Humor Icon

"క్లాసికల్ క్లాసికల్ అంటుంటారు. ఏవిటండీ అది?"

"అదా... ఉండండి. ఒక రికార్డు పెట్టి వినిపిస్తాను... ఇదుగో ఇది షెహనాయి రికార్డు".

"ఇదా... ప్రగతిమైదాన్ లో ఇది ఎప్పుడూ వింటూనే ఉంటాం... ఇదేం సంగీతమండీ అలా ఏడుస్తూ ఉంటుంది?"

"ఇది కరుణరస ప్రధానమైన చంద్రకౌఁస్ రాగం. విషాదంగానే ఉంటుంది".

"సంగీతం వింటే ఆనందం కలగాలి గాని విషాదం, వైరాగ్యం కలిగితే ఎలాగండీ".

"అయితే శృంగార రస ప్రధాన రాగం వినిపిస్తాను ఆగండి... ఇదుగో ఇది రాగేశ్వరీ రాగం".

"ఇదేం శృంగారమండి బాబు? ఇదీ ఏడుస్తూనే ఉంది. ఆ వాయించే పెద్దమనిషి ఎవరండీ"?

"పద్మ విభూషణ్, షెహనాయ్ నవాజ్ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ గారు".

"ఓహో... ఆయనగారి శృంగారం కూడా ఏడుపు గొట్టుగానే ఉంటుందన్నమాట".

"అసలు షెహనాయి నాదమే అలా ఉంటుంది - విషాదమధురంగా. అలవాటు లేక పోవడం వల్ల ఆ మాధుర్యం మీకు తెలియడం లేదు".

"అలవాటు లేకపోవడం ఏమిటండీ బాబు... ప్రగతిమైదాన్ ఎగ్జిబిషన్ కి ఏ టైములో వెళ్ళినా ఇదే సంగీతం. రేడియోలో ఇదే... టీవీలో ఇదే... అదేమిటో కొందరు శుభమా అంటూ పెళ్ళి చేసుకుంటూ కూడా ఇదే సంగీతం పెడతారు".

"అవగాహన లోపం-అంతే... పోనీ లెండి. బిస్మిల్లా, వి.జి.జోగ్ షెహనాయ్- వైలిన్ జుగల్ బందీ రికార్డు పెడతాను వినండి".

"ఆహా... ఇది మరీ బావుంది... ఒకరికిద్దరు ఏడుస్తున్నారన్న మాట. ఆ ఏడిచేదేదో ఒక్కరే ఏడవచ్చు గదండీ. డ్యూయెట్ గా ఏడవడం దేనికి?.... ఓహో... ఏం పోటీగా ఏడుస్తున్నారండీ... కాసేపు విడివిడిగా, కాసేపు జమిలిగా, కాసేపు నెమ్మదిగా, కాసేపు స్పీడుగా... అబ్బ... ఏడవడంలో కూడా ఎంత పాండిత్యమండీ...."

"అన్నప్రాశన నాడే ఆవకాయా అన్నట్టు అవగాహన లేని మీలాంటి వారికి ఆగ్రా ఘరానా ఫయ్యాజ్ ఖాన్ ఆలాప్ తో ప్రారంభిస్తే హడలెత్తి పారిపోతారనే ఉద్దేశ్యంతో సున్నితంగా, మధురంగా ఉండే బిస్మిల్లా షెహనాయితో మొదలు పెట్టాను. కాని షెహనాయి మీకు పడినట్టు లేదు. పోనీ పండిత్ రామ్ నారాయణ్ గారి సారంగి వినిపిస్తాను వినండి".

"అయ్యో రామ... సారంగి అంటే ఇదా.. ఇది తెలియక పోవడం ఏమిటి? రాష్ట్రపతి, ప్రధాని మొదలైనవారు దివంగతులైనప్పుడు రేడియోలో వినిపించేది ఇదే గదండీ... ఆహా... మన వాళ్ళు ఎంత స్పెషలైజేషన్ ఏర్పాటు చేశారండీ. చావు సంగీతం కోసం ప్రత్యేకంగా ఒక వాయిద్యాన్నే కేటాయించారు! అవునూ... ఆయన వాయించేది మృత్యురాగమా అండీ?"

"మృత్యురాగం అంటూ ఒకటి ప్రత్యేకంగా లేదండీ".

"అహ... ఏం లేదు. ఇందాక మీరు విషాద రాగం, కరుణ రాగం, శృంగార రాగం అంటేనూ... అలాగే మృత్యురాగం కూడా ఉందేమోనని....".

"ఇది బైరాగి భైరవ్ రాగం".

