Title Picture
'ఛాయా' చిత్రం ఎ.వి.యం. సంస్థ ఆర్జించుకొన్న పేరును నిలబెట్టగల విధంగా ఉంది. లోగడ ఎ.వి.యం. సంస్థకు విశేషంగా ధనం ఆర్జించి పెట్టిన చిత్రాల కోవకే చెందుతుంది ఈ చిత్రం కూడా. హృషీకేశ్ ముఖర్జీ పేరును చూసికాక ఎ.వి.ఎం. సంస్థ పేరును చూసి, ఈ చిత్రం స్థాయిని అంచనా వేసుకుని చూస్తే ఆశాభంగం కలగదు. తన అభిరుచులకు, సంప్రదాయాలకు స్వస్తి చెప్పి ఎ.వి.యం. వారి అభిరుచులకు అనుగుణంగా ఆయన ఈ చిత్రాన్ని తయారు చేశారు. ఈ చిత్ర నిర్మాణంతో ఆయన తన కీర్తిమకుటానికి కాక, ఎ.వి.యం. వారి కీర్తిమకుటానికి మరొక కొత్త ఈకను తగిలించారు. 'అనురాధ' మార్కు చిత్రాలనే కాక, ఎ.వి.యం. మార్కు చిత్రాలను కూడా తాను నిర్మించగల సమర్థుడనని ఆయన రుజువుచేసుకున్నాడు. అసలు ఆయన తీయగలిగినవి ఇటువంటి చిత్రాలేననీ, 'అనూరాధ' వంటి ఒకటి రెండు చిత్రాలను పొరపాటునో, గ్రహపాటునో నిర్మించారనీ ఈ చిత్రం వల్ల కొందరు అనుమానించే ప్రమాదం ఉన్నది.

మనోరమ (నిరూపరాయ్) అనే ఆవిడకు మొదటి రీలులోనే భర్త మరణిస్తాడు. పసిపాపను చంకను వేసుకుని ఆమె పట్టణం వస్తుంది. రోడ్లరిగేటట్లు తిరిగినా ఎక్కడా ఆశ్రయం దొరకదు. నడిచి నడిచి బట్టలు చిరిగిపోయినా పసిపిల్లకు పాలు దొరకవు. చివరకు గత్యంతరం లేక ఆ పాపను ఒక ధనికుని ఇంటి ముందు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ ధనికుడు (నజిర్ హుస్సేన్) ఆ పిల్లను పెంచుకుంటాడు (ఆయనకు సంసారం గట్రా ఏమీ లేవు). దరిమిలా ఆ పిల్ల తల్లే ఆయింట్లో దాసీగా కుదిరి పిల్లను పెంచి పెద్దదాన్ని చేస్తుంది. కొన్నాళ్ళు పోయాక ఆ పిల్ల (ఆశాఫరేఖ్) తనకు ట్యూషన్ చెప్పడానికి వచ్చే బుద్ధి మంతుడైన బీద టీచరు (సునీల్ దత్)ను ప్రేమిస్తుంది. అతనూ ప్రేమిస్తాడు. కాని వారి వివాహానికి అంతస్తు అడ్డువస్తుంది. చివరకు తల్లి త్యాగం మొదలయినవాటి వల్ల వాళ్ళకు పెళ్ళి అయి, కథ సుఖాంతమవుతుంది.

చిత్రం మొదట్లో ఒకటి, రెండు రీళ్ళు కొంత మందకొడిగా నడిచినా, తర్వాత తర్వాత పుంజుకుని ధాటీగా నడిచింది. చెప్పుకోదగ్గ విశేషమేమీ చిత్రంలో లేకపోయినా, మామూలు రకం వినోదానికి ఏమీ కొదవ ఉండదు.

సలీల్ చౌధురి సంగీతం, చిత్రం తాహతుకు తగినట్టే ఉంది. ఆయన కూడా హుషీకేశ్ ముఖర్జీ అడుగుజాడలనే అనుసరించినట్టుంది. ఏడెనిమిది పాటలలో ఒకటి-తలత్ మహమ్మద్ పాడినది-శ్రుతి పేయంగా ఉంది. మిగతావి బాక్సాఫీస్ హిట్ అయినాయి.

ఆశాపరేఖ్ నటన చిత్రానికి ఏకైక ఆకర్షణ. ఆమె తన అలవాటు ప్రకారం హాయిగా నటించింది. నాజిర్ హుస్సేన్ తను కారెక్టర్ యాక్టర్ ననే ధీమాతో అమిత నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు (అది ఆయనకు మామూలే).

ఈ చిత్రం ఎ.వి.యం. వారికి గర్వకారణం కాగలదనడంలో సందేహం లేదు. హృషీకేశ్ ముఖర్జీ ఇకపై ఇటువంటి చిత్రాలే తీయగలరని ఆశించవచ్చును.

నండూరి పార్థసారథి
(1961 అక్టోబరు 22వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post