Title Picture

పరిష్కారానికి బి.ఎన్. రెడ్డి గారి సూచనలు

"బాలల చిత్రాల సమస్య మహా క్లిష్టమయింది. దీనికి పరిష్కారం ఒకపట్టాన తేలేదికాదు. వీటి విషయంలో అనేక కష్టనష్టాలు, చెప్పలేనన్ని చిక్కులు ఉన్నాయి. ఉన్నంతలో నాకు ఒక్కటే ఉపాయం తోస్తున్నది. ఇప్పుడు మామూలు పెద్ద చిత్రాలతో పాటు ఫిల్మ్ డివిజన్ వారి న్యూస్ రీల్స్ ను చూపుతున్నట్లే, వెయ్యి, రెండు వేల అడుగుల నిడివి ఉండే చిన్నచిన్న చిత్రాలు మామూలు చిత్రాలతో జోడించి చూపవచ్చును. ఇది ఒక్కటే ఉపాయంగా కనిపిస్తున్నది".

ప్రఖ్యాత తెలుగుచలనచిత్ర దర్శక నిర్మాత, శ్రీ బి.ఎన్. రెడ్డి ఇటీవల విజయవాడ విచ్చేసిన సందర్భంలో మా ప్రత్యేక ప్రతినిధితో పైవిధంగా చెప్పారు.

"ఈ విధంగా చేయటం వలన అటు నిర్మాతలకు కష్ట నష్టాలు ఉండవు. ఇటు డిస్ట్రిబ్యూటర్లూ పెదవి విరచరు. ఎగ్జిబిటర్లకు అంతకన్నా అభ్యంతరం ఉండదు" అన్నారు ఆయన.

అయితే పెద్దల చిత్రాల మాదిరిగానే బాలల చిత్రాలను కూడా పూర్తి నిడివితో నిర్మించటం, బాలలకు ప్రత్యేక థియేటర్లు ఏర్పాటుచేయటం అనవసరం అంటారా అని ప్రశ్నించగా, ఆయన ఇలా చెప్పారు:

"అనవసరమని కాదు. పిల్లలకు ప్రత్యేక చిత్రాలు, ప్రత్యేక థియేటర్లు తప్పకుండా అవసరమే. అయితే, ప్రస్తుత పరిస్థితులలో అది అసంభవం. పరిస్థితులు అందరికీ తెలిసినవే. చూస్తూ చూస్తూ ఈ చిత్రాల నిర్మాణానికి ఎవరూ పూనుకోరు. పూనుకుంటే కొంపగుండం కావడం తథ్యమని వారికి తెలుసు".

అంత భయంకరమైన పరిస్థితులేమిటో సెలవిస్తారా? అని ప్రశ్నించగా, ఆయన ఇలా వివరించారు:

"పిల్లల చిత్రాలను పిల్లలే కానీ పెద్దలు హర్షించరు. మెజారిటీ ప్రజల ఆదరణ పిల్లల చిత్రాలకు లభించదు. వాటి ఆధాయం బహుకొద్ది నిర్మాణ వ్యయం మాత్రం తగ్గేదేమీ ఉండదు. 'ఏం చూసి మీ చిత్రానికి డబ్బు పెట్టుబడి పెట్టాలి?' అంటారు డిస్ట్రిబ్యూటర్లు. థియేటర్ల వారు అసలే అక్కర్లేదు పొమ్మంటారు. ప్రతి ఆదివారం ఉదయం ఆటగా వీటిని ప్రదర్శించడానికయినా వాళ్ళు ఒప్పుకోరు. ఎవరైనా ప్రదర్శించడానికి ఒప్పుకుంటే అది దయాధర్మంగా ఒప్పుకున్నట్లే. ఇటువంటి పరిస్థితులలో ఇక ప్రత్యేకంగా బాలల థియేటరు నిర్మించటం ఎలా సాధ్యపడుతుంది? ఈ చిత్రాల మీద లాభాలమాట అటుంచి, థియేటరును నిర్వహించేందుకు సరిపోయే డబ్బు అయినా వాటి మీద రావాలా కనీసం? అందుచేత ఇప్పటి పరిస్థితులలో పిల్లలకు ప్రత్యేకంగా పూర్తి నిడివి చిత్రాలు, ప్రత్యేక థియేటర్లు లభించడం అసంభవం".