"అంటే శ్మశానంలో బైరాగులు పాడుకునే సంగీతం అన్నమాట. లేకపోతే శ్మశానవైరాగ్య రాగం. మొత్తం మీద కాస్త అటూ యిటూగా నా ఊహ కరక్టే. ఇంతకీ ఈ రామనారాయణం గారు చావు సంగీతంలో నిష్ణాతుడా అండీ?"

"ఛ... అదేమిటండీ అలా అంటారు?"

"మృత్యు సంగీత సమ్రాట్, మరణ సంగీత మార్తాండ వగైరా బిరుదులేవైనా ఉన్నాయా ఈయనకి?"

"అవేవీ లేవుగాన మీరు మాట్లాడడం మానేసి ఒక్క నిముషం మౌనంగా విని చెప్పండి ఎలా ఉందో"

"మీరు చెప్పినట్టు ఒక్క నిముషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించాను. ఇంక చాలండి బాబు... దుఃఖం ముంచుకొచ్చేస్తోంది"

"మీరు ఈ సంగీతాన్ని చాలా శ్రద్ధగా వినాలి. అలా లైట్ గా తీసుకోకూడదు".

"దుఃఖ భారంతో ఇంత హెవీగా ఉంటే లైట్ గా ఎలా తీసుకుంటామండీ..."

"మీకు డోసు హెవీ అయినట్టుంది. కొంచెం లైట్ గా తేలిగ్గా జీర్ణమయ్యే ఫారెక్స్ లాంటి సితార్ సంగీతం వినిపిస్తానాగండి... ఇదుగో... ఇది విశ్వవిఖ్యాత సితార్ విద్వాంసుడు, పద్మవిభూషణ్, దేశికోత్తమ పండిత్ రవిశంకర్ గారి రికార్డు. వీరిది ఎల్లలెరుగని విశ్వజనీన సంగీతం. ఆ బాలగోపాలాన్ని ఉర్రూత లూగించిన సంగీతం. విని చెప్పండి ఎలా ఉందో".

"ఏదో బాగానే ఉందనుకోండి...."

"హమ్మయ్య... మొత్తానికి మీ చేత బాగానే ఉందనిపించాను. ఎంత చెప్పినా రవి శంకర్ రవిశంకరే".

"భలే వారండీ... సుతారంగా సితారు టింగు టింగు మంటుంటే బావుండక ఛస్తుందా? కానీ... ఎంతసేపని వింటాం? ఆయన ఎందుకు వాయిస్తున్నాడో, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఏమీ తెలిసిచావడం లేదు. ఇప్పటికి మూడు నిముషాలయ్యింది. ఇంత వరకు పాట మొదలు పెట్టలేదు".

"ఇందులో పాట ఉండదండీ. ఇది వాద్య సంగీతం కదా?"

"అయితే... పాటా, కీర్తనా, భజనా పాడూ ఏమీ లేకుండా ఊరికే ఎంత సేపయినా అలా టింగు టింగు మని తీగలు మీటుతూ ఉంటాడన్న మాట. రికార్డు ఇంకా మొదట్లోనే ఉంది. చులాగ్గా ఇంకో ఇరవై నిముషాలు లాగించేట్టున్నాడు".

"ఇరవై నిముషాలేమిటండీ... కచేరీలో అయితే ఆలాప్, జోడ్, ఝాలా, విలంబిత్ గత్, మధ్యలయ్ గత్, ధ్రుత్ గత్, అతిధ్రుత్ గత్ రెండు గంటల సేపు వాయించి అదరగొట్టి పారేస్తారు. మీరు విని తీరాలి".

"ఇంకా నయం... ఏదో ఫ్రీగా వినిపిస్తున్నారు కాబట్టి, వద్దంటే తీసేస్తారు కాబట్టి వింటున్నాగాని, డబ్బిచ్చి కచేరీకి వెళ్ళి గంటల తరబడి ఈ సుత్తెక్కడ భరించగలనండి బాబు? శుభ్రంగా సినిమా పాటలైతే కవిత్వం, భావాలు, అర్ధాలు మొదలైనవి ఉంటాయి. కొన్ని పాటల్లో అయితే శ్లేష కవిత్వం కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క మాటకీ రెండేసి అర్థాలన్నమాట. పోనీ అవేవీ వద్దు. భక్తీ ముక్తీ మున్నగునవి కావాలనుకుంటే త్యాగయ్య గారి కీర్తనలున్నాయి. రామా... బ్రోవవా... కావవా, మొరాలకింపవా, కడతేర్చవా అంటూ మొత్తుకుంటాడు ఆయన. త్యాగయ్య భక్తి, సుందర్రామూర్తి రక్తి లేకుండా ఇదేం సంగీతమండీ బాబు? అసలీ రవిశంకర్ గారికి ఇంత పేరు ఎలా వచ్చిందండీ?"

