అల్హయ్యా బిలావల్ రికార్డు
ఈ నెల (జూన్)లో రవిశంకర్ తాజా రికార్డు ఒకటి విడుదలయింది. ఆయన ఒక్కరూ వాయించిన రికార్డులు, మెనూహిన్ తో, అలీఅక్బర్ తో, లండన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో కలిసి వాయించిన రికార్డులు, ఆయన సంగీతం సమకూర్చిన ఇంగ్లీషు సినిమా 'చార్లీ' సౌండ్ ట్రాక్ రికార్డుతో కలిపితే ఈ తాజా రికార్డు 31 వది. శాస్త్రీయ సంగీతానికి సంబంధించినంతవరకు దేశంలో మరెవ్వరూ ఇన్ని ఎల్.పి. రికార్డులు యివ్వలేదు. మన దేశంలో ఎల్.పి. రికార్డులు ఉత్పత్తి కావడం ప్రారంభించినప్పటి నుంచి రికార్డుల సంఖ్యలో ఆయనే అగ్రగణ్యుడుగా ఉన్నారు. ఎల్.పి. రికార్డులు కాక, ఇ.పి. రికార్డులు ('అనూరాధ'తో కలిపి) మొత్తం పది వచ్చాయి.

తాజా ఎల్.పి.లో ఆయన ఒకవైపు 'అల్హయ్యా బిలావల్' రాగం, రెండో వైపు 'పట్ దీప్' రాగం వాయించారు. 'అల్హయ్యా బిలావల్'లో ఆలాప్ లేకుండా సరాసరి విలంబిత్ గత్ లో ప్రారంభించారు. తర్వాత ధ్రుత్ గత్ వాయించారు. విలంబిత్ తీన్ తాల్ లోనూ, ధ్రుత్ ఏక్ తాల్ లోనూ వాయించారు. ఈ రాగం 'బిలావల్' థాట్ కు చెందిన ప్రసిద్ధమైన రాగం. 'బిలావల్' సకల శుద్ధస్వర రాగం. ఇది అచ్చగా కర్ణాటక సంగీతంలోని శంకరాభరణానికి సమమైన రాగం. 'అల్హయ్యా బిలావల్'లో అప్పుడప్పుడు కొద్దిగా కోమల్ 'ని' కూడా ఉపయోగించబడుతుంది. అంతకు మించి దానికీ 'బిలావల్'కు తేడా ఏమీ లేదు. ఇది ప్రభాత కాలపు రాగం. విలంబిత్ గత్ ను రవిశంకర్ ఖయాల్ అంగ్ (స్టయిల్)లో వాయించారు.

'పట్ దీప్' అపరాహ్న కాలపు గంభీర రాగం, ఇందులో 'గ' కోమల స్వరం. మిగిలినవన్నీ శుద్ధ స్వరాలు. 'భీమ్ పలాస్' లోని కోమల్ 'ని' కి బదులు శుద్ధ 'ని' ఉపయోగిస్తే 'పట్ దిప్' అవుతుంది. దీని ఆరోహణ-అవరోహణ, సగమపనిస- సనిదపమగరిస. రవిశంకర్ ఈ రాగంలో ఆలాప్, జోడ్, సితార్ ఖానీతాల్ లో గత్ వాయించారు. ఆలాప్ లో ఆయన మంద్రస్థాయిలోనూ, అతి మంద్రస్థాయిలోనూ గంభీరంగా, బీన్ కార్ ఘరానాలో వాయించారు. మధుర స్మృతులు మదిని వేధిస్తూ ఉండగా ప్రియుని కొరకై నిష్ఫలంగా, నిరంతరంగా నిరీక్షిస్తున్న విరహోత్కంఠిత రూపాన్ని ఈ రాగం స్ఫురింపజేస్తుంది.

