భువనేశ్వర్, ఆగస్టు 11 : ఒడిస్సీ నృత్యం లాగానే ఒడిస్సీ సంగీతం కూడా ఒకటుందని ఒరిస్సా రాష్ట్రానికి వెలుపల చాలా మందికి తెలియదు. ఒడిస్సీ నృత్యం సంగతి కూడా గత పాతికేళ్లలోనే బయటి ప్రపంచానికి తెలిసింది. పద్మభూషణ్ కేలూ చరణ్ మహాపాత్రో కృషి ఫలితంగా, ఆయన శిష్యురాం డ్రయిన సంయుక్త పాణిగ్రాహి, సోనాల్ మాన్ సింగ్, ప్రతిమా బేది, కుంకుం మొహంతిల ద్వారా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో ఒడిస్సీ నృత్యానికి విశేష ప్రాచుర్యం లభించింది. ఆమెరికన్ నర్తకి షరన్ లోవెన్ ఈ నృత్య సౌందర్యానికి సమ్మోహితురాలై ఇండియాలో స్థిరపడి, కేలూ చరణ్ మహాపాత్ర వద్ద నృత్యం అభ్యసించి ఒడిస్సీకి తన జీవితాన్ని అంకితం చేసింది.
ఒడిస్సీ నృత్య ప్రదర్శనలలో వినిపించేది ఒడిస్సీ సంగీతమే. అయితే అది నృత్యం చాటున వినయంగా ఒదిగి ఉంటుంది. అందుకే ఒక స్వతంత్ర సంగీత ప్రక్రియగా అది కళాభిజ్ఞుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఒడిస్సీ గాయకులెవరూ రాష్ట్రందాటి బైటకువెళ్లి జాతీయ కళావేదికలపై కచేరీలు చేయలేదు. ఆకాశవాణి, దూరదర్శన్ జాతీయ సంగీత కార్యక్రమాలలో ఒడిస్సీ శాస్త్రీయ సంగీతం వినిపించదు. గ్రామఫోన్ రికార్డు కంపెనీలు, కేసెట్ కంపెనీలు, రవీంద్ర సంగీతాన్ని, మరాఠీ నాట్య సంగీతాన్ని ప్రచారం చేసినట్లుగా ఒడిస్సీ సంగీతాన్ని ప్రచారం చేయలేదు. ఒరిస్సా సంగీత నాటక అకాడమీ కూడా ఇంతకాలం ఈ సంగీతం వైపు రసికులకు ఆకర్షించడానికి కృషి చేయలేదు. రాష్ట్రం బయటేకాదు, నిజానికి ఒరిస్సాలో కూడా పూర్తిస్థాయి ఒడిస్సీ సంగీత కచేరీలు జరగడం అరుదు.
ఒరిస్సా సంగీత నాటక అకాడమీ ఐదేళ్ల తర్వాత మొదటిసారిగా ఈ మధ్య మూడు రోజులు (జూలై 31, ఆగస్టు 1, 2 తేదీలలో) శాస్త్రీయ సంగీత ఉత్సవం నిర్వహించింది. ఈ ఉత్సవంలో ప్రతి రోజూ మొదట ఒక ఒడిస్సీ గాత్ర సంగీత కచేరీ, తర్వాత హిందూస్థానీ గాత్ర కచేరీ, హిందుస్థానీ వాద్య సంగీత కచేరీ నిర్వహించింది. ఒక్కొక్క కచేరీ సుమారు గంట సేపు చొప్పున రోజు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల దాకా సంగీత కార్యక్రమాలు వినిపించారు. మొదటి రోజు ఘనశ్యాం పాండా, రామహరిదాస్, రెండవ రోజు ప్రఫుల్లకర్, మహాప్రసాద్ కర్ ఒడిస్సీ యుగళ గాత్ర కచేరీలు జరిగాయి. మూడవ రోజు శ్రీమతి శ్యామమణి దేవి ఒడిస్సీ కచేరీ జరిగింది.
