీద్ ఖాన్ యోగాసన ప్రియుడు, జానీవాకర్ రాకెన్ రోలర్. తల్లిదండ్రులు లేని వహీదాను ఆలోపం లేకుండా వారు అతి గారాబంగా పెంచారు. ఎవరికీ పక్షపాతం చూపకుండా ఆ అమ్మాయి పెద్దాయనతో నాటకాలు వేస్తూ, రెండో ఆయనతో భజన చేస్తూ, మూడో ఆయనతో యోగాసనాలు వేస్తూ, నాలుగో ఆయనతో రాకెన్ రోల్ చేస్తూ ఉంటుంది. సునీల్ దత్ తండ్రి పెళ్ళి బేరానికొస్తే, మీవాడు నాటకాలు వేస్తాడా, భజన చేస్తాడా, బస్కీలు తీస్తాడా, రాకెన్ రోల్ చేస్తాడా అంటూ నలుగురూ ఆయన్ని హడలగొట్టారు. ఆయనకి కోపం వచ్చి ఛస్తే మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోను పొమ్మంటాడు. దీనితో నాయికా నాయకుల మధ్య అగాధం ఏర్పడుతుంది. విరహం ధీరలక్షణం కాదని సామదాన భేద దండోపాయాలను మించిన మాయోపాయంతో అతను ఆమెను చేజిక్కించుకుంటాడు. నటుడుగా, భక్తుడుగా, వస్తాదుగా, రాకెన్ రోలర్ గా నలుగురి దగ్గర నాలుగు వేషాలు వేసి, కోతలు కోసి మెప్పించి ఆమెను వివాహమాడుతాడు.

కిశోర్ కుమార్ ధరించతగిన పాత్రను సునీల్ దత్ ధరించడం కొంత అసంతృప్తి కలిగిస్తుంది. వహీదా ఈ చిత్రానికి పెద్ద అలంకారం. డేవిడ్, ధూమల్, రషీద్ ఖాన్, జానీవాకర్ హద్దుమీరకుండా చక్కగా నటించారు. ప్రతి ఒక్కరు-ముఖ్యంగా యువతీయువకులు తప్పక చూడతగిన చిత్రం 'ఏక్ ఫూల్ చార్ కాంటే'.

దర్శకుడు: భప్పీసోనీ; సంగీతం: శంకర్ జై కిషన్; రచన: ఓంకార్ షహద్; ఛాయాగ్రహణం: తారాదత్; తారాగణం: వహీదారెహమాన్, సునీల్ దత్, డేవిడ్, జానీవాకర్, ధూమల్, రషీద్ ఖాన్, టున్ టున్ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 మార్చి 26వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post