Title Picture

తెలుగు పౌరాణిక చిత్రాలు ఈనాడు ఈ స్థాయికి వచ్చాయంటే అందుకు కారణం ముఖ్యంగా కడారు నాగభూషణం గారు, చిత్రపు నారాయణ మూర్తి గారు అని చెప్పక తప్పదు. ఇది వారి హస్తవాసియే. తెలుగు సగటు ప్రేక్షకులకు కావలసిన మూసలో పౌరాణిక చిత్రాలను పోతపోయడం వారికి జన్మతః అబ్బిన విద్యకాబోలుననిపిస్తుంది. ఇద్దరి శైలి దాదాపు ఒక్క విధంగానే అగుపిస్తుంది. భారీ తారాగణం లేకుండా, అట్టే ఆయాసపడకుండా ప్రేక్షకులకు సూక్ష్మంలో మోక్షం చూపించడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు.

చిత్రపు నారాయణమూర్తి గారు ప్రేక్షక భక్తజనం మీదికి విసిరిన తాజా అస్త్రం 'శ్రీకృష్ణ కుచేల'. అటుకులకు బదులుగా ఐశ్వర్యాన్ని ఇచ్చిన కృష్ణుడు, భగవంతుడు తన బాల్యమిత్రుడే అయినా భార్యాబిడ్డలు ఆకలితో అలమటిస్తున్నా భుక్తికోసం అర్థించని కుచేలుడు-వీరిద్దరి కథ ఇది. ఈ కుచేలాఖ్యానంలో రుక్మిణీకళ్యాణం, శిశుపాలవధ వంటి ఉపాఖ్యానాలు కూడా కొన్ని ఉన్నాయి. పౌరాణిక చిత్రం పదిహేనువేల అడుగులైనా ఉండాలి. కనుక ఈ హరికథను సవిస్తరంగా చిత్రీకరించారు. హాస్యాన్ని కూడా కొంత ఏర్పాటు చేశారు. అనేక పాటలు, పద్యాలు మొదలయినవి ఉన్నాయి.

సి.ఎస్.ఆర్. సొంత గొంతుతో పద్యాలు పాడుతారని గంపెడంత ఆశతో వచ్చే ప్రేక్షకులకు కొంత ఆశాభంగం కలుగుతుంది. ఆయనకు గొంతు లేదనుకున్నారు కాబోలు ఘంటసాలగారు ఎరువిచ్చారు. అయితే సి.ఎస్.ఆర్. సన్నని గొంతులో ఘంటసాల లావుపాటి గొంతు ఇమడలేదు. ఇది సి.ఎస్.ఆర్.ను కొంత ఇబ్బంది పెట్టి ఉంటుంది. ఈలపాట రఘురామయ్య గారు కనీసం 20 పద్యాలయినా పాడకపోతారా అన్న ధీమాతో వచ్చే ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం ఆశాభంగం కలిగిస్తుంది. ఆయన ఐదారుపద్యాలు మాత్రమే పాడారు.

కుచేలుడుగా సి.ఎస్.ఆర్, కుచేలుని సతిగా కన్నాంబ, వారి కుమార్తెగా రాజశ్రీ చక్కగా నటించారు. ఘంటసాల సంగీతం ఆయన అభిమానులను రంజింపచేయగలదు. తెలుగు పౌరాణిక చిత్రాలపై ఆసక్తి మెండుగా ఉన్నవారు తప్పక చూడతగిన చిత్రం గాయత్రీ వారి 'శ్రీకృష్ణ కుచేల'.

నిర్మాత, దర్శకుడు: చిత్రపు నారాయణమూర్తి; రచన: పాలగుమ్మి పద్మరాజు; సంగీతం: ఘంటసాల; ఛాయాగ్రహణం: బొమ్మన్ డి.ఇరానీ; తారాగణం: సి.ఎస్.ఆర్., కన్నాంబ, రఘురామయ్య, ముక్కామల, రామన్న పంతులు, పద్మనాభం, రాజశ్రీ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 జూన్ 25వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post