Title Picture

గడచిన రెండు మూడు నెలల కాలంలో దాదాపు ఇరవై కొత్త పత్రికలు తెలుగు దేశంలో మొలకెత్తాయి. వీటిలో సినిమా పత్రికలు, డిటెక్టివ్ పత్రికలు, సెక్సు పత్రికలు, పిల్లల పత్రికలు, మామూలు సాహిత్య పత్రికలు, విద్యా, విజ్ఞాన విషయాలకు సంబంధించిన పత్రికలు, స్త్రీల పత్రికలు, డైజెస్టు లాంటివి-అమాంబాపతూ ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం మాస పత్రికలు; కొన్ని మాత్రం పక్ష పత్రికలు. స్వరూపంలోగాని, స్వభావంలోగాని చెప్పుకోదగ్గ కొత్తదనం, నాణ్యం వీటిలో లేవు. మాసపత్రికలన్నీ దాదాపు ఒకే 'మూస' పత్రికలుగా ఉన్నాయి. మరీ చిన్న చిన్న పత్రికలు కొన్ని కేవలం కాలక్షేపం కోసం పెట్టుకున్న వ్యాపకంలాగా కనుపిస్తున్నాయి. పత్రికా విపణి వీధిలో ఈ మాత్రం పోటీ ఉండడం కూడా అవసరం. పోటీని బట్టి పత్రికా సాహిత్యస్థాయి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొత్త పత్రికలన్నింటికీ మా స్వాగతం.

అపరాధ పరిశోధన 'ప్రముఖ డిటెక్టివ్ అండ్ మిస్టరీ కథల మాస పత్రిక'. ఆగస్టు ప్రారంభసంచిక. మానేజింగ్ ఎడిటర్ : శ్యామ దామోదర్ రెడ్డి; కార్యాలయ స్థానం : నారాయణగూడా, హైదరాబాద్-29; 1/4 క్రౌన్ సైజు; 66 : పేజీలు; వెల : 75 పైసలు.

ఇందులో విజయ-బాపినీడు, వి.ఎస్. చెన్నూరి, భయంకర్, టెంపోరావ్, జి.వి.జి. ప్రభృతుల కథలు ఉన్నాయి. ప్రారంభ సంచిక మీదనే 'ప్రముఖ' అని వ్రాసుకోగలిగిన సంపాదకుల ఆత్మ విశ్వాసం ప్రసంశనీయం.

మహతి సినీమాసపత్రిక. జూలై (ప్రారంభ) సంచిక. మానేజింగ్ ఎడిటర్ : వై.వి.రావు; కార్యాలయ స్థానం : గుడివాడ; క్రౌన్ సైజు, 44 పేజీలు; వెల : 30 పైసలు.

ఈనాడున్న సినిమా పత్రికలన్నింటికంటే 'బాగానడపగలమన్న దురాశ' తమకు ఉన్నట్లు సంపాదకీయంలో వ్రాశారు. 'దురాశ దుఃఖమునకు చేటు' అని పెద్దల మాట. ముఖచిత్రం ముచ్చటగా ఉంది.

చిత్రసీమ సినీమాసపత్రిక; ఆగస్టు (ప్రారంభ) సంచిక. సంపాదకుడు : డాక్టర్ రాజాచౌదరి; కార్యాలయ స్థానం : నాగార్జుననగర్, మద్రాసు-24; 1/4 క్రౌన్ సైజు : 18 పేజీలు; వెల : పావలా.

'కృష్ణకుమారి శర్మను మళ్లా చేరదీసిందా అనేది ఇందులో ప్రధాన వ్యాసం. ఇక పత్రిక స్థాయిని ఊహించుకోవచ్చు.

సామీరి 'తెలుగు దేశీయ మాస పత్రిక'. ఆగస్టు (ద్వితీయ) సంచిక, సంపాదకుడు : దుర్గానంద్; కార్యాలయస్థానం : కొత్తగూడెం; 1/8 డెమ్మీ సైజు : 61 పేజీలు; వెల : 50 పైసలు.

విద్యావాహిని ఆగస్టు 1వ తేదీ (ప్రారంభ) సంచిక, పక్ష పత్రిక. సంపాదకుడు : గరికపాటి శివరామకృష్ణశర్మ; కార్యాలయ స్థానం : ఏలూరు. 1/4 క్రౌన్ సైజు : 18 పేజీలు, వెల : 10 పైసలు.

రూపురేఖలు, ముద్రణ బొత్తిగా బాగాలేవు. వ్యాపార ప్రకటనలు, కవితలు ఒకేమోస్తరుగా ప్రచురించారు. రచనల స్థాయిని గురించి చెప్పుకోవలసినదేమీ లేదు.

రేరాణి జూన్ (ప్రారంభ) సంచిక, మాస పత్రిక. సంపాదకుడు : కొలను బ్రహ్మానందరావు; కార్యాలయ స్థానం : 69, లేక్ వ్యూరోడ్, మద్రాసు-33; క్రౌన్ సైజు : 69 పేజీలు; వెల : 60 పైసలు.

'రేరాణి' ఆంధ్ర 'రషిక' పాఠకులకు సుపరిచితం. అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన ఈ పత్రిక ఇప్పుడు మళ్లీ వెలువడుతున్నది. (పచ్చి) శృంగార రస ప్రధాన కథలు ఇందులో ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసినదే. ముద్రణ చాలా బాగుంది.

నండూరి పార్థసారథి
(1965 సెప్టెంబర్ 29వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post