"అర్థమయ్యింది... మీకు కావాల్సింది గాత్ర సంగీతం. మామూలుగా అందరికీ వాద్య సంగీతం తొందరగా నచ్చుతుంది. గాత్ర సంగీతం ఓ పట్టాన బుర్రకెక్కదు. మీరు అందరిలాంటి వారు కారు. గాత్ర సంగీతం వినిపిస్తాను ఆగండి. ఇందులో అయితే మీక్కావాల్సిన సాహిత్యం కూడా ఉంటుంది. ఇంక వినండి శ్రద్ధగా"

"ఇద్దరు పాడుతున్నట్టుందే...."

"అవును... డాగర్ బ్రదర్స్"

"మీకు కోపం వస్తుందేమోనని నోరు మూసుకు వింటున్నాను. నాలుగు నిముషాలయ్యింది. ఒక్క అంగుళం ముందుకు కదల్లేదు. ఇంకా ఆ... ఈ... అంటూ సాగదీస్తున్నారు-ఏకులోంచి నూలు లాగినట్లుంది. ఏదో సాహిత్యం అన్నారు. దాని జాడ ఇంతవరకు కనిపించలేదు".

"ఆలాప్ అలాగే స్లోగా ఉంటుంది. కాస్త ముందుకు జరిపి పెడతాను ఆగండి....."

"మీరు ముందుకు జరిపి పెట్టినా వాళ్ళ సంగీతం ఇంకా అక్కడే ఉంది. కీర్తనా లేదు. పాడూ లేదు. ఇదేం సంగీతమండీ?"

"దీన్ని ధ్రుపద్ సంగీతం అంటారు. దీని టెక్నిక్కే అంత. ముందు మధ్యసప్తక్ తో ప్రారంభిస్తారు. అక్కణ్ణించి మంద్రసప్తక్ కి, అతి మంద్ర సప్తక్ కి వెళ్ళి, క్రమంగా మళ్ళీ మధ్య సప్తక్ కి తిరిగి వచ్చి, స్లోగా తారసప్తక్ కి వెడతారు. ఒక సప్తక్ కి పూర్తిగా మధిస్తేగాని మరో సప్తక్ లోకి అడుగు పెట్టరు. అలా ఆలాప్ పూర్తి చేశాక 'నొంతొం' అందుకుంటారు. అది కూడా ఇలాగే ఎలాబరేట్ గా పాడతారు. ఆ తర్వాత ధ్రుపద్ బందిష్- అంటే సాహిత్య రచన-అందుకుంటారు. దీని అసలు పేరు 'ధ్రువపద'. క్రమంగా అదే ధ్రుపద్ గా మారింది".

"పేరు మాత్రం అతికినట్టుగా సరిపోయిందండీ. 'ధ్రువ' అంటే ఉత్తరధ్రువం, దక్షిణ ధ్రువంలాగా కదలకుండా స్థిరంగా ఉండేది అని అర్థం. 'పద' అంటే పాదం అని అర్థం. అంటే పాదం ముందుకి కదపకుండా ఎక్కడున్నది అక్కడే పడి ఉండే సంగీతం అని అర్థం. అంతే కదండీ?"

"మీకు ఇలా లాంగ్ ప్లే రికార్డు వినిపించడం నాదే తప్పు. మూడు నిముషాల్లో ఫినిష్ అయిపోయే 78 ఆర్.పి.ఎం. రికార్డు వినిపిస్తానుండండి. అందులోనూ మాంఛి రమ్జుగా ఉండే బడేగులాం ఆలీఖాన్ గుజరీ తోడి ఖయాల్ రికార్డు పెడతాను వినండి. బందిష్ కూడా ఆయన సొంతం".

"ఇదేవిటండీ... ఈయన సాహిత్యాన్ని అలా నరికి పోగులు పెడుతున్నాడు. ఒక్క ముక్క అర్థమై చావడం లేదు"

"భాష తెలియకపోవడం వల్ల మీకు అర్థం కావడం లేదు. ఆయన హిందీలో పాడుతున్నాడు".

"భలేవారండీ నాకు హిందీ క్షుణ్ణంగా వచ్చు. విశారద దాకా చదివాను. ఆయన ఉరుముతున్నట్లు, గర్జిస్తున్నట్లు, మీదికి లంఘిస్తున్నట్లు పాడతాడేం? చక్కగా తలత్ మహమూద్ లా సాఫ్టుగా పాడకూడదూ?"