హిందుస్థానీ గానశైలికి, కర్నాటక గాన శైలికి మధ్యస్థంగా ఒడిస్సీకి ఒక విశిష్ఠమైన, విచిత్రమైన శైలి ఉంది. ముఖ్యంగా గమకాలలో దీని ప్రత్యేకత ద్యోతకమౌతుంది. అంతేగాకుండా దక్షిణ ఒరిస్సా, ఉత్తర ఒరిస్సా, పశ్చిమ ఒరిస్సా ప్రాంతాల గాన శైలుల మధ్య కూడా గమకాల ప్రయోగంలో కొంత తేడా కనిపిస్తుంది. దక్షిణ ఒరిస్సా (ఆంధ్రప్రదేశ్ ను అనుకుని ఉన్న ప్రాంతం) గాయకుల ఒడిస్సీ గానంలో కర్నాటక సంగీత గమకాల ఛాయలు కనిపిస్తాయి. ఈ సంగీత ఉత్సవంలోని మూడు ఒడిస్సీ కచేరీలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ వైవిధ్యం అవగతమౌతుంది.
రెండవ నాటి కార్యక్రమంలో తండ్రీకొడుకులు ప్రఫుల్లకర్, మహాప్రసాద్ కర్ ల కచేరీ ప్రత్యేకంగా చెప్పుకోదగింది. యువ గాయకుడు మహాప్రసాద్ కర్ ఆలాపనలో, స్వరప్రస్తారంలో అద్భుత ప్రావీణ్యం ప్రదర్శించాడు.
ప్రతిరోజూ ఒడిస్సీ సంగీతం తర్వాత హిందుస్థానీ కచేరీలు ఏర్పాటుచేయడం వల్ల శ్రోతలు ఆ రెండు పద్ధతుల మధ్య శైలీ భేదాన్ని గమనించడానికి అవకాశం కలిగింది. హిందుస్థానీ కచేరీలలో మొదటి రోజు పండిట్ జె.వి.ఎస్. రావు గాత్ర సంగీతం, డాక్టర్ ఎన్. రాజం వయోలిన్ వినిపించారు. జె.వి.ఎస్. రావుగా హిందుస్థానీ సంగీత ప్రియులకు సుపరిచితులైన జొన్నవిత్తుల వెంకటసుబ్బారావు గారు ఒరిస్సాలో స్ధిరపడిన ఆంధ్రుడు. నాటి కచేరీలో ఆయన గ్వాలియర్ ఘరానా శైలిలో, తన గురువైన స్వర్గీయ వినాయకరావు పట్వర్థన్ ను తలపించే విధంగా మధుకౌఁస్ రాగంలో విలంబిత్ ఖయాల్, ద్రుత్ తరానా, ఆ తర్వాత మిశ్రఖమాస్ లో ఒక భజన గానం చేశారు.
డాక్టర్ ఎన్. రాజం తన గురువైన స్వర్గీయ ఓంకార్ నాథ్ ఠాకూర్ గాన శైలిలో భాగేశ్వరి, గౌడమల్హార్, భైరవి రాగాలను వినిపించారు.
చివరి రోజు యువగాయకుడు దేవేంద్ర శతపథి హిందుస్థానీ గాత్ర సంగీత కచేరీ చిరస్మరణీయమైనది. ప్రముఖ ఒడిస్సీ, హిందూస్థానీ సంగీత విద్వాంసుడు డాక్టర్ దామోదర్ హోతా శిష్యుడైన ఈ యువకుడు 'మధుసరావళి' అనే ఒక అపురూప రాగాన్ని అద్భుతంగా గానం చేశారు. దాని తర్వాత భైరవి రాగంలో కబీర్ భజన్ తో అతడు కచేరీని ముగించాడు. భవిష్యత్ లో అతడు జాతీయ స్థాయి అగ్రశ్రేణి కళాకారుడుగా గుర్తింపు పొందగలడని ఆశించవచ్చు.
ఒడిస్సీ సంగీతాన్ని ఇతర రాష్ట్రాలకు పరిచయం చేయడానికై ఒరిస్సా సంగీత నాటక అకాడమీ త్వరలో హైదరాబాద్, ఢిల్లీ, బొంబాయి వంటి ప్రధాన నగరాలలో కచేరీలు నిర్వహించాలని యోచిస్తున్నది.
ఒరిస్సాకు చెందిన ప్రముఖ ఒడిస్సీ, హిందుస్థానీ గాయకుల బృందాన్ని తీసుకు వెళ్లి మొదట హైదరాబాద్ లోనూ, తర్వాత ఇతర నగరాలలోనూ కచేరీలు జరిపించాలని సంకల్పించినట్లు అకాడమీ కార్యదర్శి డాక్టర్ సుధా మిశ్రా తెలియజేశారు. ఒడిస్సీ సంగీతం కేసెట్ లను విక్రయించే ఉద్దేశ్యం కూడా ఉందని ఆమె చెప్పారు.
నండూరి పార్థసారథి
(1995 ఆగస్టు 13వ తేదీ ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)
Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works