మాల్కౌస్ రికార్డు

రవిశంకర్ అత్యుత్తమైన రికార్డులలో ఇది ఒకటిగా చెప్పడానికి వీల్లేదు. ఇంతకు ముందు వ్యాసాలలో పరామర్శించిన రికార్డులు కాక, మిగిలిన రికార్డులలో రవిశంకర్ అద్భుతంగా వాయించిన రాగాలు-'రాగేశ్వరి', 'మాల్కౌస్', 'భీమ్ పలాస్', 'బిహాగ్'. వీటిలో 'రాగేశ్వరి' రాగాన్ని EALP 1288 రికార్డులో వాయించారు. ఈ రాగంలో ఆలాప్, జోడ్, గత్ లను చాలా సీరియస్ గా, మనోహరంగా వాయించారు. ఈ రికార్డు రెండో వైపున 'పథేర్ పాంచాలి' థీమ్ మ్యూజిక్ జాజ్ కళాకారులతో కలిసి వాయించారు. 'మాల్కౌస్' రాగాన్ని IWP01 నంబరు రికార్డులో వాయించారు. ఇంత అద్భుతమైన 'మాల్కౌస్' ఇంత వరకు యే రికార్డులో లేదని చెప్పవచ్చు. 'మాల్కౌస్' రాగ సౌందర్యాన్ని ఆయన సమగ్రంగా చిత్రించారు. ఆ రాగాన్ని విన్న తర్వాత వెంటనే మరొక రాగం-ఎంత గొప్పదైనా సరే-వినాలని అనిపించదు. ఈ రాగంలో రవిశంకర్ ఆలాప్ జోడ్, ఝాలా మాత్రమే వాయించారు. గత్ వాయించకపోవడంలో గొప్ప ఔచిత్యం ఉన్నది. అంత గంభీర సుందరమైన రాగంలో ఝాలా వాయించిన తర్వాత గత్ వాయిస్తే యాంటీ క్లైమాక్స్ లాగా ఉండేది. ఈ రికార్డు రెండో వైపు వాయించిన 'ముల్తానీ' రాగం సంతృప్తి కరంగా లేదు. చాలా డల్ గా ఉంది.

'మాల్కౌస్' లాగానే 'భీమ్ పలాస్' (WP 1442) రాగంలో కూడా ఆయన ఆలాప్ జోడ్, ఝాలా మాత్రమే వాయించి ఊరుకున్నారు. ఇది కూడా ఇంత వరకు రికార్డులో వచ్చిన 'భీమ్ పలాస్' లన్నింటిలోకి ఉత్తమంగా ఉన్నది. ఈ రికార్డు రెండో వైపు మొదట అల్లారఖా తబ్లా సోలో నాలుగైదు నిమిషాలు వాయించారు. ధ్రుత్ లయలో ఆయన వాయించిన ఏక్ తాల్ అద్భుతంగా ఉంది. తర్వాత రవిశంకర్ 'పంచమ్ సే గారా'లో ఒక ధున్ వాయించారు. ఇది మొదట కొంచెం సేపు బావుంది. తర్వాత ఊకదంపుడుగా సాగింది. గ్యాలరీ జనం కోసం వాయించినట్లుగా ఉంది. నిజానికి ఈ రికార్డులోని సంగీతమంతా రవిశంకర్ మాంటెరీ ఇంటర్నేషనల్ పాప్ మ్యూజిక్ ఫెస్టివల్ లో వాయించినది. ఆ కచేరీకి హాజరైనవారిలో ఎక్కువమంది యువతరం వారు-ముఖ్యంగా హిప్పీలు. 'భీమ్ పలాస్' రాగాన్ని గొప్ప మూడ్ లో సీరియస్ గా వాయించిన రవిశంకర్ చివర ధున్ లో కేవలం యువజనాన్ని హుషారు చేయడం కోసం వాయించారు. జనం ఉత్సాహం పట్టలేక ఈలలు వేయడం కేకలు పెట్టడం కూడా రికార్డులో వినిపిస్తుంది.

