Title Picture

తెలుగులో బహుళజనాదరణ, అఖండ ఆర్థిక విజయం సాధించిన చాలా పౌరాణిక చిత్రాల ధోరణిలో ఉంది ఆశ్వరాజ్ వారి దీపావళి. తెలుగుసినిమా అభిమానులకు ఈ చిత్రంలో ఎంచతగిన లోపాలేమీ కనిపించవు. అన్ని హంగులూ ఉన్న సుదీర్ఘమైన చిత్రం ఇది.

నిర్మాత : కె. గోపాలరావు; దర్శకత్వం : రజనీకాంత్; రచన : సముద్రాల; సంగీతం : ఘంటసాల; నటీనటులు : రామారావు, రంగారావు, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, ఎల్. విజయలక్ష్మి, గుమ్మడి, రమణారెడ్డి, కాంతారావు-వగైరా.

ఇది నరకాసురవధ కథ-లేక నరకాసురుని జీవితచరిత్ర. ఇది భారతీయులందరికీ సుపరిచితమైన కథే. కాని కథను భాగవతంలో ఉన్నది ఉన్నట్లు చిత్రీకరిస్తే (తెలుగు) సినిమా అని ఎలా అనిపించుకుంటుంది కనుక అవసరమైన చిలవలు పలవులు అల్లి ఆంధ్ర ప్రేక్షకజన మనోభిరామంగా రూపొందించారు.

హిరణ్యాక్షుడు భూదేవిని బలాత్కరించబోతుంటే విష్ణువు వరాహావతారందాల్చి అతడిని వధించుతాడు. ఆ రౌద్రం చల్లారకముందే భూదేవితో శృంగారమాడుతాడు. ఫలితంగా నరకుడనే అసురుడు పుట్టాడు. శివుని మెప్పించి తల్లిచేతుల్లో మినహా మరెవ్వరి చేతుల్లో చావు లేకుండా వరంపొంది లోకాలను దహిస్తాడు. విష్ణువు కృష్ణావతారం ఎత్తి, సత్యభామ చేత నరక సంహారం చేయిస్తాడు.

Picture
రంగారావు, ఎల్. విజయలక్ష్మి

దర్శకుని ప్రతిభ ముఖ్యంగా క్లైమాక్సును కట్టుదిట్టంగా నిర్మించడంలో కనుపిస్తుంది. యుద్ధరంగ దృశ్యాలు తెలుగు సినిమాల అవధిలో పరికిస్తే చాలా చక్కగా ఉన్నాయి. ఘంటసాల సంగీతం ఆయన మామూలుస్థాయికి తగ్గకుండా హెచ్చకుండా నిలకడగావుంది. కదనరంగానికి కదిలేముందు సత్యభామ పాడిన ఒకపాట బాగుంది.

రచన రణరంగ దృశ్యాలలో గంభీరంగా, హుందాగా సాగింది. పాటలు ఎక్కువే. అయినా ప్రేక్షకులకు అభ్యంతరం ఉండదు. నటీనటులంతా వారికి మామూలయిన తరహాలో ఆట్టే కష్టపడకుండా అనాయాసంగా నటించారు. అఖండ విజయం సాధించడానికి కావలసిన వరాలన్నింటినీ ఈ చిత్రం పొందింది.

నండూరి పార్థసారధి
(1960 సెప్టెంబర్ 25వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post