"అయితే దీనికి పరిష్కారమార్గం ఏమిటంటారు"? అని మా ప్రతినిధి ప్రశ్నించారు.

"ఏమీ లేదు. పిల్లల చిత్రాలకు బాగా ఆదరణ లభించాలి. ఆదరణ లభించాలంటే ప్రచారం కావాలి. చిన్నచిన్న చక్కని చిత్రాలను తక్కువ వ్యయంతో విరివిగా నిర్మించి, ఫిల్మ్ డివిజన్ వారి న్యూస్ రీల్సు చూపుతున్నట్లుగానే మామూలు పూర్తి నిడివి చిత్రాలతో జోడించి చూపాలి. దీనివల్ల చూసేజనం అధికంగా చెల్లించే డబ్బు ఏమీ ఉండదు. ఉత్సాహజనకంగా నిర్మిస్తే పిల్లలు ఎంతో సంతోషిస్తారు. పెద్దలకు శ్రమ ఉండదు. వారానికి రెండు మూడుసార్లు న్యూస్ రీళ్ళకు బదులుగా వీటిని ప్రదర్శించవచ్చును. ఇందువల్ల థియేటర్ల వారికి పోయేదేమీ ఉండదు. ఎవరికీ కష్టమూ, నష్టమూ లేనిపద్ధతి నాకు తెలిసినంతలో ఇది ఒక్కటే. దీని వల్ల పిల్లల చిత్రాలకు ప్రచారం పెరిగి, ఆదరణకూడా పెరుగుతుంది. పూర్తి నిడివిచిత్రాలమాట అప్పుడు ఆలోచించవచ్చును" అన్నారు బి.ఎన్. రెడ్డి.

"మీరు చెప్పిన ఉపాయం నిజంగా ఎంతో అద్భుతమయినది. దీన్ని కార్యరూపంలో ప్రవేశపెట్టే ప్రయత్నం ఏదైనా మీరు చేస్తే మంచిది" అని మా ప్రతినిధి సూచించారు.

బి.ఎన్. రెడ్డి ఇలా అన్నారు:

"ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల చిత్రాలపై ఒక కమిటీని నియమించింది. మీకు తెలిసే ఉంటుంది. 12 మంది ఈ కమిటీలో ఉన్నారు. విద్యామంత్రి పట్టాభి రామారావు గారు దీనికి అధ్యక్షుడు. ఈ కమిటీ మొదటి సమావేశం ఈ మే 3వ తేదీన హైదరాబాదులో జరిగింది. ఆ సమావేశంలో నేను పై ఉపాయాన్ని సూచించాను. అయితే, సూచించినంత మాత్రాన అప్పుడే అయిపోయిందనుకోవడానికి వీలులేదనుకోండి. చిత్ర నిర్మాణానికి సంబంధించినంతవరకు నేను ఒక సలహా దారుణ్ణి. సలహాలు యెప్పుడు కార్యరూపం ధరిస్తాయో చెప్పలేను".

డిస్ట్రిబ్యూటింగు, ఎగ్జిబిటింగు విషయాలలో కాక, నిర్మాణంలో కూడా ఇంకా సాధక బాధకాలున్నాయంటారా? అని ప్రశ్నించగా ఆయన ఇలా చెప్పారు:

"అయ్యో! కావలసినన్ని. అసలు బాధలన్నీ ఇందులోనే ఉన్నాయి. బాలలకు ఎటువంటి చిత్రాలు కావాలో ముందు తేల్చుకోవాలి. పిల్లలు ఆనందించారా, లేదా అనేది ప్రశ్నకాదు. ఏ చిత్రమయినా పిల్లలు ఆనందిస్తారు. బాలల చిత్రాలలో ఎటువంటి సన్నివేశాలు ఉండవచ్చును? ఎటువంటివి ఉండకూడదు? అనేది తెలుసుకోవాలి. పిల్లలకు పెద్దల వేషాలు వేసి, కత్తులు, కటార్లు చేతికిస్తే అది బాలల చిత్రం కాదు. బాలలు నటించేవన్నీ బాలల చిత్రాలు కావు. వాళ్ళకి విజ్ఞానం, వినోదం, ఉత్సాహం అన్నీ కల్పించే విధంగా, వారిపై చెడ్డ ప్రభావము కల్పించని విధంగా ఉండాలి చిత్రాలు. ఈ విషయాలను ప్రతిభావంతులయినవారందరూ కూర్చుని చర్చించాలి. ముఖ్యంగా కథా దారిద్ర్యం పెద్ద సమస్య. తెలుగులో బాలసాహిత్యం దాదాపు శూన్యం. ఇప్పుడు బాలసాహిత్యం అని చెప్పబడుతున్నవి అసలు బాలసాహిత్యం కానేకాదు. తగిన కథలు లేని పరిస్థితిలో బాలల చిత్రాలు నిర్మించడం ఎలా సాధ్యమవుతుంది?"

