Title Picture

అసలే తెలుగు చిత్రం, అందులోను డబ్బింగ్ చిత్రం. ఆ పైన జానపద వంటి చరిత్రాత్మక చిత్రం-ఎలా ఉంటుందో ఊహించడం అంత కష్టం కాదు. అందుకే మరీ అమాయకులకు తప్ప ఎవరికీ ఆశాభంగం కలగదు. అధవా కలిగినా అది నిర్మాతల తప్పుకాదు. తమ తప్పేనని ఒప్పుకొని లెంపలు వేసుకుంటారు. "ఔరా! ఈ చిత్రం ఎంత గొప్పగుణపాఠం (దురాశ దుఃఖము చేటు) నేర్పింది!" అని ముక్కుల మీద వేళ్ళు వేసుకుంటారు.

నరసరాజు అండ్ కంపెనీ వారు నిర్మించిన 'వీరసామ్రాజ్యం' చిత్రం తెలుగు డబ్బింగ్ చిత్రాల స్థాయికి నకలుగా ఉంది. ఈ చిత్రాన్ని విశేషంగా ఆదరించి, రజతోత్సవం చేయించారంటే తమిళుల అభిరుచి ఎంతలో ఉన్నదో తెలుస్తున్నది.

పగవాని కుమారునికి తన కూతురు నిచ్చి వివాహం చేసిన విశాలహృదయుడు పల్లవ చక్రవర్తి నరసింహవర్మ కథ ఇది.

ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకర్షించగల అంశాలు:

దర్శకుడు, సాంకేతిక నిపుణులు సమర్థులైతే మళ్ళీ 'మల్లీశ్వరి' వంటి కళాఖండాన్ని నిర్మించడానికి తగిన కథావస్తువు ఇందులో ఉన్నది. నిరుపమానమైన శిల్ప కళాక్షేత్రం మహాబలిపురం ఈ చిత్రానికి గొప్ప వాతావరణాన్ని చేకూర్చి పెట్టింది. డబ్బింగ్ చిత్రం కనుక కొంత మార్జిన్ వదిలిపెట్టి చూస్తే మల్లాది వారి మాటలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన అంశం-అగ్రశ్రేణి నటీనటులున్నారు.

ఈ చిత్రంలోని లోపాలు, దీన్ని డబ్బింగ్ చిత్రంగా కాక మూలచిత్రంగా-అంటే కళ్ళు తెరుచుకొని, చెవులు మూసుకొని పరిశీలిస్తే దర్శకత్వం చాలా పేలవంగా ఉన్నట్లు తెలుస్తుంది. చిత్రం మందకొడిగా, నానుడుగా నడిచింది. జవం, వేగం మచ్చుకైనా కనుపించవు. కనీసం తర్జుమా చేసేటప్పుడైనా మూడో వంతు నిడివి తగ్గిస్తే కొంత బావుండేది. పాటలు మరీ వికృతంగా, విడ్డూరంగా ఉన్నాయి. ఒక్కపదమైనా అర్థంకాదు. పూర్తిగా అరవయాసతో కూడి ఉన్నాయి. ఈ లోపం లేకుండా చేయాలంటే పాటకు రాగం మార్చి ఉండవలసింది. పెదవుల కదలికలకు అనుగుణంగా మాటలను కూర్చినట్లే, స్వరాలను కూర్చవలసి ఉంటుంది. అది చాలా తీరిక, ఓపిక, ప్రతిభ, డబ్బుతో కూడిన పని. ఆ నాలుగూ ఉంటే సరాసరి తెలుగు చిత్రమే తీసి ఉందుముగా అంటారు మన నిర్మాతలు.

పైన చెప్పిన లోపాలు ఈ చిత్రానికే కాదు. మొత్తం తెలుగు డబ్బింగు పరిశ్రమకే వర్తిస్తాయి.

దర్శకుడు: యోగానంద్; సంగీతం: పామర్తి; రచన: మల్లాది; ఛాయాగ్రహణం: సెల్వరాజ్; తారాగణం: వైజయంతిమాల, జెమినీ గణేశన్, ఎస్.వి.రంగారావు, బి.సరోజా దేవి, బాలయ్య, రాగిణి, కమలా లక్ష్మణ్ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 ఫిబ్రవరి 5వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post