Title Picture

1962 అక్టోబరు, నవంబరు నెలల్లో మనదేశపు ఈశాన్య సరిహద్దు ప్రాంతం (NEFA-నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ-ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్)లో భారత-చైనాల మధ్య యుద్ధం జరిగినప్పుడు నేను ఆంధ్రప్రభ చిత్తూరు ఎడిషన్ లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. ఆ యుద్ధం అక్టోబరు 20 నుంచి నవంబరు 20 వరకు సరిగ్గా నెల రోజులు జరిగింది. రోజూ టెలిప్రింటర్ లో వచ్చే యుద్ధం వార్తలన్నీ నేనే రాస్తూ ఉండేవాణ్ణి. యుద్ధ విశేషాలు, వర్ణనలూ త్రిల్లింగ్ గా ఉండేవి. అప్పుడు ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు కూడా సబ్ ఎడిటర్ గా చిత్తూరు ఎడిషన్ లో పనిచేస్తుండేవాడు. అతనూ నా వయస్సువాడే. ఇద్దరం ఒకేసారి ప్రభలో చేరాము. ఆ రోజుల్లో ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్ర శర్మగారు చిత్తూరు మునిసిపల్ కమిషనర్ గా పనిచేస్తుండేవారు. ఆయన మా కంటే పన్నెండేళ్ళు పెద్దవాడైనా స్నేహితుడు లాగానే ఉండేవాడు. ఆయన ఆఫీసు మా 'ప్రభ' ఆఫీసుకు బాగా దగ్గరే. తరచుగా కలుస్తూ ఉండేవాళ్ళం. భారత-చైనా యుద్ధం గురించి చర్చిస్తుండేవాళ్ళం. ఆ యుద్ధం ఇతివృత్తంగా నాటకం రాసి ప్రదర్శిస్తే బాగుంటుందనుకున్నాం. 'వందేమాతరం' అనే శీర్షికతో మారుతీరావు ఆ నాటకం రాశాడు. 'ప్రభ'లో పనిచేస్తుండిన యువకులతో కలిసి నాటకాన్ని ప్రదర్శించాడు. ప్రధాన పాత్ర తనే నిర్వహించాడు.

యుద్ధం వార్తలు రాస్తున్నప్పుడు కొన్ని విశేషాంశాలను, వర్ణనలను నేను నోట్ చేస్తుండేవాణ్ణి. మంచి సినిమాకి పనికొచ్చే సబ్జెక్ట్ గా నాకు అనిపించింది. అంతకు ముందు - రెండు సంవత్సరాల క్రిందట-నేను 'ఆంధ్రప్రభ' విజయవాడ ఎడిషన్ లో పనిచేసినప్పుడు ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత బి.ఎన్. రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయగా ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. తెలుగు సినిమాలకు కథాదారిద్ర్యం పెద్ద సమస్యగా ఉందనీ, మంచి కథ కోసం తానూ వెతుకుతున్నాననీ ఆయన చెప్పారు. ఆ మాటలను దృష్టిలో పెట్టుకుని భారత-చైనా యుద్ధంపై అప్పటివరకు నేను సిద్ధం చేసుకున్న 'సామగ్రి'తో సుమారు 16, 17 పేజీల 'సినాప్సిస్' (కథాసంగ్రహాన్ని) తయారు చేసి రెడ్డి గారికి పంపించాను. తర్వాత స్వయంగా వెళ్ళి మద్రాసులో ఆయన్ని కలిశాను. కథను ఇద్దరం చర్చించాము.

''ఇది సినిమాకు పనికొచ్చే మంచి కథే. కాని, దీన్ని నేను చేయలేను. ఇందులో మొత్తం కథ అంతా ఈశాన్య సరిహద్దు ప్రాంతంలోని యుద్ధ రంగంలో జరుగుతుంది. స్టూడియోలో తయారు చేసేదికాదు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి. సైనిక అధికారుల తోడ్పాటు కావాలి. ఇప్పటి వరకు ఎవరూ చేయని పని ఇది. ఈ వయస్సులో ఇంత వ్యయప్రయాసలతో కూడిన పని నేను చేయలేను'' అని రెడ్డిగారు చెప్పారు.