"అయితే, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బాలల చిత్ర సంఘం చేస్తున్న కృషి ఏమిటి? దాన్ని గురించి మీ అభిప్రాయం?"

దానికి ఆయన ఇలా చెప్పారు.

"బాలల చిత్ర సంఘం నిర్మించిన చిత్రాలు అంత హర్షించదగినవిగా నాకు కనుపించలేదు. నా ఉద్దేశ్యంలో బాలలకు కావలసినవి అటువంటి చిత్రాలు కావు. వాటికి డబ్బూ రావటం లేదు. ప్రచారమూ లేదు. ఎక్కడా కనిపించడమే లేదు. మంచి కథలు దొరకడం లేదని వారి వాదన. కానీ మంచి కథలు వ్రాసేవారికి ప్రోత్సాహం లేదు. వారికి కథలు వూరికే కావాలి. సలహాలు వూరికే కావాలి. ఉత్తమబాలల కథకు పదివేలు యిస్తామని ప్రకటిస్తే, అద్భుతమయిన కథలు కొల్లలుగా వస్తాయి. ప్రణాళికలమీద కోటానుకోట్లు ఖర్చు పెడుతున్నా, వీటికి కాని ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. ఉచితంగా కథలు ఎవరిస్తారు? ఎందుకు యివ్వాలి?"

"మామూలు పూర్తినిడివి చిత్రాల విషయములో కూడా కథాదారిద్ర్యం ఉంది. వెయ్యి రూపాయలు పెడితే ఒక నవలను అచ్చువేయవచ్చును. కానీ పబ్లిషర్లు ముందుకు రావడంలేదు. రచయితలకు ప్రోత్సాహం లేదు. చెప్పుకోదగిన స్వతంత్ర నవలలు తెలుగులో గట్టిగా లెక్కపెడితే డజను ఉండవు. నవలలు విరివిగా వెలువడుతూ ఉంటే వంద నవలలో ఒక్కటయినా చిత్రానికి పనికి వస్తుంది. ఫలానా పుస్తకం విపరీతంగా అమ్ముడుపోయింది కనుక, దాన్ని సినిమా తీయవచ్చునని నిర్మాతలు సులభంగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. తెలుగులో నవలా సాహిత్యం, కథా సాహిత్యం బొత్తిగా తక్కువ. అందుచేతనే హిందీలోనో, బెంగాలీలోనో రజతోత్సవాలు చేయించుకున్న చిత్రాలు తెలుగులో మనవారు తీయవలసి వస్తున్నది. సాహిత్యాన్ని బట్టే చలన చిత్రాలు కూడా" అన్నారు ఆయన.

"హైదరాబాదులో 'రవీంధ్రభారతి' థియేటరు పనిఎంతవరకు వచ్చింది?" అని ప్రశ్నించగా, పని చురుకుగా సాగుతున్నదనీ, సుమారు 15 రోజులలో నిర్మాణం బరంతు వరకు పూర్తి కాగలదనీ ఆయన అన్నారు. "ప్రస్తుతపు అంచనాల ప్రకారం 12 లేక 13 లక్షల వరకు నిర్మాణ వ్యయం అవుతుంది. 1961 మే నాటికి థియేటరు నిర్మాణాన్ని పూర్తి చేసి, విశ్వకవి రవీంద్రుని శతజయంత్యుత్సవాన్ని అందులోనే జరిపించాలని సంకల్పం. ఇది కేవలం సంగీత, నృత్య, నాటక కార్యక్రమాలకు మాత్రమే ఉద్దేశించబడింది" అని బి.ఎన్. రెడ్డి తెలియజేశారు.

నండూరి పార్థసారథి
(1960 ఆగష్టు 15వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Next Post