Title Picture
కుంకుం, చంద్రశేఖర్

'స్త్రీలలో పాతివ్రత్యం ఉండాలిగానీ, ఈ కాలంలోనైనా భర్తలను చావు నుంచి తప్పించవచ్చును' అని నిరూపించటానికి ప్రయత్నిస్తుంది ఈ చిత్రం. ఈ చిత్రం పేరు చూస్తేనే ఇది పాములకు సంబంధించిన కథ అని ఇట్టే పసికట్టవచ్చు. అంతేకాదు, సాంకేతిక వర్గం, తారాగణం చూసి ఈ చిత్రం ఎంత బాగుంటుందో కూడా తేలిగ్గానే అంచనా వెయ్యవచ్చును. పండిత పామర విచక్షణ లేకుండా ఎవరు ఎలా ఉంటుందని వెళ్తారో సరిగ్గా అలాగే ఉంటుంది ఈ చిత్రం. సారాంశమేమంటే, ఈ చిత్రం ఏవర్గంవారికీ ఆశాభంగం కల్గించదు.

కథానాయికకు నాగదేవత శాపం ఉన్నది. ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు పెళ్ళి పీటల మీదనే చనిపోతాడట. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. ఈ శాపరహస్యం ఆమెకు కూడా తెలియదు. ఆమె అన్నయ్యకు మాత్రమే తెలుసు. ఆ అమ్మాయిని ప్రేమించేందుకు ఆ పల్లెకు ఒక అబ్బాయి వస్తాడు. వచ్చిన తక్షణమే ఆమె కూడా అతన్ని ప్రేమించేసి ముడిఫిలింను పొదుపు చేస్తుంది. ప్రేక్షకుల ఆత్మశాంతికోసం నాలుగు డ్యూయెట్లు పాడేసేసరికి పెళ్ళి ప్రస్తావన వస్తుంది. వాళ్ళన్నయ్య రహస్యం చెప్పేస్తాడు. పూర్వకాలంలో సతీసావిత్రి వగైరాలు పతులను బతికించుకో లేదా, నేను మాత్రం ఆ పని ఎందుకు చెయ్యకూడదని అమ్మాయి పంతం పట్తుంది. పెళ్ళి జరుగుతూ ఉండగా పాము వస్తుంది. భర్త ప్రాణాలను కాపాడమని భక్తిగా, బెదిరిస్తున్నట్లుగా ఒక పాట పాడేసరికి పాము పారిపోతుంది-చాలా మోసకారికథ. చాలామంది జానపదమో పౌరాణికమోననుకుంటారు. ఇది సాంఘికం. టిక్కెట్లు కొనే స్థోమతులేక హాలుబయట నుంచునేవారి వీనులకు విందుచేసే సంకల్పం చిత్రగుప్త సంగీతంలో కనుపిస్తుంది. శబ్దగ్రాహకుడు ఆయనకు తోడ్పడ్డాడు. ఈ చిత్రంలో బీన్ వాద్యం వింటే ఇక మరో చిత్రంలో బీన్ వినాలనిపించదు. అంతస్థాయిలో ఉన్నది.

ఆగా, హెలెన్ ల జంట ముచ్చటగా ఉంది. పద్మా పిక్చర్సువారు ఆంధ్రలో ఈ చిత్రాన్ని విడుదలచేశారు. నిర్మాత: దేవిశర్మ; దర్శకుడు: తారాహరీష్; సంగీతం: చిత్రగుప్త; తారాగణం: కుంకుం, చంద్రశేఖర్, ఆగా, హెలెన్, కె.ఎస్.సింగ్, సుందర్ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 జూలై 17వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Next Post