ఆయన మాటల్లో ప్రతి అక్షరం నిజం. ఆయనే కాదు-తెలుగులో ఇంకే దర్శకుడూ చేయగలిగిన సబ్జెక్ట్ కాదు ఇది. నేను ఆ కథను 1963లో ఎప్పుడో రెడ్డిగారితో చర్చించాను.

కాని, ఇంకో సంవత్సరం తర్వాత 1964లో ప్రముఖ దర్శకుడు చేతన్ ఆనంద్ భారత-చైనా యుద్ధంపై హిందీలో 'హఖీఖత్' అనే చిత్రం తీశాడు. డాక్యుమెంటరీ వాస్తవికతతో చాలా వరకు ఫిల్మ్స్ డివిజన్ చిత్రాల ధోరణిలో ఆ చిత్రం తయారయింది. భారత రక్షణ శాఖ సహకారంతో చాల వ్యయప్రయాసలతో నిర్మించిన ఆ చిత్రాన్ని చేతన్ ఆనంద్ అప్పటి ప్రధాని నెహ్రూకు అంకితమిచ్చాడు. బల్ రాజ్ సహనీ, ధర్మేంద్ర, విజయ్ ఆనంద్, సంజయ్ ఖాన్, ప్రియా రాజ్ వంశ్, ఇంద్రాణీ ముఖర్జీ, చాంద్ ఉస్మానీ, అచలా సచ్ దేవ్ వంటి ప్రముఖ కళాకారులు నటించిన ఆ చిత్రం 'ప్రాపగండా' చిత్రంలా ఉందని చాలా మంది విమర్శించారు. ఆ చిత్రం ఆర్థికంగా కూడా విజయం సాధించలేదు. కైఫీ ఆజ్మీ రచించిన పాటలు, మదన్ మోహన్ సంగీతం గొప్పగా ఉన్నాయి. భారత, చైనాల మధ్య యుద్ధం ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో జరిగినప్పుడే లడఖ్ సరిహద్దు ప్రాంతంలో కూడా జరిగింది. చేతన్ ఆనంద్ లడఖ్ వద్ద జరిగిన యుద్ధాన్ని తన చిత్రానికి ఇతివృత్తంగా తీసుకున్నాడు.

ఆ రోజుల్లో పత్రికా రచయితలు, ఫొటోగ్రాఫర్లు స్వయంగా యుద్ధరంగానికి వెళ్ళి సమాచారం సేకరించడానికి అనుమతి లభించేది కాదు. ప్రభుత్వమే పత్రికలకు సమాచారం, ఫొటోలు పంపేది. 'హఖీఖత్' సినిమా చిత్రీకరణ కూడా ప్రభుత్వ పర్యవేక్షణలోనే సాగింది.

నేను తయారు చేసుకున్న కథాసంగ్రహంతో సినిమా తీయడం సాధ్యమయ్యేది కాదు కనుక దానిని ఒక నవలగా రూపొందించాను. వెండి తెరమీద కాకపోయినా పాఠకుని మనస్సనే తెరపై సినిమాలాగానే - వీక్షించడానికి వీలుగా కథను చిత్రీకరించాను. నండూరి రామమోహనరావు, బాపు, రమణ, రావికొండలరావు, విఏకే రంగారావు గార్ల సంపాదకత్వంలో వి.వి. రాఘవయ్య గారు ప్రారంభించిన 'జ్యోతి' మాసపత్రికకు నా 'శిఖరాలు-సరిహద్దులు' నవలను పంపించాను. 1964-65లో ఏడు సంచికలలో అది సీరియల్ గా ప్రచురితమయింది. అది సంపాదకులకు, పాఠకులకు కూడా నచ్చింది. ఆ నవలలో అన్నీ కల్పిత పాత్రలే. 'కథ' కల్పితమే. కాని, కథా స్థలమంతా సహజమైనదీ, వాస్తవికమైనదీ. ఆర్థిక స్తోమతు, హంగులన్నీ సమకూర్చుకోగలిగిన సమర్థత ఉన్న దర్శక నిర్మాతలు సినిమాగా తీయగలిగితే ఆ ప్రయత్నం జయప్రదమయ్యేదేమో!

నవల రూపంలో ఇదే నా మొదటి రచన. దీని గురించి ఇప్పటికి ఇంతకు మించి ఏమీ చెప్పను. తర్వాత చెప్పవలసింది తర్వాత చెబుతాను.

నండూరి పార్థసారథి
(July 27, 2021)

Previous Post