"ఆయన గమకాలు వేసి పాడుతున్నాడు. క్లాసికల్ సంగీతానికి పుష్టినిచ్చేవి ఆ గమకాలే. వాటిల్లో ఎన్నో రకాలున్నాయి. 'ధర్తీకా ధడ్కన్' అని ఒక రకం ఉంది. ఆ గమకం పాడుతుంటే భూకంపంలా అదిరిపోతూ ఉంటుంది. 'మేఘ్ గర్జన్' అని ఇంకోటి ఉంది. అది మీరిందాక చెప్పినట్లు మేఘాల ఉరుముతున్నట్టు ఉంటుంది".

"సింహగర్జన్ లేదా?"

"అబ్బే అది లేదు?"

"బతికి పోయాం. అది కూడా ఉంటే ఈ పాటికి ఆయన సింహావతరాంలా మీదికి లంఘించి చీల్చి చెండాడి ఉండేవాడు. అయితే గురూగారూ.. ఈ క్లాసికల్ సంగీతం అంతా ఇహ ఇంతేనా?"

"అంతా ఇలాగే ఎందు కుంటుంది? క్లాసికల్ లో ఎన్నో రకాలున్నాయి. వాటిల్లో హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం ప్రధానమైనవి. ఇవికాక పర్షియన్, అరేబియన్, ఈజిప్షియన్, చైనీస్ సంగీతాలున్నాయి. ఒక్కొక్క దాని స్టయిల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది".

"హిందుస్థానీ అంటే ఎలా ఉంటుందండీ?"

"ఇప్పటి దాకా మీరు విన్నది హిందుస్థానీ సంగీతమే".

"అయితే... ఒక్క వాక్యంలో చెప్పాలంటే... ఈసురో మంటున్నట్టు, ఈగలుదోలుకుంటున్నట్లు ప్రారంభమై, తొడగొట్టి సవాలు చేస్తున్నట్టు, గుడ్లురుముతున్నట్టు, మీద పడి కరుస్తున్నట్టు అంతమయ్యేది హిందుస్థానీ సంగీతమన్న మాట".

"పరిచయం లేనివారికి మొదట్లో అలాగే అనిపిస్తుంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. భయపడి పారిపోకుండా ధైర్యంగా ఎదుర్కోండి. అప్పుడప్పుడూ వచ్చి కొద్ది కొద్దిగా వినిపోతూ ఉఁడండి. క్రమక్రమంగా అది మచ్చికవుతుంది. దానిపై ఆసక్తి, అనురక్తి కలుగుతాయి. ఒకసారి దాని రుచి తెలిసిందంటే ఇంక వదిలి పెట్టరు. స్పిక్ మాకే వారి సోదాహరణ ప్రసంగకార్యక్రమాలకి హాజరవుతూ ఉండండి. మీ అవగాహన పెరుగుతుంది".

"స్పిక్ మాకే ఏమిటండీ?"

"SPIC MACAY అంటే SOCIETY FOR PROMOTION OF INDIAN CLASICAL MUSIC AND CULTURE AMONG YOUTH. యువతరం వారిలో శాస్త్రీయ సంగీతం పట్ల అభిరుచి, అవగాహన పెంచడానికి కృషి చేస్తున్న సంస్థ అది. విశ్వవిద్యాలయాలలోనూ, కళాశాలల్లోనూ గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల చేత సోదాహరణ ఉపన్యాసాలు ఇప్పిస్తూ ఉంటారు. విద్యార్థుల సందేహాలకి విద్వాంసులు ఉదాహరణ పూర్వకంగా సమాధానాలిస్తుంటారు. చొప్పదంటు ప్రశ్నలకి కూడా విసుక్కోకుండా చాలా ఓపికగా జవాబులిస్తుంటారు. ఆ కార్యక్రమాలు ప్రత్యేకంగా మీలాంటి వారి కోసమే".

"ఏమో గురూ గారూ... ఈ క్లాసికల్ మ్యూజిక్కు నాకు అర్థమైచావదు".

"తెలుసుకోవాలన్న కోరికంటూ ఉండాలే గానీ తప్పక అర్థమవుతుంది. గ్రానైట్ రాయిని కూడా అద్దంలా మెరిసేట్టు పాలిష్ పెట్టవచ్చు. రెగ్యులర్ గా వినండి. మీ అవగాహన పాలిష్ట్ గ్రానైట్ లా మెరుస్తుంది. సంగీతం పాడాలంటే పూర్వ జన్మ వాసన అవసరం గాని విని ఆనందించడానికేముంది? శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గాన రసం ఫణిః అన్నారు పెద్దలు".

"అన్యాపదేశంగా భలే దెబ్బ కొట్టారు గురూగారూ...! ఇంతకీ నేను శిశువుననా, పశువుననా మీ ఉద్దేశ్యం?".

నండూరి పార్థసారథి
(1991లో రచన సచిత్ర మాస పత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post