బిహాగ్ రికార్డు

రవిశంకర్ గొప్పగా వాయించిన మరొక రాగం 'బిహాగ్'. ఈ రాగాన్ని EASD 1372 రికార్డులో రెండు వైపులా వాయించారు. ఇందులో ప్రక్క వాద్యంగా పద్మభూషణ్ అహమ్మద్ జాన్ తిరఖ్వా తబ్లా వాయించడం విశేషం. తొంభై ఏండ్లు పైబడిన తిరఖ్వా వయస్సులోనే కాక, తబ్లా వాదన నైపుణ్యంలో కూడా దేశం మొత్తం మీద అగ్రగణ్యుడు. ఆయన రవిశంకర్ తో కలిసి వాయించిన రికార్డు ఇది ఒక్కటే. ఇందులో మొదటి వైపు ఏడెనిమిది నిమిషాల సేపు తిరఖ్వాసాహబ్ తీన్ తాల్ లో తబ్లా సోలో వాయించారు. తర్వాత రవిశంకర్ 'బిహాగ్' లో ఆలాప్, జోడ్ వాయించారు. రెండో వైపు 'బిహాగ్' లోనే విలంబిత్, మధ్య లయ గత్ లను వాయించారు.

'జై బాంగ్లా' శీర్షికతో వెలువడిన ఒక ఇ.పి. రికార్డు (S/7-EPE 1166) లో రవిశంకర్ స్వయంగా రెండు బెంగాలీ గీతాలు పాడారు. బెంగాలీ జానపద సంగీతంతో పరిచయం ఉన్నవారికి ఆ పాటలు నచ్చుతాయి. సాధారణ శ్రోతలకు అవి బోరింగ్ గా ఉంటాయి. ఆ రికార్డు రెండో వైపు రవిశంకర్, అలీఅక్బర్ ఖాన్ కలిసి 'మీశ్ర జింఝూటీ' రాగాన్ని వాయించారు.

రవిశంకర్ 1945 ప్రాంతంలో 'నీచానగర్', 'ధర్తీకే లాల్' అనే హిందీ చలన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తర్వాత సత్యజిత్ రే నిర్మించిన 'పథేర్ పాంచాలీ', 'అపరాజిత', 'అపూర్ సంసార్', 'పరస్ పత్థర్' బెంగాలీ చిత్రాలకు, తపన్ సిన్హా నిర్మించిన 'కాబూలీవాలా' (బెంగాలీ) చిత్రానికి, 'అనూరాధ', 'గోదాన్' హిందీ చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 'ది కెనెడియన్ ఫాంటసీ', 'ది చైరీ టేల్', 'ది ప్లూట్ అండ్ ది యారో', 'చార్లీ' ఇంగ్లీషు చిత్రాలకు కూడా సంగీతం సమకూర్చారు. వీటిలో 'చార్లీ' ఎల్.పి., 'అనూరాధ' ఇ.పి. మాత్రం విడుదలైనాయి. మిగిలినవాటికి ఎల్.పి., ఇ.పి.లు రాలేదు.

'అనూరాధ' ఇ.పి.లో నాలుగూ లతామంగేష్కర్ పాటలే వేశారు. శాస్త్రీయ ధోరణిలో ఉన్నప్పటికీ అవన్నీ బాగా హిట్ అయినాయి. ఆ చిత్రం వచ్చి 13 ఏళ్ళయినా ఇప్పటికీ ఆ పాటలు తరచుగా రేడియోలో వినిపిస్తూ ఉంటాయి. 'సావఁరే' అనే పాట-ఇంత వరకు భైరవి రాగంలో వచ్చిన సినిమా పాటలన్నింటిలోకి మంచిదని చెప్పవచ్చు. 'కైసేదిన్ బీతే' పాటను 'మాంజ్ ఖమాస్' రాగంలోనూ 'హాయేరే ఓ దిన్' పాటను 'జన సన్మోహిని' రాగంలోనూ, 'జానేకైసే సప్నోంమే' పాటను 'తిలక్ శ్యామ్' రాగంలోనూ కూర్చారు. ఈ నాలుగూ లతా మంగేష్కర్ కు చాలా ఇష్టమైన పాటలు.

నండూరి పార్థసారథి
(1974 జూలై 5వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post